రోజుకు 24 గంటలేనా? ఈ లెక్క ఎలా మొదలైంది? ఆ గ్రంథాల్లో ఈజిప్షియన్లు ఏం రాశారు?

ఈజిప్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈజిప్షియన్ హైరోగ్లిఫిక్ గ్రంథాల్లో గంటలను ఎలా లెక్కించేవారో రాసుంది
    • రచయిత, రాబర్ట్ కాక్రోఫ్ట్, సారా సైమన్స్
    • హోదా, బీబీసీ ముండో

అక్షరాలతో పదాలను రాసే విధానం మొదలుకాకముందే మన పూర్వీకులు కొలతలను ఉపయోగించేవారు. అందుకే సమయాన్ని లెక్కించడం ఎలా మొదలైందో కనిపెట్టడం చాలా కష్టం.

కొన్ని కొలతలు ఖగోళ పరిణామాలను అనుసరించి మనం మొదలుపెట్టాం. అందుకే బహుశా భిన్న సంస్కృతుల్లో వీటిని విరివిగా ఉపయోగించి ఉండొచ్చని పురాతత్వ పరిశోధకులు భావిస్తున్నారు.

ఒక రోజు లేదా ఒక సంవత్సరాన్ని కొలవడానికి సూర్యుడి చుట్టూ భూమి కదలికలపై ఆధారపడటమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక నెలల విషయానికి వస్తే, చంద్రుడి కదలికలపై మన పూర్వీకులు ఆధారపడేవారు.

అయితే, కొన్ని కొలతలు ఖగోళ పరిణామాలతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటాయి. వీటికి ఉదాహరణగా వారాలను చెప్పుకోవచ్చు.

అత్యంత పురాతన రచనల్లో ఒకటైన ఈజిప్షియన్ హైరోగ్లిఫిక్ గ్రంథాల్లో గంటలను ఎలా లెక్కించేవారో రాసి ఉంది. ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా ప్రాంతాల్లో పుట్టినట్లుగా భావిస్తున్న ఈ విధానం ఆ తర్వాత కాలంలో యూరప్‌కు విస్తరించింది. ఆ తర్వాత దీన్నే ప్రపంచం మొత్తం అనుసరించడం మొదలుపెట్టింది.

ఈజిప్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్రీ.పూ. 2000లనాటి చతురస్రాకారపు చెక్క శవపేటికల లోపలి వైపు కొన్ని అలంకరణల్లో ఖగోళ పట్టికలు కనిపిస్తాయి

పురాతన ఈజిప్టులో సమయం

క్రీ.పూ. 2400లలోనే పురాతన ఈజిప్టులో ‘పిరమిడ్ టెక్స్ట్’లను రాశారు. వీటిలో ‘వెనట్’గా పిలిచే ఓ పదముంది. దీన్ని ‘గంట’ అనే పదానికి బదులుగా హైరోగ్లిఫ్ భాషలో ఉపయోగించి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

వెనట్‌ను ఎందుకు ‘గంట’ అనే పదంగా భావిస్తున్నారో తెలుసుకోవాలంటే మీరు అస్యుత్ నగరానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ క్రీ.పూ. 2000ల నాటి చతురస్రాకారపు చెక్క శవపేటికల లోపలి వైపు కొన్ని అలంకరణల్లో ఖగోళ పట్టికలు కనిపిస్తాయి.

ఈ పట్టికల్లో ఓ సంవత్సర కాలాన్ని పదేసి రోజులతో విభజిస్తూ సూచించే నిలువు వరుసలు కనిపిస్తాయి. ఈజిప్షియన్ల క్యాలెండర్లలో 12 నెలలు ఉంటాయి. ఇక్కడ ఒక్కో నెలను మూడు పదేసి రోజుల వారాలుగా విభజించేవారు.

ఒక్కో వరుసలో 12 నక్షత్రాల పేర్లను ఇక్కడ ప్రస్తావించారు. మొత్తంగా ఇక్కడ 12 నిలువు వరుసలు ఉన్నాయి. ఈ పట్టిక ఆధునిక ‘స్టార్ చార్ట్’ తరహాలోనే ఒక ఏడాదిలో ఆకాశంలో నక్షత్రాల కదలికలను సూచిస్తోంది.

ఆ 12 నక్షత్రాల సాయంతో రాత్రిని 12 భాగాలుగా విభజించినట్లు కనిపిస్తోంది. అయితే ఇక్కడ ‘వెనట్’ అనే పదాన్ని ఎక్కడా ఉపయోగించలేదు.

అయితే, క్రీ.పూ. 16 నుంచి 11 శతాబ్దాల మధ్య కాలంలో ఈ పట్టికల్లోని నిలువు వరుసలు, ‘వెనట్’ల మధ్య లంకె కనిపిస్తుంది.

ఈజిప్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అబిడోస్‌ ఒసిరియోన్‌ ప్రాంతంలోని ఒక ప్రార్థనా స్థలంలో సూర్యుడు, ఇతర నక్షత్రాల కదలికల ఆధారంగా సమయాన్ని ఎలా లెక్కించాలనే వివరాలు ఉన్నాయి

ఖగోళ పరిణామాలతో..

అబిడోస్‌ ఒసిరియోన్‌ ప్రాంతంలోని ఒక ప్రార్థనా స్థలంలో సూర్యుడు, ఇతర నక్షత్రాల కదలికల ఆధారంగా సమయాన్ని ఎలా లెక్కించాలనే వివరాలు ఉన్నాయి. అస్యుత్ శవపేటికలో కనిపించిన పట్టిక కూడా ఇక్కడ ఉంది. దీనిలో 12 నిలువు వరుసల కోసం వెనట్‌ అనే పదాన్ని ఉపయోగించారు.

ఇక్కడ పగలులో 12 వెనట్‌లు, రాత్రిపూట 12 వెనట్‌లు ఉంటాయని పేర్కొన్నారు. ఈ రెండూ సమయానికి కొలతలుగా స్పష్టంగా వివరించారు. వారు ప్రస్తావించిన సమయం దాదాపుగా ఆధునిక సమయం కొలతలను పోలి ఉంది.

ఇక్కడ పగటి గంటలను సూర్యుడి నీడ, రాత్రి గంటలను నక్షత్రాల కదలికల ఆధారంగా లెక్కించేవారు. అయితే, సూర్యుడు, చంద్రుడు కనిపించేటప్పుడు మాత్రమే ఈ సమయాన్ని లెక్కించగలం. మరోవైపు సూర్యోదయం, సూర్యాస్తమయం లాంటి సమయాలను ఎలా లెక్కించాలో ఇక్కడ కొలతలేమీ లేవు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వెనట్‌, ఆధునిక గంటల మధ్య కాస్త తేడా ఉంటుంది. ఏడాది పొడవునా వెనట్ ఒకేలా ఉండదు. శీతాకాలంలో రాత్రి సమయం, వేసవి కాలంలో పగటి సమయం ఎక్కువగా ఉంటాయి.

అయితే, ఇక్కడ 12 అనే సంఖ్య ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే పది రోజుల వ్యవధికి 12 నక్షత్రాలను ఎందుకు ఎంచుకున్నారనేది తెలియాలి. ఈ ప్రశ్నకు కూడా ఆ పట్టికల రూపంలో ఒక సమాధానం కనిపిస్తోంది.

వీడియో క్యాప్షన్, సురక్షితంగా భద్రపరిచిన డైనోసార్ పిండాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

నక్షత్రాల సమయం

పురాతన ఈజిప్షియన్లు తమ సమయానికి కేంద్ర బిందువుగా ‘సిరియస్’ నక్షత్రాన్ని ఎంచుకున్నారు. సిరియస్‌కు అనుగుణంగా మిగతా నక్షత్రాల్లో కదలికల ఆధారంగా వారు సమయాన్ని కొలిచేవారు.

అయితే, ఈ నక్షత్రాలు ఏడాది పొడవునా కనిపించవు. ఒక్కోసారి ఏడాదిలో 70 రోజుల వరకూ ఇవి ఆకాశంలో మాయం అయిపోయేవి.

ఒసిరియోన్ స్టార్ గ్రంథం ప్రకారం.. ప్రతి పది రోజులకు సిరియస్ లాంటి నక్షత్రం ఆకాశంలో మాయం అయ్యేది. దాని స్థానంలో ఒక కొత్త నక్షత్రం కనిపించేది. ఈ పరిణామాలు ఏడాది పొడవునా ఇలా జరుగుతూనే ఉంటాయి.

సంవత్సరంలో సమయాన్ని బట్టి రాత్రి పూట పది నుంచి 14 వరకూ నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి పది రోజుల వ్యవధిలో వీటి కదలికలను కొలవడంతో ఆ శవపేటిక లోపలి పట్టిక తరహా పట్టిక వస్తుంది.

క్రీ.పూ. 2000లలో ఈ సమయం కొలతలను పరిశీలిస్తే కచ్చితత్వం కంటే దీనికి ఒక రూపాన్ని ఇవ్వాలనే విధానం కనిపిస్తుంది. బహుశా అలా ఆ పట్టికలో 12 నిలువు వరసలు పుట్టి ఉండొచ్చు. నేడు అలాంటి పట్టికలు ఇప్పటికీ ఈజిప్టు మ్యూజియంలలో కనిపిస్తాయి.

వారానికి పది రోజులను ఎంచుకోవాలనే ఆలోచన నుంచే పగటికి 12 గంటలు, రాత్రికి 12 గంటలు ఉండాలనే ఆలోచన కూడా పుట్టి ఉండొచ్చు. ఈ విధంగా ఆధునిక కాలం కొలతలకు 4,000 ఏళ్లకు ముందే పునాదులు పడ్డాయి.

(మెక్‌మాస్టర్ యూనివర్సిటీలోని ఫిజిక్స్, ఆస్ట్రానమీ అసోసియేట్ ప్రొఫెసర్ రాబర్ట్ కాక్రోఫ్ట్, ప్రొఫెసర్‌గా సారా సైమన్స్ పనిచేస్తున్నారు.)

వీడియో క్యాప్షన్, ఈ పురాతన మమ్మీ ముఖాన్ని చేతులతో ఎందుకు కప్పేసుకుంది?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)