‘మా అమ్మ దేవదాసీ. ఇది చెప్పడానికి నేనేమీ సిగ్గు పడను’

దేవదాసీ

ఫొటో సోర్స్, MANISH GAEKWAD

ఫొటో క్యాప్షన్, కోల్‌కతాలో 1990లో దేవదాసీగా జీవించేటప్పటి రేఖాబాయి ఫోటో
    • రచయిత, చెరిలన్ మోలన్
    • హోదా, బీబీసీ న్యూస్

అది 1962. సరిహద్దు వివాదంపై నాడు భారత్, చైనా మధ్య యుద్ధం జరిగింది. దీంతో భారత ప్రభుత్వం అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) ప్రకటించింది.

రోడ్డుపై సైరన్లు, వీధుల్లో బంద్‌ల నడుమ ప్రజలు భయం గుప్పిట్లో జీవించేవారు. భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నట్లుగా అనిపించేవి.

రేఖాబాయికి ఆ భయం అడ్డుకాలేదు. మిగతా దేవదాసీ మహిళల్లా ఆమె ఇంట్లో కూర్చోలేదు. రోజూ రాత్రి ఆమె అందమైన చీర కట్టుకొని మగవారి కోసం పాటలు పాడుతూ నాట్యం చేసేవారు.

కష్టాలు కూడా కొన్నిసార్లు అవకాశాలను వెతికిపెడతాయని జీవితమే ఆమెకు నేర్పించింది.

గందరగోళమైన రేఖాబాయి జీవితాన్ని ‘‘ద లాస్ట్ కోటెసాన్ – రైటింగ్ మై మదర్స్ మెమొయిర్’’ అనే పుస్తకం రూపంలో ఆమె కుమారుడు మనీష్ గైక్వాడ్ నేడు ప్రజలకు పరిచయం చేస్తున్నారు.

‘‘మా అమ్మ ఎప్పుడూ తన కథను అందరికీ చెప్పాలని అనుకునేది,’’ అని గైక్వాడ్ చెప్పారు.

దీన్ని చెప్పడానికి తనకు ఎలాంటి సిగ్గూ లేదా ఇబ్బందీ లేదని, యుక్తవయసు వరకూ ఆమెతో కలిసి జీవించానని, ఆమె జీవితాన్ని దగ్గర నుంచి చూశానని ఆయన వివరించారు.

‘‘చిన్నప్పుడు ఆమెతో కలిసి దేవదాసీ మహిళలు జీవించే ఇంటిలో ఉండేటప్పుడు పిల్లలు చూడకూడనివన్నీ చూశాను. మా అమ్మకు ఇవన్నీ తెలుసు. కానీ, ఆమె ఏదీ నా నుంచి దాచాలని అనుకోలేదు’’ అని గైక్వాడ్ చెప్పారు.

తల్లి తనకు చెప్పిన అనుభవాల నుంచి ఈ పుస్తకాన్ని ఆయన రాశారు. 1990ల కాలంలో దేవదాసీ మహిళల జీవితం ఎలా ఉండేదో దీనిలో వివరించారు.

క్రీ.పూ. 2వ దశాబ్దం నుంచి భారత ఉపఖండంలో దేవదాసీ మహిళలు ఉండేవారని ఒడిస్సీ డ్యాన్సర్, ‘కోర్టింగ్ హిందుస్తాన్: ద కన్సూమింగ్ పాషన్స్ ఆఫ్ ఐకానిక్ విమెన్ పెర్ఫార్మర్స్ ఆఫ్ ఇండియా’ పుస్తక రచయిత మాధుర్ గుప్తా చెప్పారు.

‘‘వారు ఆనందాన్ని పంచే మహిళలు. ముఖ్యంగా దేవుళ్లు, రాజ కుటుంబాల ముందు వారు నాట్యం చేసేవారు’’ అని గుప్తా వివరించారు. భారత్‌లో బ్రిటిష్ పాలనకు ముందు, దేవదాసీ మహిళలను గౌరవప్రదమైన కళాకారులుగా చూసేవారు. అప్పట్లో ధనవంతులు వీరిని ప్రోత్సహించేవారు.

దేవదాసీ

ఫొటో సోర్స్, BHANSALI PRODUCTION

ఫొటో క్యాప్షన్, గంగూబాయి కాఠియావాడీ సినిమాలోనూ దేవదాసీల పాత్రలు కనిపిస్తాయి

‘‘కానీ, సమాజం, పురుషుల చేతిలో వీరు దోపిడీకి గురయ్యేవారు’’ అని గుప్తా చెప్పారు.

బ్రిటిష్ పాలనలో దేవదాసీళల సంస్కృతి పతనావస్థకు వచ్చింది. బ్రిటిషర్లు వీరిని సెక్క్‌వర్కర్లుగా చూసేవారు, ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు చట్టాలను కూడా తీసుకొచ్చారు.

1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, వారి స్థితి మరింత దిగజారింది. దీంతో చాలా మంది దేవదాసీ మహిళలు వేశ్యావృత్తిని ఎంచుకున్నారు. నేడు ఆ సంస్కృతి అంతరించిపోయింది. కానీ, కొందరు ప్రముఖ దేవదాసీలు, వారి జీవితాలపై అప్పుడప్పుడు పుస్తకాలు, సినిమాలు వస్తుంటాయి.

అలాంటి ఒక కథే రేఖాబాయిది.

మహారాష్ట్రలోని పుణెలో ఒక పేద కుటుంబంలో ఆమె జన్మించారు. కుటుంబంలోని పది మంది పిల్లల్లో ఆమె ఆరోవారు.

ఆమె సరిగ్గా ఏ సంవత్సరం పుట్టారో రేఖాబాయికి గుర్తు కూడా లేదు. ఐదుగురు ఆడ పిల్లలు పుట్టిన తర్వాత, మళ్లీ ఆడపిల్లే పుట్టిందని ఆమెను శిశువుగా ఉన్నప్పడే మద్యానికి బానిసైన తండ్రి ఒక చెరువులో విసిరేసేందుకు యత్నించారు.

కుటుంబ అప్పులను తీర్చేందుకు తొమ్మిది లేదా పదేళ్ల వయసులోనే ఆమెకు పెళ్లి చేశారు. అత్తింటివారు ఆమెను కోల్‌కతాలోని బోబజార్‌లో దేవదాసీ మహిళలు ఉండే ఇంటిలో విక్రయించేశారు.

దేవదాసీ మహిళగా శిక్షణ పొందేనాటికి ఆమెకు యుక్తవయసు కూడా రాలేదు. అయితే, ఆమె జీవితం, సంపాదన ఆమె బంధువుల్లో ఒకరైన ఓ దేవదాసీ చేతుల్లో ఉండేది.

భారత్-చైనా యుద్ధ సమయంలో ఆ బంధువు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో తన జీవితాన్ని అనుకున్నట్లుగా నడిపించుకునే అవకాశం రేఖాబాయికి దక్కింది. కొవ్వొత్తుల వెలుగుల్లో ఆమె ఇచ్చిన ప్రదర్శనలే ఆమెకు గుర్తింపును తెచ్చిపెట్టాయి. కాస్త ధైర్యం కూడగట్టుకుంటే సొంతంగా బతకగలనని ఆమె అర్థం చేసుకున్నారు.

ఈ సూత్రమే తన జీవితానికి మార్గదర్శిగా మారింది. బాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లుగా రేఖాబాయి ఎప్పుడూ ఒక మగవాడిని అంటిపెట్టుకొని ఉండలేదు. మళ్లీ పెళ్లి చేసుకోకూడదని మాత్రం ఆమె నిర్ణయించుకున్నారు. చిన్న చిన్న నేరస్థుల నుంచి ధనవంతులైన షేక్‌లు, ప్రముఖ సంగీత కళాకారులు వరకు చాలా మంది తనను ప్రోత్సహించినప్పటికీ వివాహం జోలికి ఆమె వెళ్లలేదు. ఎందుకంటే దేవదాసీలు ఉండే ఆ ఇంటిని విడిచిపెట్టాల్సి వస్తుందని ఆమె భావించారు.

ఆ ఇంటిలోనే ఆమె ఎక్కువగా నాట్యం చేసేవారు, అక్కడే జీవించేవారు, తన కొడుకును అక్కడే పెంచి పెద్దచేశారు. అంతేకాదు, తన కుటుంబంలో చాలా మందికి అక్కడే ఆమె ఆశ్రయం ఇచ్చారు. అదే ఆమె స్వేచ్ఛ, శక్తికి చిహ్నంగా మారింది.

అక్కడే ఆమె ఎన్నో కష్టాలను కూడా చూశారు. ఆమెలోని అమాయకత్వం అక్కడే ఆహుతైంది. కోపం, భయం, నిరాశ లాంటి ఎన్నో ప్రతికూల భావాలు కూడా అక్కడే ఆమెను వెంటాడాయి.

దేవదాసీ మహిళ

ఫొటో సోర్స్, MANISH GAEKWAD

ఫొటో క్యాప్షన్, 1980లలో బాంబేలో దేవదాసీల ప్రదర్శన

తన పుస్తకంలో తల్లి తనకు వివరించిన కొన్ని కలచివేసే ఘటనలను కూడా మనీష్ గైక్వాడ్ గుర్తుచేసుకున్నారు. ఒకసారి తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందని ఓ దుండగుడు తుపాకీ తీసి తన తల్లిని బెదిరించాడని వివరించారు.

మరొక సందర్భంలో అసూయతో కొందరు దేవదాసీలే ఆమెను దూషించిన ఘటనలనూ వివరించారు. కొందరైతే ఆమెను బెదిరించేందుకు గ్యాంగ్‌స్టర్‌లను కూడా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు. మరికొందరు మాత్రం ఆమెను వేశ్య అని తిట్టేవారు, కానీ ఆమె వేశ్య కాదు.

అయితే, ఆ ఇల్లే ఆమెను ఉక్కు మహిళగా మార్చింది. నర్తకిగా తనలోని ప్రతిభను ఆమె అక్కడే గుర్తించారు. ఏదో వెతుక్కుంటూ వచ్చే పురుషులను ఆమె తన ప్రదర్శనతో అక్కడే కట్టిపడేసేవారు.

అక్కడే తనతో ప్రవర్తించే తీరును బట్టి ఎందరో మగవారి జీవితాలను ఆమె చదివారు. చాలా ప్రశాంతంగా ఉండటం, అవసరమైనప్పుడు కోపం ప్రదర్శించడం కూడా అక్కడే ఆమె నేర్చుకున్నారు.

‘‘దేవదాసీల భాషలో నేను ప్రావీణ్యం సాధించాను. అవసరానికి తగినట్లుగా నేను మాట్లాడేదాన్ని’’ అని ఆమె చెప్పారు.

మనోహరమైన ప్రదర్శనలు ఇవ్వడంతోపాటు తన కొడుకును కూడా ఆమె జాగ్రత్తగా ఇక్కడే కాపాడుకున్నారు. అతడికి మెరుగైన జీవితం ఇచ్చేందుకు ఆమె శక్తి మేర కృషి చేశారు.

దేవదాసీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాలా బాలీవుడ్ సినిమాల్లో దేవదాసీల పాత్రలు కనిపిస్తాయి

కొడుకును చిన్నప్పుడు రేఖాబాయి తన దగ్గరే అట్టి పెట్టుకున్నారు. ప్రదర్శనల మధ్య ఖాళీ సమయంలో అతడి దగ్గరకు వెళ్లి ఏడుస్తున్నాడేమోనని ఆమె చూసేవారు.

తర్వాత అతడిని బోర్డింగ్ స్కూల్‌కు పంపించారు. ఆ తర్వాత అతడి కోసం ఒక అపార్ట్‌మెంట్‌ తీసుకున్నారు. అక్కడ బాబు తన స్నేహితులతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా గడిపేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.

తన కుమారుడి విషయంలో ఆమె ఎప్పుడూ గర్వంతోనే ఉండేవారు. ఇంగ్లిష్ మీడియం విద్య, బోర్డింగ్ స్కూల్‌లతోపాటు ఆమె చూపిన శ్రద్ధ అతడి జీవితంపై చాలా రకాలుగా ప్రభావం చూపించాయి.

సెలవుల్లో తన కొడుకు ఇంటికి వచ్చినప్పుడు తనకు తినడానికి ఫోర్క్, స్పూన్ కావాలని అతడు అడిగిన విషయాలను పుస్తకంలో ప్రస్తావించారు.

‘‘ఫోర్క్‌లు ఇదివరకు నాకు తెలుసు. కానీ, వాటిని ఇంగ్లిష్‌లో ఏమని పిలుస్తారో తెలియదు. నువ్వు వాటిని ఎలా వాడతారో చెప్పినప్పుడు, నేను మార్కెట్‌కు వెళ్లి అలానే చెప్పాను’’ అని ఆమె చెప్పినట్లు పుస్తకంలో రాసుకొచ్చారు.

2000 నాటికి దేవదాసీల సంస్కృతి కనుమరుగైంది. రేఖాబాయి కూడా ఆ ఇంటిని వదిలి కోల్‌కతాలోని తన అపార్ట్‌మెంట్‌లో స్థిరపడ్డారు. గత ఫిబ్రవరిలో ముంబయిలో ఆమె మరణించారు. తన తల్లి మనోబలం, ప్రతిభ ఎప్పుడూ తనకు ఆశ్చర్యంగా అనిపిస్తాయని గైక్వాడ్ చెప్పారు.

‘‘ఈ పుస్తకాన్ని మగవారు తప్పకుండా చదువుతారు. ఎందుకంటే దీనిలో వారు తమ తల్లి ప్రేమను చూసుకుంటారు. తమ తల్లి వ్యక్తిత్వాన్ని గుర్తించేందుకు ఈ పుస్తకం వారికి సహకరిస్తుంది. అంతేకాదు, వారిని వారిగానే స్వీకరించేలా చేసేందుకూ ఇది తోడ్పడుతుంది’’ అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా... ఎలా తెలుస్తుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)