వయసు పెరిగే కొద్దీ గొంతు ఎందుకు మారుతుంది?

స్వరం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, ఆడమ్ టేలర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వయసు పెరిగే కొద్ది గొంతులో తేడా ఉంటుంది. మన గొంతు వృద్ధాప్య ప్రభావాలకు అతీతమేం కాదు. కానీ వాటిని మంచి స్థితిలో ఉంచడానికి తోడ్పడే కొన్ని అంశాలు ఉన్నాయి.

సర్ ఎల్టన్ జాన్ ఈ సంవత్సరం గ్లాస్టన్‌బరీలో షో నిర్వహించారు. అత్యధికంగా వీక్షించిన రికార్డునూ ఆయన ఆ 'షో' సొంతం చేసుకుంది.

ఆయన షోను 70 లక్షల కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు బీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు.

76 ఏళ్ల ఈ గాయకుడు ఖచ్చితంగా తన అద్భుత ప్రదర్శనను అందించారు.

కానీ దశాబ్దాలుగా ఎల్టన్ జాన్ సంగీతాన్ని వింటున్న చాలామంది కెరీర్‌లో ఆయన స్వరం ఎంత మారిపోయిందో గమనించే ఉంటారు.

1980లలో జాన్‌కు స్వర తంత్రులు (వోకల్ కార్డ్స్) నుంచి పాలిప్‌లను తొలగించడానికి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ఆయన గొంతు మారింది.

స్వర తంత్రులు మీ గొంతు నుంచి ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. ఇవి స్వరపేటికలో ఉంటాయి. గొంతు నుంచి ఊపిరితిత్తులకు గాలిని అందించే శ్వాసకోశ వ్యవస్థలో ఒక భాగం స్వరపేటిక.

ఊపిరితిత్తుల నుంచి స్వరపేటిక ద్వారా గాలి బయటకు వెళ్లినప్పుడు, అది స్వర తంత్రులు కంపించేలా చేస్తుంది. ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది .

స్వర తంత్రులలో మూడు ప్రధాన భాగాలుంటాయి: స్వర కండరం, స్వర స్నాయువు, వాటిని కప్పి ఉంచే శ్లేష్మ పొర (గ్రంథులను కలిగి ఉంటుంది).

ఇది ఉపరితలాన్ని తేమగా ఉంచుతుంది. వాటిని దెబ్బ తినకుండా కాపాడుతుంది.

ఎల్టన్ జాన్

ఫొటో సోర్స్, Getty Images

పురుషులు, స్త్రీల గొంతులో తేడాలు ఎందుకు?

స్వరపేటికలో దాదాపు 17 ఇతర కండరాలు కూడా ఉంటాయి. ఇవి స్వర తంత్రుల స్థానం, ఉద్రిక్తతను మార్చగలవు. తద్వారా ఉత్పత్తి అయిన ధ్వనిని మారుస్తుంది.

యుక్తవయస్సుకు ముందు ఆడ, మగ మధ్య స్వర తంత్రులు ఉత్పత్తి చేసే ధ్వనిలో చాలా తక్కువ తేడా ఉంటుంది. కానీ యుక్త వయస్సులో, హార్మోన్లు వాటి ప్రభావాలను చూపడం ప్రారంభిస్తాయి.

ఇది స్వరపేటిక నిర్మాణాన్ని మారుస్తుంది. పురుషులలో "ఆడమ్స్ యాపిల్", స్వర తంత్రుల పొడవు ఎక్కువగా చేస్తుంది.

ఇవి యుక్త వయస్సు తర్వాత పురుషులలో 16 మి.మీ, స్త్రీలలో 10 మి.మీ పొడవు వరకు పెరుగుతాయి.

యుక్తవయస్సు తర్వాత మహిళల స్వర తంత్రులు 20-30 శాతం సన్నగా ఉంటాయి.

ఈ పొట్టిగా, సన్నగా ఉండే స్వర తంత్రుల కారణంగానే పురుషుల కంటే స్త్రీలు సాధారణంగా ఎక్కువ రకాల స్వరాలను వినిపించగలుగుతారు.

యుక్తవయస్సు వచ్చిన తర్వాత కూడా హార్మోన్లు వాయిస్‌పై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు ఒక మహిళ రుతు చక్రం దశను బట్టి ఆమె స్వరం భిన్నంగా ఉండవచ్చు.

అండాల ఉత్పత్తి దశలో ఉన్న వారిలో వాయిస్ నాణ్యత ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే ఈ దశలో గ్రంథులు చాలా శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి, స్వర తంత్రులకు వాటి ఉత్తమ సామర్థ్యాన్ని అందిస్తాయి.

గర్భనిరోధక మాత్రలు తీసుకునే స్త్రీలు వాయిస్ నాణ్యతలో తక్కువ వైవిధ్యాన్ని చూపుతారని పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే పిల్ అండాల ఉత్పత్తిని నిలిపివేస్తుంది.

అతి వినియోగంతో నష్టం

మరోవైపు బహిష్టుకు ముందు హార్మోన్ల మార్పులు స్వర తంత్రులకు ఆటంకం కలిగిస్తాయి, వాటిని దృఢంగా చేస్తాయి.

1960లలో ఒపెరా గాయకులకు వారి స్వర తంతువులు దెబ్బతినకుండా చూసుకోవడానికి " గ్రేస్ డేస్ " ఎందుకు ఇచ్చారో ఇది తెలియజేస్తుంది.

స్త్రీల స్వర తంతువులు సన్నగా ఉన్నందున, వారి అతి వినియోగం వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంది.

శరీరంలోని దాదాపు ప్రతి ఇతర భాగాల మాదిరిగానే, స్వర తంత్రులకూ వయస్సుంటుంది. కానీ ఈ మార్పులు అందరికీ కనిపించకపోవచ్చు.

మనం పెద్దయ్యాక స్వరపేటిక దానిలోని ఖనిజ పదార్ధాలను పెంచుకోవడం ప్రారంభిస్తుంది, ఇది మృదులాస్థి కంటే గట్టిగా, ఎముకలాగా మారుతుంది.

ఈ మార్పు 30 ఏళ్లకే, ముఖ్యంగా పురుషులలో మొదలవుతుంది. ఇది స్వర తంత్రులను తక్కువ ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది.

స్వర తంత్రులు కదలడానికి ఉపయోగపడే కండరాలు కూడా మన వయస్సు పెరిగేకొద్దీ ( ఇతర కండరాల మాదిరిగానే) ఉపయోగపడకుండా అవుతాయి .

స్వర తంత్రులకు సాయం చేసే స్నాయువులు, కణజాలాలు కూడా స్థితిస్థాపకతను కోల్పోతాయి, తక్కువ అనువైనవిగా మారతాయి. ఊపిరితిత్తుల కండరాల పనితీరు తగ్గుతుంది. ధ్వనిని సృష్టించడానికి ఊపిరితిత్తుల నుంచి వెలువడిన గాలి శక్తిని ఇది తగ్గిస్తుంది.

స్వరపేటికను నియంత్రించే సామర్థ్యం తగ్గడంతో పాటు శ్లేష్మం ఉత్పత్తి చేసే గ్రంథుల సంఖ్య కూడా తగ్గుతుంది.

చాలామంది వ్యక్తులలో స్వర తంత్రులకు వయస్సు అదే స్థాయిలో ఉన్నప్పటికీ, జీవనశైలి కారణంగా వాటికి హాని కలిగించే ప్రమాదం ఎక్కువుంటుంది. అప్పుడు అది మీ వాయిస్ ధ్వనిని మార్చవచ్చు.

ఉదాహరణకు ధూమపానం వాపుకు, శ్లేష్మ ఉత్పత్తి పెరగడానికి కారణమవుతుంది, అయితే శ్లేష్మ ఉపరితలాలపై కూడా ఇది ప్రభావం చూపవచ్చు.

ఆల్కహాల్ కూడా ఇదే ప్రభావం చూపుతుంది. కాలక్రమేణా ఈ కారణాలు స్వర తంత్రులను దెబ్బతీస్తాయి. వాయిస్‌ను మారుస్తాయి.

స్వరం

ఫొటో సోర్స్, Getty Images

స్వరం బొంగురుగా ఎందుకు మారుతుంది?

లారింగైటిస్ కోసం ఉపయోగించే స్టెరాయిడ్ ఇన్హేలర్స్ వంటి కొన్ని మందులు స్వరాన్ని మార్చగలవు.

స్వర తంత్రులను బ్లడ్ తిన్నర్స్ (రక్తం గట్టకట్టడాన్ని నిరోధించేవి) కూడా దెబ్బతీస్తాయి, ఇవి పాలిప్స్ ఏర్పడటానికి కారణమవుతాయి. దీని వలన స్వరం కరుకుగా లేదా బొంగురుగా మారుతుంది.

మజిల్ రిలాక్సెంట్స్ వంటి ఔషధాలు మనిషికి చికాకు కలిగిస్తాయి, స్వర తంత్రులు దెబ్బతినవచ్చు. ఈ మందుల వల్ల కలిగే చికాకు, మార్పులు వాడకం ఆపిన తర్వాత కనిపించవు. మరొక జీవనశైలి అంశం అతిగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇది సాధారణంగా గాయకులు, ఉపాధ్యాయులు, ఫిట్‌నెస్ బోధకులు వంటి వారి పని సమయంలో వారి స్వరాన్ని ఎక్కువగా ఉపయోగించే వారిలో కనిపిస్తుంది.

ఇది 'రేన్కేస్ ఎడెమా' అనే అసాధారణ పరిస్థితికి దారి తీస్తుంది. ఇది ధూమపానం వల్ల కూడా సంభవించవచ్చు.

స్వర తంత్రులలో ద్రవం పేరుకుపోవడానికి రేన్కేస్ ఎడెమా కారణమవుతుంది. ఇది స్వరాన్ని మారుస్తుంది.

రేన్కేస్ పరిస్థితి చేయిదాటితే ఆ ద్రవం తొలగించడానికి శస్త్రచికిత్స అవసరం .

చాలా సందర్భాలలో విశ్రాంతి తీసుకోవడం, చికాకు కలిగించే వాటిని (ధూమపానం, మద్యపానం) తీసుకోకపోవడం ప్రయోజనకరం.

అయితే స్పీచ్, లాంగ్వేజ్ థెరపీలు ధ్వని మార్పును పరిష్కరించగలవు .

స్వర తంత్రుల వయస్సు సంబంధిత మార్పులలో మనం మార్చలేకపోయినా, నిరంతర ఉపయోగం ద్వారా మన స్వర నాణ్యత, సామర్థ్యాన్ని కొంతవరకు కొనసాగించవచ్చు.

అనేక సందర్భాల్లో పాడని వ్యక్తులతో పోలిస్తే గాయకులు వారి వయస్సు పెరిగేకొద్దీ వారి స్వరం తక్కువ మార్పులకు లోనవుతుంటాయి.

రోజూ పాడటం వంటివి స్వర తంత్రుల క్షీణతను తగ్గించడానికి ఉపయోగపడతాయి.

అందుకే మనం మన స్వర తంత్రులను జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం.

ద్రవ పదార్థాలు తీసుకుంటూ, ఆల్కహాల్, పొగాకు తగ్గించడం వల్ల వీటిని దెబ్బతినకుండా చూసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)