జమ్మూకశ్మీర్‌ ప్రశాంతంగా ఉందని ప్రభుత్వం చెబుతోంది... మరి కశ్మీరీలు ఏం అంటున్నారు?

జమ్మూకశ్మీర్

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, కీర్తి దుబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో శాంతి, అభివృద్ధిల శకం మొదలైంది. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. బంద్‌లు, రాళ్లు రువ్వడాలు పూర్తిగా తగ్గిపోయాయి.’’

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు మద్దతుగా సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం తాజాగా దాఖలుచేసిన ప్రమాణపత్రంలో ఈ విషయాలు పేర్కొన్నారు.

గత నాలుగేళ్లలో కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడటంతోపాటు మిలిటెంట్ల దాడులు 45 శాతం తగ్గాయని ప్రమాణపత్రంలో కేంద్ర ప్రభుత్వం వివరించింది.

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై ఆగస్టు 2 నుంచి రోజూ విచారణ చేపట్టబోతున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది. కేంద్రం చర్యలు రాజ్యాంగాన్ని అనుసరించి తీసుకున్నారా? లేదా అనే విషయంపై ప్రస్తుతం కోర్టు విచారణ చేపడుతోంది.

తాజా ప్రమాణపత్రానికి ముందుగా సుప్రీం కోర్టులో కేంద్ర హోం శాఖ కూడా 19 పేజీల ప్రమాణపత్రాన్ని దాఖలుచేసింది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంతో ఈ ప్రాంతానికి ఎలా మేలు జరుగుతోందో దీనిలో 40 పాయింట్లలో వివరించారు. ‘‘కేంద్ర ప్రభుత్వ చర్యలతో మునుపెన్నడూ లేనిరీతిలో ఇక్కడ శాంతి నెలకొంది.’’ అని ఆ ప్రమాణపత్రంలో పేర్కొన్నారు.

జమ్మూకశ్మీర్

ఫొటో సోర్స్, EPA

కశ్మీర్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి?

గత జూన్ నుంచి సెప్టెంబరు మధ్య మూడు నెలలు నేను కశ్మీర్‌లో ఉన్నాను. శ్రీనగర్‌లోని డౌన్‌టౌన్, లాల్‌చౌక్ ప్రాంతాలతోపాటు షోపియాన్, కుల్గామ్, పుల్వామా లాంటి జిల్లాల్లో కేంద్రం చెప్పినట్లే బంద్‌లు, ధర్నాలు కనిపించలేదు.

శ్రీనగర్‌ వీధుల్లో పర్యటకుల సంఖ్య కూడా ఎక్కువగానే కనిపించింది. కరోనావైరస్ లాక్‌డౌన్‌లను ఎత్తివేసిన తర్వాత ఇక్కడకు రికార్డు స్థాయిలో పర్యటకులు వస్తున్నట్లు రికార్డులు కూడా చెబుతున్నాయి.

అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులను కశ్మీరీలు ఎలా చూస్తున్నారు? కేంద్రం చెబుతున్న విషయాలపై వారు ఏం అంటున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఇక్కడి స్థానికులతో బీబీసీతో మాట్లాడింది.

శ్రీనగర్‌కు పొరుగున ఉండే గాందర్‌బల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఈ ప్రశ్నలపై బీబీసీతో మాట్లాడారు. అయితే, ఆయన తన పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు.

‘‘ప్రజల నోరును నొక్కేస్తూ దాన్నే శాంతిగా ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రశాంతత ప్రజలను భయపెట్టడంతో వచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ పాలనను ఏ మాత్రం విమర్శించినా ఆ వ్యక్తిని వెంటనే నేరుగా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బెదిరిస్తున్నారు.’’ అని ఆయన అన్నారు.

‘‘ఇక్కడ బంద్, ధర్నాలు లేకపోవడానికి ప్రధాన కారణం హురియత్ కార్యాలయానికి తాళాలు వేయడమే. ఏళ్ల నుంచి చాలామంది హురియత్ నాయకులను జైలులో పెట్టారు. మరికొందరికి గృహనిర్బంధం విధించారు. అంతా సాధారణంగా ఉంటే ఇప్పటికీ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్‌ను ఇంకా ఎందుకు నిర్బంధంలో ఉంచారు? ఎక్కడపడితే అక్కడ పెద్ద సంఖ్యలో సైన్యాన్ని ఎందుకు మోహరిస్తున్నారు?’’ అని ఆయన ప్రశ్నించారు.

జమ్మూకశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

పరిస్థితులు ప్రభుత్వం చెప్పినట్లే ఉన్నాయా?

2022లో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బీబీసీతో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. వేర్పాటువాద నాయకులు ఎవరూ గృహ నిర్బంధంలో లేరని ఆయన చెప్పారు. కానీ, బీబీసీ బృందం ఫ్యాక్ట్-చెక్ చేసినప్పుడు పరిస్థితులు భిన్నంగా కనిపించాయి.

నిజానికి నేడు కూడా మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ ఇంటి నుంచి బయటకు రావడానికి వీలులేకుండా నిర్బంధం విధించారు. ఆయనను మసీదుకు వెళ్లడానికి కూడా అనుమతించడం లేదు.

కశ్మీర్‌లో ప్రస్తుతం స్వతంత్ర మానవ హక్కుల సంస్థలేవీ పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. 2021 సెప్టెంబరులో ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకర్త ఖుర్రమ్ పర్వేజ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. ఆయనపై యూఏపీఏలోని సెక్షన్ 43(2)(బీ) కింద ఆరోపణలు మోపారు. దాదాపు రెండున్నరేళ్ల నుంచీ ఆయన జైలులోనే ఉన్నారు.

జమ్మూకశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

కేంద్రం చెబుతున్న వాటికి క్షేత్రస్థాయిలో పరిస్థితులకు చాలా తేడా కనిపిస్తోందని శ్రీనగర్‌ డౌన్‌టౌన్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడు చెప్పారు.

‘‘కశ్మీర్‌లో పరిస్థితికి సాధారణానికి వచ్చిందని ప్రజలందరూ చెప్పాలి. అప్పుడే పరిస్థితి సాధారణానికి వచ్చినట్లు. నేడు ప్రజలు చాలా మంది తమను నిర్బంధించినట్లు భావిస్తున్నారు. నిరుద్యోగం కూడా చాలా ఎక్కువగా ఉంది. మీరు రోడ్డుపై వెళ్తుంటే భారీ స్థాయిలో భద్రతా బలగాలు కనిపిస్తాయి. భద్రత పేరుతో ఎక్కడికక్కడే వాహనాలను నిలిపేస్తున్నారు. అంబులెన్స్‌లను కూడా ఆపేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం సాధారణంగా చెబుతోంది. కానీ, మాకు ఇదేమీ సాధారణం కాదు.’’ అని ఆయన అన్నారు.

శ్రీనగర్‌లోని రద్దీగా ఉండే ప్రాంతాల్లో రీగల్ చౌక్ కూడా ఒకటి. ప్రస్తుతం పరిస్థితి కాస్త ప్రశాంతంగానే ఉందని, బంద్‌లు ధర్నాలేవీలేవని 42 ఏళ్ల దుకాణదారుడు చెప్పారు. అయితే, ఈ పరిస్థితికి ఆర్టికల్ 370తో ముడి పెట్టడం సరికాదని ఆయన అన్నారు.

‘‘బంద్‌లు లేకపోవడంతో కాస్త సంతోషంగానే ఉంది. ఇలాంటి వాతావరణం కల్పించినందుకు ప్రభుత్వానికి క్రెడిట్ తక్కుతుంది. అయితే, అన్నింటికీ ఆర్టికల్ 370తో ముడిపెట్టడం సరికాదు. ఆర్టికల్ 370 అనేది కశ్మీరీల ప్రాథమిక హక్కు. దీన్ని మా నుంచి తీసేసుకున్నారు.’’ అని ఆయన చెప్పారు.

మునుపటితో పోలిస్తే, లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో అవినీతి కూడా తగ్గిందని కొంతమంది కశ్మీరీలు భావిస్తున్నారు.

‘‘నేను ఉద్యోగులు సమయానికి ఆఫీసులకు వస్తున్నారు. ప్రతిదానికీ లంచాలు అడగడం కూడా తగ్గింది.’’ అని 70 ఏళ్ల వ్యక్తి ఒకరు చెప్పారు.

జమ్మూకశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

యూఏపీఏ కేసులు ఎక్కువయ్యాయి..

గత నాలుగేళ్లలో ఇక్కడ అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ), పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (పీఎస్‌ఏ) కింద నమోదుచేస్తున్న కేసులు చాలా పెరిగాయి.

దీనిపై సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు వెంకటేశ్ నాయక్ దాఖలుచేసిన దరఖాస్తుపై ప్రభుత్వ అధికారులు స్పందించారు. 2014లో యూఏపీఏ కింద 45 కేసులు నమోదుకాగా, 2019లో ఇవి 255 కేసులకు పెరిగాయి.

జమ్మూకశ్మీర్ పోలీసుల సమాచారం ప్రకారం 2019 నుంచి ఆగస్టు 2021 వరకూ 2300 మందిపై ఈ కేసులు నమోదుచేశారు.

మరోవైపు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2021లో యూఏపీఏ కేసులు గరిష్ఠంగా నమోదైన ప్రాంతం జమ్మూకశ్మీరే.

కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఘర్షణల కేసులు కూడా ఎక్కువ నమోదైంది కశ్మీర్‌లోనే. మొత్తంగా ఇక్కడ 2021లో 751 కేసులు నమోదయ్యాయి.

జమ్మూకశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడు పీఎస్‌ఏ గురించి చూద్దాం. 2019తో పోలిస్తే ప్రస్తుతం ఈ చట్టం కింద నమోదుచేస్తున్న కేసుల సంఖ్య తగ్గింది. 2019లో ఈ చట్టం కింద 699 కేసులు నమోదుకాగా, 2020లో ఈ సంఖ్య 160కి తగ్గింది. 2021లో అయితే, 95 కేసులను ఈ చట్టం కింద నమోదుచేశారు.

కశ్మీర్‌లో మానవ హక్కుల కేసుల్లో ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోందని కొంతమంది న్యాయవాదులు చెప్పారు. ‘‘పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద అరెస్టు చేసిన వారి కేసులను హైకోర్టు కొట్టివేసిన వెంటనే.. మళ్లీ వారిపై యూఏపీఏ కింద ఆరోపణలు మోపుతున్నారు. దీంతో మళ్లీ వారు జైలులోనే గడపాల్సి వస్తోంది.’’ అని వారు చెప్పారు.

‘‘ఇలా వరుసగా ఆరోపణలు మోపడంతో ఒకసారి అరెస్టైనవారు బయటకు రావడం కష్టంగా మారుతోంది. భద్రతా సంస్థలు పీఎస్‌ఏ, యూఏపీఏలను కలిపి ఉపయోగిస్తున్నాయి.’’ అని ఆయన అన్నారు.

పీఎస్‌ఏను 1978లో షేక్ అబ్దుల్లా ప్రభుత్వం తీసుకొచ్చింది. స్మగ్లర్ల కోసం మొదటగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే, ఆ తర్వాత దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపైనా దీనికింద కేసులు నమోదుచేయడం మొదలుపెట్టారు.

పీఎస్ఏ కింద నిందితులను విచారణ లేకుండానే రెండేళ్ల వరకూ జైలులో పెట్టొచ్చు. యూఏపీఏలోనూ ఇలానే ఏళ్లపాటు నిందితులను జైలులో పెట్టొచ్చు. ఈ చట్టం కాస్త సంక్లిష్టమైనది. దీని కింద కేసు నమోదుచేస్తే.. బెయిలు వచ్చే అవకాశం చాలా తక్కువ.

జమ్మూకశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

ఈ చట్టాలపై గాందర్‌బల్‌కు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘పీఎస్ఏ, యూఏపీఏల గురించి సాధారణ ప్రజలు చాలా భయపడుతున్నారు. అందుకే ఎవరూ నోరు కూడా విప్పడం లేదు. మరోవైపు జర్నలిస్టులు, మానవ హక్కుల లాయర్ల ఇళ్లలోనూ తరచూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ ప్రజలు ఏం చెయగలరు?’’ అని ఆయన ప్రశ్నించారు.

2021 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు వార్షికోత్సవానికి సంబంధించి కశ్మీర్‌లోని లాల్‌చౌక్‌లో తీసిన చిత్రాలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

ఆ రోజు చాలా మంది దుకాణదారులు నిరసనగా తమ దుకాణాలను మూసివేస్తుంటే.. భద్రతా సంస్థలు బలవంతంగా వారితో దుకాణాలు తెరిచేలా చేశారు.

గత ఆగస్టు 5న నేను శ్రీనగర్‌లోని ఒక హోటల్‌లో ఉన్నాను. ఆ రోజు ఉదయం నేను నిద్ర లేచేసరికి మొబైల్‌లో ఇంటర్నెట్ పనిచేయలేదు. ఈ విషయంపై సర్వీస్ ప్రొవైడర్‌కు ఫోన్ చేసినప్పుడు.. ప్రభుత్వ ఆదేశాలపై ఇంటర్నెట్ సేవలను స్తంభింపచేసినట్లు చెప్పారు. ఆ రోజు రాత్రి పది వరకూ ఇంటర్నెట్ సేవలు మళ్లీ పునరుద్ధరించలేదు.

ఇక పెట్టుబడుల విషయానికి వస్తే, ఈ ఏడాది మార్చిలో తొలి విదేశీ పెట్టుబడులు కశ్మీర్‌కు వచ్చాయి. దుబాయికి చెందిన

ఇమార్ గ్రూపు శ్రీనగర్‌లో 60 మిలియన్ డాలర్ల (రూ.490 కోట్లు)తో ఒక షాపింగ్ కాంప్లెక్స్‌ను కడుతోంది.

కొన్ని గల్ఫ్ దేశాలు కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ప్రస్తుతం ఇమార్ మినహా మరే పెట్టుబడులు కనిపించడం లేదు.

వీడియో క్యాప్షన్, ప్రభుత్వ వైఖరి పట్ల నిరాశను వెలిబుచ్చిన బాధిత కుటుంబాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)