సెక్స్‌కు సమ్మతి తెలిపే వయసును 18 ఏళ్ళ కన్నా తగ్గించాలా?

కలయిక

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తికి సెక్స్‌కు అనుమతించే హక్కు ఉందా?

ముఖ్యంగా భారతదేశంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న యువతను మేజర్లుగా పరిగణించరు.

భారతదేశంలో 1875 భారత మెజారిటీ చట్టం ప్రకారం 18 ఏళ్ల యువకులను మేజర్లుగా పరిగణిస్తారు. దీనితో పాటు వారికి అనేక హక్కులు ఇచ్చారు.

రాజ్యాంగంలోని 61వ సవరణలో 18 ఏళ్లు నిండిన యువతకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడం, ఓటు హక్కు లాంటివి కల్పించారు.

అదే సమయంలో బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం భారతదేశంలో వివాహానికి అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు తప్పనిసరి.

అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వివాహ వయస్సును పెంచే ఆలోచనలో ఉంది. మరోవైపు సెక్స్ సమ్మతి వయస్సును 18 ఏళ్ల నుంచి తగ్గించాలన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.

దీనిపై మధ్యప్రదేశ్‌, కర్ణాటక హైకోర్టులు తమ వైఖరిని వెల్లడించాయి.

అంగీకారంతో కూడిన ప్రేమ సంబంధాలను పోక్సో చట్టం పరిధిలోకి తీసుకురావడంపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆందోళన వ్యక్తంచేశారు.

'సమ్మతి వయస్సు'పై అభిప్రాయాలు తెలియజేయాలని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖను 'లా కమిషన్' కోరింది.

అయితే 'సమ్మతి వయస్సు' తగ్గిస్తే అది పోక్సో చట్టం, మైనర్లకు సంబంధించిన ఇతర చట్టాలను ప్రభావితం చేస్తుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేందుకు 2012లో పోక్సో చట్టం తీసుకొచ్చారు. ఇందులో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తిని 'మైనర్లు'గా నిర్వచించారు.

18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తితో (ఏకాభిప్రాయంతోనైనా) సంబంధం పెట్టుకుంటే, అది నేరం కిందకు వస్తుంది. ఇద్దరూ మైనర్లే అయినప్పటికీ, అదే నిబంధన వర్తిస్తుంది.

కోర్టు

ఫొటో సోర్స్, ANI

కోర్టులు ఏం చెప్పాయి?

మహిళల సమ్మతి వయస్సును 16 ఏళ్లకు తగ్గించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల కేంద్రానికి సూచించింది.

వాస్తవానికి 2020లో ఓ మైనర్ బాలికపై పదేపదే అత్యాచారం చేసి, ఆమెను గర్భవతిని చేసిన కేసు కోర్టు ముందుకు వచ్చింది. ఈ కేసులో నిందితుడిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పిటిషన్ దాఖలైంది.

ఈ సందర్భంగా న్యాయమూర్తి ''14 ఏళ్ల బాలుడు లేదా బాలికకు సోషల్ మీడియాపై అవగాహన ఉంటుంది. ఇంటర్‌నెట్ సౌకర్యం కూడా వారికి సులువుగా అందుబాటులో ఉండటంతో పిల్లలు చిన్న వయసులోనే అన్నీ తెలుసుకుంటున్నారు'' అని వ్యాఖ్యానించారు.

యుక్తవయస్సు కారణంగా అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవుతున్నారని, ఫలితంగా వారు అంగీకారంతో శారీరక సంబంధాలు ఏర్పరుచుకుంటారని కోర్టు అభిప్రాయపడింది.

"ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండేందుకు సెక్స్‌కు సమ్మతి తెలిపే యువతి వయస్సును 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నా" అని జస్టిస్ కుమార్ అగర్వాల్ తెలిపారు.

''ఈ వయసులోని బాలబాలికల శారీరక, మానసిక వికాసాన్ని పరిశీలిస్తే.. అలాంటి వ్యక్తి తన స్పృహతో తన మేలు కోసం నిర్ణయం తీసుకోవచ్చని అర్థమవుతోంది’’ అని కోర్టు పేర్కొంది.

సాధారణంగా టీనేజ్ అబ్బాయిలు, అమ్మాయిలు స్నేహాన్ని పెంపొందించుకుంటారు. వారు ఆకర్షణ, శారీరక సంబంధాన్ని పెంచుకుంటారు.

యువత

ఫొటో సోర్స్, Getty Images

కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది?

మరోవైపు ఏకాభిప్రాయ సంబంధాలలో వయస్సు ప్రమాణాలను పునఃపరిశీలించాలని లా కమిషన్‌కు కర్ణాటక హైకోర్టు గత ఏడాది సూచించింది.

'16 ఏళ్లు పైబడిన మైనర్ బాలికలు అబ్బాయిలతో ప్రేమ'కు సంబంధించిన అనేక క్రిమినల్ కేసులు కోర్టు ముందుకు వస్తున్నాయని ఆ రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ గుర్తుచేసింది.

ఈ సందర్భాలలో సదరు అమ్మాయిలతో రిలేషన్ పెట్టుకున్న అబ్బాయిలలో మైనర్లు లేదా కొద్దిరోజుల కిందటే మేజర్లుగా మారిన వారున్నారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఒక కార్యక్రమంలో పోక్సో చట్టం పరిధిలో అంగీకార శృంగార సంబంధాల కేసులను చేర్చడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

''పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు వ్యక్తుల మధ్య జరిగే అన్ని రకాల లైంగిక చర్యలు (మైనర్ల మధ్య సమ్మతి ఉన్నప్పటికీ) నేరంగా పరిగణిస్తారని మీకు తెలుసు. ఈ వ్యక్తుల మధ్య సమ్మతి చెల్లుబాటు కాదని చట్టం చెబుతోంది'' అని జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు

“అటువంటి కేసుల్లో న్యాయమూర్తులకు క్లిష్టమైన ప్రశ్నలు ఎదురవడాన్ని చూశాను. ఈ అంశంపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. కౌమారదశలో ఉన్నవారిపై ఆరోగ్య నిపుణులు చేసిన పరిశోధనలను దృష్టిలో ఉంచుకుని శాసన వ్యవస్థ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి'' అని సూచించారు సీజేఐ.

యువత

ఫొటో సోర్స్, Getty Images

'సమ్మతి వయస్సు'పై భిన్నాభిప్రాయాలు

ఈ నేపథ్యంలో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి లా కమిషన్ అభిప్రాయాలు కోరింది. అయితే'సమ్మతి వయస్సు' తగ్గింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమ్మతి వయస్సును తగ్గించాలని ఒక పక్క చెబుతుంటే, దాని వల్ల తలెత్తే సమస్యల జాబితా ఎక్కువే ఉంది.

ఈ నేపథ్యంలో సమ్మతి వయస్సును తగ్గించాలని హైకోర్టు న్యాయవాది సోనాలి కద్వాసరా అభిప్రాయపడ్డారు.

“మీరు అంగీకరించకపోయినా, మీకు అసౌకర్యంగా ఉన్నా 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు సెక్స్ చేసుకుంటున్నారన్నది నిజం. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం నా దగ్గర లేనప్పటికీ ఇది వాస్తవం. అలాంటి కేసులు చట్టం ముందుకి వచ్చినప్పుడు, కుటుంబాలు గౌరవం పేరుతో అబ్బాయిలపై పోక్సో కేసులు పెట్టడం జరుగుతోంది'' అని సోనాలి చెప్పారు.

కొన్ని సందర్భాల్లో కుటుంబాలు వివాహానికి అంగీకరిస్తున్నాయి. అయితే చట్టం ప్రకారం శిక్ష మాత్రం మారదు.

“సమ్మతి వయస్సును 16 సంవత్సరాలకు తగ్గిస్తే, నేను దానిని అంగీకరిస్తా. ఎందుకంటే పోక్సో చట్టానికి ముందు 15 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేసుకుంటే శిక్ష ఉండకపోయేది. కానీ POCSO చట్టం తీసుకొచ్చిన తర్వాత ఈ నిబంధన రద్దు చేశారు. అటువంటి పరిస్థితిలో నేను కర్ణాటక హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా'' అని అన్నారు సోనాలి.

ఒక అబ్బాయి, అమ్మాయి శారీరక సంబంధం పెట్టుకుంటే, ఆపై పెళ్లి ఆలోచనను కొనసాగించి, పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోతే, అప్పుడు ఏం చేయాలి?

ఈ ప్రశ్నకు సోనాలి కద్వాసరా స్పందిస్తూ.. అలాంటి ఆందోళన ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.

సోనాలి వాదనతో సుప్రీంకోర్టు న్యాయవాది సత్యం సింగ్ ఏకీభవించడం లేదు.

యువత చిన్న వయసులోనే రొమాంటిక్ రిలేషన్స్‌లోకి ప్రవేశిస్తున్నారని సమ్మతించే వయసును తగ్గించాలనడం కరెక్టు కాదని అంటున్నారు.

"ఈ వయస్సులోని యువతలో హార్మోన్ల మార్పులు ఉన్నాయనేది అంగీకరించాల్సిన విషయమే. దీని కారణంగా అమ్మాయిలు గర్భవతి అయినప్పుడు శారీరక ప్రభావాలు, ఆ తర్వాత వచ్చే సమస్యలు మానసికంగా ప్రభావం చూపుతాయి. ఒకవేళ బిడ్డను కంటే చట్టవిరుద్ధంగా పిలుస్తారు. అది సామాజికంగా ప్రభావాన్ని చూపుతుంది'' అని సత్యం సింగ్ అన్నారు.

బాలిక

ఫొటో సోర్స్, Getty Images

సమ్మతి అంటే..

పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడానికి పోక్సో చట్టాన్ని తీసుకువచ్చినందున సమ్మతి వయస్సును తగ్గించే సమస్య సంక్లిష్టంగా ఉందని ముంబైకి చెందిన మహిళా కార్యకర్త, గైనకాలజిస్ట్ డాక్టర్ సుచిత్రా దాల్వీ అంటున్నారు.

సమ్మతిని 'అవును' లేదా 'కాదు' అనే కోణం నుంచి మాత్రమే చూడకూడదని, అయితే అవును అని చెప్పడం వల్ల ఫలితం ఎలా ఉంటుందో కూడా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.

అంతేకాదు భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఉందని ఆమె గుర్తుచేశారు.

అయితే ఇలాంటి కోర్సు లేకుండా సెక్స్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి పిల్లలు తెలుసుకోవచ్చా? అని ప్రశ్నకు సుచిత్రా స్పందిస్తూ.. "ఇక్కడ మైనర్ అమ్మాయి, 30 ఏళ్ల వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే, మీరు దానిని వేధింపు అంటారు. కానీ ఇద్దరూ పెద్దలైతే అది వేధింపు కాదు. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది'' అని అన్నారు.

''మైనర్ అమ్మాయి గర్భవతి అయిందని అనుకుందాం. అది అబ్బాయితో పాటు అమ్మాయిపై కూడా ప్రభావం చూపుతుంది అబార్షన్ జరిగితే అమ్మాయిపై శారీరక, మానసిక ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితిలో ఆడపిల్ల పట్ల సమాజం వైఖరి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు'' అని తెలిపారు సుచిత్రా.

"సెక్స్ నేరం కాదని, దానికి కఠినమైన శిక్షలు ఉండవని, అయితే మధ్యేమార్గం వెతకాలని నేను నమ్ముతున్నా" అని సుచిత్రా దాల్వి ఒక సలహా ఇచ్చారు.

అలాంటి సంబంధాలలో అమ్మాయితో పాటు అబ్బాయిపై ప్రభావాన్ని ఒంటరిగా చూడలేమని, శిక్ష విధించడంపై దృష్టి పెట్టాలని సోనాలి కద్వాసరా సూచించారు.

ఇతర దేశాలలో సమ్మతి వయస్సు ఎలా ఉంది?

ప్రపంచవ్యాప్తంగా చూస్తే సమ్మతి సగటు వయస్సు 16 సంవత్సరాలు.

భారతదేశంలో ఈ వయస్సు 18. ప్రపంచంలోని ఇతర దేశాలలో ఇది 13 నుంచి 18 సంవత్సరాలుగా ఉంది. చాలా దేశాలలో ఇది 16 సంవత్సరాలు.

ఇటీవల జపాన్ ఈ వయస్సును 13 నుంచి 16 ఏళ్లకు పెంచింది. జర్మనీ, చైనాలలో సమ్మతి వయస్సు 14 సంవత్సరాలు.

సౌదీ అరేబియా, యెమెన్, ఇరాన్, పాకిస్తాన్‌లలో వివాహేతర సెక్స్ (అంగీకారం ప్రకారమే అయినప్పటికీ) చట్టవిరుద్ధం. కఠినమైన శిక్ష విధించే నిబంధనలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)