ఏలూరు: ‘హాస్టల్లో హత్యకు గురైన అఖిల్ వర్ధన్‌ను చంపింది ఆ స్కూల్ విద్యార్థులే’.. మిస్టరీ ఛేదించిన పోలీసులు

- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో సోమవారం రాత్రి హత్యకు గురైన నాలుగో తరగతి విద్యార్థి అఖిల్ వర్థన్‌ను అదే స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం పులిరాముడిగూడెంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
హాస్టల్‌లో నిద్రిస్తున్న అఖిల్ వర్ధన్‌ను అపహరించి, చంపేసినట్లు మంగళవారం ఉదయం వార్తలు వచ్చాయి.
ఈ హత్య కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
అదే పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు హత్య చేసినట్టు పోలీసులు నిర్ధరణకు వచ్చారు.
స్కూల్లో జరిగిన చిన్న తగాదా కారణంగా విభేదాలు పెంచుకుని హత్యకు పాల్పడినట్టు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రశాంతి వెల్లడించారు.
నిందితులను జువైనల్ కోర్టుకు తరలించినట్లు చెప్పారు.
నిందితులను పట్టించిన నోట్‌బుక్, చేతి రాత

దర్యాప్తులో భాగంగా విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించామని ఆమె తెలిపారు.
‘‘చివరికి విద్యార్థుల పుస్తకాలను పరిశీలిస్తుండగా, ఒకరి నోట్ బుక్ లో పేజీలు చిరిగి ఉండడాన్ని గుర్తించాం. దాని ఆధారంగా విచారణ చేస్తే హంతకులు పట్టుబడ్డారు.
మృతుడి చేతిలో దొరికిన లెటర్‌పై ఉన్న చేతిరాత ఓ విద్యార్థిది. దాని ఆధారంగా ఆరా తీయగా అసలు నిందితులు బయటపడ్డారు’’ అని ఆమె వివరించారు.
అసలేం జరిగిందంటే...
పులిరాముడి గూడెం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న అఖిల్ వర్థన్ అనే విద్యార్థి హత్య నాలుగు రోజుల క్రితం కలకలం రేపింది.
సోమవారం నాడు విద్యార్థి హాస్టల్‌లో నిద్రిస్తుండగా అపహరించి, చంపేశారు.
అంతేగాకుండా, బతకాలనుకున్న వారు హాస్టల్ వదిలి పారిపోవాలని హెచ్చరించిన లేఖ బాలుడి శవం వద్ద దొరకడం మరింత ఆందోళనకరంగా మారింది.
విద్యార్థి హత్యపై అధికార యంత్రాంగం కదిలింది. ఏలూరు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు.
అయితే, గిరిజన సంక్షేమ శాఖ హాస్టళ్ల పరిస్థితికి అద్దంపట్టేలా హత్య ఘటన ఉందనే వాదన వినిపిస్తోంది. మర్డర్ జరిగిన హాస్టల్‌లో సదుపాయాల లేమిని ఎత్తిచూపుతున్నారు.
అయితే హత్య ఘటనపై ఆందోళన వ్యక్తంచేస్తూ పలువురు విద్యార్థులు హాస్టల్ వదిలి ఇళ్లకు వెళ్లిపోతున్నారు.
ఇంతకీ హత్య చేసిందెవరు? ఇప్పుడు అక్కడి పరిస్థితి ఎలా ఉందన్నది ఆరా తీసేందుకు బీబీసీ పులిరాముడుగూడెంతో పాటుగా మృతుడి స్వగ్రామం ఉర్రింకలో పర్యటించింది.
అన్ని కోణాల్లో దర్యాప్తు...
జూలై 10వ తేదీ రాత్రి 10 గం.ల తర్వాత హత్య జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్‌లో నమోదయిన ఎఫ్ఐఆర్ నెం. 126/2023లో కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు.
అయితే, జూన్ 11వ తేదీ ఉదయం ఈ హత్య వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. 12వ తేదీన జిల్లా ఎస్పీ, ఏఎస్పీ కూడా పులిమామిడి గూడెంలోని ఆశ్రమ పాఠశాలలో విచారణ సాగించారు.
"అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. పలు అనుమానాలున్నాయి. 9 ఏళ్ల విద్యార్థిని చంపాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది ఆరా తీస్తున్నాం.
పలువురి నుంచి సమాచారం సేకరించాం. విద్యార్థులు, సిబ్బందితో పాటుగా గ్రామస్తుల నుంచి కూడా వివరాలు తీసుకుంటున్నాం.
క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా కొంత ప్రయత్నం చేసింది. దర్యాప్తు వేగంగా జరుగుతోంది. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం" అంటూ ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు బీబీసీకి తెలిపారు.
కేసు విషయంలో పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా ఉందని, దానికి తగ్గట్టుగానే ఆధారాలు సేకరించే పనిలో వివిధ బృందాలు రంగంలోకి దిగాయని అడిషనల్ ఎస్పీ వివరించారు.

ఫొటో సోర్స్, RAVI PEDAPOLU
నోట్లో గుడ్డలు కుక్కి చంపేశారు...
బుట్టాయిగూడెం మండలంలో ఉర్రింక మారుమూల గ్రామం. గ్రామంలోకి వెళ్లేందుకు సరైన రోడ్డు కూడా లేదు. ఆ గ్రామంలో సచివాలయ వాలంటీర్‌గా పనిచేస్తున్న గోగుల శ్రీనివాసరెడ్డి, ఆయన భార్య రామలక్ష్మి ఆశావర్కర్. వారికి ముగ్గురు పిల్లలు.
కుమార్తె హర్షిణి 8వ తరగతి చదువుతోంది. పెద్ద కొడుకు హర్షవర్థన్ 6, చిన్న కొడుకు అఖిల్ వర్ధన్ 4వ తరగతి చదువుతున్నారు.
కొడుకులిద్దరినీ గత ఏడాది పులిరాముడి గూడెంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ హాస్టల్‌లో చేర్చారు.
మొన్నటి వేసవి సెలవుల తర్వాత అఖిల్ పది రోజుల క్రితమే మళ్లీ హాస్టల్‌కి వెళ్లాడు. ఆ తరువాత ఊహించని విధంగా హత్యకు గురి కావడం ఉర్రింక వాసులను కలిచివేస్తోంది.
"హాస్టల్ లో తగిన రక్షణ లేదు. పిల్లలకి రక్షణగా కనీసం వార్డెన్ కాకపోయినా వాచ్‌మెన్ ఉన్నా బాగుండేది. వాళ్లెవరూ హాస్టల్‌లోకి రాకపోయేది. ఎవరూ లేకపోవడంతో పిల్లల్ని కిడ్నాప్ చేశారు. పక్కనే ఉన్న స్కూల్ బిల్డింగ్ దగ్గర చంపి పడేశారు. నోట్లో గుడ్డలు కుక్కి, పీక నులిమేశారు. కడుపులో కర్రతో పొడిచినట్టుంది. కళ్లు కూడా పీకేశారు. ఏం జరిగిందన్నది మాకు అంతుబట్టడం లేదు. మాకు ఎటువంటి గొడవలు లేవు. ఈ ఘటన మీద దర్యాప్తు లోతుగా జరగాలి" అంటూ మృతుడి తాత గంగిరెడ్డి అన్నారు.
కేసు పూర్తిగా విచారించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నామంటూ ఆయన బీబీసీతో చెప్పారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గంగిరెడ్డి కోరారు.
ఈ ఘటన తర్వాత ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం, వార్డెన్‌తో పాటుగా విధుల్లో ఉండాల్సిన నైట్ వాచ్‌మెన్‌ని కూడా సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.

ఫొటో సోర్స్, RAVI PEDAPOLU
అస్తవ్యస్తంగా హాస్టల్ నిర్వహణ..
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆశ్రమ పాఠశాలల హాస్టళ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నట్టు ఈ ఘటన రుజువు చేస్తోంది.
పులిమామిడి గూడెం హాస్టల్‌కి రెగ్యులర్ వార్డెన్ ఐదేళ్లుగా లేరు. దాంతో ఇన్‌ఛార్జులతోనే నెట్టుకొస్తున్నారు.
ఇక హాస్టళ్లను పర్యవేక్షించాల్సిన గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ పోస్టు కూడా ఖాళీగా ఉంది. దాంతో నిర్వహణా వైఫల్యం, పర్యవేక్షణా లోపాలు కలిసి ఇలాంటి ఘటనలకు ఆస్కారమిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
ఘటన జరిగిన హాస్టల్ భవనం గదుల కిటికీలకు ఊచలు కూడా లేవు. దాంతో నిందితులు లోపలికి ప్రవేశించడానికి సులువు అయినట్లు కనిపిస్తోంది.
ఈ హాస్టల్‌లో అదనపు గదుల నిర్మాణం కోసం నాడు- నేడు పథకంలో రూ. 49 లక్షలు కేటాయించినప్పటికీ రెండేళ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. దాంతో హాస్టల్ ఆవరణతో పాటుగా గదులు కూడా పూర్తిగా సిద్దంగా లేవు.
మారుమూల ప్రాంతం కావడంతో అధికారుల తనిఖీలు కూడా పెద్దగా ఉండవనే ధీమాతో కనీసం వార్డెన్, హెచ్‌ఎం కూడా అక్కడ ఉండటం లేదని చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితి అనేక గిరిజన హాస్టళ్లలో ఉందని తగిన రక్షణ ఏర్పాట్లు అవసరమని ఎస్ఎఫ్ఐ నాయకుడు అశోక్ తెలిపారు.

ఫొటో సోర్స్, RAVI PEDAPOLU
హాస్టల్ వదిలిపోతున్న విద్యార్థులు...
అఖిల్ వర్థన్ రెడ్డి హత్యతో పాటుగా మిగిలిన వారంతా హాస్టల్ నుంచి పారిపోవాలంటూ రాసి ఉన్న లేఖ ఘటనా స్థలంలో దొరకడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. వరుసగా అధికారులు, ప్రజాప్రతినిధుల రాకతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఇప్పటికే కొందరు విద్యార్థులను కూడా పోలీసులు విచారించారు. ఘటన జరిగిన రాత్రి అఖిల్ తో పాటు నిద్రపోయిన విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు.
రాత్రి 10గం.ల ప్రాంతంలో కరెంటు సరఫరా నిలిపివేసి ఇద్దరు వ్యక్తులు బాలుడిని అపహరించిట్టు విద్యార్థులు పోలీసులకు తెలిపారు. ఆ మరుసటి రోజు ఉదయం స్కూల్ భవనాల మధ్యలో మృతదేహం పడి ఉండగా తొలుత ఐదో తరగతి విద్యార్థి సంతోష్ రెడ్డి గుర్తించాడు.
అయితే ఈ పరిణామాలతో కొందరు విద్యార్థులు హాస్టల్ వదిలి వెళ్లిపోయారు. 184 మంది విద్యార్థులుండాల్సిన చోట బుధవారం నాటికి కేవలం 80 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వారు కూడా ఇంటికి వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
"విద్యార్థుల్లో ఆందోళన ఉన్న మాట వాస్తవం. దానిని సరిచేస్తాం. వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. అవసరమైన సహాయం అందిస్తాం. ఎటువంటి భయాందోళన లేకుండా చదువులు కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తాం. నిందితుల సంగతి పోలీసులు చూస్తారు. పిల్లల చదువులు దెబ్బతినకుండా జాగ్రత్త పడతాం. అవసరమైన ఏర్పాట్లు చేసి, పరిస్థితులు చక్కదిద్దుతాం" అంటూ ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సదుపాయాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు.
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం కింద రూ. 10 లక్షల చెక్కుని ఆయన అందించారు.
ఇవి కూడా చదవండి
- అనిల్ అంబానీ డిఫెన్స్ కంపెనీ కూడా దివాలా... ఇప్పుడు రఫేల్ డీల్ పరిస్థితి ఏంటి?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
- విశాఖపట్నం: రొయ్యల ధరలు ఎందుకు తగ్గిపోతున్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















