చంద్రయాన్-3: రోవర్ 'ప్రజ్ఞాన్' చంద్రునిపై ఎప్పుడు దిగుతుంది, ఈ మిషన్‌తో భారత్ సాధించేదేమిటి... 5 కీలక ప్రశ్నలు, సమాధానాలు

ఫొటో సోర్స్, Getty Images
చంద్రుడిపై పరిశోధనల్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 రాకెట్‌ను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి చంద్రయాన్-3ని ప్రయోగించింది. చంద్రయాన్ 3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటాయి. వాటి బరువు 3,900 కిలోలు.
చంద్రయాన్ 3లో ప్రయోగించిన రోవర్ చంద్రుడిపై విజయవంతంగా దిగితే, ఇప్పటి వరకూ ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ నిలుస్తుంది.
ప్రత్యక్షంగా, టీవీలలో లక్షలాది మంది చూస్తుండగా చంద్రయాన్ 3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రయాన్ ప్రయోగాన్ని వీక్షించేందుకు వివిధ పాఠశాలల నుంచి 200 మంది విద్యార్థులను స్పేస్ సెంటర్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించారు.
''భారత అంతరిక్ష రంగంలో జులై 14వ తేదీని సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది'' అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
ఆగస్టు 23 - 24 తేదీల మధ్య ల్యాండర్ చంద్రుడిని చేరుకోనుంది. చంద్రయాన్ రోవర్ చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టనుంది.
విజయవంతంగా ప్రయోగం
చంద్రయాన్-3 ప్రయోగం నాలుగు దశలను విజయవంతంగా పూర్తి చేసింది.
చంద్రయాన్ 3 విజయవంతంగా కక్ష్యలోకి చేరుకుందని ఇస్రో తెలిపింది. అక్కడి నుంచి అది చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుందని పేర్కొంది.
''చంద్రయాన్ - 3 చంద్రుడి వైపు తన ప్రయాణం ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే అది చంద్రుడిని చేరుకుంటుంది'' అని ఇస్రో చీఫ్ శ్రీధర పణిక్కర్ సోమనాథ్ చెప్పారు. ఏఎల్‌వీఎం3-ఎం4 రాకెట్ చంద్రయాన్ 3ని సరైన కక్ష్యలో ప్రవేశపెట్టిందని అన్నారు.
చంద్రయాన్ - 3 ప్రయోగం విజయవంతంగా సాగుతోందని, అది చంద్రుడిపై ల్యాండ్ అయ్యే క్షణం కోసం ఎదురుచూస్తున్నట్లు ఇస్రో తెలిపింది.

ఫొటో సోర్స్, YEARS
2008లో తొలి మిషన్
''2008లో చంద్రుడిపై తొలి మిషన్ ప్రారంభమైంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత చంద్రుడిపై నీటి జాడ, చంద్రుడి ఉపరితలంపై పగటి వేళల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో క్షుణ్ణంగా తెలుసుకునేందుకే ఈ ప్రయోగం'' అని చంద్రయాన్-1 ప్రాజెక్ట్ డైరెక్టర్ మైలస్వామి అన్నాదురై అన్నారు.
''2019లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లతో కలిపి ప్రయోగించిన చంద్రయాన్ - 2 పాక్షికంగానే విజయవంతమైంది. అయితే, ఆ ఆర్బిటర్ ఇప్పటికీ తన కక్ష్యలోనే తిరుగుతూ చంద్రుడిపై పరిస్థితులను అధ్యయనం చేస్తోంది.
చంద్రుడిపై దిగే క్రమంలో ల్యాండర్, రోవర్ మాత్రమే విఫలమయ్యాయి. చంద్రుడిపై దిగే సమయంలో అవి క్రాష్ అయ్యాయి. అది సిస్టమ్‌లో చివరి నిమిషంలో తలెత్తిన లోపం'' అని అన్నాదురై వివరించారు.
చంద్రయాన్ 2 సమయంలో జరిగిన క్రాష్, దానికి సంబంధించిన డేటాపై అధ్యయనం చేశామని, అలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సోమనాథ్ చెప్పారు.
చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా దిగడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని, దీని కోసం 615 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు.
సుమారు 1500 కేజీల బరువున్న ల్యాండర్ ''విక్రమ్'' (ఇస్రో ఫౌండర్ విక్రమ్ సారాభాయి పేరు పెట్టారు.), దాని కడుపులో 26 కేజీల బరువున్న రోవర్ ''ప్రజ్ఞాన్'' చంద్రుడిపై దిగనున్నాయి. ప్రజ్ఞాన్ అంటే సంస్కృతంలో జ్ఞానం అని అర్థం.
శుక్రవారం విజయవంతంగా ప్రయోగించిన తర్వాత చంద్రుడి కక్ష్యలోకి చేరేందుకు 15 రోజుల నుంచి 20 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత విక్రమ్ సురక్షితంగా చంద్రుడిపై ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రాకెట్ వేగాన్ని శాస్త్రవేత్తలు నియంత్రిస్తారు.
అంతా అనుకున్నట్టుగా జరిగితే, ఆరు చక్రాలున్న రోవర్ ''ప్రజ్ఞాన్'' సురక్షితంగా ల్యాండ్ అయి చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ అక్కడి రాళ్లు, అగ్నిపర్వతాల వల్ల ఏర్పడిన గుంతలు, అక్కడి వాతావరణ పరిస్థితులకు సంబంధించిన ఫోటోలు, కీలక సమాచారాన్ని పంపుతుంది.
అవి అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు ఉపయోగపడతాయి.
''రోవర్‌లో అమర్చిన ఐదు పరికరాలు చంద్రుడి ఉపరితల భౌతిక లక్షణాలు, అక్కడి వాతావరణం, ఉపరితలం అడుగుభాగాన ఎలా ఉంది అనే విషయాలపై అధ్యయనం చేస్తాయి. కొత్త ఆవిష్కరణలు జరుగుతాయని ఆశిస్తున్నా'' అని సోమనాథ్ మిర్రర్ నౌతో అన్నారు.
చంద్రుడి దక్షిణ ధ్రువం గురించి ఇప్పటి వరకూ ఎవరికీ పెద్దగా వివరాలు తెలియదు. ఎప్పుడూ నీడ పడుతూ ఉండే దక్షిణ ధృవ వైశాల్యం, ఉత్తర ధృవ వైశాల్యం కంటే చాలా పెద్దది. ఇలా శాశ్వతంగా నీడ ఉండే ప్రాంతాల్లో నీరు ఉండే అవకాశం ఉంది.
2008లో ప్రయోగించిన చంద్రయాన్ -1 దక్షిణ ధ్రువానికి సమీపంలో చంద్రుడిపై తొలిసారి నీటి జాడను కనుగొంది.

ఫొటో సోర్స్, YEARS
దక్షిణ ధ్రువంపై ఎందుకు?
''ఇది భూమధ్య రేఖ ప్రాంతం కావడంతో సురక్షితంగా ల్యాండ్ అవుతుందని భావిస్తున్నాం.'' అని సోమనాథ్ చెప్పారు.
''ఏదైనా కొత్త విషయాలను కనుగొనేందుకు దక్షిణ ధ్రువం వంటి కొత్త ప్రదేశానికి వెళ్లాల్సిందే. కానీ, ల్యాండింగ్ కొంచెం కష్టమైన ప్రక్రియ'' అని ఆయన అన్నారు.
చంద్రయాన్ -2 క్రాష్ అయినప్పుడు డేటా సేకరించి, దానిపై అధ్యయనం చేశామని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు అది ఉపయోగపడిందన్నారు.
''చంద్రయాన్ 2 ఆర్బిటర్ చంద్రుడి ఉపరితలంపై ఉన్న పరిస్థితులకు సంబంధించిన చాలా స్పష్టమైన ఫోటోలను పంపించింది. డేటాను అధ్యయనం చేయడం ద్వారా ల్యాండింగ్ చేయాలనుకున్న ప్రదేశంలో ఎన్ని బండరాళ్లు, గుంతలు ఉన్నాయో అంచనా వేయగలిగాం. సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసేందుకు అది ఉపయోగపడింది'' అని ఆయన వివరించారు.
''చంద్రుడిపై ఒక రోజు ప్రారంభమయ్యేందుకు సమానంగా ఖచ్చితమైన సమయంలో ల్యాండింగ్ జరగాలి. (చంద్రుడిపై ఒకరోజు భూమిపై 14 రోజులకు సమానం). ఎందుకంటే ల్యాండర్, రోవర్ బ్యాటరీలు ఛార్జి చేయడానికి సూర్యరశ్మి తప్పనిసరి.'' అని అన్నాదురై చెప్పారు.
చంద్రుడిపై పరిశోధనలపై భారత్‌కు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. చంద్రుడి గురించి మరింత అర్థం చేసుకునేందుకు చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, విశ్వం గురించి తెలుసుకునేందుకు ఇది గేట్‌వే అని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
''చంద్రుడిపై మనం ఒక ఔట్‌పోస్టును ఏర్పాటు చేసుకోగలిగితే, అంతరిక్షం గురించి మరింత తెలుసుకునేందుకు వీలుపడుతుంది. అక్కడ దొరికే వస్తువులతో ఆవాసాలు ఎలా ఏర్పాటు చేసుకోగలమో తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరగాలి. అలాగే, అక్కడ ఉండే మనవాళ్లకు అవసరమైన వాటిని ఎలా తీసుకువెళ్లాలో అన్వేషించాలి'' అని అన్నాదురై అన్నారు.
''అంతరిక్షం నుంచి చంద్రుడు వేరుపడితే అది భూమికి మరో ఖండంగా మారుతుంది. అప్పుడు మనం చూస్తూ ఉండాల్సిన పనిలేదు. ఆ ఖండంలో జీవించేందుకు సిద్ధమవడంలో చురుగ్గా ఉండాలి. భారత్ ప్రయోగాల అంతిమ లక్ష్యం అదే. ఆ దిశగా ప్రయోగాలు కొనసాగించాలి.'' అని అన్నారు.
చంద్రయాన్ - 3 విజయం ఆ దిశగా జరిగే ప్రయోగాలకు ముందడుగు కానుంది.

ఫొటో సోర్స్, Getty Images
చంద్రయాన్ - 3 విజయావకాశాలు ఎంత?
గతంలో ప్రయోగించిన చంద్రయాన్ -2 విఫలమైన నేపథ్యంలో చంద్రయాన్ - 3 విజయావకాశాలు ఎంత?
చంద్రయాన్ -3లో ఎలాంటి మార్పులు చేశారు? ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఈ మిషన్ లక్ష్యం ఏంటి? అనే విషయాల గురించి తెలుసుకునేందుకు స్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్, డ్రోన్స్ రంగాల్లో నిపుణులు, శివ్ నాడార్ యూనివర్సిటీ అధ్యాపకులు డాక్టర్ ఆకాశ్ సిన్హాతో బీబీసీ మాట్లాడింది.
బీబీసీ అడిగిన ప్రశ్నలకు డాక్టర్ ఆకాశ్ సమాధానాలు ఇచ్చారు.
1. ప్రశ్న: చంద్రయాన్ -2 మాదిరిగా జరగకుండా చంద్రయాన్ -3 మిషన్‌కు ఎలాంటి మార్పులు చేశారు?
సమాధానం: గత 50 ఏళ్లలో ఎన్నో ప్రయోగాలు జరిగాయి. అయితే, చంద్రుడిపై నీటి జాడను తెలుసుకునేందుకు తొలిసారి చంద్రయాన్ -2 ను ప్రయోగించారు. కానీ, ల్యాండర్ బయటికి రాలేదు. ఈసారి తప్పకుండా విజయవంతమవుతుంది.
గతంతో పోలిస్తే ల్యాండర్ టెక్నెలజీలో చాలా మార్పులు చేశారు. అందుకే ఈసారి తప్పకుండా విజయవంతం అవుతుందని నమ్ముతున్నాం.
2. ప్రశ్న: చంద్రయాన్ 3 చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. అయితే, ఆ ప్రదేశం గురించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. చంద్రుడిపై ఆ భాగంలో దిగడం ఎంత కష్టం? అక్కడ ఎలాంటి సమస్యలు రావొచ్చు? అది విజయవంతంగా చంద్రుడిపై దిగితే భారత్‌కు ఎలాంటి విజయం అవుతుంది?
సమాధానం: చంద్రుడిపై సవాల్‌తో కూడిన ప్రాంతాన్ని మన శాస్త్రవేత్తలు ఎంచుకున్నారు. దాన్ని చంద్రుడి దక్షిణ ధ్రువంగా పిలుస్తారు. అక్కడి రోవర్‌ను భూమిపై నుంచి నేరుగా పర్యవేక్షించడం చాలా కష్టంతో కూడుకున్న పని.
అయితే, ఆ ప్రదేశంలో నీటి జాడ, ఖనిజాలు ఉండే అవకాశం ఉంది.

3. ప్రశ్న: చంద్రయాన్ లక్ష్యమేంటి?
సమాధానం: ఈ మిషన్‌లో భాగంగా చంద్రయాన్‌లోని రోవర్(ఒక చిన్న రోబో) ల్యాండర్ నుంచి బయటకు వచ్చి చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇది ల్యాండ్ అవుతుంది. చంద్రుడిపై నీటి జాడ, ఖనిజాలు, ఇతర విషయాలను అది కనుగొంటుంది.
ఒకవేళ భవిష్యత్తులో చంద్రుడిపై ఆవాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే, చంద్రుడి ఉపరితలంపై పరిస్థితులను తెలిపే ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది.
4. ప్రశ్న: ఈ మిషన్‌లో అతిపెద్ద సవాల్ ఏంటి?
సమాధానం: చంద్రుడిపైకి ఒక రోవర్‌ను పంపడమే మొదటి సవాల్. దానిని పూర్తిగా కంప్యూటర్లతో నియంత్రించాల్సి ఉంటుంది. నాలుగు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోవర్‌ను ఇక్కడి నుంచి నియంత్రించలేం. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేస్తుంది.
చంద్రుడిపై జీపీఎస్ లేకపోవడం రెండో సవాల్. భూమిపై మనం కారు నడుపుతున్నప్పుడు జీపీఎస్ ద్వారా మనకు చాలా సమాచారం లభిస్తుంది. జీపీఎస్ వల్ల డ్రైవర్ రహిత కార్లు కూడా వచ్చాయి. కానీ, అది చంద్రుడిపై కుదరదు. మీరు ఎక్కడ ఉన్నారు? ఏ ప్రదేశంలో ఉన్నారు? ఎంత దూరంలో ఉన్నారు? వంటి విషయాలు తెలియవు. కేవలం రోవర్‌లోని సెన్సార్ల వల్లే వాటిని అంచనా వేయగలం. దీని వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈసారి అలాంటి విషయాలన్నింటిలో జాగ్రత్తలు తీసుకోవడం మంచి పరిణామం.
5. ప్రశ్న: చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ ఖర్చు ఒక హాలీవుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ ఖర్చు దాని కంటే 30 శాతం తక్కువ. భారతీయ శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చుతో ఎలా చేయగలుగుతున్నారు?
సమాధానం: భారత్‌లో మనకు నేర్పే ఒక విషయం ఏంటంటే, వనరులను వీలైనంత సమర్థవంతంగా వినియోగించుకోవడం, వీలైతే వాటిని తిరిగి ఉపయోగించుకోవడం.
చంద్రయాన్ 2 పంపినప్పుడు అందులో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ అనే మూడు భాగాలున్నాయి. ఆర్బిటర్ విజయవంతమైంది. అది చంద్రుడి కక్ష్యలో ఇప్పటికీ తిరుగుతోంది. ఇప్పటికే ఆర్బిటర్ అక్కడ ఉండడంతో చంద్రయాన్ 3లో ఆర్బిటర్‌ను ప్రయోగించలేదు. అందువల్ల ఆర్బిటర్‌కి అయ్యే ఖర్చు తగ్గింది.
ఇస్రోలోని గొప్పదనం ఏంటంటే, శాస్త్రవేత్తలు చాలా వరకూ తమ ఇళ్లలోనే పనిచేస్తారు. టెక్నాలజీని స్వయంగా అభివృద్ధి చేస్తారు. దాని వల్లే తక్కువ ఖర్చుతో పెద్ద మిషన్‌ను చేయగలుగుతున్నాం.
ఇవి కూడా చదవండి:
- యశస్వి జైస్వాల్: క్రికెట్ కోసం ఇంటి నుంచి పారిపోయాడు, ఇప్పుడు తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ చేశాడు
- జమ్మూకశ్మీర్ ప్రశాంతంగా ఉందని ప్రభుత్వం చెబుతోంది... మరి కశ్మీరీలు ఏం అంటున్నారు?
- 4,000 మంది మహిళలకు రహస్యంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారని ముస్లిం వైద్యుడిపై ఆరోపణలు ఎందుకు?
- ఏలూరు: ‘హాస్టల్లో హత్యకు గురైన అఖిల్ వర్ధన్‌ను చంపింది ఆ స్కూల్ విద్యార్థులే’.. మిస్టరీ ఛేదించిన పోలీసులు
- వందే భారత్ రైళ్లలో సీట్లు ఖాళీగా ఎందుకుంటున్నాయి?















