మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల లోన్ - ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎ. కిశోర్ బాబు
- హోదా, బీబీసీ కోసం
కొత్త వ్యాపార ఆలోచనలతో పారిశ్రామికవేత్తలుగా రాణించాలని తపించే మహిళల కోసం రూ.10 లక్షల నుంచి రూ. కోటి వరకు రుణం అందించేలా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తోంది.
అదే ‘స్టాండ్‌అప్ ఇండియా’.
ఈ పథకం ద్వారా మహిళలే కాదు, ఎస్సీ, ఎస్టీలు కూడా లింగబేధంతో పనిలేకుండా రుణాలు పొందవచ్చు.
‘స్టాండ్ అప్ ఇండియా’ పథకం కింద రుణం పొందాలంటే ఏం అర్హతలు ఉండాలి? దీని కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
‘స్టాండ్ అప్ ఇండియా’ అంటే ఏమిటి?
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు రుణం ఇచ్చి వారికి ఊతం అందించడమే స్టాండ్ అప్ ఇండియా పథకం ఉద్దేశం.
2015 ఆగస్టు 15న ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
దీని ద్వారా చిన్ని చిన్న పరిశ్రమలు నెలకొల్పి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణం అందజేస్తుంది.
ఇప్పటివరకు ఈ పథకం కింద 2,11,925 మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే.. అందులో 1,91,052 దరఖాస్తులకు రుణాలు మంజూరు చేశారు.
ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.43,046 కోట్ల మేర రుణాలు అందజేశారు.
బ్యాంకులు రుణాలు కచ్చితంగా ఇస్తాయా?
కేంద్ర ప్రభుత్వం చెప్పినా బ్యాంకులు సరిగ్గా రుణాలు ఇవ్వవనే అనుమానాలు మనకుండటం సహజమే.
అయితే ఈ పథకం అలా కాదు. దీనికి సంబంధించి కేంద్రం బ్యాంకులకు కొన్ని షరతులను విధించింది.
దేశంలో మొత్తం 1.25 లక్షల బ్యాంకు శాఖలున్నాయి. వీటిలో చిన్నా, పెద్దా అనేదానితో నిమిత్తం లేకుండా ప్రతి శాఖ కూడా ఏటా కచ్చితంగా తమ ప్రాంతంలో ఒక మహిళకైనా లేదా దళిత, గిరిజన యువ పారిశ్రామికవేత్తకైనా రుణం అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది.
లబ్ధిదారులు ఎంత పెట్టుబడి పెట్టాలి?
తాము పెట్టబోయే పరిశ్రమ వ్యయంలో లబ్ధిదారులు 10 లేదా 15 శాతం పెట్టుబడి భరించాల్సి ఉంటుంది.
గతంలో ఇది 25 శాతంగా ఉండేది. దాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇతరులు రుణం పొందాలంటే నిబంధనలు ఏమిటి?
మహిళలకు మాత్రమే కాదు, ఇతరులు కూడా ఈ రుణాలు పొందవచ్చు. కానీ దానికి కొన్ని కచ్చితమైన షరతులుంటాయి.
ఇతరులెవరైనా వ్యక్తిగతంగా తాము స్థాపించబోయే లేదా ఇప్పటికే నెలకొల్పిన పరిశ్రమ విస్తరణకు ఈ పథకం కింద రుణం పొందవచ్చు.
అయితే ఈ పరిశ్రమలో మహిళలు లేదా ఎస్సీ, ఎస్టీలకు చెందిన వ్యక్తికి 51 శాతం వాటా తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఈ రుణాలు మంజూరు చేస్తారు.
రుణం ఎన్నేళ్లలో చెల్లించాలి?
7 సంవత్సరాల్లోపు ఈ రుణాన్ని తిరిగి చెల్లించాలి. 18 నెలల వరకు మారిటోరియం గడువు ఇస్తారు.
వడ్డీ ఎంత?
తక్కువ వడ్డీ రేటు మీద రుణాలు అందజేయడమే ఈ పథకం ప్రత్యేకత.

ఫొటో సోర్స్, Getty Images
రుణం పొందడానికి అర్హతలేమిటి?
దరఖాస్తుదారులు మహిళలు లేదా ఎస్సీ, ఎస్టీ వ్యక్తులై ఉండాలి.
వయసు 18 సంవత్సరాలకు పైబడి ఉండాలి.
ఇప్పటికే పరిశ్రమ లేదా సంస్థలు నెలకొల్పిన వారు తమ వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవడానికి కూడా ఈ పథకం కింద రుణాలు పొందవచ్చు.
సంస్థలో 51% వాటా తప్పనిసరిగా ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తికి లేదా మహిళా వ్యవస్థాపకులకు చెందినదై ఉండాలి.
రుణం పొందాలనుకునే వారు గతంలో ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి రుణం పొంది, దాన్ని సరిగ్గా చెల్లించకుండా డీఫాల్టర్‌గా మారి ఉండకూడదు.
సిబిల్ స్కోరు బలంగా ఉండేలా చూసుకోవాలి.
ఈ పథకం గురించి తెలుసుకోవాలంటే ఎవర్ని సంప్రదించాలి?
దగ్గర్లో ఉన్న ఏదైనా బ్యాంకుకు వెళ్లి అక్కడి అధికారులను సంప్రదించాలి.
స్టాండ్ అప్ ఇండియా పోర్టల్ https://www.standupmitra.in/ సందర్శించి వివరాలు, అర్హతల గురించి తెలుసుకోవచ్చు.
జిల్లాలోని లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ (ఎల్‌డీఎం)ను సంప్రదించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చా?
చేసుకోవచ్చు. అయితే ముందుగా మీరు https://www.standupmitra.in/ పోర్టల్‌లో రిజిస్టరు చేసుకోవాలి.
ఇందులో మీరు అందించే వివరాలను బట్టి మిమ్మల్ని రెండు కేటగిరీలుగా వర్గీకరిస్తారు
మీరు ట్రైనీ రుణ గ్రహీత (ట్రైనీ బారోవర్) లేదా సిద్ధంగా ఉన్న రుణగ్రహీత (రెడీ బారోవర్) కిందకు వస్తారా అనేది నిర్ణయిస్తారు.
ఇలా మీరు లాగిన్ పూర్తి చేసుకున్న తరువాత మీ దరఖాస్తు అర్హతకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు.
ట్రైనీ బారోవర్ అంటే?
మీ పరిశ్రమకు సంబంధించి మార్జిన్ మనీని (బ్యాంకుల నుంచి రుణం తీసుకొనే ముందు పరిశ్రమ పెట్టేందుకు మీ దగ్గర ఉండాల్సిన పెట్టుబడి) సేకరించడానికి కూడా మీకు సహాయం అవసరమని భావిస్తే అప్పుడు మిమ్మల్ని పోర్టల్‌లో ట్రైనీ బారోవర్‌గా వర్గీకరిస్తారు.
ఈ దరఖాస్తుదారును సంబంధిత జిల్లా లీడ్ డిస్ట్రిక్ మేనేజర్(ఎల్‌డీఎం)కు లేదా నాబార్డ్/సిడ్బీ కార్యాలయాలకు అనుసంధానిస్తారు.
ఈ అధికారులు ఏం చేస్తారు?
రుణ గ్రహీతకు ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల (ఫైనాన్షియల్ లిటరసీ సెంటర్స్- ఎఫ్ఎల్‌సీ)ల ద్వారా శిక్షణ ఇస్తారు.
వృత్తి శిక్షణ కేంద్రాలు, ఇతరత్రా నైపుణ్యాలపై శిక్షణ అందజేస్తారు.
మహిళా పారిశ్రామికవేత్తల సంఘాలు, వాణిజ్య సంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రఖ్యాత వ్యాపారవేత్తల నుంచి మద్దతు కూడా అందేలా చూస్తారు.
ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు) ఎలా రూపొందించాలనేదానిపై శిక్షణ ఇస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
రెడీ బారోవర్ అంటే ఏమిటి?
పైన చెప్పుకొన్నట్లు ప్రభుత్వ యంత్రాంగం చేయి పట్టి నడిపించాల్సిన అవసరం లేదనుకునే పారిశ్రామికవేత్తలు ఈ కేటగిరీలోకి వస్తారు.
వీరి దరఖాస్తులను ఆయా జిల్లాలోని బ్యాంకులకు పంపిస్తారు.
అక్కడి నుంచి నేరుగా రుణాలు పొందే అవకాశం కల్పిస్తుంది.
మీ దరఖాస్తును పోర్టల్‌లో ట్రాక్ చేయవచ్చు కూడా.
ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చా?
చేసుకోవచ్చు. మీకు దగ్గర్లోని ఏదైనా ఒక బ్యాంకుకు వెళ్లి అక్కడి అధికారులను సంప్రదించి నేరుగా అక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలోని లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలాంటి పరిశ్రమలు స్థాపించుకోవచ్చు?
మీకున్న ఆలోచనను బట్టి ఏ తరహా పరిశ్రమనైనా నెలకొల్పవచ్చు. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయి డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.
దాన్ని మీరు రుణం పొందదలచిన బ్యాంకు అధికారులకు కూడా సమర్పించాలి.

ఫొటో సోర్స్, Getty Images
ష్యూరిటీలు ఇవ్వాలా?
ఆయా బ్యాంకు నిబంధనలను అనుసరించి వారు అడిగిన మేర ష్యూరిటీలు లేదా పూచీకత్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇది మీకు రుణం ఇచ్చే బ్యాంకు నిబంధనలను బట్టీ ఉంటంది.
గ్రీన్‌ఫీల్డు ప్రాజెక్టు అంటే ఏమిటీ?
ఏమాత్రం ఉపయోగించని భూమిలో పరిశ్రమ నెలకొల్పడానికి వీలుగా కొత్త మౌలిక సదుపాయాలు నిర్మించే వాటిని గ్రీన్‌ఫీల్డు ప్రాజెక్టులుగా వ్యవహరిస్తారు.
అంటే ఆ భూమిలో ఇప్పటికే ఉన్న నిర్మాణాలను కూల్చివేయడం గానీ, పునర్మించడం కానీ చేయరు.
ఖాళీ భూమిలో కొత్తగా మౌలిక సదుపాయాలు కల్పిస్తారు అంతే.
దరఖాస్తులు జిల్లా స్థాయిలో సమీక్షిస్తారా?
మీ దరఖాస్తులను జిల్లా స్థాయిలో సమీక్షిస్తారు. దీని కోసం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో డిస్ట్రిక్ట్ లెవల్ క్రెడిట్ కమిటీ ఉంటుంది.
ఈ కమిటీలో మూడు నెలలకోసారి ఈ దరఖాస్తుల పురోగతి, రుణాలు తీసుకున్నవారు సాధిస్తున్న ప్రగతి గురించి సమీక్ష జరుపుతారు.

ఫొటో సోర్స్, bbc/Kishore babu
‘కొన్ని సమస్యలున్నాయి’
స్టాండ్ అప్ ఇండియా పథకం అమలులో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయని విజయవాడకు చెందిన ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రెన్యూర్ చెరుకూరి చాముండేశ్వరి చెప్పారు.
‘‘మాలాంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొత్తగా పరిశ్రమ స్థాపించాలన్నా, ఉన్నదాన్ని విస్తరించాలన్నా రుణం పొందడానికి బ్యాంకర్ల నుంచీ అనేక నిబంధనలు ఎదురవుతున్నాయి. అందులో ప్రధానమైంది సిబిల్ స్కోరు. కరోనావైరస్ మహమ్మారి వల్ల దాదాపు రెండేళ్లకు పైగా వ్యాపారాలు స్తంభించిపోయాయి. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంపైనా ఇది ప్రభావం చూపుతోంది. సక్రమంగా రుణాలు తిరిగి చెల్లించినవారు, చెల్లిస్తున్నవారు కోవిడ్ వల్ల సిబిల్ స్కోరు తక్కువకు పడిపోయే పరిస్థితులను ఎదుర్కొన్నారు’’ అని ఆమె అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆశించిన రీతిలో పారిశ్రామిక ప్రగతి సాధించాలంటే ఎంఎస్‌ఎంఈలు, తయారీ రంగాన్ని బాగా ప్రోత్సహించాలని చాముండేశ్వరి అభిప్రాయపడ్డారు. అప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు.

‘‘ప్రైవేటు బ్యాంకులు ముందుకు రావడం లేదు’’
స్టాండ్ అప్ ఇండియాను చాలా మంచి పథకమని ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ నవనీత్ కుమార్ అన్నారు.
‘‘ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని కోరుకుంటున్న మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి. చాలా తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తున్నాం. పబ్లిక్ సెక్టారు బ్యాంకులు ఈ రుణాలు బాగా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకులు మాత్రం రుణాలు అంతగా ప్రోత్సాహకరంగా ఇవ్వడం లేదు. ఇది నిరుత్సాహ పరుస్తోంది.’’ అని నవనీత్ చెప్పారు.
‘‘ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్‌గా మేం దీనిపై దృష్టి సారించాం. ప్రైవేటు బ్యాంకులు కూడా తగినంత రుణాలు ఇవ్వాలని వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో స్టాండ్ అప్ ఇండియా పథకం కింద కొత్తగా పరిశ్రమలు స్థాపించడానికి చాలా మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే కొంతమంది కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు. మరికొన్ని దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.” అని ఆయన చెప్పారు.
జిల్లాలో ఎవర్ని సంప్రదించాలి?
దరఖాస్తుదారుకు సులభంగా సేవలందించడానికి వీలుగా ఆయా రాష్ట్రాల్లో జిల్లాల్లో కనెక్ట్ సెంటర్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
దరఖాస్తుదార్లు వారి ప్రాంతంలోని కనెక్ట్ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేయడానికి సహాయం పొందవచ్చు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నవారు తమ ప్రాంతంలోని కనెక్ట్ కేంద్రాలను ఈ వెబ్ లింక్‌లో తెలుసుకోవచ్చు.
https://www.standupmitra.in/SUCCs
వివరాలకు ఎవర్ని సంప్రదించాలి?
దరఖాస్తుదారుల కోసం కేంద్రం టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసింది.
టోల్‌ఫ్రీ నంబరు : 1800-180-1111
ఈ మెయిల్: [email protected]
ఇవి కూడా చదవండి:
- హోం లోన్: కిరాయి ఇంటికి కడుతున్న అద్దె డబ్బులను ఈఎంఐగా కట్టి ఇల్లు కొనుక్కోవచ్చా?
- Annuity plans: నెల జీతంలాగా స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే మార్గమిది, ఎవరు చేరొచ్చు, తెలుసుకోవాల్సిన విషయాలేంటి
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















