రుషికొండ: బీచ్‌కు వచ్చేవారి నుంచి డబ్బులు వసూలు చేయాలనే ఆలోచన వెనక ఏం జరిగింది?

రుషికొండ బీచ్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

రోజూ సాయంత్రం విశాఖ బీచ్‌లకు జాతరల్ని తలపించేంత జనాలు వస్తుంటారు. ఆర్కే బీచ్ మొదలు భీమిలి వరకు ఉన్న 32 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతంలో బీచ్ పాయింట్లన్నీ ఎంతో సందడిగా కనిపిస్తాయి.

రుషికొండ బీచ్‌ను చూసేందుకు వచ్చే సందర్శకుల దగ్గర రుసుం వసూలు చేయాలని ఆంధ్రప్రదేశ్ పర్యటకశాఖ ఇటీవల ఆలోచన చేసింది.

2023 జులై 11 నుంచి మనిషికి రూ. 20 చొప్పున్న వసూలు చేయాలనే ఆలోచన చేసింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

బీచ్‌లకు వెళ్లే సందర్శకుల నుంచి డబ్బులు వసూలు చేయాలనే ఆలోచన వచ్చిందంటే... అది త్వరలోనైనా మళ్లీ అమలు చేస్తారనే ఆందోళన విశాఖ వాసుల్లో ఉంది.

బీచ్ సందర్శకుల నుంచి డబ్బులు వసూలు చేయాలనే ఆలోచన ప్రభుత్వం ఎందుకు చేసింది? సందర్శకుల ఆందోళనకు కారణమేంటి? ఈ ఆలోచనపై పర్యావరణవేత్తలు ఏమంటున్నారు?

వీడియో క్యాప్షన్, బీచ్‌కు వచ్చేవారి నుంచి డబ్బులు వసూలు చేయాలనే ఆలోచన వెనక ఏం జరిగింది?

టికెట్లు అవసరం లేదన్నారు

విశాఖ బీచ్‌లో చార్జీలు వసూలు చేస్తారనే వార్త టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ప్రజా సంఘాలు ఆందోళనలు కూడా చేశాయి. వీటికి రాజకీయ పార్టీలు మద్దతు కూడా ఇచ్చాయి.

దాంతో పర్యటక శాఖ వెనక్కి తగ్గింది. కానీ వెనక్కు తగ్గిన విషయం పెద్దగా ప్రచారంలోకి రాలేదు.

జులై 14న తెలంగాణ నుంచి రుషికొండ బీచ్‌కు వచ్చిన పర్యటకులు, బీచ్ ఎంట్రీ టికెట్లు ఎక్కడ ఇస్తారు అని అడగటం కనిపించింది. టికెట్లు తీయనవసరం లేదని వీరికి అక్కడి భద్రతా సిబ్బంది చెప్పారు.

“మేం ఇక్కడికి వచ్చేందుకు ప్లాన్ చేసుకునేటప్పుడే బీచ్‌కు వెళ్తే డబ్బులు కట్టాలనే వార్తలు సోషల్ మీడియాలో చూశాను. నిజామా? కాదా? అని టీవీలు, పేపర్లు కూడా చూశాను. దాదాపు అన్నింటిలోనూ ఆ వార్త కనిపించింది. ఇదెక్కడి అన్యాయంరా, దేవుడా అనుకున్నాం. ఆ తర్వాత ప్రభుత్వం చార్జీలు వసూలు చేయడం లేదనే నిర్ణయం తీసుకుందనే విషయం మాకు తెలియదు. పెద్దగా మీడియాలో కూడా కనిపించలేదు” అని తెలంగాణకు చెందిన వనిత బీబీసీతో చెప్పారు.

“మా కుటుంబమంతా రుషికొండ బీచ్‌లో బాగా ఎంజాయ్ చేశాం. డబ్బులు వసూలు చేయలేదు. మేం తిరిగిన అన్ని ప్రదేశాల్లో కంటే తక్కువ ఖర్చైనది ఇక్కడే. ఎందుకంటే ఎటువంటి రుసుం లేదు. అలలతో ఆడుకున్నాం, సరదాగా గడిపాం. పాప్‌కార్న్ తిన్నాం. కానీ ఉచితంగా ప్రకృతిని ఎంజాయ్ చేసే ఇలాంటి చోట్ల డబ్బులు వసూలు చేయాలనే ఆలోచనలు సరైనవి కాదు” అని వనిత అన్నారు.

రుషికొండ బీచ్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘ఆ ఆలోచనే సరికాదు’

రుషి కొండ బీచ్‌కు వెళ్తే చార్జీలు చెల్లించాలని ప్రభుత్వం చేసిన ఆలోచనకు ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ప్రకృతి ఇచ్చిన సంపదపై ప్రభుత్వం డబ్బులు వసూలు చేయడమేంటని సోషల్ మీడియా వేదికగా కొందరు నిలదీశారు. ప్రస్తుతానికి వెనకడుగు వేసినా భవిష్యత్తులో చేయకుండా ఉండాలని కోరుతున్నారు.

“మా ఇంటికి ఎవరైనా వచ్చినా, లేదంటే మా కుటుంబ సభ్యులం కూడా సరదాగా బీచ్‌కు వెళ్తుంటాం. పైసా ఖర్చు లేకుండా గట్టు మీదో, ఇసుకలోనో కూర్చుని సరదాగా కబుర్లు ఆడుకుంటాం. బీచ్‌కు వెళ్తే డబ్బులు కట్టాలని వార్తల్లో చూడగానే ఇదెక్కడి ఘోరం అనిపించింది. ఈ వారం నుంచి ఇక బీచ్‌కు వెళ్లలేమా అని బాధపడ్డాను. అయితే తీసేశారని తెలిసి సంతోషపడ్డాం” అని మద్దిలపాలేనికి చెందిన రామోల సునీత బీబీసీతో అన్నారు.

“కానీ బీచ్ చూడ్డానికి వెళ్తే డబ్బులు వసూలు చేయాలనే ఆలోచనే కరెక్ట్ కాదండి. ఇప్పుడు రుషికొండ బీచుతో మొదలై, ఆ తర్వాత ఒక్కొక్క బీచుకు వసూలు చేస్తారు. అదే జరిగితే జేబులో డబ్బులుంటేనే బీచుకు వెళ్లగలం. అందుకే ఇంకెప్పుడూ బీచులు చూడాలంటే డబ్బులు వసూలు చేయాలనే ఆలోచన చేయవద్దని ప్రభుత్వానికి మేం విజ్ఞప్తి చేస్తున్నాం” అని ప్రభుత్వ అధికారులను సునీత కోరారు.

రుషికొండ బీచ్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

బీచ్‌లో వాకింగ్‌కూ డబ్బులు కట్టాలా: సోహన్ హట్టంగడి

బీచ్ చూడాలంటే డబ్బులు వసూలు చేయాలనే ఆలోచనలు ప్రకృతిని ప్రజలకు దూరం చేస్తాయని పర్యావరణ వేత్త సోహన్ హట్టంగడి బీబీసీతో అన్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఆయన కొన్ని వీడియోలు చేశారు, అధికారులతోనూ ఆయన మాట్లాడారు.

“నేను రోజూ బీచ్‌లో వాకింగ్‌కు వెళ్తాను. దానికి డబ్బులు కట్టాలా? లేదా నేను వాకింగ్ చేయడం మానేయాలా? ప్రతి రోజూ నడక కోసం, కుటుంబంతో సమయం గడిపేందుకు, బర్త్ డే పార్టీలు చేసుకునేందుకు, బాధలు తగ్గించుకునేందుకు, ఆనందాన్ని పంచుకునేందుకు బీచ్‌లకు రావడం చాలా మందికి అలవాటు. కానీ టికెట్ పెడితే ఎవరైనా బాధతో బీచుకు వస్తే రూ. 20 ఇచ్చి ఏడవాలా? ప్రభుత్వం చార్జీలు వసూలు చేయాలనుకోవడం నుంచి వెనక్కి తగ్గడం మంచి నిర్ణయం. అధికారులు నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.” అని సోహన్ బీబీసీతో చెప్పారు.

“సాగరతీరం, పబ్లిక్ పార్కు లాంటి వాటిని ‘కామన్స్ ఏరియా’ అంటారు. ఇక్కడకు ఎవరైనా రావచ్చు. కానీ రావాలంటే డబ్బులు కట్టాలంటే మాత్రం అది ప్రకృతిని సొంతం చేసుకోవడం లాంటిది. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, కొనుక్కుని నాది అని చెప్పుకోడానికి. సాగరం, ప్రకృతి మనిషికి ఇచ్చిన వరం. ఇటువంటి వాటి జోలికి వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత తప్పదు. రుషికొండ విషయంలో అదే కనిపించింది.” అని సోహన్ అన్నారు.

రుషికొండ బీచ్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఏమన్నారు?

విశాఖలో ఆర్కే బీచ్ తర్వాత అత్యధికంగా పర్యటకులు, సందర్శకులు వచ్చేది రుషికొండ బీచ్‌కే. ప్రతి నెలా లక్షన్నర మంది వస్తారని టూరిజం శాఖ లెక్కలు చెప్తున్నాయి.

అధికారుల అంచనా ప్రకారం రూ. 20 ఎంట్రీ ఫీజు పెడితే దాని ద్వారా ఏటా దాదాపు రూ.3 కోట్ల నుంచి రూ. 3.5 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.

ఇక వాహనాల పార్కింగ్ చార్జీలు ఎలాగూ వసూలు చేస్తారు. ఇదంతా రుషికొండ బీచ్ సుందరీకరణ, నిర్వహణకు ఉపయోగపడుతుందని ఆలోచన చేసినట్లు టూరిజం అధికారులు చెప్పారు.

2020 అక్టోబర్ నెలలో రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ బీచ్ సర్టిఫికేషన్ వచ్చింది. ఈ సర్టిఫికేట్ పొందడం కోసం అవసరమైన సదుపాయల కల్పన కోసం టూరిజం శాఖ రూ.7 కోట్లు ఖర్చు చేసింది.

సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ బీచ్ నిర్వహణను ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఆ తర్వాత మళ్లీ ఏపీటీడీసీ పర్యవేక్షించింది. ప్రస్తుతం రెండు, మూడుసార్లు బీచ్ నిర్వహణకు టెండర్లు పిలిచినా ఎవరూ రాలేదు.

బ్లూ ఫ్లాగ్ బీచ్ హోదా నిర్వహణ కష్టతరం కావడంతో ఎంట్రీ టికెట్ ద్వారా రెవెన్యూ వసూలు చేసి, దాని ద్వారా నిర్వహణ ఖర్చులను భరించడం లేదా ధర పెంచి నిర్వహణ టెండర్లు ఆహ్వానించడం లాంటి చర్యలకు టూరిజం శాఖ సిద్ధమైంది.

“బ్లూ ఫ్లాగ్ బీచ్ నిర్వహణ, నిరంతరం అక్కడ సదుపాయల కల్పనకు కొంత చార్జీలు వసూలు చేసేందుకు టూరిజం శాఖ ఆలోచన చేసినట్లు ఉంది. ఇది బీచ్ అభివృద్ధి కోసమే. కాకపోతే ప్రజల వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్వహణ ఖర్చులను టూరిజం శాఖే భరించేందుకు సిద్ధమైంది” అని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో చెప్పారు.

రుషికొండ బీచ్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే..?

తీర ప్రాంత పర్యటక స్థలాలకు పర్యటకుల భద్రత, కాలుష్య రహిత పరిసరాలు, సముద్ర నీటి నాణ్యత లాంటి 33 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేట్‌ ఇస్తారు. విశాఖ రుషికొండ బీచ్‌కు కూడా ఈ సర్టిఫికేషన్ ఉంది.

డెన్మార్క్‌లోని పర్యావరణ అధ్యయన సంస్థ 'ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్' బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను అందజేస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఫాగ్ సర్టిఫికేషన్ ఉన్న ఏకైన బీచ్ రుషికొండ.

“రుషికొండ బీచ్‌లో బీచ్ క్లీనర్లు, లైఫ్ గార్డులు, సెక్యూరిటీ సిబ్బంది ఇలా దాదాపు 40 మంది వరకు పని చేస్తున్నారు. వీరి జీత భత్యాలతో పాటు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌కు అనుగుణంగా పరిసరాల శుభ్రత, టాయిలెట్ల నిర్వహణ లాంటి వాటి కోసం అదనపు ఖర్చు అవుతుంది. ఇక్కడ వస్తున్న ఆదాయంతో పోలిస్తే పెడుతున్న ఖర్చు ఎక్కువ. దీంతో టికెట్ల ద్వారా కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చునని ఈ ఆలోచన చేశాం” అని టూరిజం శాఖ ఉద్యోగి ఒకరు చెప్పారు.

రుషికొండ బీచ్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

అలా చేస్తే ప్రమాదకరమే: ప్రొఫెసర్ సీతారత్నం

మనిషికి సాగరానికి విడదీయ రాని సంబంధం ఉంటుందని, ఇలాంటి ఫీజు వసూలు నిర్ణయాలతో ఆ సంబంధానికి విఘాతం కలిగే ప్రమాదం ఉంటుందని రచయిత్రి, ఏయూ తెలుగు విభాగం ప్రొఫెసర్ సీతారత్నం బీబీసీతో అన్నారు.

‘‘చార్జీలు వసూలు చేస్తే.. పర్యటకులు, సందర్శకులు ప్రమాదాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే చార్జీలు కట్టలేకో, కట్టడం ఇష్టం లేకో అధికారిక ఎంట్రీ పాయింట్ల నుంచి కాకుండా సమీపంలో ఉండే వేరే దారుల్లో వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అక్కడ ఏదైనా ప్రమాదం జరగవచ్చు. పైగా ప్రకృతి వరమైన సాగరానికి వెళ్లకుండా ఆపడం ప్రకృతి నుంచి మనిషిని విడదీయమే అవుతుంది. ప్రకృతి ప్రసాదించిన దానికి డబ్బులు కట్టడమేంటి’’ అని సీతారత్నం ప్రశ్నించారు.

‘‘ఇప్పటివరకు విశాఖలో ఉన్న ఏ బీచ్ వద్దనైనా అదనంగా సౌకర్యాలు వాడుకుంటే అంటే వాహనాల పార్కింగ్, స్నానపు గదుల వినియోగం, బోటు షికారు ఇలాంటి వాటికి చార్జీలు వసూలు చేస్తున్నారు. కానీ బీచ్‌కు వెళ్లేందుకే చార్జీలు కట్టాలంటే చాలా కష్టమైన విషయం. విశాఖలో ముఖ్యమైన ఆర్కే బీచ్, తొట్లకొండ, అప్పికొండ, భీమిలి ఇలా ఏ బీచులో లేని చార్జీలు బ్లూ ఫ్లాగ్ పేరుతో రుషికొండలో పెట్టాలని చూడటం దారుణం’’ అని సోహన్ హట్టంగడి వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం సాగరానికి ఏమైనా యాజమానా అని ఆయన ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)