NASA: భూమికి కోటి 10 లక్షల కిలోమీటర్ల దూరంలో, అంతరిక్షంలో ‘అతిపెద్ద విజయం’.. గ్రహశకలం దారిని మళ్లించిన నాసా
అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా... ఇప్పుడు తనను తాను భూగ్రహ పరిరక్షకుడిగా చెప్పుకోవచ్చంది. ఒక గ్రహశకలం దిశను విజయవంతంగా మరల్చిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేసింది నాసా.
ఈ ప్రయోగం భూమికి కోటి 10 లక్షల కిలోమీటర్ల దూరంలో జరిగింది. ప్రమాదకరమైన ఆబ్జెక్ట్స్ నుంచి భూమిని కాపాడే భవిష్యత్తు పథకాన్ని పరీక్షించేందుకు ఈ మిషన్‌ను నిర్వహించారు.
మరే ఇతర మిషన్‌కన్నా అద్భుతమైన ఫొటోలివి. భూమికి 70 లక్షల మైళ్ల దూరంలో నాసాకు చెందిన డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్ ఒక గ్రహశకలాన్ని సమీపించినప్పటి దృశ్యాలివి.

ఫొటో సోర్స్, ASI
దీని లక్ష్యం - అంతరిక్షంలో ఈ గ్రహశకలాన్ని ఢీ కొట్టడమే.
నాసా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో... ఆ మిషన్ విజయవంతమైందని ప్రకటించారు.
''లక్ష్యిత గ్రహశకలం ప్రయాణ దిశను డార్ట్ విజయవంతంగా మళ్లించింది. ప్రపంచం మనకు ఎలాంటి సవాళ్లు విసిరినా సరే, నాసా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఈ మిషన్ చాటిచెప్పింది'' అని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ చెప్పారు.
భూమి మీదున్న టెలిస్కోపులు ఆస్టరాయిడ్ కదలికను ట్రాక్ చేశాయి. అంతే కాదు, దాన్ని ఢీకొట్టాక రాతి శిథిలాలు అంతరిక్షంలో ఎలా చెల్లాచెదురయ్యాయో చూపించాయి.
ఈ క్రాష్‌తో ఆరు వేల మైళ్ల పొడవునా ధూళి మేఘం ఎలా వ్యాపించిందో హబుల్ స్పేస్ టెలిస్కోప్ నుంచి అందిన ఫొటోలో కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, NASA/ESA/STSCI/HUBBLE
ఈ శిథిలాలన్నీ ఆస్టరాయిడ్ దిశను మార్చేందుకు ఉపయోగపడ్డాయి.
''టార్గెట్ ఒక డబుల్ ఆస్టరాయిడ్ సిస్టమ్. డిడీమోస్ అని పిలిచే ఒక భారీ అంతరిక్ష బండరాయి చుట్టూ డిమోర్ఫోస్ అని పిలిచే ఒక చిన్న రాయి తిరుగుతూ ఉండింది. ఢీకొనడానికి ముందు, పెద్ద రాతి చుట్టూ పరిభ్రమించడానికి డిమోర్ఫోస్‌కు పదకొండు గంటల 55 నిమిషాలు పట్టేది. అయితే, గంటకు 22 వేల కిలోమీటర్ల వేగంతో ఒక స్పేస్‌క్రాఫ్టును ఢీకొట్టడంతో అదొక కుదుపుకు లోనైంది. దాంతో దాని వేగం చాలా స్వల్పంగా తగ్గింది. ఇప్పుడు దాని కక్ష్య మారిపోయిందని నాసా ధ్రువీకరించింది. పరిభ్రమించడానికి దానికిప్పుడు పదకొండు గంటల 23 నిమిషాలు పడుతుంది. 32 నిమిషాలు తగ్గడం అంటే చాలా పెద్ద తేడానే'' అని బీబీసీ ప్రతినిధి రెబెకా మొరేల్ వివరించారు.

ఫొటో సోర్స్, NASA/JHU-APL
''భవిష్యత్తులో ఇలా చెయ్యాలనుకుంటే, బహుశా ఇది పని చేయొచ్చు. అయితే, మనం అనేక ఏళ్ల ముందుగానే పనిలోకి దిగాల్సి ఉంటుంది. ఇలా గ్రహశకలం దిశను మళ్లించే పనిని భవిష్యత్తులో కూడా చేయగలగాలంటే, వార్నింగ్ టైమ్ అనేది చాలా కీలకంగా ఉంటుంది''అని డార్ట్ కోఆర్డినేషన్ లీడ్ నాన్సీ ఛాబోట్ తెలిపారు.
ఈ గ్రహశకలంతో మరో ఎన్‌కౌంటర్‌కు ఇప్పటికే ప్రణాళిక తయారైంది.
రెండేళ్లలో యూరప్ ఒక స్పేస్‌క్రాఫ్టును పంపిస్తుంది. అది ఈ క్రాష్‌తో ఏర్పడ్డ రంధ్రాన్ని అధ్యయనం చేస్తుంది. భూగ్రహాన్ని కాపాడుకోవడానికి ఇదసలు సమర్థవంతమైన పద్ధతేనా అనేది తెలుసుకోవడానికి ఆ అధ్యయనం మనకు ఉపయోగపడుతుంది.
ఇవి కూడా చదవండి:
- జస్టిస్ డీవై చంద్రచూడ్: సుప్రీం కోర్టులో తండ్రి తీర్పును తిరగరాసిన న్యాయమూర్తి
- ‘పాకిస్తాన్ బ్యాటర్లు హెల్మెట్ పెట్టుకోకుండానే బ్యాటింగ్ చేస్తారు, భారత్ ఫాస్ట్ బౌలర్ల వేగం సరిపోదు’
- చిన్నాన్న-పెదనాన్న, మేనత్త-మేనమామ పిల్లల్ని పెళ్లి చేసుకుంటే జరిగే జన్యు మార్పులు ఏంటి?
- ‘హిందీని రుద్దుతున్నారు’ అంటూ ఎందుకు విమర్శలు పెరుగుతున్నాయి,అమిత్ షా కమిటీ సిఫారసుల్లో ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)