మనిషి ఒంటి మీద కంటికి కనిపించని గీతలు ఉంటాయని తెలుసా... ఆ రేఖల రహస్యమేంటి?

బ్లాష్కో రేఖలు చర్మం కింద కనిపించే డెర్మిస్ కణజాలంలోని కొల్లాజెన్ ఫైబర్లకు సమాంతరంగా ఇవి ఉంటాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్లాష్కో రేఖలు చర్మం కింద కనిపించే డెర్మిస్ కణజాలంలోని కొల్లాజెన్ ఫైబర్లకు సమాంతరంగా ఇవి ఉంటాయి
    • రచయిత, రెడేషియన్
    • హోదా, బీబీసీ ముండో

మీరు వాటిని చూడలేకపోవచ్చు. కానీ, అవి పుట్టినప్పటి నుంచీ మీతోనే ఉన్నాయి. తల నుంచి కాలి బొటన వేళ్ల వరకూ ఒళ్లంతా అవి ఉంటాయి. తలపై సుడులు తిరిగి, వీపుపై వీ ఆకారంలో, ముఖంపై అడ్డంగా ఈ రేఖలు ఉంటాయి.

పైకి కనిపించనప్పటికీ ఇలాంటి గీతలు ఉంటాయని 19వ శతాబ్దంలో జర్మనీ డెర్మటాలజిస్టు ఆల్ఫ్రెడ్ బ్లాష్కో ప్రతిపాదించారు. తన రోగుల చర్మంపై దద్దుర్లు, పుట్టుమచ్చలను జాగ్రత్తగా పరిశీలించిన అనంతరం ఆయన ఈ అవగాహనకు వచ్చారు.

చాలా మచ్చలు ఒక ప్యాటెర్న్‌లో ఉంటున్నట్లు ఆయన గుర్తించారు. ఎవరో ముందుగానే నిర్దేశించిన మార్గంలో వెళ్తున్నట్లుగా ఇవి కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు.

మన శరీరంపై లాంగర్ లేఖలు లాంటి వాటిని అప్పటికే పరిశోధకులు గుర్తించారు. శస్త్రచికిత్సల సమయంలో వీటిని అనుసరించే శరీరంపై వైద్యులు కోతలు పెడుతుంటారు. ఈ రేఖలపై ఒత్తిడి కాస్త తక్కువగా ఉంటుంది. ఫలితంగా రోగి ఇక్కడ గాయమైనా త్వరగా కోలుకుంటాడు.

చర్మం మీద పైకి కనిపించని గీతలు
ఫొటో క్యాప్షన్, పైకి కనిపించనప్పటికీ ఇలాంటి గీతలు ఉంటాయని 19వ శతాబ్దంలో జర్మనీ డెర్మటాలజిస్టు ఆల్ఫ్రెడ్ బ్లాష్కో ప్రతిపాదించారు

బ్లాష్కో రేఖల విషయానికి వస్తే.. చర్మం కింద కనిపించే డెర్మిస్ కణజాలంలోని కొల్లాజెన్ ఫైబర్లకు సమాంతరంగా ఇవి ఉంటాయి. వాటి కింద ఉండే కండరాల ఫైబర్లకు లంబంగా కనిపిస్తాయి.

ఈ రేఖల్లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇవి రక్తనాళాలు, శోషరస వ్యవస్థలు (లింఫాటిక్ సిస్టమ్), లేదా ఇతర కండరాలకు అనుసరిస్తూ కనిపించవు.

అంతుచిక్కని ఈ ప్యాటర్న్‌లు కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే కనిపిస్తాయి.

కొన్ని చర్మ సమస్యలతో బాధపడుతున్న రోగుల నుంచి సమాచారం సేకరించి, వ్యాధుల గాయాలను మ్యాప్ చేసిన అనంతరం 1901లో బ్లాష్కో తన పరిశోధనను డెర్మటాలజీ కాంగ్రెస్ ఎదుట సమర్పించారు.

ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెర్వ్స్ ఇన్ ద స్కిన్, ఇట్స్ రిలేషన్‌షిప్ విత్ స్కిన్ డిసీజెస్ పేరుతో ఆయన పరిశోధన పత్రాన్ని ప్రచురించారు.

‘‘అనుకోకుండా చర్మంపై ఈ గాయాలు, చర్మ సమస్యలు నా పరిశోధనకు కేంద్రమయ్యాయి. బహుశా వీటిపై ఎక్కువ సమయం పనిచేయడమే దీనికి కారణం కావచ్చు.’’ అని ఆయన ఆ పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.

‘‘ఈ రేఖల నమూనా మీ అందరికీ పరిచయం చేయాలని అనుకుంటున్నాను. నా పరిశోధన ఫలితాలను ఒక చిత్రం రూపంలో మీ ముందు ఉంచుతున్నాను.’’ అని పై మ్యాప్‌లను ఆయన చూపించారు.

వీడియో క్యాప్షన్, ఆందోళనగా ఉన్నప్పుడు ఏం చేయాలి?

1922లో బ్లాష్కో మరణించారు. అయితే, సుఖ వ్యాధులను అడ్డుకోవడంలో పరిశుభ్రత గురించి ఆయన చేసిన కృషి అమూల్యమైనది. చర్మ వ్యాధులపై ఆయన చేపట్టిన పరిశోధనలకు ఆయన కాలంలోనే గుర్తింపు లభించింది.

‘‘ఈ రంగంలో మిగతా నిపుణుల అధ్యయనాలకు బ్లాష్కో పరిశోధన ఆధారంగా నిలిచింది. ప్రముఖ డెర్మటాలజిస్టుగా బ్లాష్కో పేరు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచిపోతుంది.’’అని డెర్మటాలాజిస్క్ జీట్స్‌క్రిఫ్ట్ జర్నల్‌లో పరిశోధకుడు అబ్రహాం బష్కే రాసుకొచ్చారు.

ఈ రేఖల ప్యారెట్న్ పుట్టుకతోనే మనతో ఉంటుందని కూడా బ్లాష్కో అంచనా వేశారు. ఎందుకంటే తర్వాత కాలంలో వచ్చే చర్మ వ్యాధులు ఇవే ప్యాటెర్న్‌ను అనుసరిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఈ రేఖలను బ్లాష్కో గుర్తించిన శతాబ్దం తర్వాత, వీటికి జర్మనీలోని మార్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన రడాల్ఫ్ హ్యాపల్, ఎటిస్సా అస్సిం మరికొన్ని వివరాలను కూడా జోడించారు

ఫొటో సోర్స్, GORAN_TEK-EN

ఫొటో క్యాప్షన్, ఈ రేఖలను బ్లాష్కో గుర్తించిన శతాబ్దం తర్వాత, వీటికి జర్మనీలోని మార్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన రడాల్ఫ్ హ్యాపల్, ఎటిస్సా అస్సిం మరికొన్ని వివరాలను కూడా జోడించారు

సుడులు తిరుగుతూ...

ఈ రేఖలను బ్లాష్కో గుర్తించిన శతాబ్దం తర్వాత, వీటికి జర్మనీలోని మార్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన రడాల్ఫ్ హ్యాపల్, ఎటిస్సా అస్సిం మరికొన్ని వివరాలను కూడా జోడించారు.

సవివర ప్యాటెర్న్‌ను రూపొందించేందుకు వీరు 186 మంది తల, మెడ గాయాలను పరిశీలించారు.

ముఖంపై ఈ బ్లాష్కో రేఖలు ఇసుక గడియారం ఆకారంలో ముక్కు దగ్గర కలుస్తున్నట్లు వీరు అంచనాకు వచ్చారు. వీటిలో కొన్ని రేఖలు దాదాపు 90 డిగ్రీల కోణంలో కలుస్తున్నాయి. తలపై మాత్రం ఇవి సుడులు తిరుగుతున్నాయి.

వీరు గుర్తించిన రేఖలు పైన చూపించిన విధంగా ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, కొన్ని ఆహార పదార్థాలు ఆకలిని నియంత్రిస్తాయా, పరిశోధనల్లో ఏం తేలింది?

బ్రిటిష్ సైటోజెనెటిసిస్టులు మేరీ లయాన్, జర్మనీ హ్యాపిల్ లాంటి నిపుణుల పరిశోధనలతో గత కొన్నేళ్లలో బ్లాష్కో రేఖల విషయంలో చాలా పురోగతి కనిపిస్తోంది.

మన శరీర అభివృద్ధికి మూలమైన కణాల అవశేషాలను ఈ రేఖలు సూచిస్తున్నాయి.

మన మంతా ఒక కణం నుంచే అభివృద్ధి చెందాం.

అభివృద్ధి చెందే దశలో శరీరమంతా పొపైపొరలా పరచుకునేందుకు చర్మ కణాలు విభజనకు గురై, సంఖ్యను రెట్టింపు చేసుకునే సమయంలో ఈ రేఖల మధ్య దూరం పెరుగుతోంది.

కణస్థాయిలో అసలు ఏం జరుగుతోందో చెప్పడానికి ఈ బ్లాష్కో రేఖలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

బ్లాష్కో రేఖల వల్ల ఏర్పడే ప్యాటెర్న్‌లు మన కంటికి కనపడవు. కానీ, దద్దుర్లు, ఇతర వ్యాధుల సమయంలో ఈ ఒక ప్యాటెర్న్‌ను గమనించొచ్చు.

వీటి గురించి అర్థం చేసుకోవడం ద్వారా కొన్ని రకాల చర్మ వ్యాధులను మెరుగ్గా నిర్ధారించొచ్చు.

వీడియో క్యాప్షన్, హీరోయిన్లు, అందగత్తెలు తాగే బ్లాక్‌వాటర్ అంటే ఏంటి?

కవలల్లో గుర్తించొచ్చు..

డజన్ల కొద్దీ చర్మ రోగాలు బ్లాష్కో రేఖలను అనుసరించే చర్మంపై విస్తరిస్తూ ఉంటాయి. గాయాలు, పుండ్లు కూడా రెండు వేర్వేరు రేఖలు కలిసే చోటే ఎక్కువగా అవుతుంటాయి.

బ్లాష్కో రేఖలను మనకు చూపించే వాటిలో కైమెరిజం కూడా ఒకటి. ఒకే వ్యక్తిలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కణాలు కనిపించడాన్ని కైమెరిజంగా చెబుతారు.

‘‘కడుపులో కవలలు ఉండేటప్పుడు ఎక్కువగా ఇలా ఇలా జరుగుతుంది. వీటిలో ఒక పిండం మరణించినప్పుడు దీనిలోని కొన్ని కణాలు రెండో పిండంలోకి వెళ్తాయి.’’ అని సైటిఫిక్ అమెరికన్ మ్యాగజైన్‌లో రాసుకొచ్చారు.

ఇలా రెండు భిన్న రకాల కణాలు కలిసి ఒక మనిషిగా రూపుదిద్దుకునేటప్పుడు చర్మంలోని ఎపీడెర్మల్ కణాల్లోనూ ఆ తేడా కనిపిస్తుంది.

ఈ రెండు రకాల చర్మం రంగుల మధ్య స్వల్ప తేడా కనిపిస్తుంది. దీన్ని మనం అతినీలలోహిత కాంతి సాయంతో చూడొచ్చు.

మీకు కనిపించినా, కనిపించకపోయినా.. ఈ గీతలు మన శరీరంలో పైనుంచి కిందకు, ముందు నుంచి వెనక్కు పరచుకొని ఉంటాయి.

మన శరీరంపై ఏదో కథను రాసినట్లుగా ఈ లైన్లు ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)