పైలట్ రోహిత్ రెడ్డి: వై కేటగిరీ సెక్యూరిటీ సిబ్బందితో కలిసి చేసిన వీడియో వైరల్... విమర్శలపై ఎమ్మెల్యే ఏమన్నారు?

తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి

ఫొటో సోర్స్, Pilot Rohith Reddy/facebook

ఫొటో క్యాప్షన్, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తాండూరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలెట్ రోహిత్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కాకపోతే ఈసారి ఆయన తనతో పాటూ తన సెక్యూరిటీ సిబ్బందిని కూడా వివాదంలో ఇరుక్కునేలా చేశారు.

తన భద్రత కోసం ప్రభుత్వం ఇచ్చిన పోలీసులు, కమాండోలతో కలసి సదరు ఎమ్మెల్యే రూపొందించారంటున్న ఓ షార్ట్ వీడియో (రీల్) వైరల్ గా మారింది.

దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు దీనిపై విమర్శలు, ఫిర్యాదులు చేశారు. రాజకీయంగానూ దీనిపై విమర్శలు వినిపిస్తున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ఆ వీడియోలో పైలెట్ రోహిత్ రెడ్డి కాషాయ పంచె, కండువా కప్పుకొని మధ్యలో నడుస్తుండగా, ఆలివ్ గ్రీన్ యూనిఫాంలో మెషీన్ గన్లు పట్టుకున్న నలుగురు పోలీసులు, వారి వెనుక సాధారణ పోలీస్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు, సఫారీలో ఉండే గన్ మెన్లు ముగ్గురు, ఆపై మళ్లీ ఆలివ్ గ్రీన్ యూనిఫాంలో ఉన్న పోలీసులు ఆయన చుట్టూ ఉండి నడవడం కనిపిస్తుంది.

దానికి సినిమాల్లో హీరోలకు వాడే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేశారు.

అయితే దీనిపై వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అది తాము కావాలని తీసిన వీడియో కాదని, తాను సాధారణంగా సెక్యూరిటీతో నడుస్తుంటే కొందరు మిత్రులు స్నాప్ చాట్‌లో వీడియో తీశారని చెప్పారు. అంతేకాదు, తనకు ప్రధాని మోదీలా ప్రభుత్వ సిబ్బందితో ఫొటోషూట్ చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

ఇది ఎవర్నీ ఇబ్బంది పెట్టడానికి చేసింది కాదు అన్నారు.

అయితే, ఆ వీడియోలో ఎమ్మెల్యే ముందుగా నడుస్తుంటే యూనిఫాం వేసుకుని తుపాకులు పట్టుకున్న పోలీసులు ఆయన వెనుక నుంచి వచ్చి రెండు వైపులా విడిపోయి సినిమా తరహాలో నడవడం కనిపిస్తోంది.

దీంతో అది ప్లాన్ చేసి షూట్ చేసిన వీడియోలా కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు.

పైలట్ రోహిత్ రెడ్డి

ఫొటో సోర్స్, Pilot Rohith Reddy /facebook

రోహిత్ రెడ్డి ఇటీవలే 11 రోజుల పాటూ అతి రుద్ర మహాయాగాన్ని నిర్వహించారు. ఆ యాగ నిర్వహణ సందర్భంలోనే ఇది జరిగింది.

సాధారణ ఎమ్మెల్యేకు ఒకరో ఇద్దరో గన్ మెన్లు ఉంటారు. అయితే రోహిత్ రెడ్డికి మాత్రం మంత్రులకు కూడా లేని తరహాలో వై కేటగిరీ భద్రత ఉంది.

వై కేటగిరీ అంటే 8 మంది పోలీసులు, వారిలో ఒకరిద్దరు ప్రత్యేక శిక్షణ పొందిన కమాండోలు, వీరుకాక మళ్లీ ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు (ఈ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు సాధారణంగా ఎస్సై ఆపై స్థాయి వారు) ఉంటారు.

వీరి కోసం ఒకటి లేదా రెండు పోలీసు వాహనాలను కూడా కేటాయిస్తారు.

ఈ వై కేటగిరీ భద్రత కోసం ఒక అంచనా ప్రకారం దాదాపు నెలకు రూ. 12 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి భద్రతకు కేటాయించిన పోలీసు సిబ్బంది జీతాలు, వాహనాల ఖర్చంతా ప్రభుత్వానిదే.

రోహిత్ రెడ్డికి అంత భారీ భద్రత కల్పించడాన్ని ముందు నుంచీ బీజేపీ ప్రశ్నిస్తోంది.

సంఘ విద్రోహ శక్తుల నుంచి తీవ్రమైన హాని ఉన్న సందర్భాల్లో అతి ముఖ్యమైన వ్యక్తులకు ఇలాంటి భద్రత ఇస్తారు. పోలీసు ఉన్నతాధికారులు, ఇంటిలిజెన్స్ అధికారుల నివేదిక ఆధారంగా ఈ భద్రత కల్పిస్తారు.

ప్రస్తుతం చాలా మంది కేంద్ర మంత్రులకు కూడా లేని ఇలాంటి భద్రతను రోహిత్ రెడ్డికి కల్పించడం వెనుక కారణం మాత్రం వేరు.

పైలట్ రోహిత్ రెడ్డి

ఫొటో సోర్స్, Pilot Rohith Reddy /facebook

కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి గెలిచిన రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు. తరువాత బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఫిరాయించే ప్రయత్నం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.

రోహిత్ రెడ్డి, మరికొందరు ఎమ్మెల్యేలు ఓ ఫాం హౌస్‌లో కొందరు స్వామీజీలతో మాట్లాడుతుండగా సైబరాబాద్ పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడున్న ఎమ్మెల్యేలను పార్టీ మారాలంటూ ఆ స్వామీజీలు ప్రలోభపెడుతున్నారంటూ కేసు నమోదైంది.

తరువాత ఆ కేసు అనేక మలుపులు తిరిగింది కోర్టులకు వెళ్లింది.

రోహిత్, బీజేపీకి చెందిన జాతీయ స్థాయి నేత బీఎల్ సంతోష్‌తో మాట్లాడినట్లుగా చెప్తున్న వీడియోలు కొన్ని బయటకొచ్చాయి.

కొద్దిరోజుల తరువాత రోహిత్ రెడ్డికి వై కేటగిరీ భద్రత కల్పించారు. ఇప్పుడు ఆ కమాండో పోలీసులతోనే ఆయన రీల్స్ చేశారు.

‘‘ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. వ్యక్తిగత భద్రత ఇవ్వడానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ తరువాత వాళ్లు ఏ పనులు చేయాలి? ఏది చేయకూడదు వంటి ప్రోటోకాల్ పెద్దదే ఉంది. గన్‌మెన్ సామాన్లు మోసే వాళ్లు కాదు. బిల్డప్ ఇవ్వడానికీ కాదు. గన్‌మేన్‌గా పనిచేసే వారికి రెగ్యులర్‌గా డ్రిల్ కూడా ఉంటుంది. అంటే ప్రముఖుల భద్రత విషయంలో వారెప్పుడూ అలసత్వంగా ఉండకుండా చేసిన ఏర్పాటు అది. కానీ దురదృష్టవశాత్తూ కొందరు నాయకులు గన్‌మెన్‌ను దర్పం చూపించుకోవడానికి వాడుతున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు గన్ మెన్లను పర్సనల్ సిబ్బందిలాగా వాడతారు’’ అని రిటైర్డ్ ఎస్పీ శ్రీనివాస రావు బీబీసీతో అన్నారు.

పైలట్ రోహిత్ రెడ్డి

ఫొటో సోర్స్, Pilot Rohith Reddy /facebook

‘‘నిజానికి గన్‌మెన్ వీఐపీ భద్రత మాత్రమే చూడాలి. వాళ్లకు మంచినీళ్ల బాటిల్ ఇవ్వడం సహా ఏ పనీ చేయకూడదు. వాళ్లకు వేసిన దండలూ, శాలువాలూ తీసుకోవడం, వాళ్లకు కావాల్సిన వస్తువులు, కాల్ రాగానే ఫోన్ చేతికి అందివ్వడం.. వంటివి నిషేధం.

టీవీ మీడియా వచ్చిన కొత్తలో కొందరు గన్‌మెన్ తాము భద్రతగా ఉన్న వీఐపీలకు షూ తెచ్చి ఇవ్వడం వంటి వీడియోలు కూడా బయటకు రావడంతో అప్పట్లో వివాదాస్పదమైంది.

ఉన్నతాధికారులు గన్‌మెన్లకు ఎప్పటికప్పుడు ఈ విషయంలో మార్గనిర్దేశం చేస్తారు. కానీ మన వ్యవస్థలో వీఐపీలకు పలుకుబడి ఎక్కువ.అందువల్ల ఈ నిబంధనలు అమలు కావు. ప్రతిసారీ అందరిపై చర్యలూ తీసుకోలేరు’’ అన్నారు శ్రీనివాస రావు.

తెలంగాణలో ఎమ్మెల్సీ గన్‌మేన్‌‌కు ఏమైందంటే..

చట్ట ప్రకారం గన్ మెన్లు అంటే వ్యక్తిగత భద్రత సిబ్బంది చిన్న తప్పు చేసినా కఠిన శిక్ష పడిన ఘటనలు తెలంగాణలో కూడా ఉన్నాయి.

2021 మార్చిలో ఎమ్మెల్సీ వాణీదేవి కారును ఆమె గన్‌మెన్ నడిపారు.

అసెంబ్లీ ఆవరణలో కేవలం కారు బయటకు తీయడానికి మాత్రమే ఆయన కారు నడిపారు.

అప్పుడు చిన్న ప్రమాదం జరిగింది.

కానీ నిబంధనల ప్రకారం గన్‌మేన్ కారు నడపకూడదు కాబట్టి అతనిపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

పైలట్ రోహిత్ రెడ్డి

ఫొటో సోర్స్, Pilot Rohith Reddy /facebook

యూపీలో పోలీసుల కోసం సోషల్ మీడియా పాలసీ

ఇక ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి.

2019లో గుజరాత్ లో ఒక స్టేషన్లో టిక్ టాక్ చేసిన లేడీ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నో ఘటనలు నమోదు అయ్యాయి. 2022లో ఉత్తర ప్రదేశ్‌లో ముగ్గురు పోలీసులు హిందీ పాటకు రీల్స్ చేస్తే వారిని సస్పెండ్ చేశారు.

అదే ఏడాది యూపీలోనే మరో లేడీ కానిస్టేబుల్ డబ్‌‌స్మాష్ చేస్తే సస్పెండ్ చేశారు.

దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా పోలీసుల కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా పాలసీ తీసుకువచ్చింది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.

పోలీసులు సోషల్ మీడియాలో ఏం చేయాలి, ఏం చేయకూడదు వంటి పెద్ద జాబితాయే ఉంది అందులో.

ప్రస్తుతానికి రోహిత్ రెడ్డి రీల్ విషయంలో పోలీసులపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఈ అంశంపై వికారాబాద్ ఎస్పీ, పైలెట్ రోహిత్ రెడ్డిల స్పందన తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే, వారు ఈ కథనం ప్రచురించే సమయానికి అందుబాటులోకి రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)