'యజమాని వేధింపులు' భరించలేక ఇంటికి తిరిగి వెళ్లేందుకు వందల కిలోమీటర్లు నడిచిన ముగ్గురు వలస కూలీల కథ

ఫొటో సోర్స్, SHESHADEB BEHERA
- రచయిత, సందీప్ సాహూ
- హోదా, బీబీసీ కోసం, భువనేశ్వర్ నుంచి
ఒడిశాకు చెందిన ముగ్గురు కూలీలు కాలినడకన వందల కిలోమీటర్లు ప్రయాణించారు.
ఎనిమిది రోజుల్లో వారు దాదాపు 1300 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇందులో అత్యధిక దూరం కాలినడకనే వెళ్లారు. నడక మధ్యలో కొన్నిసార్లు ట్రక్కు లేదా కొన్నిసార్లు బైక్‌లు నడిపే వారిని లిఫ్ట్ అడిగి ప్రయాణించారు.
పని వెతుక్కుంటూ బెంగళూరు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు, అక్కడ యజమాని తీరుతో విసిగిపోయి ఒడిశాలోని తమ గ్రామాలకు కాలినడకన బయల్దేరారు.
ఈ ముగ్గురు చెప్పిన వివరాల ప్రకారం, కలాహాండికి చెందిన మొత్తం 12 మందికి పని కల్పిస్తామని ఓ ఏజెంట్ హామీ ఇచ్చారు. పని పేరుతో మోసం చేసి బెంగళూరుకు తీసుకెళ్లారు. ఇంతకుమించి ఆ ఏజెంట్ గురించి వారు ఏం చెప్పలేకపోతున్నారు.
కలాహాండిలోని జయపాట్నా బ్లాక్‌కు చెందిన ఒక గ్రామానికి చెందిన బుదూ మాంఝీ, కాతారూ మాంఝీ, భికారీ మాంఝీ అనే ఈ ముగ్గురు కార్మికులు మార్చి 26న బెంగళూరు నుంచి నడక ప్రారంభించారు. వారం తర్వాత అంటే ఏప్రిల్ 2న వారు గ్రామాలకు చేరుకున్నారు.

ఫొటో సోర్స్, SHESHADEB BEHERA
ఎందుకు తిరిగి వచ్చారు?
యజమాని తమకు వేతనాలు ఇవ్వలేదని ఆ ముగ్గురూ చెప్పారు. డబ్బు అడిగినప్పుడు కొట్టేవారని తెలిపారు. ఆయన దోపిడీతో విసిగిపోయి తిరిగి సొంత గ్రామానికి వెళ్లిపోవాని నిర్ణయించుకున్నట్లు వారు చెప్పారు.
బుదూ మాంఝీ ఈ అంశం గురించి బీబీసీతో ఫోన్‌లో మాట్లాడారు.
‘‘మేం రెండు నెలల క్రితమే పని కోసం బెంగళూరుకు వెళ్ళాం. అక్కడ మాకు తినడానికి తిండి దొరికేది. కానీ, చేసిన పనికి కూలీ దొరకకపోయేది. డబ్బు ఇవ్వమని అడిగినప్పుడు యజమాని మమ్మల్ని కొట్టడం ప్రారంభించాడు. అప్పుడే తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని మేం నిర్ణయించుకున్నాం. టికెట్ కొనడానికి కూడా మా దగ్గర డబ్బు లేకపోవడంతో కాలినడకన బయల్దేరాం’’ అని ఆయన చెప్పారు.
పనిలో చేరిన మొదటి రోజుల్లో ఖర్చుల కోసం ప్రతీ వారం తమకు కాంట్రాక్టర్ రూ. 100 ఇచ్చేవారని బుదూ తెలిపారు.
‘‘ఆ డబ్బుతో పూట గడవడమే కష్టమైంది. సబ్బు, నూనె, నిత్యావసర వస్తువులు అన్నీ మేమే కొనుక్కోవాలి. కాబట్టి కాస్త ఎక్కువ డబ్బు ఇవ్వాల్సిందిగా కాంట్రాక్టర్‌ని కోరాం. ఆ తర్వాత మాకు ప్రతీ వారం రూ. 200 ఇచ్చారు. ఒక నెల రోజులుగా ఈ డబ్బు కూడా మాకు ఇవ్వడం ఆపేశారు. చేతిలో డబ్బుల్లేక అక్కడ బతకడం మాకు కష్టంగా అనిపించింది. మేం మోసపోయామని అర్థమైంది’’ అని ఆయన వివరించారు.
యజమాని మీ శ్రమను దోపిడీ చేస్తూ, డబ్బులు అడిగితే కొడుతున్నప్పుడు మీతో పాటు బెంగళూరుకు వచ్చిన మిగతా వారు ఎందుకు తిరిగి గ్రామాలకు రాలేదు అని ప్రశ్నించగా ఆయన బదులు ఇచ్చారు.
‘‘వారంతా వేరే చోట పనిచేస్తున్నారు. బెంగుళూరు చేరుకున్నాక మేమంతా విడిపోయాం. మేం ముగ్గురం ఒక భవన నిర్మాణంలో పనికి చేరాం. ఆ తర్వాత మిగతా వారి గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు’’ అని చెప్పారు.
దారివెంట వెళ్లేవారు జాలిపడి ఇచ్చిన వాటితోనే కడుపు నింపుకుని నడక కొనసాగించినట్లు ఆయన తెలిపారు.
‘‘మేం బెంగుళూరు నుంచి కేవలం రెండు వాటర్ బాటిళ్లతో బయలుదేరాం. ఒక చోట, టీ దుకాణం యజమాని మాకు చాయ్‌తో పాటు కేక్ ఇచ్చారు. ఇలాగే ఎక్కడ ఏది దొరికితే అదే తింటూ మా ప్రయాణం కొనసాగించాం. ఒక్కోసారి మాకు రోజంతా తిండి దొరకని సందర్భాలు కూడా ఎదురయ్యాయి’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, SHESHADEB BEHERA
గ్రామానికి ఎలా చేరుకున్నారు?
ఒడిశా సరిహద్దులోకి ప్రవేశించిన తర్వాత అలసిపోయి, ఆకలితో ఉన్న ఈ ముగ్గురిని కోరాపుట్‌లోని పంతంగిలో కొంత మంది ప్రజలు గమనించారు. వారికి ఆహారం ఇవ్వడంతో పాటు కొంత డబ్బు కూడా ఇచ్చి వాహనంలో పంపించారు.
ఒడిశా మోటరిస్టుల సంఘం పంతంగి శాఖ అధ్యక్షుడు భగవాన్ పడాల్ మాట్లాడుతూ, ‘‘మా అసోసియేషన్ సభ్యుడు ఈ ముగ్గురు కూలీల గురించి నాకు ఫోన్‌లో తెలియజేశారు. ఇతర సభ్యులతో వెళ్లి వారిని కలిశాం. భోజనం ఏర్పాటు చేసి, కొంత డబ్బు ఇచ్చి, వారిని పాపడాహండీకి వెళ్లి వాహనంలో కూర్చోబెట్టాను’’ అని చెప్పారు.
నవరంగపూర్‌లోని పాపడాహాండి నుంచి ఈ ముగ్గురు కూలీలు కాలినడకన ఆదివారం సాయంత్రం స్వగ్రామాలకు చేరుకున్నారు.
అయితే, బెంగుళూరు నుంచి ఒడిశాకు ఎలా వెళ్లాలో వారు ముగ్గురికి తెలియలేదు. దీంతో రైల్వే లైన్ పక్కన నడుద్దామంటూ బుదూ మిగతా ఇద్దరికీ సలహా ఇచ్చారు. వారు అలాగే నడకను సాగించారు.
‘‘మేం రోజంతా నడిచే వాళ్లం. రాత్రి కాగానే అక్కడే పడుకునేవాళ్లం. మమ్మల్ని చూసి జాలి పడి ఎవరైనా తినడానికి ఏదైనా ఇస్తే తీసుకునేవాళ్లం. తినడానికి ఏమీ దొరకనప్పుడు అలాగే ఆకలితో నీళ్లు తాగి పడుకునేవాళ్లం. నడక వల్ల కాళ్లకు బొబ్బలు వచ్చాయి. కానీ, మాకు నడవడం తప్ప మరో మార్గం లేదు’’ అని బుదూ చెప్పారు.
నిరక్షరాస్యులైన ఈ గిరిజనులకు బెంగళూరులో తాము ఎక్కడ, ఏ కంపెనీలో పనిచేశారో కూడా తెలియదు. వారిని బెంగళూరు తీసుకెళ్లిన ఏజెంట్ పేరు కూడా తెలియదు. తమ జిల్లాకు చెందిన మరో తొమ్మిది మందితో కలసి జనవరి నెలలో బెంగళూరుకు వెళ్లినట్లు మాత్రమే వారు చెప్పగలుగుతున్నారు. అంతకుమించి వారికి ఏదీ తెలియదని అంటున్నారు.

ఫొటో సోర్స్, SHESHADEB BEHERA
ఇంటి వద్ద దయనీయ పరిస్థితులు
ఇంతకాలం ఇంటి వద్ద ఈ ముగ్గురూ లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
భికారీ మాంఝీ భార్య మాట్లాడుతూ, ‘‘నేను అడవి నుంచి కట్టెలు, ఆకులు సేకరించి ఇంటికి తెస్తాను. ప్రభుత్వం నుంచి లభించే అయిదు కిలోల బియ్యంతోనే మేం బతుకుతున్నాం. బెంగళూరు నుంచి నా భర్త డబ్బుతో వస్తాడని అనుకున్నా. కానీ, అలా జరగలేదు. రోజులు ఎలా గడుస్తాయో అర్థం కావట్లేదు’’ అని చెప్పారు.
ఇంకెప్పుడూ పని కోసం సొంత ఊరు వదిలి బయటకు వెళ్లబోనని జాంచువా గ్రామంలో ఉండే భికారీ అన్నారు.
"మేం ఊరు వదిలి బయటకు వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, ఇక్కడ చేయడానికి పని లేదు. అందువల్ల పనిని వెదుక్కుంటూ బలవంతంగా బయటకి వెళ్లాల్సి వచ్చింది. ఇకపై చచ్చినా బయటకు వెళ్లను’’ అని ఆయన చెప్పారు.
అయితే, ఈ ప్రాంతంలో కూలీలకు పని లేదన్న ఆరోపణలను జయపాట్నా బీడీవో స్నిగ్ధరాణి ప్రధాన్ తోసిపుచ్చారు.
బాధితుల గ్రామాలను సందర్శించి ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్థానిక బీడీఓను కోరినట్లు బీబీసీకి ఫోన్‌లో కలాహాండి కలెక్టర్ పి. అన్వేషారెడ్డి తెలిపారు.
నివేదిక అందిన తర్వాత వారికి ప్రభుత్వ సహాయం అందేలా చేస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- NCERT: చరిత్ర నుంచి మొఘలుల పాఠాలను కావాలనే తొలగించారా, విమర్శలేంటి?
- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
- ఆంధ్రప్రదేశ్: “గుండెలు పిసికేసీ తలంతా అదిమినట్లు అనిపిస్తోంది. నాకు ఇంకేమి తెలియదు” అంటూ ఆ గ్రామస్థులు ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు?
- అల్-అక్సా మసీదు: ఇక్కడ మేకను బలి ఇవ్వడం గురించి రెండు మతాల మధ్య ఎందుకు ఘర్షణ జరుగుతోంది
- ‘‘యుక్రెయిన్, రష్యాల యుద్ధాన్ని ఆపడానికి సాయం చేయండి’’ జిన్‌పింగ్‌కు ఫ్రెంచ్ అధ్యక్షుడి వినతి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














