చంద్రయాన్-3 తరువాత ఇస్రో లక్ష్యం ఏమిటి? చంద్రయాన్-4లో మనుషులను పంపిస్తారా

ఫొటో సోర్స్, @isro/twitter
- రచయిత, శ్రీకాంత్ బక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
చంద్రయాన్-1, చంద్రయాన్-2 మంగళయాన్ ప్రయోగాల్లో అత్యంత సంక్లిష్టమైన దశ ఆయా గ్రహాల గురుత్వాకర్షణ కక్ష్యలోకి ప్రవేశించడమే.
చంద్రుడి గురుత్వాకర్షణ కక్ష్యలో ప్రవేశించడాన్ని లూనార్ ఆర్బిట్ ఇన్‌సర్షన్ అంటారు. అదే అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించడాన్ని ఏరియో సెంట్రిక్ ఇన్సెర్షన్ అంటారు.
ఇది అనుకున్నంత సులువైన దశ కాదు. అమెరికా, రష్యాలు తొలినాళ్లలో 14 సార్లు ఈ దశలోనే విఫలమయ్యాయి. 15వ సారి మాత్రమే విజయం సాధించాయి.
కానీ ఇస్రో మాత్రం తొలి ప్రయత్నంలోనే చంద్రయాన్-1 ప్రయోగంలో ఈ దశను విజయవంతంగా అధిగమించింది.
ఇప్పుడు చంద్రయాన్ - 3లోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయోగానికి సర్వ సన్నద్ధమైంది.

ఫొటో సోర్స్, Getty Images
తొలి ప్రయత్నంలోనే ఇస్రో విజయం
నాసా వెల్లడించిన వివరాల ప్రకారం అపోలో 11 ప్రయోగంలోనే కాదు.. అంతకన్నా ముందుకూడా చాలామందిని చంద్రుడి దగ్గరకు పంపింది నాసా.
అపోలో వన్ ప్రయోగంలో చంద్రుడు వరకూ వెళ్లి వచ్చేందుకు కావాల్సిన పరిజ్ఞానాన్ని, సామర్థ్యాన్ని నాసా పరీక్షించుకుంది. ఆ తర్వాత జరిగిన ప్రయోగాల్లో కొన్ని విఫలమయ్యాయి.
అపోలో 11 కన్నా ముందు జరిగిన ప్రయోగాల్లో వారు చంద్రుడి కక్ష్య వరకూ వెళ్లి, చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టి వెనక్కి వచ్చేశారు తప్ప చంద్రుడి మీద దిగలేదు.
అపోలో 10 ప్రయోగంలో 1968 డిసెంబర్ 25న ఫ్రాంక్ బోర్మన్, బిల్ యాండ్రెస్, జిమ్ లోవెల్‌లతో కూడిన వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించి, తిరిగి వెనక్కి వచ్చేసింది.
కానీ వాళ్లు చంద్రుడి మీద దిగకపోవడంతో ఈ ప్రయోగం ప్రపంచానికి తెలియలేదు.

ఫొటో సోర్స్, NASA
12 మందిని చంద్రుడిపైకి పంపిన నాసా
కేవలం అపోలో 11 ద్వారా ముగ్గురు వ్యోమగాముల్ని పంపడమే కాదు.. ఆ తర్వాత కూడా ఇలాంటి ప్రయోగాలు కొనసాగించింది నాసా.
1969 నవంబర్ 14న అపోలో 12 రాకెట్ ద్వారా మరో ముగ్గురు వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపింది.
అలా 1972 డిసెంబర్ 7న అపోలో 17 చివరిసారిగా ముగ్గురు వ్యోమగాముల్ని పంపింది. ఇలా మూడేళ్ల వ్యవధిలో నాసా 12 మంది వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపింది. ఆ తర్వాత చంద్రుడి మీదకు మనుషుల్ని పంపే ప్రయోగాలను నిలిపేసింది.
ఈ విజయాలతో పాటు ఎన్నో వైఫల్యాలను కూడా నాసా చవిచూసింది.
1967 ఫిబ్రవరి 21న నాసా అపోలో 1 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. కానీ రిహార్సల్ టెస్టింగ్ టైంలో క్యాబిన్‌లో మంటలు రేగడంతో...రాకెట్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యోమగాములతో పాటు 27 మంది సిబ్బంది మరణించారు.
ఇలా ఎన్నో విఫలయత్నాల తర్వాత... నాసా విజయవంతంగా చంద్రుడి మీద కాలు మోపింది.
అయితే, ఇస్రో అతి తక్కువ ఖర్చుతో, తొలి ప్రయత్నాలతోనే విజయం సాధిస్తూ వస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
చంద్రయాన్-3 తర్వాత ఏం జరుగుతుంది?
ఇస్రో చంద్రయాన్ ప్రయోగాలు చేపట్టింది కేవలం రోవర్లు, ల్యాండర్లను చంద్రుడి మీదకు పంపించడానికి మాత్రమే కాదు. ఎప్పటికైనా మానవుల్ని కూడా చంద్రుడి మీదకు పంపేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, అది సాధించడం అంత సులువు కాదు.
ఇప్పుడున్న రాకెట్ల సామర్థ్యం కానీ, ఇంజిన్ల సామర్థ్యం కానీ అందుకు సరిపోదు. అందుకే ఒక్కో ప్రయోగంలో ఒక్కో విజయం సాధిస్తూ ముందుకెళ్తోంది.
చంద్రయాన్-1లో ఆర్బిటర్, మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ప్రయోగించారు.
చంద్రయాన్-2 లో ఆర్బిటర్‌తో పాటు, ల్యాండర్, రోవర్ కూడా పంపించారు.
చంద్రయాన్-3 లో...ఆర్బిటర్ లేకుండా ల్యాండర్, రోవర్ మాత్రమే పంపిస్తున్నారు.
ఈ ప్రయోగంలో చంద్రయాన్-2లో ప్రయోగించిన ఆర్బిటర్ నే ఉపయోగించుకోనున్నారు.
చంద్రయాన్-3లో సాధించిన విజయాలను బట్టి, సేకరించిన సమాచారాన్ని బట్టి చంద్రయాన్-4, ఆ తర్వాత ప్రయోగాలు కొనసాగిస్తారు.
వాటిలో అన్నీ విజయవంతమవుతూ ఉంటే తదుపరి ప్రయోగాల్లో మానవ సహిత అంతరిక్ష నౌకలను పంపిస్తారు.
ఈ దిశగా ఇప్పటికే మరికొన్ని ప్రయోగాలు కూడా జరుగుతున్నాయ. ఇస్రో చేపట్టబోయే గగన్‌యాన్ కూడా ఇందులో భాగమే.
భారత తొలి వ్యోమగామి రాకేశ్ శర్మ. రష్యాకు చెందిన సోయజ్ వ్యోమ నౌకలో అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు.
ఇలా ఇతర దేశాల సాయంతో కాకుండా పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో మానవుల్ని అంతరిక్షంలోకి పంపేందుకు గగన్‌యాన్ ప్రయోగాల్ని ఇస్రో చేపట్టబోతోంది.
ఇలా గగన్‌యాన్ ప్రయోగంలో ముగ్గురు వ్యోమగాముల్ని భూమికి 400 కిలోమీటర్ల ఎత్తు వరకూ తీసుకెళ్లి, అక్కడ మూడు రోజుల పాటు ఉంచి ఆ తర్వాత సురక్షితంగా భూమ్మీదకు తీసుకువస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
పరికరాలు తిరిగి రావు, కానీ వ్యోమగాములు తిరిగి రావాలి
చంద్రయాన్ ప్రయోగాల్లో ఇప్పటి వరకూ ప్రయోగించిన ఆర్బిటర్లు కానీ, ల్యాండర్లు, రోవర్లు కానీ వేటినీ తిరిగి భూమ్మీదకు తీసుకురావాల్సిన పనిలేదు.
కానీ వ్యోమగాముల్ని చంద్రుడిపైకి పంపిస్తే వాళ్లను సురక్షితంగా భూమ్మీదకు తీసుకురావాల్సి ఉంటుంది. అందుకోసం క్రూ మాడ్యూళ్లను తయారు చేయాలి.
నాసా పంపిన విధంగా సాధ్యమైనంత తక్కువ కాలంలో చంద్రుడిని చేరేలా భారీ రాకెట్లను నిర్మించాల్సి ఉంటుంది.
చంద్రుడి మీద దిగేలా మానవ సహిత ల్యాండర్లను పంపించడమే కాదు.. సదరు ల్యాండర్ తిరిగి భూమికి తిరిగి రావాలంటే చంద్రుడికి కొంత ఎత్తులో కమాండ్ మాడ్యూల్ కూడా ఉండాలి.
ఈ కమాండ్ మాడ్యూల్ నుంచే ల్యాండర్ చంద్రుడి మీద దిగి, అక్కడ వ్యోమగాములు పరిశోధనలు చేసిన తర్వాత, తిరిగి వాళ్లు అదే ల్యాండర్ మాడ్యూల్‌లో తిరిగి చంద్రుడి ఉపరితలంపై ఉన్న కమాండ్ మాడ్యూల్‌కి వచ్చి చేరాలి. ఆ తర్వాత ఈ కమాండ్ మాడ్యూల్‌ను తిరిగి భూమికి తీసుకురావాలి.
ఈ ప్రయోగాలన్నీ పది రోజుల లోపు వ్యవధిలోనే పూర్తి చేయాలి. దీనికి అత్యాధునిక సాంకేతికత, భారీ రాకెట్లు తయారు చేయాలి.
చంద్రుడి మీద వాతావరణం ఉండదు. అంతరిక్షంలో ఉష్ణోగ్రత కూడా చాలా తక్కువకు పడిపోతుంది.
ఇక్కడ కూడా రాకెట్లు ప్రయాణించేలా క్రయోజనిక్ ఇంజిన్లను రూపొందించాలి.

ఫొటో సోర్స్, ISRO
వ్యోమగాముల భద్రతే కీలకం
వీటన్నింటినీ మించి ప్రయోగ సమయంలో అనుకోని లోపాలు తలెత్తితే వ్యోమగాములు ఉన్న క్రూ మాడ్యూళ్లను రక్షించేందుకు క్రూ ఎస్కేప్ సిస్టమ్ కూడా సిద్ధం చేసుకోవాలి. అన్నింటినీ మించి వ్యోమగాల్ని భూమ్మీదకు తీసుకొచ్చే క్రూ మాడ్యూల్ సిద్ధం చేయాలి.
టెస్ట్ వెహికల్ మిషన్ తయారు చేయాలి. ఏదైనా ప్రమాదం తలెత్తితే వ్యోమగాముల్ని ప్రయోగం నుంచి పక్కకు తప్పించేలా పాడ్ అబార్ట్ టెస్ట్‌లు నిర్వహించాలి.
చంద్రయాన్ మీదకు వ్యోమగాముల్ని పంపేందుకు మానవ రహితంగా ప్రయోగాలు చేయాలి. ఆ తర్వాత మానవ సహితంగా ప్రయోగాలు చేయాలి.
ఇవన్నీ సాధించడం అన్నది చంద్రయాన్-3, ఆ తర్వాత ప్రయోగాల విజయాల మీద ఆధారపడి ఉంటుంది.
చంద్రయాన్-3 సక్సెస్ అయ్యి ఆ తర్వాత ప్రయోగాలు కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధిస్తే చంద్రయాన్ 10, లేదా 11 ప్రయోగాల్లో మావన సహిత అంతరిక్ష ప్రయోగాలు, చంద్రుడి మీదకు మనుషుల్ని పంపే ప్రయోగాలు ఇస్రోకు సాధ్యమవ్వొచ్చు.

ఫొటో సోర్స్, ISRO
ఇస్రోకు కూడా భారీ రాకెట్లు అవసరమే
అపోలో 11ను నాలుగు రోజుల్లో చంద్రుడి దగ్గరకు తీసుకువెళ్లి, అక్కడ అపోలో 11లో ఈగిల్ అనే ల్యాండర్ చంద్రుడి మీద దిగి, వ్యోమగాములు చంద్రుడి మీద దిగి, పరిశోధనలు చేశాక, తిరిగి ఆ ల్యాండర్ ఆర్బిటర్‌ను చేరుకుని, అది భూమ్మీదకు రావడం కోసం ఎంతో ఇంధనం అవసరం అయ్యింది.
భవిష్యత్తులో ఇస్రో చంద్రుడి మీదకు వ్యోమగాముల్ని పంపే ప్రయోగాలకు కూడా ఇంతే భారీ రాకెట్లు, భారీ ఇంధనం, అన్నీ అవసరం అవుతాయి.
అప్పుడు ఆ ప్రయోగాలు కూడా వారం రోజుల వ్యవధిలోనే పూర్తవుతాయి.
ఇవి కూడా చదవండి:
- ఎగిరే టాక్సీలు వచ్చేస్తున్నాయి
- గ్రహాంతరవాసులు ఉన్నారా....పెంటగాన్ విడుదల చేయబోయే రిపోర్టులో ఏముంది?
- గ్రహాంతరవాసులు భూమిపైకి వస్తే ఏమవుతుంది? స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పారు
- UFO: అంతుచిక్కని ఫ్లయింగ్ సాసర్ల రహస్యం ఏంటి? ఒకప్పుడు అమెరికాను ఊపేసిన ఈ ‘ఏలియన్ స్పేష్ షిప్‌లు’ ఇప్పుడు ఏమయ్యాయి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















