హిందూ మహాసముద్రంలో నౌకలకు ఆ 'పాయింట్' వద్ద ఒక వింత అనుభవం ఎదురవుతుంది... ఎందుకు?

నౌక

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆలిస్ హెర్నాండెజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భూమిపై అత్యంత 'లోతైన ప్రదేశం' ఎక్కడుందో తెలుసా? హిందూ మహాసముద్రంలో.

ఈ ప్రాంతంలో భూమి గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది? దీనికి ఇద్దరు భారతీయ పరిశోధకులు శాస్త్రీయంగా బదులిచ్చారు.

పాఠశాలలో మనం నేర్చుకున్నదాని ప్రకారం, భూమి గుండ్రంగా ఉంది, నిజానికి, దాని ధ్రువాలు బల్లపరుపుగా ఉంటాయి. అలాగే, భూమి గురుత్వాకర్షణశక్తికి కేంద్ర స్థానానికి లాగే వేగం సెకనుకు 9.8 మీటర్లు.

బంగాళాదుంప ఆకారంలో కనిపించే భూమి మీది ద్రవ్యరాశి ప్రదేశాన్ని బట్టి మారుతుంది.

అంతేకాదు, ఒక చోటుకు, మరో చోటుకు మధ్య గురుత్వాకర్షణలో కూడా మార్పు ఉంటుంది. అది ఆ ప్రాంతంలోని ద్రవ్యరాశిని బట్టి మారుతుంది.

కొన్ని ప్రదేశాలు సగటు కంటే తక్కువ లేదా ఎక్కువ గురుత్వాకర్షణ కలిగి ఉండవచ్చు.

భూ గ్రహం

ఫొటో సోర్స్, THAT

గురుత్వాకర్షణ రంధ్రంలో వస్తువులు పడతాయా?

ఈ విషయాల గురించి మాట్లాడేటప్పుడు మనం, 'గురుత్వాకర్షణ రంధ్రం' గురించి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

ఈ లోతైన ప్రదేశంలో గురుత్వాకర్షణలో ఎక్కువ తేడా ఉంటుంది.

భౌగోళిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన ఒవిడో విశ్వవిద్యాలయానికి చెందిన గాబ్రియేలా ఫెర్నాండెజ్ వీజో, "ఇది భూమిపై అత్యంత ముఖ్యమైన ప్రదేశం" అని చెప్పారు.

అయితే, సాధారణ రంధ్రం లేదా లోయలో పడినట్లు వస్తువులు దీనిలో పడవని అంటున్నారు. ఈ రంధ్రం కనిపించదని వారు చెబుతున్నారు.

దశాబ్దాల క్రితం అక్కడ ప్రయాణించిన నౌకలు ఈ ప్రదేశంలో వింత అనుభవాన్ని ఎదుర్కొన్నాయి. ఆ ప్రాంతంలో గురుత్వాకర్షణలో మార్పును గుర్తించాయి. తరువాత ఉపగ్రహాలు దానిని ధ్రువీకరించాయి.

కానీ, భూమిలోని ఆ రంధ్రానికి కారణం చెప్పలేకపోయారు. అయితే, ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని వివరణలు అందుబాటులోకి వచ్చాయి.

గురుత్వాకర్షణ రంధ్రం

ఫొటో సోర్స్, THAT

ఫొటో క్యాప్షన్, గురుత్వాకర్షణ రంధ్రం ఉన్న ప్రాంతం చూపించే మ్యాప్

30 లక్షల చదరపు కిలోమీటర్ల 'రంధ్రం'

ఈ రంధ్రం సముద్ర ఉపరితలం నుంచి 105 మీటర్ల లోతులో ఉంది.

దీని వైశాల్యం 30 లక్షల చదరపు కిలోమీటర్లు. దీనిని ఇండియన్ ఓషన్ జియోయిడ్ లా (IOGL) అంటారు.

భూమిపై అతి తక్కువ గురుత్వాకర్షణను ఇక్కడ కనుగొన్నారు.

తక్కువ ద్రవ్యరాశి ఉన్న చోట గురుత్వాకర్షణ తక్కువగా ఉంటుందని మనకు పాఠశాలలో నేర్పించారు.

హిందూ మహాసముద్రంలోని ఈ రంధ్రం అతి తక్కువ గురుత్వాకర్షణ కలిగి ఉంటుంది. అయితే, ఎందుకు అలా?

భూగోళ శాస్త్రవేత్తలు దీనికి భిన్నమైన వివరణలు ఇస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

'పెను అగ్ని ప్రమాదం'

''మన వద్ద ఉన్న సిద్ధాంతాల ప్రకారం రెండు కాంటినెంటల్ ప్లేట్లు ఢీకొన్నప్పుడు వాటిలో ఒకటి మరొకదాన్ని కిందకి నెట్టివేస్తుంది, దీంతో దాని ద్రవ్యరాశి తగ్గుతుంది" అని ఫెర్నాండెజ్ చెప్పారు.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం 25 కోట్ల సంవత్సరాల క్రితం పురాతన గోండ్వానా ఖండం, లారేషియా ఖండం ఒకదానికొకటి ఢీకొనడం వల్ల ఈ రంధ్రం ఏర్పడింది. ఆ తర్వాత హిందూ మహాసముద్రంగా మారింది. కానీ, ఈ వివరణ హిందూ మహాసముద్రంలో ఖగోళపరమైన మార్పులను గమనించిన పరిశోధనలకు సంతృప్తికరంగా తోచలేదు.

అయితే, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన దీపంజన్ పాల్, ఆత్రేయి ఘోష్ దీనిపై మరో రకమైన వివరణ ఇచ్చారు.

అందుకోసం, వారు గత 14 కోట్ల సంవత్సరాలలో భూమిపై సంభవించిన మార్పులపై కంప్యూటర్ సాయంతో 19 భౌగోళిక అంచనా నమూనాలను రూపొందించారు.

భూ ఉపరితలం వద్ద గురుత్వాకర్షణ, ఉష్ణోగ్రత, ఖండాంతర పలకలు విడిపోవడానికి పట్టే సమయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

ఆ విధంగా ఇరువురు అందించిన 19 నమూనాలలోని ఆరు నమూనాలు శాస్త్రీయంగా కనిపించాయి.

గురుత్వాకర్షణ రంధ్రం

ఫొటో సోర్స్, Getty Images

భారతీయ పరిశోధకుల వివరణ

భారతీయ పరిశోధకుల వివరణ కూడా గోండ్వానా ఖండం నుంచి ఇండియన్ కాంటినెంట్ విడిపోవడం వల్లే హిందూ మహాసముద్రం ఏర్పడిందని ధ్రువీకరిస్తోంది. అదే నిజమైతే, మరి ఆఫ్రికా సంగతేంటి?

చల్లటి టెథిస్ సముద్రం తూర్పు ఆఫ్రికా వైపు కదిలి, అక్కడ కింది భాగంలో వేడి శిలాద్రవాన్ని ఢీకొంది. ఫెర్నాండెజ్ ప్రకారం ఇది ఆ సమయంలో అత్యంత భారీ అగ్నిప్రమాదం.

వేడి, చల్లని భాగాలు ఢీకొన్నప్పుడు కంపనం ఏర్పడింది. ఈ సంఘటన భారీ భౌగోళిక పొరలు ఏర్పడటానికి కారణమైంది. ఈ కారణంగానే హిందూ మహాసముద్రంలో కొంత భాగం తక్కువ సాంద్రత, తక్కువ గురుత్వాకర్షణ కలిగి ఉందని భారతీయ పరిశోధకుల నివేదిక తెలిపింది.

ఫెర్నాండెజ్ ప్రకారం ఈ వివరణ మరింత సముచితమైనది. ఎందుకంటే ఇది భౌగోళిక చరిత్ర, గణిత డేటా, జియోలాజికల్ కంప్యూటర్ నమూనాలను పరిగణనలోకి తీసుకుని చేసిన విశ్లేషణ.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)