చంద్రయాన్ 3: ఇలాంటి ప్రయోగాలకు ‘ముహూర్తం’ ఎలా నిర్ణయిస్తారు?

చంద్రయాన్-3 ప్రయోగం

ఫొటో సోర్స్, Twitter/ISRO

    • రచయిత, శ్రీకాంత్ బక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఏదైనా పనిని ముహూర్తం చూసుకుని ప్రారంభించే అలవాటు ప్రపంచవ్యాప్తంగా చాలా సంప్రదాయాల్లో, మతాల్లో ఉంటుంది.

సాధారణంగా పంచాంగాలు, క్యాలెండర్లు అన్నీ చంద్రుడి గమనం ఆధారంగా లెక్కిస్తారు. అంటే ముహుర్తాలన్నీ చంద్రుడి చుట్టూనే తిరుగుతాయి.

మరి చంద్రుడి మీదకు వెళ్లే ప్రయాణానికి ఏ లెక్క ప్రకారం ముహూర్తం పెడతారో తెలుసా?

చంద్రయాన్-3 ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం చేసుకుంది. జులై 14 మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు ప్రయోగం ఉంటుందని ఇస్రో ఛైర్మన్ ఎస్. స్వామినాథ్ ప్రకటించారు.

చంద్రయాన్ ప్రయోగం గురించి జూన్ నెల చివరి వారంలో మాట్లాడిన ఇస్రో ఛైర్మన్

చంద్రయాన్ ప్రయోగం జులై 13 నుంచి జులై 19 మధ్య ఉంటుందని ప్రకటించారు.

ఆ తర్వాత, జులై 14వ తేదీ మధ్యాహ్నం 2: 35 గంటలకు ప్రయోగించనున్నట్లు ప్రకటించారు.

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, NASA/TWITTER

భూమ్మీద ప్రయాణం... అంతరిక్షంలో ప్రయాణం ఒకటి కాదు

మీరు భూమ్మీద రెండు ప్రాంతాల మధ్య ప్రయాణించాలనుకోండి. ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు.

ఉదాహరణకు మీరు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ఎలా వెళ్తారు.

ఏదో ఒక వాహనంలో విశాఖపట్నంలో బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. మీరు ప్రయాణించే వాహన వేగాన్ని బట్టి మీరు గమ్యం చేరుకునే సమయం ఆధారపడి ఉంటుంది.

అంటే మీరు ఎంత వేగంతో వెళ్లాలి, ఎంత సమయంలో వెళ్లాలి అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. ఒక స్థిరమైన ప్రాంతం నుంచి మరో స్థిరమైన ప్రాంతానికి వెళ్లేలాంటే.. మీరు ప్రయాణించే వేగం, దూరం మీద ఆధారపడుతుంది.

కానీ, మరో ఆలోచన కూడా చెయ్యండి. ఒక వ్యక్తి విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కి వెళ్లే దారిలో బస్సులో ప్రయాణిస్తున్నారు. ఆయనకు మీరు ఒక వస్తువు అందించాలి.

అందుకు మీరు విశాఖపట్నం నుంచి కారులో బయలుదేరారు. ఇప్పుడు ఆయన్ను మీరు ఎంత సేపటిలో కలుసుకుంటారు అని అడిగితే... అప్పుడేం చెప్తారు.

మీరు ఆ బస్సు కన్నా వేగంగా వెళ్తేనే బస్సు గమ్యం చేరేలోగా దానిని చేరుకోగలరు. ఒకవేళ బస్సు ప్రయాణిస్తున్న వేగం కన్నా రెట్టింపు వేగంతో ప్రయాణిస్తే ఇంకాస్త ముందుగానే ఆయన్ను చేరుకుంటారు.

అంటే ఒక స్థిరమైన ప్రాంతం నుంచి కదులుతున్న చోటికి వెళ్లాలంటే, ఆ కదిలే చోటు వేగాన్ని, మీ వేగాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

అంటే సాపేక్ష వేగం అన్నమాట.

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, NASA

అంతరిక్ష ప్రయాణం అంటే భూమి గురుత్వాకర్షణను అధిగమించి పైకి వెళ్లాలి.

అంతరిక్షంలోకి శాటిలైట్లను ప్రవేశ పెట్టే రాకెట్లు... లాంచింగ్ ప్యాడ్ నుంచి ఆకాశంలోకి వలయాకార మార్గంలో వెళ్లి నిర్ధిష్ట కక్ష్యలో వాటిని ప్రవేశ పెడతాయి.

ఇక వీటన్నింటికన్నా గ్రహాంతర ప్రయోగం కాస్త భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే.. భూమి మనకు స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

కానీ భూగోళం సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఇక భూమి చుట్టూ చంద్రుడు కూడా ఇదే విధంగా పరిభ్రమిస్తుంటాడు.

అంటే మీరు నేరుగానో, తిన్నగానో రాకెట్‌లో ప్రయాణించడానికి వీలుండదు. ఉదాహరణకు చంద్రయాన్-3 చంద్రుడిని ఆగస్ట్ 23వ తేదీకి చేరుకోవాలంటే... అప్పటికి చంద్రుడు తన కక్ష్యలో పరిభ్రమిస్తూ, ఏ ప్రాంతానికి చేరుకుంటాడో అక్కడికి మనం వెళ్లేలా ఇప్పటి నుంచే ప్రయాణం ప్రారంభించుకోవాలి.

భూమ్మీద నుంచి అంతరిక్షంలో భూకక్ష్యలోకి వెళ్లడం వరకూ కొన్ని పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాలి.

అంటే ప్రయోగతేదీ నాటి వాతావరణ పరిస్థితులతో పాటు, సౌర కుటుంబంలో భూమి ఉన్న స్థానం, చంద్రుడు ఉన్న స్థానాలను బట్టి ఖగోళ దూరాలను లెక్కించుకోవాలి.

భూమి చుట్టూ తిరుగుతూ క్రమంగా తన అపోజీని పెంచుకునే చంద్రయాన్ త్రీ.... భూ గురుత్వాకర్షణ పరిధిని దాటి చంద్రుడి వైపు ఎప్పుడు ప్రయాణం ప్రారంభించాలి అన్నది కూడా చంద్రుడి స్థానాన్ని బట్టి నిర్ణయిస్తారు.

ఇవన్నీ ఖగోళ పరంగా లెక్కించిన తర్వాతే... చంద్రయాన్ త్రీ పేలోడ్‌ను... మళ్లీ మండించి చంద్రుడి కక్ష్యలో ప్రవేశ పెడతారు.

చంద్రయాన్

ఫొటో సోర్స్, ISRO

ఒక్క రోజు ఆలస్యమైనా నెల ఆగాల్సిందే?

జులై 14న ఆకాశంలోకి దూసుకెళ్లే చంద్రయాన్ 3, ఆగస్ట్ 23 లేదా పరిస్థితులను బట్టి ఆగస్ట్ 24న చంద్రుడి మీదకు ల్యాండయ్యేలా ల్యాండర్‌ని ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.

చంద్రుడి మీద ల్యాండ్ అయ్యేందుకు పరిస్థితులన్నీ అనువుగా ఉంటేనే ఆగస్ట్ 23న ల్యాండింగ్‌కి ప్రయత్నిస్తామని, లేని పక్షంలో మరో నెల రోజుల తర్వాత ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తామని సోమనాథ్ తెలిపారు.

చంద్రుడి మీదకు ల్యాండర్ పంపించడానికి ఏరోజు పడితే ఆ రోజు పంపించడం కుదరదు. చంద్రుడి దశలను బట్టి దాని మీద ల్యాండర్‌ను దింపాల్సి ఉంటుంది.

ఎందుకంటే చంద్రుడి మీద దిగి పరిశోధనలు చేసే ల్యాండర్, రోవర్ మాడ్యూల్ పనిచేయడానికి విద్యుత్ కావాలి.

ఆ విద్యుత్ సౌర ఫలకాల నుంచి మాత్రమే ల్యాండర్, రోవర్లు పొందగలుగుతాయి. అంటే ల్యాండర్ దిగే సమయానికి అక్కడ సూర్యరశ్మి ఉండాలి. అంటే చంద్రుడి మీద పగలు ప్రారంభమయ్యే సమయానికి ల్యాండింగ్ జరగాలి.

భూమి

ఫొటో సోర్స్, ESA

చంద్రుడి మీద ఒక రోజంటే భూమి మీద 29 రోజులు...

భూమి మీద ఒక రోజు అంటే పగలు, రాత్రి కలిపి 24 గంటలు. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. చంద్రుడిపై సూర్యకాంతి పడి, ఆ కాంతి పరావర్తనం చెంది, మనకు చంద్రుడు ప్రకాశవంతంగా కనిపిస్తాడు.

అయితే భూమ్మీద ఒక రోజుకి, చంద్రుడి మీద ఒక రోజుకు చాలా తేడా ఉంటుంది. చంద్రుడి మీద ఒక రోజు అంటే... అది భూమ్మీద సుమారుగా 29 రోజులకు సమానం.

అంటే చంద్రుడి మీద ఒక పగలు అంటే.. దాదాపు 14 రోజులుంటుంది. ఆ 14 రోజులు మాత్రమే అక్కడ సూర్యకాంతి లభిస్తుంది. అంటే ఆ 14 రోజులు మాత్రమే ల్యాండర్, రోవర్లకు కావాల్సిన సౌరశక్తి అందుతుంది.

అందుకే చంద్రయాన్ 2లో కానీ, చంద్రయాన్ త్రీలో కానీ చంద్రుడిపైకి పంపుతున్న ల్యాండర్, రోవర్ల జీవిత కాలం కేవలం 14 రోజులే అని ఇస్రో చెప్పుకొచ్చింది.

చంద్రుడి మీద దక్షిణ ధ్రువంలో చంద్రయాన్ ల్యాండర్ దిగబోతోంది. చంద్రుడి మీద దశలను బట్టి, ఆ ప్రాంతంలో ఆగస్ట్‌24న పగలు ప్రారంభం కాబోతోంది.

కాబట్టి ఆ రోజు ల్యాండింగ్ జరిగితే... అక్కడి నుంచి గరిష్ఠంగా 14రోజుల పాటు ల్యాండర్ అక్కడ పడే సూర్యరశ్మిని ఆధారంగా చేసుకుని పనిచేయగలగుతుంది. అదే ఒక్క రోజు ఆలస్యమైనా... ల్యాండర్ పని చేసే అవకాశం కూడా ఒక్క రోజు తగ్గిపోతుంది.

రూ.615కోట్ల ఖర్చుతో చేస్తున్న చంద్రయాన్ ప్రయోగంలో చంద్రుడి మీద మనం పరిశోధనలు జరపాల్సిన ప్రతి క్షణం విలువైనదే.

అందుకే ఒకవేళ ఆగస్ట్ 24న ల్యాండింగ్ కుదరకపోతే, మళ్లీ చంద్రుడి మీద పగలు ప్రారంభమయ్యే వరకూ అంటే సెప్టెంబర్ 23 మరో నెల రోజులు ఆగాల్సి వస్తుందని ఇస్రో ఛైర్మన్ ఎస్ స్వామినాథ్ తెలిపారు.

ల్యాండర్

ఫొటో సోర్స్, ISRO

సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో..

చంద్రయాన్ ప్రయోగంలో ల్యాండర్, రోవర్లు గరిష్ట సమయం పనిచేసేలా చూడాలి. అందుకే వాటిని ఎక్కువ సేపు చంద్రుడి మీద సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో ల్యాండ్ చేయాలి.

ఆగస్ట్ 24 నాటికి చంద్రయాన్ మిషన్ చంద్రుడి ఉపరితలంలో 100 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండింగ్ చేసే విధంగా ఉండాలంటే... అందుకు అనుగుణంగా భూమ్మీద నుంచి రాకెట్ బయలుదేరే సమయాన్ని కూడా ఖగోళ పరంగా నిర్ధరించుకోవాలి.

ఇలా ఖగోళ శాస్త్ర నియమాలు, భూమి, చంద్రుడి గమనాలు, చంద్రుడి మీద చంద్రయాన్ త్రీ ల్యాండర్, రోవర్ దిగే సమయానికి అక్కడ పగలు ఎప్పుడు ప్రారంభమవుతుంది వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని చంద్రయాన్ వంటి ప్రయోగాలకు లాంచింగ్ టైం నిర్ణయిస్తారు.

వీడియో క్యాప్షన్, చంద్రుడి మీదకు వెళ్లడానికి ముహుర్తం ఎందుకు పెడతారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)