సేంద్రీయ వరి సాగు నిజంగా లాభదాయకమా? తమిళనాడు అనుభవాలు ఏమిటి?

- రచయిత, శివకుమార్ రజకులం
- హోదా, బీబీసీ ప్రతినిధి
సేంద్రీయ వ్యవసాయం లాభదాయకమని మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
సంప్రదాయ వరి వంగడాలనే సాగు చేయాలని నడుం బిగించిన పలువురు రైతులు ప్రస్తుతం నష్టాల ఊబిలో చిక్కుకున్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి.
సంప్రదాయ వరి రకాలైన కరుప్పు కౌని, మాప్పిళ్లై సాంబ సాగు చేసిన సేంద్రీయ రైతులు నష్టపోతున్నారు.
వారి నష్టానికి కారణమేమిటి? సంప్రదాయ వరి రకాలను పండించడంలో ఎదురయ్యే సవాళ్లు ఏమిటి?
వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను ఉపయోగించి ఆకలి చావుల నుంచి ప్రజలను కాపాడిన వాళ్లలో కూడా కొంత మంది నేడు ప్రకృతి సేద్యం వైపు మళ్లాలని చెబుతున్నారు.
గ్లోబల్ ట్రెండ్ భారత్‌లోనూ ప్రతిధ్వనిస్తోంది. ప్రభుత్వం అందించిన గణాంకాలే అందుకు నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయంలో భారతదేశం ఐదో స్థానంలో ఉంది.
ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలసీ ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడు 4,223 మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా రూ.108 కోట్లు ఆర్జించింది.
ఇది ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అందించడానికి 'రసాయన రహిత సేంద్రీయ వ్యవసాయం' వైపు మొగ్గు చూపేలా రైతులను ప్రోత్సహిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, స్వచ్ఛంద సంస్థల చొరవ వల్ల సేంద్రీయ వ్యవసాయానికి రైతుల్లో మంచి ఆదరణ లభించింది.
ముఖ్యంగా కనుమరుగైన సంప్రదాయ వరి వంగడాల గురించి తెలుసుకున్న రైతులు వాటిని సాగులోకి తీసుకు వచ్చేందుకు ముందుకు వచ్చారు.
సేంద్రీయ వ్యవసాయం ద్వారా కరుపుకౌని, మాప్పిళ్లై సాంబ వంటి అనేక సంప్రదాయ వరి రకాలను తీసుకువచ్చారు.
అయితే అవి నేటి మార్కెట్‌కు తగినవిగా ఉన్నాయా? రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న.
సాగు విస్తీర్ణం పెరిగినా..

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ను కలిసిన 'అగ్రిశక్తి' వ్యవస్థాపకులు సెల్వమురళితో బీబీసీ మాట్లాడింది.
కృష్ణగిరి జిల్లా మాథూరు గ్రామానికి చెందిన ఈయన వ్యవసాయ సాంకేతికతలు ప్రతి రైతుకు చేరేలా కృషి చేస్తున్నారు.
అంతేకాకుండా 'అగ్రిశక్తి అంగడి' పేరుతో రైతుల నుంచి నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను కొని అమ్ముతున్నారు.
"2015 తర్వాత తమిళనాడులో సేంద్రీయ వ్యవసాయంపై ఆసక్తి పెరిగింది. చాలా మంది ప్రజలు సేంద్రీయ వ్యవసాయం వైపు దృష్టి సారించారు. ఫలితంగా సేంద్రీయ ఉత్పత్తులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి" అని అన్నారు సెల్వమురళి.
కానీ దానికి తగ్గట్టుగా మార్కెట్ అవకాశం పెరిగినట్లు కనిపించడం లేదని అంటున్నారు సెల్వ.
పంటకోత అనంతర సమస్యల వల్ల భారత్‌లో ఏటా లక్ష కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లుతోందని ఆయన తెలిపారు.
సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌లో సమస్యలు, నష్టాలు ఎక్కువని అంటున్నారు 'అగ్రిశక్తి' వ్యవస్థాపకులు.

సేంద్రీయ ఉత్పత్తులతో సమస్యలేంటి?
సేంద్రీయ ఉత్పత్తులు చాలా తక్కువ జీవితకాలాన్ని కలిగి ఉంటాయని, వాటిని కీటకాలు, ఈగలు తేలిగ్గా తినేస్తాయని సెల్వమురళి అంటున్నారు.
''అవి 10 నుంచి 15 రోజుల్లో పాడైపోతాయి. బ్లాక్ కౌని రైస్, మాపిళ్లై సాంబ బియ్యం వంటి సంప్రదాయ వరి రకాలను సోషల్ మీడియాలో, బయట చాలా మంది గొప్పగా చెప్పుకుంటారు. అంటే సంప్రదాయ బియ్యానికి విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ, మార్కెట్లో ఉన్నవి అవి కాదు" అని అంటున్నారు సెల్వ.
తమిళనాడులో 500 టన్నుల బ్లాక్ కౌని బియ్యం అమ్ముడుపోకుండా ఉన్నాయని ఆయన అన్నారు.
సేంద్రీయ ఉత్పత్తుల కోసం తనకు రోజూ 10 నుంచి 15 ఫోన్ కాల్స్ వస్తున్నాయని సెల్వమురళి చెప్పారు.
"చాలా మంది సేంద్రీయ రైతులు తమ కౌని బియ్యం, మాపిళ్లై సాంబ బియ్యం అమ్మాలని నన్ను అడుగుతారు. కానీ వాటికి మార్కెట్ లేనందున నేను చేయలేను" అని ఆయన తెలిపారు.

‘ఆ సేంద్రీయ ఉత్పత్తులను కొనరు’
సేలంలో 'పసుమైకుడిల్' పేరుతో ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయిస్తున్న అరణ్య అల్లి కూడా ఇదే చెబుతున్నారు.
తన పొలంలోనే కాకుండా దగ్గరి బంధువులు, స్నేహితుల పొలాల్లో పండే సంప్రదాయ బియ్యం, కూరగాయలు, పసుపు, పాలకూర తదితర వాటిని కొని విక్రయిస్తుంటారు అరణ్య అల్లి.
పసుపు వంటి కొన్ని ఉత్పత్తులను అదనపు విలువతో విక్రయిస్తారు. మరోవైపు సేంద్రీయ వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్న వారికి కూడా ఆమె సలహాలు ఇస్తారు.
సంప్రదాయ వరి వంగడాల విక్రయంపై అరణ్య అల్లిని అడిగితే.. ‘‘నేను గత 18 ఏళ్లుగా ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయిస్తున్నాను. ఏటా సేంద్రీయ ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది.
కానీ, సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలన్న రైతుల ఆసక్తికి అనుగుణంగా ఆ ఉత్పత్తులను వినియోగించే దృక్పథం ప్రజల్లో పెంపొందడం లేదు'' అని ఆమె అన్నారు.
సహజసిద్ధమైన వ్యవసాయోత్పత్తులు మార్కెట్‌లో పేరుకుపోతున్నా కొనే వారు లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
''బ్లాక్ కౌని, మప్పిళ్లై సాంబ, పార్కర్ వంటి ప్రతి సంప్రదాయ బియ్యం వాటి ప్రత్యేకత కారణంగా ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించాయి. అయితే కుల్యాడిచాన్ బియ్యం వంటి అంతగా ఆదరణ లేని సంప్రదాయ బియ్యం రకాలను వారు కొనరు’’ అని అరణ్య అల్లి చెప్పారు.

రైతులకు అవగాహన లేకపోవడంతో నష్టాలు
తన వద్ద 60 బస్తాల నల్ల పత్తి బియ్యం అమ్ముడుపోలేదని, తనకున్న వ్యాపార పరిచయాల ద్వారా రాబోయే రోజుల్లో విక్రయించగలనని అరణ్య ఆశిస్తున్నారు.
అలాగే అరణ్య ప్రకారం నేరుగా మార్కెట్ చేసుకునే సేంద్రీయ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ సేంద్రియ రైతులందరూ ఆ స్థితిలో లేరు.
ముఖ్యంగా కొత్తగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులకు మార్కెట్ అవకాశాలపై అవగాహన లేదు.
దాన్ని సద్వినియోగం చేసుకుంటున్న వ్యాపారులు రైతుల నుంచి ఉత్పత్తులను తక్కువ ధరకు అడుతున్నారు.
అదే సందర్భంలో సేంద్రీయ ఉత్పత్తులను ఎక్కువ కాలం భద్రపరచడం సాధ్యం కాకపోవడంతో కొత్త రైతులు నష్టాలను చవిచూస్తున్నారని ఆమె చెప్పారు.
కృష్ణగిరి జిల్లా బోచంపల్లి సమీపంలోని పరూర్ గ్రామానికి చెందిన సేంద్రీయ రైతు ధరణీధరన్‌తో బీబీసీ మాట్లాడింది.
ధరణీధరన్ తన స్వగ్రామానికి సమీపంలోని అరసంబట్టిలో 'నమ్మాజ్వార్ మక్కల్ అంగడి' అనే సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే దుకాణాన్ని కూడా నడుపుతున్నారు.
సంప్రదాయ వరి వంగడాల విక్రయం గురించి ఆయన మాట్లాడుతూ.. ''ఐదేళ్ల క్రితం వరకు సంప్రదాయ రకం బియ్యం కేజీ 200 రూపాయలు ఉండగా.. ఇప్పుడు 140 రూపాయలు మాత్రమే పలుకుతోంది. సంప్రదాయ వరి వంగడాల పునరుద్ధరణపై అవగాహన కారణంగా చాలా మంది విత్తనాలు కొనుగోలు చేయడానికి మా వద్దకు వ్యక్తిగతంగా వస్తారు. కానీ పంటను ఎలా విక్రయించాలో వారికి తెలియడం లేదు’’ అని క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించారు.
ఈ రోజు తన వద్ద 150 బస్తాల సంప్రదాయ వరి వంగడాలు నిల్వ ఉన్నాయని చెబుతున్న ధరణీధరన్, 25 కిలోల 60 బస్తాల నల్ల బియ్యం గత 6 నెలలుగా అమ్మకుండా నిల్వ ఉంచానన్నారు.
‘‘సంప్రదాయ వరి రకాలను సేంద్రీయ పద్ధతిలో పండించడం వల్ల పురుగుల బారిన పడే అవకాశం ఉంది. అలా ప్రతి రెండు నెలలకోసారి వాటిని వేరు చేసి, శుభ్రం చేసి మళ్లీ కట్టలు కట్టినప్పుడు దిగుబడి తగ్గుతుంది. నా భూమిలో పండించిన పంట ఇప్పటికీ అమ్ముడుపోకపోవడంతో ఈ ఏడాది 3 ఎకరాలు తగ్గించి సాగుచేశాను'' అని అన్నారు ధరణీ.

పాయసం, ఇడ్లీ, దోసెలుగా..
మాప్పిళ్లై సాంబ వంటి వరి రకాలను మార్కెట్‌లో విక్రయించలేకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయని సెల్వమురళి అన్నారు.
"ఒకటి అవి చాలా ఖరీదైనవి. రెండోది ఆ బియ్యాన్ని రోజువారీ ఆహారంగా ఎలా ఉపయోగించాలో ప్రజల్లో కనీస అవగాహన లేదు." అని తెలిపారు.
''బ్లాక్ కౌని, మాప్పిళ్లై సాంబా బియ్యం రాయిలా గట్టిగా ఉంటాయి, రుచిగా ఉండవు. మన ప్రజలు చిన్న రకాల బియ్యం తినడానికి అలవాటు పడ్డారు. అదేవిధంగా సంప్రదాయ బియ్యాన్ని ఆహారం కోసం ఎక్కువగా వాడటం లేదు" అని అన్నారు సెల్వ.
బ్లాక్ కౌని, మాప్పిళ్లై సాంబా బియ్యాన్ని గంజి లేదా పాయసంగా తినవచ్చు. దీన్ని ఇడ్లీ, దోసెలాగా కూడా తయారుచేసుకుని తినవచ్చు.
ఇలా సిద్ధం చేయడానికి బియ్యాన్ని కనీసం 12 గంటలు నానబెట్టాలి. అప్పుడే ఆ బియ్యం తేలికవుతాయి. ఆ తర్వాత వాటిని మెత్తగా చేయవచ్చు.
''కరుప్పు కౌని, మాప్పిళ్లై సాంబ రకాల బియ్యం రూ.190కి కిలో కావడంతో సామాన్యులు వీటిని తమ ఆహారంలో ఒకటిగా కూడా పరిగణించడం లేదు. నేడు మనం ఉపయోగించే వరి ధాన్యం చాలా వరకు 3 నెలల పంటగా పండిస్తారు. కానీ, కరుప్పు కౌని, మాప్పిళ్లై సాంబ మొదలైనవి 160 రోజుల పంటలు. వాటిని అంత తక్కువ ధరకు ఇవ్వలేం’’ అని సెల్వ మురళి చెప్పారు.
ఆ పరిశోధనలు పెరగాలి: సెల్వ
"కేరళలో పుదు రోజువారీ ఆహారంలో భాగమైనట్లు తమిళనాడులోను అలాంటిదే జరిగితే పరిస్థితి మెరుగుపడుతుంది. సంప్రదాయ బియ్యంతో కొత్త రకాల ఆహారాన్ని పరిచయం చేయవచ్చు" అని సెల్వ తెలిపారు.
మధుమేహం రహిత లక్ష్యం దిశగా సింగపూర్ ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు. భారత్ మధుమేహాన్ని నిర్మూలించాలంటే ఈ సంప్రదాయ వరి వంగడాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
''సింగపూర్ మాదిరిగానే భారత్‌లోనూ అందుకు శ్రీకారం చుట్టవచ్చు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు పాడైపోకుండా పరిశోధనలు పెరగాలి. అదనపు పద్ధతులు వెతకాలి'' అని సెల్వ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- ఫాక్స్‌కాన్-వేదాంత: రూ. 1,60,750 కోట్ల సెమీ కండక్టర్ హబ్ ఒప్పందం రద్దవడంతో మోదీ 'కల' చెదిరిందా?
- శ్రీలంక: ఆర్థిక సంక్షోభంతో ఎగసిన నిరసనలకు ఏడాది... ఇప్పుడు జనజీవనం ఎలా ఉంది?
- తెలంగాణ: డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎన్ని కడతామన్నారు? ఎన్ని కట్టారు?
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడుల్లో 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. అమ్మ ఒడి, నాడు-నేడు సహా ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించడం లేదా?














