అంబానీ చేతికి బియానీ వ్యాపారాలు.. అమెజాన్‌కు రిలయన్స్ పోటీ ఇస్తుందా? - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, EPA
రిలయన్స్ రిటైల్ చేతికి కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాలు దక్కనున్నాయని.. ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)ల మధ్య ఆ మేరకు నేడు ఒక ఒప్పందం జరిగే అవకాశం కనిపిస్తోందని 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది. ఇదే జరిగితే భారత రిటైల్ రంగంలో రిలయన్స్ రిటైల్ వాటా భారీ ఎత్తున పెరగనుందని చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్, కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌ల మధ్య ఒప్పందానికి శనివారం జరిగే బోర్డు సమావేశంలో ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ అంగీకారం తెలపవచ్ఛు. మొత్తం నగదులో జరిగే ఈ ఒప్పందంలో ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రుణాలన్నీ రిలయన్స్ రిటైల్‌కు వెళతాయి. అదే సమయంలో అందులో మైనారిటీ వాటా కూడా రిలయన్స్ రిటైల్‌కు వస్తుంది.
ఇదీ ఒప్పందం..: ఫ్యూచర్ గ్రూప్ తొలుత తన అయిదు యూనిట్లయిన నిత్యావసరాలు, దుస్తులు, సరఫరా వ్యవస్థ, వినియోగదారు వ్యాపారాలను.. ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ (ఎఫ్‌ఈఎల్)లో విలీనం చేస్తుంది. ఆ తర్వాత ఎఫ్‌ఈఎల్ అన్ని రిటైల్ ఆస్తులను ఏకమొత్తంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయిస్తుందని ఈ పరిణామాలతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. మొత్తం లావాదేవీ విలువ రూ. 29,000 - 30,000 కోట్లుగా ఉండొచ్చని చెబుతున్నారు. రిలయన్స్ రిటైల్‌కు దుస్తులు, నిత్యావసరాలను దీర్ఘకాలం పాటు సరఫరా చేసే ఒప్పందాన్ని కూడా ఎఫ్‌ఈఎల్ కుదుర్చుకోవచ్ఛు.
ఫ్యూచర్ గ్రూప్ ఎందుకు అమ్మాల్సి వస్తోందంటే..: ఈ ఒప్పందం ద్వారా తనకున్న భారీ అప్పుల నుంచి బయటపడాలని ఫ్యూచర్ గ్రూప్ భావిస్తోంది. 2019 మార్చి 31 నాటికి రూ. 10,951 కోట్లుగా ఉన్న కంపెనీ అప్పులు 2019 సెప్టెంబరు 30 నాటికే రూ. 12,778 కోట్లకు చేరుకున్నాయి. ఈ మార్చి కల్లా కొన్ని బకాయిలను తీర్చాల్సి ఉంది. అయితే ఆర్‌బీఐ మారటోరియం కొంత ఊపిరినిచ్చింది.
ఫిబ్రవరి నుంచే గ్రూప్ కంపెనీలు రుణాన్ని తీర్చలేని పరిస్థితికి వచ్చాయి. దీంతో బియానీకిచ్చిన రుణాలకు మరిన్ని షేర్లు తనఖా పెట్టాలని రుణదాతలు ఒత్తిడి పెంచారు. ఆలోచనల పుట్టగా పేరున్న బియానీ.. క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయడంలో విఫలం కావడంతో పాంటలూన్ రిటైల్‌ను ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు; ఫ్యూచర్ క్యాపిటల్‌ను వార్‌బర్గ్ పింకస్‌కు విక్రయించుకోవాల్సి వచ్చింది. ఇపుడూ రుణాలు తీర్చడానికే ఈ విక్రయం.
రిలయన్స్‌కు ఏమిటి లాభం..: ఎప్పటినుంచో రిటైల్ రంగంలో మార్కెట్ లీడర్‌గా మారాలన్న రిలయన్స్ కల ఈ ఒప్పందంతో నెరవేరుతుంది. గత ఆర్థిక సంవత్సరం రూ. 1.63 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిన రిలయన్స్ రిటైల్‌కు ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందం ద్వారా భారత్‌లోని సంస్థాగత రిటైల్ మార్కెట్లో మూడో వంతు కంటే అధిక మార్కెట్ వాటా లభిస్తుంది. అంతేకాదు పోటీదార్లపై గట్టి ఒత్తిడిని పెంచవచ్ఛు ముఖ్యంగా అమెరికాకు చెందిన అమెజాన్ ఇండియాకు ఇ-కామర్స్ విభాగంలో గట్టి పోటీ ఇవ్వవచ్ఛు.

పసి పాపను అమ్మేసిన అమ్మమ్మ
నెల రోజుల వయసున్న మనవరాలి ఆలనా పాలనా చూడాల్సిన అమ్మమ్మ అప్పులు తీర్చుకోవడం కోసం రూ. లక్షకు విక్రయించిందని 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. శిశువు కనిపించకపోవడంపై కూతురు నిలదీయడం.. తల్లీకూతుళ్ల గొడవను ఓ వ్యక్తి డయల్ 100కు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన జమల్పూరి పద్మ, రమేశ్ నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో నెల రోజుల క్రితం పద్మ ఆడశిశువుకు జన్మనిచ్చింది. వారం క్రితం భర్తతో గొడవ పడిన పద్మ.. స్వగ్రామంలోని తల్లి కనకమ్మ ఇంటికి వచ్చింది.
కూతురికి మాయమాటలు చెప్పిన కనకమ్మ.. నాలుగు రోజుల క్రితం శిశువును పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి రూ. 1.10 లక్షలకు విక్రయించింది. శిశువు కనిపించకపోవడంతో తల్లిని నిలదీయగా మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీసింది. పద్మ గట్టిగా నిలదీయడంతో డబ్బులకు అమ్మేశానని చెప్పడంతో రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు శుక్రవారం విచారణ జరిపారు.
ప్రేమ వివాహం నచ్చనందుకే..!: పద్మకు గతంలోనే వివాహమైంది. కుమారుడు, కూతురు ఉన్నారు. రమేశ్‌ను రెండో వివాహం చేసుకుంది. కులాంతర వివాహం చేసుకోవడంతో తల్లికి నచ్చలేదు. కూతురుపై కక్ష పెంచుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో అదునుగా తీసుకున్న కనకమ్మ.. కూతురును తన ఇంటికి తీసుకొచ్చింది.
శిశు విహార్‌కు తరలింపు: శిశువు విక్రయంపై ఎస్సై కిరణ్‌రెడ్డి పూర్తి స్థాయిలో విచారణ జరిపి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పర్చేందుకు కరీంనగర్‌లోని శిశువిహార్‌కు తరలించారు. కాగా, శిశువు విక్రయంలో కొందరు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు తెలిసింది. కనకమ్మ రూ. 2 లక్షలు డిమాండ్ చేయగా రూ. 1.10 లక్షలకు బేరం కుదిర్చినట్లు సమాచారం.

ఫొటో సోర్స్, Getty Images
సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో బార్లకు అనుమతి?
'అన్‌లాక్-4.0'లో బార్లను అనుమతించనున్నారా? సిటింగ్‌లకు కాకుండా కౌంటర్ సేల్స్‌కు అవకాశమిస్తారా? సెప్టెంబరు 1 నుంచి బార్లలోనూ మద్యం, బీరు లభిస్తాయా? అంటే.. ఎక్సైజ్ అధికారులు, బార్ల యజమానులు అవునంటున్నారని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. వచ్చే నెల 1 నుంచి బార్లు తెరుచుకుంటాయని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతించడానికి సిద్ధంగా ఉందని తెలిసింది. అయితే కేంద్ర హోంశాఖ జారీ చేసే తాజా మార్గదర్శకాల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఇదివరకు మద్యం దుకాణాలను అనుమతించినట్లుగానే కేంద్ర మార్గదర్శకాల ప్రకారం బార్లకు అనుమతి లభిస్తుందని అంటున్నారు. నిజానికి రాష్ట్రంలో 1000 వరకు బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లు (లిక్కర్ లైసెన్స్‌డ్) ఉన్నాయి.
కరోనా లాక్‌డౌన్ కంటే ముందుగానే మార్చి 15 నుంచి ఇవన్నీ మూతపడ్డాయి. దీంతో బార్ల యజమానులు నష్టపోవడమే కాకుండా, ప్రభుత్వానికి మద్యం ద్వారా వచ్చే రాబడి కూడా గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం మద్యం షాపుల ద్వారానే మద్యం, బీరును విక్రయిస్తున్నారు. ఈ విక్రయాలతో ప్రభుత్వానికి రోజుకు సగటున రూ.70 కోట్ల వరకు రాబడి వస్తోంది. అదే బార్లను కూడా అనుమతిస్తే.... మరో రూ.15-20 కోట్ల రోజువారి రాబడి పెరుగుతుంది.
సెప్టెంబరు 1 నుంచి కేంద్రం అన్‌లాక్-4.0ను అమలు చేయనుంది. దీనిలో భాగంగా జారీ చేసే మార్గదర్శకాల్లో బార్లు, క్లబ్బులు, పబ్బులకు వెసులుబాటు ఉంటుందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ వెసులుబాటు లభిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా బార్లను అనుమతిస్తుంది. పైగా బార్లు కూడా సెప్టెంబరు వరకు సరిపడా ఎక్సైజ్ ట్యాక్స్ (లైసెన్సు ఫీజు) ను ప్రభుత్వానికి చెల్లించాయి. దీంతో తమకూ అనుమతి ఇవ్వాలని, లేకపోతే తీవ్రంగా నష్టపోతామంటూ బార్ల యజమానులు ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌కు విజ్ఞప్తి చేశారు. అందుకే కేంద్రం ఇచ్చే వెసులుబాటును ఆధారంగా చేసుకుని బార్లను అనుమతించవచ్చని తెలిసింది.
అయితే అనుమతులు ఎలా ఉంటాయన్న చర్చ కూడా సాగుతోంది. బార్లలో సిట్టింగ్ సేల్స్‌కు అవకాశం ఇవ్వబోరని ప్రచారం జరుగుతోంది. ఇదివరకు ఫుడ్ రెస్టారెంట్లకు ఇచ్చినట్లుగానే 'టేక్ అవే', 'కౌంటర్ సేల్స్' వంటి పద్ధతుల్లో అనుమతి ఇవ్వవచ్చని అంటున్నారు. అంటే వినియోగదారులను బార్లలో కూర్చోబెట్టి మందును సర్వ్ చేయడం కాకుండా రిటెయిల్‌గా విక్రయించుకోవడానికి అనుమతి ఇస్తారని చెబుతున్నారు. ఇలా అనుమతులిస్తే తమకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని బార్ల యజమానులు అంటున్నారు.
వాస్తవానికి బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి బార్లకు ఫుల్ బాటిళ్ల (ఒక్కో బాటిల్‌లో 750 ఎంఎల్ లిక్కర్ ఉంటుంది) ను సరఫరా చేస్తారు. రిటెయిల్ సేల్స్‌ను అనుమతిస్తే ఫుల్ బాటిళ్లు కొనుగోలు చేసేవారు చాలా తక్కువగా ఉంటారని, దీని వల్ల తమకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదని యజమానులు వాపోతున్నారు. అందుకే వైన్ షాపులకు సరఫరా చేసినట్లుగానే తమకూ నిబ్ (180 ఎంఎల్), పింట్ (375 ఎంఎల్) లను సరఫరా చేయాలని అడుగుతున్నారు. అలాగైతేనే వినియోగదారులు బార్లలో మద్యాన్ని కొనుగోలు చేస్తారని పేర్కొంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో నాలుగు కోట్ల కరోనా టెస్టులు పూర్తి
దేశంలో ఇప్పటివరకూ దాదాపు నాలుగు కోట్ల (3,94,77,848) కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. గురువారం ఒక్క రోజే 9 లక్షలకుపైగా కోవిడ్ పరీక్షలు జరిపారు. ఈ వివరాల్ని ఐసీఎంఆర్ వెల్లడించింది. కేవలం రెండు వారాల్లోనే కోటిపైగా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.
మరోవైపు దేశంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య బాగా పెరుగుతున్నది. ఇప్పటి వరకు 25,83,948 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 76.28 శాతంగా నమోదైంది. ప్రస్తుతం కరోనాతో 7,42,023 మంది చికిత్స పొందుతున్నారు. మరణాల రేటు 1.82 శాతానికి తగ్గిపోయింది.
గురువారం నుంచి శుక్రవారం నాటికి 24 గంటల వ్యవధిలో దేశంలో రికార్డుస్థాయిలో 77,266 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,87,500 పెరిగింది.
ఇవి కూడా చదవండి:
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- పార్టీ సమావేశంలో ప్రత్యక్షమైన కిమ్ జోంగ్ ఉన్... ఇంతకీ ఆయనకేమైంది?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








