అనిల్ అంబానీ డిఫెన్స్ కంపెనీ కూడా దివాలా... ఇప్పుడు రఫేల్ డీల్ పరిస్థితి ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దినేష్ ఉప్రేతి
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై 13-14 తేదీల్లో రెండు రోజుల పాటు ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఫ్రాన్స్ జాతీయ పరేడ్‌కు మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
ఈ పర్యటనలో నౌకాదళం కోసం రఫేల్-ఎం కొనుగోలుతో సహా మరో భారీ రక్షణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వార్తాసంస్థ పీటీఐ తెలిపింది.
వైమానిక దళం కోసం భారత్ గతంలో 36 రఫేల్ విమానాలను కొనుగోలు చేసింది .
2017లో రఫేల్‌ను తయారు చేసిన డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ అనిల్ అంబానీకి చెందిన 'రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్' భారతీయ భాగస్వామిగా ఎంచుకుంది.
దీనిపై అప్పుట్లో చాలా వివాదాలు నడిచాయి.
అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు చాలా వరకు నష్టాల వైపు పయనిస్తున్నాయని, అంతేకాకుండా, రక్షణ రంగంలో వారికి అనుభవం లేకపోవడాన్ని విపక్షాలు ఎత్తిచూపాయి.
వారితో రూ.30,000 కోట్ల ఒప్పందం ఎందుకు కుదుర్చుకుంటున్నారని ప్రశ్నించాయి.
ఒకప్పుడు ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లలో ఒకరిగా ఉన్న అనిల్ అంబానీ ప్రస్తుతం పతన దశను ఎదుర్కొంటున్నారు.
కమ్యూనికేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పవర్ జనరేషన్, సప్లై, షిప్‌బిల్డింగ్, హోమ్ ఫైనాన్స్ వంటి వివిధ వ్యాపారాలలో రాణించిన అనిల్ అంబానీ ఇప్పుడు అప్పుల ఊబిలో చిక్కుకున్నారు.
ఆయన కంపెనీలు చాలావరకు దివాలా తీశాయి. చాలా కంపెనీలను తక్కువ ధరలకు విక్రయించారు.
రిలయన్స్ క్యాపిటల్ వేలం అయిన తర్వాత, ఇపుడు మరొక కంపెనీ దివాలా దారిలో ఉంది. అదే రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (RNEL).
అనిల్ అంబానీ కంపెనీలలో రక్షణ రంగంలోకి ప్రవేశించిన సంస్థ ఇదే.

ఫొటో సోర్స్, AFP
వివాదాల జాయింట్ వెంచర్
ఆర్ఎన్ఈఎల్ మాతృ సంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. వాస్తవానికి అనిల్ అంబానీ గ్రూప్ 2015లో 'పీపావావ్ డిఫెన్స్ అండ్ ఆఫ్‌షోర్ ఇంజనీరింగ్ లిమిటెడ్' కంపెనీని కొనుగోలు చేసింది.
అనంతరం కంపెనీ పేరును 'రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్'గా మార్చారు. ఈ గ్రూప్‌లో మొదటి పెద్ద ఒప్పందమే రఫేల్ డీల్ .
రిలయన్స్‌తో ఫ్రెంచ్ కంపెనీ డస్సాల్ట్ 'జాయింట్ వెంచర్'ను ప్రారంభించింది. కంపెనీ పేరు 'డసాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్'. ఇందులో రిలయన్స్ వాటా 51 శాతం కాగా, డస్సాల్ట్ వాటా 49 శాతం.
దీనికోసం నాగ్‌పూర్‌లోని మిహాన్‌లో ఉన్న స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో ఒక కర్మాగారాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఫైటర్ జెట్‌ల విడిభాగాలను దశలవారీగా ఇక్కడ తయారు చేస్తున్నట్లు తెలిపారు.
అయితే, అనిల్ అంబానీకి చెందిన 'రిలయన్స్ నేవల్ డిఫెన్స్ అండ్ ఇంజినీరింగ్' కంపెనీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది.
రుణం చెల్లించనందుకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో కొన్ని పార్టీలు (క్రెడిటర్లు) ఫిర్యాదు చేశాయి.
వేలం ప్రక్రియను అహ్మదాబాద్ లా ట్రిబ్యునల్ ఆమోదించింది. స్వాన్ ఎనర్జీ నేతృత్వంలోని హాజెల్ మర్కంటైల్ కన్సార్టియం అనిల్ అంబానీ కంపెనీని కొనుగోలు చేయడంలో ముందుంది. దీనికోసం రూ. 2,700 కోట్ల బిడ్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
కోర్టు విచారణలో అంగీకరించిన అనిల్ అంబానీ
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీ షేర్‌హోల్డింగ్ ప్రకారం ప్రమోటర్లకు (అనిల్ అంబానీ) మార్చి 2023 వరకు ఆర్‌ఎన్‌ఈఎల్‌లో వాటా లేదు. అయితే, ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎల్‌ఐసీ 7.93 శాతం కలిగి ఉంది.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు దాదాపు అర శాతం వాటా ఉంది. మిగిలిన షేర్లు సాధారణ ఇన్వెస్టర్ల వద్ద ఉన్నాయి. కంపెనీ మునిగిపోవడం వల్ల సామాన్య ఇన్వెస్టర్లు, ఎల్‌ఐసీ ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుంది.
ఆర్ఎన్ఈఎల్ 2022 సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి బీఎస్ఈకి అందించిన డేటా ప్రకారం కంపెనీ ఆదాయం రూ. 68 లక్షలు మాత్రమే. అదే సమయంలో కంపెనీ మొత్తం నష్టాన్ని రూ.527 కోట్లుగా ప్రకటించింది.
2023 ఏప్రిల్ 19 నాటి ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ 2021-22 ఫలితాలను వెల్లడించింది. దీని ప్రకారం ఏడాది కాలంలో కంపెనీ ఆదాయం రూ.6 కోట్ల 32 లక్షలు కాగా, మొత్తం నష్టం రూ. 2,086 కోట్లుగా చూపింది.
ఆర్‌ఎన్‌ఈఎల్ దివాలా తీయడం ఇండో-ఫ్రెంచ్ జాయింట్ వెంచర్ డసాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలను నిశితంగా పరిశీలిస్తున్న, స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు అవినాశ్ గోర్కర్ చెప్పారు.
“జాయింట్ వెంచర్‌లో రెండు కంపెనీలు సమానంగా పెట్టుబడి పెట్టాలి. అటువంటి పరిస్థితిలో డస్సాల్ట్ తన వాటా పెట్టుబడి పెడుతుంది, కానీ అనిల్ అంబానీ వాటా ఏది'' అని అవినాశ్ అన్నారు.
2020 సంవత్సరంలో చైనా బ్యాంకుల రుణానికి సంబంధించిన వివాదంపై ఇంగ్లండ్ హైకోర్టులో విచారణ సందర్భంగా అనిల్ అంబానీ తాను దివాలా తీసినట్లు, రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయానని అంగీకరించారు.
అనిల్ తరపు న్యాయవాది తన వాదనలో ''అనిల్ అంబానీ నికర విలువ సున్నా, ఆయన దివాలా తీశారు. అందుకే బకాయిలు చెల్లించలేకపోతున్నారు, కుటుంబ సభ్యులు కూడా వారికి సాయం చేయలేరు'' అని చెప్పారు.
కంపెనీలను ఒకదాని తర్వాత ఒకటి కోల్పోతున్న సమయంలో, రఫేల్ కోసం ఏర్పాటుచేసిన జాయింట్ వెంచర్లను అనిల్ అంబానీ ఎలా నడపగలరు?

ఫొటో సోర్స్, AFP
రఫేల్ ఏమవుతుంది?
డస్సాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ సాంకేతికంగా అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అనుబంధ సంస్థ అయినందున జాయింట్ వెంచర్‌ల నిబంధనలు భిన్నంగా ఉండవచ్చు.
ఈ జాయింట్ వెంచర్ కొనసాగవచ్చని రీసెర్చ్ అనలిస్ట్ ఆసిఫ్ ఇక్బాల్ అభిప్రాయపడ్డారు .
అయితే, అనిల్ అంబానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితి బాగాలేనందున, ఈ వెంచర్‌ను ప్రారంభించిన 'మేకిన్ ఇండియా' ఉద్దేశం నెరవేరకపోవచ్చని అన్నారు.
“ఈ జాయింట్ వెంచర్ ఆర్థిక నివేదికలు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అప్‌డేట్ కావు. దానిలో చివరి ఆర్థిక ప్రకటన 2019లో విడుదలైంది'' అని అసిఫ్ అన్నారు.
2019 మార్చి 31 నాటికి డస్సాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ మొత్తం ఫైనాన్సియల్ లయబిలిటీస్ రూ. 142 కోట్ల కంటే ఎక్కువగా ఉన్నాయని ఆ ప్రకటనలో చెప్పారు.
అయితే సరిగ్గా ఏడాది క్రితం అంటే 2018 మార్చి 31 నాటికి ఆ మొత్తం రూ. 38.81 కోట్లు అని తెలిపారు .
అనిల్ పతనానికి కారణమేంటి?
అంబానీ కుటుంబీకులు భారతదేశంలోనే అత్యంత ధనవంతులు. అయితే, ముఖేష్ అంబానీ కంటే అతని తమ్ముడు అనిల్ కథ భిన్నంగా ఉంది.
అనిల్ పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. అదే సమయంలో ముఖేష్ వివాదాలకు దూరంగా ఉన్నారు.
అనిల్ అంబానీ గురించి తెలిసిన ఆర్థిక విశ్లేషకులు ఆయన పరిస్థితికి కారణం ఆర్థిక నిర్వహణ లోపం అని భావిస్తారు.
ఆస్తుల పంపకం తర్వాత తనకు వచ్చిన కంపెనీల పురోగతిపై దృష్టి పెట్టకుండా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. ఇది వారికి లాస్ డీల్ అని తేలింది.
కొత్త కంపెనీలు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని గెలుచుకోలేకపోయాయి. అప్పటికే స్థాపించిన కంపెనీలు పట్టాలు తప్పడం ప్రారంభించాయి. ఫలితంగా అనిల్ అంబానీ అప్పుల ఊబిలో కూరుకుపోతూనే ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పడిలేచిన ముఖేష్ అంబానీ
అది 2007. అంబానీ సోదరులు అంటే ముఖేష్, అనిల్‌ల మధ్య ఆస్తుల పంపకం జరిగి రెండేళ్లు.
ఆ సంవత్సరం ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ముఖేష్, అనిల్‌లు ఉన్నారు.
అనిల్ కంటే అన్నయ్య ముఖేష్ కొంచెం ధనవంతుడు. ఆ సంవత్సరం జాబితా ప్రకారం అనిల్ అంబానీ ఆస్తి విలువ రూ.3.7 లక్షల కోట్లు, ముఖేష్ ఆస్తి రూ.4 లక్షల కోట్లు.
2007-2008 మాంద్యం ముఖేష్ అంబానీతో సహా అనేక మంది పారిశ్రామికవేత్తలను దెబ్బతీసింది. ముఖేష్ సంపద దాదాపు 60 శాతం క్షీణించింది.
అయితే, ఆయన ఆ కష్టకాలం నుంచి బయటకు వచ్చి ఇప్పుడు వృద్ధిని కొనసాగిస్తున్నారు.
2008లో ముఖ్యంగా 'రిలయన్స్ పవర్' పబ్లిక్ ఇష్యూకి ముందు తమ్ముడు అనిల్, తన అన్నయ్యను మించిపోతాడని చాలామంది నమ్మారు.
రిలయన్స్ పవర్ ఇష్యూ అనేక విధాలుగా చరిత్రాత్మకమైనది. పబ్లిక్ ఇష్యూ ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలోనే ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది.
ఒక షేరు ధర రూ. వెయ్యికి చేరుకోవచ్చని అనుకున్నారు. ఇది జరిగి ఉంటే అనిల్ నిజంగా ముఖేష్‌ను దాటివెళ్లేవారు. కానీ అది జరగలేదు.
అనిల్ అంబానీ వ్యాపారాలు ఏవీ అభివృద్ధి చెందలేదు. ఆయన అప్పుల్లో కూరుకుపోయారు.
ఇప్పుడు కొత్తగా ఏమీ ప్రారంభించే పరిస్థితిలో లేరు. ఆయన తమ వ్యాపారాలను చాలా వరకు అమ్మేస్తున్నారు లేదంటే మూసేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- భారత్‌కు ఫ్రాన్స్ అంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తోంది?
- ట్విటర్ Vs. థ్రెడ్స్: ఎలాన్ మస్క్ ట్రిక్స్ ఎందుకు పారడం లేదు... మెటా యజమాని జుకర్‌బర్గ్ కొత్త యాప్‌తో పోటీ ఎలా ఉండబోతోంది?
- సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల వివాహాల కేసు జడ్జిలకు పరీక్షగా మారిందా?
- టెక్నాలజీ మ్యారేజేస్: భాగస్వామి హృదయ స్పందనను తెలిపే ఉంగరాలు, లాకెట్ల కథ ఏంటి?
- ప్రేమలో విడిపోతే గుండెపోటు వచ్చినట్లు ఎందుకు అనిపిస్తుంది, ఆ బాధలో గుండెకు ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














