బేబీ సినిమా రివ్యూ: అమ్మాయిని ఓ అబ్బాయి ఇంతలా ప్రేమిస్తాడా... ఈ కథలో నిజమైన ప్రేమ ఎవరిది?

ఫొటో సోర్స్, Twitter/Anand Deverakonda
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
''మొదటి ప్రేమకు మరణం లేదు
మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది''
బేబీ సినిమా ఈ పాయింట్ చుట్టూ తిరుగుతుందని దర్శకుడు ముందే చెప్పేశాడు. ట్రైలర్‌లోనూ అదే చూపించాడు.
'బేబీ' కథేమిటో, అందులో చూపించే ప్రేమ ఏమిటో ఈ రెండు ముక్కల్లోనే అర్థమైపోతుంది. తొలి ప్రేమలో ఎంత మాధుర్యం ఉంటుందో, అది విఫలమైనప్పుడు అంతే బాధ పుడుతుంది.
'బేబీ' కథలో మాధుర్యం ఉంది. విషాదం ఉంది. మరి ఆ రెండింటి మధ్య సాగిన ప్రయాణం ఎలా ఉంది? ఇంతకీ `బేబీ` కథతో దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు?

ఫొటో సోర్స్, Insta/ananddeverakonda
ఓ ఆటోవాలా ప్రేమకథ
వైష్ణవి (వైష్ణవి) పదో తరగతిలోనే ఆనంద్ (ఆనంద్ దేవరకొండ)ని ఇష్టపడుతుంది. వైష్ణవి ఇష్టాన్ని, ప్రేమని చూసి ఆనంద్ కూడా ప్రేమిస్తాడు.
వైష్ణవి బాగా చదివి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదిస్తుంది. ఆనంద్‌కి చదువు అబ్బక ఆటో డ్రైవర్‌గా సెటిల్ అవుతాడు.
ఎలాగోలా చదువు పూర్తి చేసి, ఆనంద్‌ని పెళ్లి చేసుకోవాలనుకొంటుంది వైష్ణవి.
అయితే కాలేజీలో పరిస్థితులు మరోలా ఉంటాయి. అక్కడి పాష్ లైఫ్ వైష్ణవిని తప్పు దోవ పట్టిస్తుంది.
విరాజ్ (విరాజ్ అశ్విన్)తో స్నేహం చేస్తుంది. వైష్ణవిని విరాజ్ ప్రేమిస్తాడు. పాష్ లైఫ్‌కి అలవాటు పడిన వైష్ణవి, ఆనంద్‌ల మధ్య రోజూ గొడవ జరుగుతుంటుంది. వారి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏమైంది? బస్తీలో ఉన్న ఆనంద్ ప్రేమ కాదని విరాజ్‌ని వైష్ణవి ఇష్టపడిందా? ఆనంద్, విరాజ్, వైష్ణవి ఈ ముగ్గురిలో ఎవరి ప్రేమలో నిజాయతీ ఉంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే.. `బేబీ` చూడాల్సిందే.

ఫొటో సోర్స్, youtube/trailor grab
ఓ అమ్మాయి బయోపిక్
ఆటోవాలా ఆనంద్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ మొదలైనా, ఇది ఒక అమ్మాయి బయోపిక్‌లా అనిపిస్తుంది.
వైష్ణవి అనే బస్తీ అమ్మాయి - కాలేజీలో అడుగు పెట్టిన తరవాత, పాష్ లైఫ్‌కి ఎలా ఆకర్షితురాలైంది? ఆ తరవాత తన జీవితాన్ని చేతులారా ఎలా పాడు చేసుకొంది? అనే పాయింట్ చుట్టూనే ఈ కథ నడిచింది.
బేబీలో మూడు పాత్రలు చాలా కీలకం. ఒకటి ఆనంద్ దేవరకొండ, రెండోది వైష్ణవి, మూడోది విరాజ్ అశ్విన్. ఈ మూడు పాత్రలే స్క్రీన్ స్పేస్‌ని ఆక్రమించాయి. మిగిలిన పాత్రలెన్ని ఉన్నా అవన్నీ అప్పుడప్పుడూ వచ్చిపోయేవే.
ఆనంద్ ప్రేమలో నిజాయతీ కనిపిస్తుంది. తను ఇష్టపడిన అమ్మాయిపై తాను పెంచుకొన్న నమ్మకం, తన కోసం పడే కష్టం, ప్రేమ పట్ల తనకున్న సిన్సియారిటీ ఇవన్నీ తెరపై అద్భుతంగా చూపించాడు దర్శకుడు.
తను ప్రేమించిన అమ్మాయి తప్పు చేసినా సరే `ఇది నా పిల్లరా` అని ఆమెని ఆరాధించడం చూస్తే ప్రేమలోని గొప్పదనం అర్థం అవుతుంది. చివర్లో బ్రిడ్జ్ సీన్‌లో కాళ్ల మీద పడి అభ్యర్థిస్తున్నప్పుడు ఓ అమ్మాయిని ఓ అబ్బాయి ఇంతలా ప్రేమిస్తాడా? అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Insta/ananddeverakonda
వైష్ణవి పాత్రలో నిలకడ ఏది?
బస్తీ అమ్మాయిగా తన అమాయకత్వం, ప్రేమలో స్వచ్ఛత అమితంగా నచ్చేస్తాయి. ఇష్టపడిన అబ్బాయి ముద్దు అడిగితే చెప్పు చూపించే తత్వం ఆమెది.
సడన్‌గా కాలేజీలోకి అడుగుపెట్టిన తరవాత ఆ క్యారెక్టర్ గ్రాఫ్‌లో విపరీతమైన మార్పు వస్తుంది. వైష్ణవి క్యారెక్టర్ రెండు రకాలుగా ప్రవర్తిస్తుంటుంది. ఆమె మంచిదేనా? చెడ్డదా? లేదంటే పరిస్థితుల ప్రభావంతో మారిపోతోందా? అనే విషయంలో దర్శకుడే ఏం చెప్పాలో తెలియక తికమకపడ్డాడు.
ఓ దశలో ఆనంద్, విరాజ్ ఇద్దరినీ వైష్ణవి మోసం చేస్తున్నట్లే అనిపిస్తుంది. వైష్ణవి క్యారెక్టర్ ఆగాధంలో పడిపోయినప్పుడు ఆ పాత్రపై ఎవరికైనా జాలి వేయాలి. కానీ, వైష్ణవిని చూస్తే ఆ ఫీలింగ్ కాదు. క్యారెక్టర్ రాసుకోవడంలో ఉన్న లోపమే దానికి కారణం. క్లైమాక్స్‌లో సైతం వైష్ణవి పాత్రపై సానుభూతి కలగదు.
ఇక విరాజ్ పాత్రను దర్శకుడు తన చిత్తానుసారం రాసుకుంటూ వెళ్లిపోయాడు. ఆ పాత్ర ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంది. కాబట్టి, విరాజ్ పాత్రపై ప్రేక్షకులకు ఎలాంటి ఫీలింగ్ రాదు. ఒక్కోసారి సైకోలా, ఒక్కోసారి బుద్ధిమంతుడిలా, ఇంకోసారి అపర ప్రేమికుడిలా ఈ పాత్ర రూపాంతరం చెందుతూ ఉంటుంది.

ఫొటో సోర్స్, Insta/ananddeverakonda
టార్గెట్ రీచ్
ఇంటర్వెల్ సీన్‌లో దర్శకుడు తన పనితనం చూపించాడు. అమ్మాయిల మనసులోని భావాలకు అక్షరరూపం ఇచ్చాడు.
అక్కడ దర్శకుడు రాసిన ప్రతీ మాటా, టార్గెట్ ఆడియన్స్‌ను తాకుతుంది. ఇంటర్వెల్ కార్డు వేసినప్పుడు ఓరకమైన సంతృప్తితో ప్రేక్షకుడు థియేటర్ల నుంచి బయటకు వస్తారు. ఈ సినిమాని యూత్ కోసం దర్శకుడు తీసి ఉంటే, చాలా సన్నివేశాలు వాళ్లకు నచ్చేస్తాయి.
ద్వితీయార్థంలో కథ పక్క దారి పట్టిన ఫీలింగ్ కలుగుతుంది. కథానాయిక పాత్ర పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోతుంది. వాటి నుంచి బయట పడడానికి తాను తీసుకొన్న నిర్ణయం ఆడిటోరియానికి విస్తుపోయేలా ఉంటుంది.
కొన్ని హార్డ్ హిట్టింగ్ సన్నివేశాలు, సంభాషణలతో క్లైమాక్స్‌కి కాస్త ఊపు తీసుకొచ్చాడు దర్శకుడు.

ఫొటో సోర్స్, insta/sairazesh
వారెవ్వా వైష్ణవి
ఈ సినిమాతో వైష్ణవి రూపంలో ఓ తెలుగమ్మాయి కథానాయికగా మారింది. టిక్ టాక్ వీడియోలతో ప్రాచుర్యం పొందిన వైష్ణవికి ఇది తొలి సినిమా. వైష్ణవి పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులు పడతాయి.
అమాయకత్వం, పెంకితనం, మొండితనం ఇవన్నీ తన పాత్రలో చక్కగా పలికించింది. ఎమోషన్ పండించే సీన్లలో తన నటన మరింత బాగుంది.
అయితే ఈ పాత్రకు ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుంది. కొన్నిసార్లు సాఫ్ట్‌గా మాట్లాడి, కోపం వచ్చినప్పుడు మాత్రం తెలంగాణ యాస ఎత్తుకొంటుంది.
ఆనంద్ దేవరకొండ మరోసారి ఆకట్టుకున్నాడు. కొన్నిసార్లు వైష్ణవినే డామినేట్ చేశాడు. ముఖ్యంగా బ్రిడ్జ్ సీన్‌లో తన నటన చాలా చాలా బాగుంది.
నిజంగానే ఓ ఆటో డ్రైవర్ కథ తెరపై చూస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చాడు. విరాజ్ పాత్రను రాసుకోవడంలో లోపం ఉంది కానీ, విరాజ్ నటనలో లేదు. తను అందంగా కనిపించాడు. పాత్రకు ఎంత కావాలో అంత చేశాడు.
ఓ రెండు మేఘాలు
విజయ్ బుల్‌గానిన్ సంగీతం అందించిన పాటల్లో రెండు బాగా నచ్చేస్తాయి. ఓ రెండు మేఘాలు పాటని బిట్లు బిట్లుగా వాడుకొన్నారు. చివరి పాట కూడా మనసుని హత్తుకుంది.
నేపథ్య సంగీతంతో మూడ్‌ని క్రియేట్ చేసేందుకు ప్రయత్నించాడు. కెమెరా వర్క్ నీట్ గా ఉంది. మూడు గంటల సినిమా ఇది. నిడివి తగ్గించేందుకు స్కోప్ ఉంది.
హృదయ కాలేయం లాంటి కామెడీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయి రాజేష్‌లో ఫీల్ గుడ్, ఎమోషనల్ టచ్ ఉందని నిరూపించిన సినిమా ఇది.
నోట్: ఈ సమీక్ష రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
ఇవి కూడా చదవండి:
- ఎగిరే టాక్సీలు వచ్చేస్తున్నాయి
- గ్రహాంతరవాసులు ఉన్నారా....పెంటగాన్ విడుదల చేయబోయే రిపోర్టులో ఏముంది?
- గ్రహాంతరవాసులు భూమిపైకి వస్తే ఏమవుతుంది? స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పారు
- UFO: అంతుచిక్కని ఫ్లయింగ్ సాసర్ల రహస్యం ఏంటి? ఒకప్పుడు అమెరికాను ఊపేసిన ఈ ‘ఏలియన్ స్పేష్ షిప్‌లు’ ఇప్పుడు ఏమయ్యాయి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










