పిల్లలే పుట్టరనుకున్న ఆ నటికి సాధారణ గర్భం, ఎలా సాధ్యమైంది

దెబీనా దంపతులు

ఫొటో సోర్స్, INSTAGRAM/DEBINA BONNERJEE

    • రచయిత, రవి ప్రకాష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

టీవీ నటి దెబీనా బెనర్జీ తన రెండో కుమార్తె దివిషాను 'మిరాకిల్ బేబీ' అని పిలుస్తున్నారు. తన రెండో గర్భాన్ని నమ్మలేకపోతున్నానని దెబీనా బెనర్జీ చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. దివిషా పుట్టుక ఆమెకు ఒక అద్భుతం.

వాస్తవానికి 2022 ఏప్రిల్‌లో ఆమె మొదటి కుమార్తె లియానా ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) సాంకేతికతతో జన్మించింది.

కొన్ని నెలల తర్వాత ఆమె రెండోసారి గర్భవతి అయింది. ఈ గర్భం పూర్తిగా సాధారణమైనది.

మొదటి కూతురు పుట్టిన ఏడు నెలలకే ఆమె రెండో కుమార్తెకు జన్మనిచ్చారు. ఇది ప్రీ మెచ్యూర్ డెలివరీ.

ఇప్పుడు తన భర్త గుర్మీత్ చౌధరి, ఇద్దరు కుమార్తెలతో సంతోషంగా జీవిస్తున్నారు దెబీనా.

నోయిడాలో ఉంటూ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఓ జంట పెళ్లయిన పదేళ్ల తర్వాత ఐవీఎఫ్ టెక్నాలజీని ఆశ్రయించారు.

ఐవీఎఫ్ ద్వారా మొదటి బిడ్డ పుట్టిన రెండేళ్ల తర్వాత మరోసారి ఈ జంట తల్లిదండ్రులు అయ్యారు. ఈ సారి మాత్రం సాధారణ గర్భమే.

రెండోసారి తల్లి అయినందుకు మిథాలీ (పేరు మార్చాం) ఆనందాన్ని వ్యక్తం చేశారు.

"ఐవీఎఫ్ తర్వాత మళ్లీ అలాగే చేయించుకోవాల్సి ఉంటుందని అనుకున్నాం. అయితే సాధారణ గర్భం సాధ్యమవుతుందని వైద్యులు హామీ ఇచ్చారు, అదే జరిగింది." అని ఆమె అన్నారు.

సరోగసీ, ఐవీఎఫ్ పద్ధతులలో చికిత్స చేస్తున్న వైద్యులు కూడా ఐవీఎఫ్ కాన్పు తర్వాత సాధారణ గర్భాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని నమ్ముతున్నారు.

గర్భం

ఫొటో సోర్స్, PA

వైద్యులు ఏమంటున్నారు?

ఐవీఎఫ్‌ ద్వారా గర్భం దాల్చిన వారు ప్రతిసారీ ఇదే పద్ధతిని ఉపయోగించాల్సిన అవసరం లేదని రాంచీకి చెందిన డాక్టర్ రూపశ్రీ పురుషోత్తం చెబుతున్నారు.

ఇక్కడ చాలామంది మహిళల రెండో గర్భం పూర్తిగా సాధారణమైనది, వారి పిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

"ఐవీఎఫ్‌ తర్వాత మేం సాధారణ గర్భధారణ కేసులను చూస్తుంటాం, ఇది సాధారణం. వాస్తవానికి లేటు వయసులో వివాహం కారణంగా లేదా కొన్ని సందర్భాల్లో వైద్య కారణాల వల్ల గర్భం దాల్చకపోవచ్చు. అప్పుడు వారు ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చడానికి మా వద్దకు వస్తారు. మొదటి బిడ్డ పుట్టిన తర్వాత, వారిలో ఒత్తిడి తగ్గిపోతుంది. వారు సంతోషంగా ఉంటారు. దీంతో సాధారణ గర్భధారణకు అవకాశాలు పెరుగుతాయి'' అని బీబీసీతో డాక్టర్ రూపశ్రీ పురుషోత్తం అన్నారు.

“లేటు వయసులో సంతానం లేని స్త్రీలు సాధారణంగా థైరాయిడ్, రక్తపోటు, మధుమేహం, ఒత్తిడితో బాధపడుతున్నట్లు చెబుతారు.

దీంతో ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన తర్వాత, వారు రెండో బిడ్డ కోసం కూడా ఐవీఎఫ్‌నే ఆశ్రయిస్తారు.

కాబట్టి వీళ్లలో ఐవీఎఫ్ తర్వాత నార్మల్ డెలివరీ రేటు కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే, వారు ఆరోగ్యంగా ఉంటే రెండోసారి 'సాధారణ గర్భం' వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి" అని రూపశ్రీ తెలిపారు.

గర్భం

ఫొటో సోర్స్, Getty Images

ఇలా ఎందుకు జరుగుతుంది?

ప్రతి ఐదుగురిలో ఒకరు ఐవీఎఫ్ కంటే ముందు గర్భం దాల్చిన తర్వాత సాధారణ పద్ధతిలోనే రెండోసారి గర్భవతి అయ్యామని ఓ పరిశోధనలో తెలిపారు.

వీరిలో చాలామంది మహిళలు మొదటి సారి గర్భం దాల్చిన మూడేళ్లలోపు రెండోసారి గర్భం దాల్చి పిల్లలకు జన్మనిచ్చారు.

ఈ పరిశోధనా పత్రం గత నెల (జూన్ 21) 'హ్యూమన్ రిప్రొడక్షన్' అనే పరిశోధనా పత్రిక (జర్నల్)లో ప్రచురించారు.

ఇంగ్లాండ్‌లో మొదటి ఐవీఎఫ్ గర్భం తర్వాత రెండోసారి 'సాధారణ గర్భం' దాల్చిన 22 మంది మహిళలతో ఇంటర్వ్యూలు కూడా అందులో ఉన్నాయి.

ఇప్పుడు ఈ గణాంకాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయి.

నలుగురు వైద్యుల బృందం 1980 నుంచి 2021 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల మందికిపైగా మహిళలపై నిర్వహించిన 11 పరిశోధనలను అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయాన్నిపేర్కొంది.

యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లోని ఈజీఏ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఉమెన్స్ హెల్త్‌కి చెందిన డాక్టర్ అన్నెట్ త్వైట్స్ నేతృత్వంలోనిదీ బృందం.

ఈ బృందంలో డాక్టర్ అన్నెట్ త్వైట్స్‌తో పాటు డాక్టర్ జెన్నిఫర్ హాల్, డాక్టర్ జూడిఫ్ స్టీఫెన్‌సన్, డాక్టర్ జెరాల్డిన్ బారెట్ సభ్యులుగా ఉన్నారు.

ఈ నివేదికతో ఏకీభవిస్తూ ఐవీఎఫ్ తర్వాత దాదాపు 20 శాతం మంది మహిళలు సహజంగా గర్భం దాల్చవచ్చని దిల్లీలో 'ఫెమినిస్ట్' పేరుతో ఐవీఎఫ్ క్లినిక్‌ని నడుపుతున్న డాక్టర్ సౌజన్య అగర్వాల్ చెప్పారు.

“స్త్రీల ట్యూబ్‌‌లు బ్లాక్‌ అయినపుడు లేదా భర్త స్పెర్మ్ కౌంట్ సరిగ్గా లేనప్పుడు మాత్రమే ఐవీఎఫ్ పరిస్థితి తలెత్తుతుంది. లేదా ఇద్దరిలో కొన్ని సమస్యలు ఉన్నా ఐవీఎఫ్ ఆశ్రయించొచ్చు. ఈ గర్భధారణ సమయంలో ఇలాంటి సమస్యలు దూరమవుతాయి'' అని సౌజన్య అగర్వాల్ అన్నారు.

అయితే, ఐవీఎఫ్ చేయించుకునే చాలామంది మహిళలు తదుపరిసారి కూడా ఐవీఎఫ్ అవసరమో లేదో తెలుసుకోవాలనుకుంటారని సౌజన్య అగర్వాల్ చెప్పారు.

“ వాళ్లు మమ్మల్ని అదే విషయం అడుగుతుంటారు. ఇది కేసు నుంచి కేసుకు మారుతూ ఉంటుంది. మేం అనేక పరీక్షలు చేస్తాం. అన్ని పరీక్షల్లో ఫలితాలు సాధారణమైతే, రెండోసారి గర్భం వచ్చే అవకాశాలు ఉన్నాయి'' అని తెలిపారు.

అన్ని ఫలితాలు సాధారణంగానే ఉన్నా ఐవీఎఫ్ పరిస్థితి ఎందుకు వస్తుంది అనే ప్రశ్నకు సౌజన్య అగర్వాల్ సమాధానమిస్తూ “ అన్నీ బాగున్నా కూడా కొంతమంది మహిళలు గర్భం దాల్చలేరు. వైద్య పరిభాషలో మేం దానిని వివరించలేని వంధ్యత్వం అని పిలుస్తాం. ఈ సందర్భాలలో కూడా రెండోసారి సాధారణ గర్భం వచ్చే అవకాశాలు ఉన్నాయి'' అని అన్నారు.

ఐవీఎఫ్ ఎప్పుడు మొదలైంది?

ఐవీఎఫ్ సాంకేతికత 1978లో అమలులోకి వచ్చింది. ఈ టెక్నాలజీతో ప్రపంచం మొత్తం మీద ఇప్పటివరకు కోటి మందికి పైగా పిల్లలు జన్మించారని అంచనా.

ఐవీఎఫ్ కంటే ముందు, గర్భం దాల్చిన తర్వాత సాధారణ గర్భం గురించి చాలా పరిశోధనలే జరిగాయి.

వీడియో క్యాప్షన్, ‘‘నాకు ఎవరెస్ట్ ఎక్కడం కన్నా ఛావుపడీయే కష్టమని అర్థమవుతోంది’’

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)