అమెరికా: అత్యంత ధనిక దేశంలో బాలకార్మికులు ఎందుకు పెరుగుతున్నారు?

- రచయిత, మారియాన సాంచెజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పధ్నాలుగేళ్ల మేరీ (అసలు పేరు కాదు)కి క్లాస్‌లో నిద్ర ఆపుకోవడం పెద్ద సమస్య. అమెరికాలోని నెబ్రస్కా రాష్ట్రానికి చెందిన వాల్‌నట్ మిడిల్ స్కూల్‌లో చదువుతున్న ఆమె, చాలా సందర్భాల్లో క్లాసులను మిస్సవుతుంటుంది. దీనికి ఆమె కుర్రతనపు చేష్టలో, తప్పుడు నడవడికో కారణం కాదు.
గ్వాటెమాల నుంచి వచ్చిన ఆ బాలిక కుటుంబం వారంలో ఐదు నుంచి ఆరు రోజుల పాటు సాయంత్రం 11 నుంచి ఉదయం 5 వరకు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. మాంసం ప్యాకింగ్ చేసే ప్లాంట్‌లో యంత్రాలను శుభ్రం చేయడం, జంతు కళేబరాలను, మాంసం ముక్కలను ఏరివేయడం వారి విధి.
ఒక్కోసారి ఆమె పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ప్లాంట్ లో వాడే ఇండస్ట్రియల్ బ్లీచ్ లాంటి రసాయన పదార్ధాల నుంచి వచ్చే వాయువులను పీల్చి అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితితులు కూడా వస్తాయి.
గ్రాండ్ ఐలాండ్‌లోని ఫ్యాక్టరీలో మేరీలాంటి 31 మంది మైనర్‌లతో నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో పని చేయిస్తున్నారని అధికారులు నిర్వహించిన తనిఖీల్లో తేలింది. వీరందరినీ ప్యాకర్స్ శానిటేషన్ సర్వీసెస్ అనే సంస్థ హైర్ చేసుకుంది.
‘‘మేం ఆ వర్కర్లను ప్రశ్నించినప్పుడు వాళ్లు సమాధానం చెప్పడానికి తటపటాయించారు. తరచూ తమ సూపర్‌వైజర్ల వైపు భయం భయంగా చూశారు’’ అని అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ షానాన్ రెబెల్లెడో చెప్పారు. ‘‘మేం ఆరా తీసినప్పుడు వీరిలో చాలామంది మైనర్లని తేలింది’’ అని ఆమె కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.
ఇలా అమెరికాలోని 8 రాష్ట్రాలలో 102 మంది మైనర్లను ప్యాకర్స్ శానిటేషన్ సర్వీసెస్ సంస్థ నియమించుకుందని అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ తన ఆరోపణల్లో పేర్కొంది. ఇందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సంస్థకు 1.5 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 12.5 కోట్లు ) జరిమానా విధించింది.
‘‘వీరందరినీ ప్రమాదకరమైన రసాయనాలు వాడే మాంసం ప్రాసెసింగ్ యూనిట్లో పని చేయించినందుకు’’ ఈ జరిమానా విధించింది. ప్యాకర్స్ శానిటేషన్ సర్వీసెస్ కుదుర్చుకున్న ఉద్యోగుల్లో కనీసం ముగ్గురు రసాయనాల బారిన పడి అస్వస్థతకు గురైనట్లు అధికారులు గుర్తించారు. కానీ మేరీలాంటి కేసులు ఇవాళ కొత్తేమీ కాదు.
ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో అమెరికా ఒకటన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ, అక్కడ కూడా చైల్డ్ లేబర్ ( బాల కార్మిక వ్యవస్థ) ఉదంతాలు భారీగా ఉన్నట్లు తేలింది. ఒక్క 2022 సంవత్సరంలోనే 4,000 మైనర్లతో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయిస్తున్నట్లు లేబర్ డిపార్ట్ మెంట్ గుర్తించింది.
2013లో లేబర్ డిపార్ట్‌మెంట్ 1,400 మంది మైనర్‌లు పనుల్లో ఉన్నట్లు తనిఖీల ద్వారా గుర్తించింది. ఆ తర్వాత ఇంత పెద్ద స్థాయిలో మైనర్లను చెకింగుల్లో గుర్తించడం గత సంవత్సరమే మొదటిసారి.
అమెరికాలో మైనర్ బాలబాలికలతో పనులు చేయించే ధోరణి గత కొన్ని దశాబ్ధాలుగా పెరుగుతున్నట్లు ఈ రంగంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు.
‘‘నా కెరీర్‌లో గత 30 సంవత్సరాలుగా నేను పేదదేశాల్లో చైల్డ్ లేబర్ వ్యవస్థపై పనిచేశాను. కానీ, ఈ దశలో అమెరికాలోని బాలకార్మిక వ్యవస్థపై దృష్టిసారించే పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఆశ్చర్యం అనిపిస్తోంది’’ అని ప్రొఫెసర్ ఎరిక్ ఎడ్మండ్ బీబీసీతో అన్నారు. ప్రొఫెసర్ ఎడ్మండ్ ఒక ఎకనమిస్ట్.

మారుతున్న చట్టాలు
బాల కార్మికులతో పని చేయించుకునే విషయంలో యజమానులకు అనేక ఆప్షన్లు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లోని చట్టం ప్రకారం మైనర్‌లకు పెద్దలకు ఇచ్చే వేతనంలో కనీసం సగం చెల్లిస్తే అనుమతిస్తుంది.
వాషింగ్టన్‌లోని ప్రొఫెషనల్ లాబీ గ్రూపుల నుంచి మద్ధతు సంపాదించిన ఈ విధానాన్ని అనుసరించాలా వద్దా అనే అంశంపై ఇతర రాష్ట్రాలు కూడా ఆలోచిస్తున్నాయి.
అయోవా రాష్ట్రంలో బాల కార్మిక చట్టాలలో మార్పులు ఈ జులై 1 నుంచి అమలులోకి వచ్చాయి. టీనేజర్స్ చేయదగిన ఉద్యోగాలు, పని గంటలను పెంచడానికి ఇది అవకాశం కల్పించింది. బాల కార్మికుల విషయంలో సమాఖ్య ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తాజాగా చట్టాలను ఆమోదించిన రాష్ట్రంగా అయోవా ముందు వరసలో నిలిచింది.
అయితే మేలో వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పని చేసే థింక్‌ట్యాంక్ ఎకనామిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ చేసిన సర్వేలో అమెరికాలోని 50 రాష్ట్రాలలో కనీసం 14 రాష్ట్రాలు బాల కార్మిక వ్యవస్థకు అడ్డంకులను తొలగించే ప్రయత్నాలు చేశాయి. ఎనిమిది రాష్ట్రాలు ఇప్పటికే ఇలాంటి చట్టాలను ఆమోదించాయి.
ఈ చట్టాలు 14 ఏళ్ల పిల్లలను ఆరు గంటలపాటు రాత్రి షిఫ్టులలో పని చేయించుకోవడానికి, ఇండస్ట్రియల్ లాండ్రీ లాంటి పెద్దపెద్ద పనుల్లో పని చేయించడానికి అవకాశం కల్పిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో టీనేజర్లు (16వ ఏట నుంచి) ప్రమాదకరమైనా, శారీరక శ్రమ అధికకంగా ఉండే కూల్చివేత పనులు, మాంసం ప్యాకింగ్ లాంటి ఉద్యోగాలు చేయవచ్చు. బార్‌లలో మద్యం సరఫరా చేసేందుకు అనుమతిస్తున్నా, వారు మద్యం కొనడానికి మాత్రం 21 ఏళ్లు రావాల్సిందే.
అయితే, ఈ చట్టాలు ఫెడరల్ చట్టాలతో ( సమాఖ్య ) విభేదిస్తుంటాయి. 14, 15 సంవత్సరాల వయసున్న బాలబాలికలతో పాఠశాల పని వేళల్లో కేవలం 3 గంటలే పని చేయించుకోవాలని, సాయంత్రం 7 దాటిన తర్వాత పని చేయించుకోవద్దని సమాఖ్య చట్టాలు చెబుతున్నాయి.
ప్రమాదకరమైన పనులైన మైనింగ్, నిర్మాణరంగం, ఫుడ్ ప్యాకింగ్, రోడ్ల నిర్మాణం వంటి రంగాలలో 16, 17 సంవత్సరాల వయసున్న పిల్లలు పనిచేయడం ప్రమాదకరమని ఫెడరల్ చట్టం పేర్కొంటొంది.

‘ఇది 19వ శతాబ్ధం కాదు’
దేశంలో బాలకార్మిక వ్యవస్థకు సంబంధించిన అధికారిక గణాంకాలు లేకపోవడంతో ఈ వ్యవస్థ ఎంత ప్రబలంగా ఉందో చెప్పే పరిస్థితి లేదు.‘‘ దేశంలో 16 ఏళ్ల లోపు పిల్లలు పనులకు వెళుతున్న ఘటనలు లేవని భావించడంతో 1970ల నుంచి బాలకార్మికులకు సంబంధించిన డేటా సేకరణను నిలిపేశారు’’ అని ప్రొఫెసర్ ఎడ్మండ్ వెల్లడించారు.
అయితే, కంపెనీల దగ్గరున్న డేటా, ప్రభుత్వం నిర్వహించే తనిఖీలు ఈ వ్యవస్థ తీవ్రతను చెప్పగలవు. ఈ రంగంలో రానురాను పెరుగుదల కనిపిస్తోందని గణాంకాలు కూడా సూచిస్తున్నట్లు అధికారులు అంగీకరిస్తున్నారు.
2018తో పోల్చితే గత సంవత్సరం బాల కార్మికులు 69% పెరిగినట్లు రిపోర్టులు రావడంతో అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లోనే కనీసం 600 చోట్ల తనిఖీలు చేసినట్లు ప్రకటించింది.
ఫిబ్రవరిలో దొరికిన ఒక కేసు ప్రకారం, 100 మందికి పైగా వలస వచ్చిన పిల్లలు పనులు చేస్తూ దొరికారు. వీరిలో 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు చాలామంది ఉన్నారు. వీరంతా పలు రాష్ట్రాలలో కబేళాలను శుభ్రం చేసే పనిలో ఉన్నారు.
"ఇది 19వ శతాబ్దపు సమస్య కాదు, నేటి సమస్య, మనందరం ఆలోచించాల్సిన సమస్య’’ అని అప్పటి లేబర్ సెక్రటరీ మార్టీ వాల్ష్ ఫిబ్రవరి 27న ప్రచురించిన ఒక ప్రకటనలో తెలిపారు.

కార్మికుల కొరత
అమెరికన్ సమాజంలో ఏర్పడిన కొన్ని సామాజిక పరిణామాలు ఆర్ధికంగా బలహీనస్థితిలో ఉన్న పిల్లలతో పనులు చేయించుకోవడానికి యజమానులను పురికొల్పింది. అమెరికాలో నిరుద్యోగిత దాదాపు లేదు. ఏప్రిల్‌లో విడుదలైన డేటా ప్రకారం దేశంలో నిరుద్యోగిత 3.4 శాతం ఉంది.
గత ఐదు దశాబ్ధాలలో నమోదైన అతి తక్కువ నిరుద్యోగితా శాతం ఇది. జూన్‌లో సుమారు మూడున్నర లక్షల కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి.
దీంతో ఇప్పుడు అమెరికాలో ఖాళీ అయిన ఉద్యోగాలను పూరించడం యజమానులకు కష్టంగా మారింది. వేతనాలు కూడా గత సంవత్సరంలో ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ రేటుతో పెరుగుతున్నాయి. ఇవన్నీ కార్మికుల కొరతకు అద్దం పడుతున్నాయి.
మెక్సికో నుంచి సరిహద్దుల వద్ద వలసలను నిరోధించడంతో కార్మికుల కొరత కూడా బాగా పెరిగింది.

వలసల పెరుగుదల
అమెరికా చట్టాల ప్రకారం తల్లిదండ్రులు లేకుండా పిల్లలు, టీనేజర్లు దేశంలోకి వస్తే వారిని దేశం నుంచి బహిష్కరించరు. దీంతో అమెరికాకు వలస వచ్చే చిన్నారుల సంఖ్య భారీ ఎత్తున పెరిగింది. 2021లో ఇలా సరిహద్దు దాటి వచ్చిన దాదాపు 1.39 లక్షల మంది మైనర్‌లను అమెరికా అదుపులోకి తీసుకుంది. 2022లో ఇలా 1.28 లక్షల మంది వచ్చారు.
ఇలాంటి వారిని మొదట మైగ్రేషన్ ఏజెంట్లకు అప్పగిస్తారు. తర్వాత వారిని గరిష్టంగా 72 గంటలపాటు డిటెన్షన్ సెంటర్లలో ఉంచుతారు. ఆ తర్వాత వారిని షెల్టర్లకు తరలిస్తారు. ఫెడరల్ ప్రభుత్వమే వారికి ఆహారం, ఆరోగ్యం, విద్య లాంటి సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది.
30 రోజులలోగా వారిని స్పాన్సర్‌షిప్ మీద విడుదల చేస్తారు. వీలైతే తల్లిదండ్రులకు లేదంటే కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, పరిచయస్తులకు అప్పగిస్తారు.
2021లో 12%మంది, 2022లో 14%శాతం మందికి కుటుంబంతో సంబంధం లేని స్పాన్సర్‌షిప్‌లు, లేదంటే దూరపు బంధువులకు అప్పగించారు. ఇలా పిల్లలు బయటకు వచ్చాక వారు ఏం చేస్తారో ప్రభుత్వానికి తెలియదని చిల్డ్రన్ మైగ్రేషన్ అడ్వోకేట్‌లు బీబీసీతో అన్నారు.
‘‘ఈ పిల్లలు సాధారణంగా పేద కుటుంబాలకు చెందినవారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా అమెరికాలో అడుగుపెడతారు. వారిలో మూడింట రెండువంతుల మంది కార్మికులుగా మారినా ఆశ్చర్యం లేదు’’ అని పిల్లల సంరక్షణ వ్యవహారాలలో లాయర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి చెప్పారు. ఆయన తన పేరును ప్రచురించడానికి ఇష్టపడలేదు.
దీనిపై స్పందించాల్సిందిగా అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్‌ను బీబీసీ సంప్రదించగా అటువైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

పిల్లలే టార్గెట్
ఇలాంటి బాలబాలికలు కొన్ని ప్రత్యేక పరిశ్రమల వారికి టార్గెట్‌గా మారారని కొందరు నిపుణులు బీబీసీకి చెప్పారు.
‘‘కార్మికులకు పెరుగుతున్న డిమాండ్ నిజమే అయినా, కేవలం దీనివల్లే బాల కార్మికుల చట్టాల ఉల్లంఘనల్లో పెరుగుదల కనిపించడంలేదు. ఈ పెరుగుదలకు కారణం కార్పొరేట్ సంస్థల దురాశ, లాబీయిస్టులు, వారికి మద్ధతుగా నిలుస్తున్న రాజకీయ నాయకులు. బలహీనంగా ఉన్న శ్రామికుల శ్రమను దోచుకోవడానికి, వీలైనంత తక్కువ ఖర్చుతో కార్మికులను సంపాదించడానికి యజమాన్యాలు ప్రయత్నించడం" అని మిచిగాన్ విశ్వవిద్యాలయ లా స్కూల్‌లో ప్రొఫెసర్ చావి కీనీ నానా అన్నారు.
ఆమె వలస కార్మికుల అక్రమ రవాణా వ్యవహారాలపై పని చేస్తుంటారు.
ఇటీవలి సంవత్సరాలలో సరిహద్దులో అనాథలైన మైనర్‌ల సంఖ్య అనూహ్యంగా పెరగడం, అదే సమయంలో బాల కార్మిక చట్టాల ఉల్లంఘనల కేసులు పెరగడం యాదృచ్చికం కాదని ప్రొఫెసర్ నానా అంటున్నారు.
సులభంగా శ్రమ దోపిడీ గురయ్యే కార్మికుల రాక పెరిగినట్లు కంపెనీలు గుర్తించాయని ఆమె అభిప్రాయపడ్డారు. "ఏ ఆధారం లేని విదేశీ మైనర్లు దేశంలోకి వస్తుండటంతో, కంపెనీలు తమ లేబర్ ఖర్చులను తగ్గించుకునే అవకాశాలను అందులో చూసుకున్నాయి.’’ అని ఆమె అన్నారు.
చట్టవిరుద్ధంగా పనిలో పెట్టుకుంటే జరిమానాలు విధించే ప్రమాదం ఉందని కంపెనీలు అర్థం చేసుకున్నాయని, అయితే అవి ఈ ఖర్చులను తమ బిజినెస్ మోడల్‌గా మార్చుకుంటున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
"హక్కులను అడిగే అవకాశం లేని బలహీనమైన కార్మికులను నియమించుకోవడం ద్వారా వారికి మిగిలే డబ్బు, జరిమానాల కంటే ఎక్కువగా ఉంటుంది’’ అని ప్రొఫెసర్ నానా చెప్పారు.
"దీనికితోడు బాల కార్మికులకు సంబంధించిన ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో, అనేక రాష్ట్రాలు పిల్లలతో పని చేయించుకునేలా చట్టాలను మారుస్తున్నాయి తప్ప, వారికి రక్షణ కల్పించడం లేదు" అని అన్నారామె.
నెబ్రాస్కాలోని గ్రాండ్ ఐలాండ్‌లోని వాల్‌నట్ మిడిల్ స్కూల్ ప్రిన్సిపాల్‌ని సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నాలు చేసింది. వారు మాట్లాడటానికి అందుబాటులోకి రాలేదు.
ఇవి కూడా చదవండి:
- హోం లోన్: కిరాయి ఇంటికి కడుతున్న అద్దె డబ్బులను ఈఎంఐగా కట్టి ఇల్లు కొనుక్కోవచ్చా?
- Annuity plans: నెల జీతంలాగా స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే మార్గమిది, ఎవరు చేరొచ్చు, తెలుసుకోవాల్సిన విషయాలేంటి
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














