టమాటా బంగారమాయెనే... మదనపల్లె మార్కెట్లో ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Thinkstock
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
టమాటా ధర ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కిలో రూ.140 నుంచి రూ.160 వరకూ పలుకుతున్న టమాటా ధర ఇంకా ఏ స్థాయికి చేరుతుందోనని సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.
అదే సమయంలో పెరుగుతున్న ధర కొంతమంది టమాటా రైతుల్లో సంతోషం కూడా తీసుకొచ్చింది.
గతంలో ధర లేక టమాటాలు రోడ్లపై పారబోసిన రైతులు ఇప్పుడు ఈ ధర ఉపశమనం కలిగించిందని ఊపిరి పీల్చుకుంటున్నారు.
సోషల్ మీడియాలో కూడా టమాటా ధరలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
రైతులను సమర్థిస్తూ, ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తూ మీమ్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి.
ఇంతకీ దేశవ్యాప్తంగా టమాటా ధర అసలు ఎందుకు ఇంతలా పెరిగింది. దీని వెనుక ఉన్న కారణాలేంటి.. టమాటా రైతులు, వ్యాపారులు ఏం చెబుతున్నారు అనే విషయాలను తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.
టమాటా మార్కెట్ కేరాఫ్ మదనపల్లి

టమాటా అనగానే చాలా మందికి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుర్తొచ్చేది మదనపల్లి.
అందులోనూ టమాటా ధర పెరిగినప్పుడల్లా వ్యాపారుల నుంచి వినియోగదారుల వరకు అందరి కన్నూ మదనపల్లి మార్కెట్ మీద పడుతుంది.
వేసవి సమయంలో టమాటా సాగు మదనపల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువ జరుగుతుంది.
టమాటా ధర కాస్త స్థిరంగా ఉండడానికి కారణమవుతుంది.
అలాంటిది ఈసారి కిలో టమాటా ధర రికార్డు స్థాయికి చేరింది.
దీని వెనుక స్థానిక వ్యాపారులు, రైతులు, అధికారులు ఎన్నో కారణాలు చెబుతున్నారు.
ఈ ఏడాది మదనపల్లి టమాటా సాగు విషయానికి వస్తే.. మార్కెట్‌కు గత ఏడాది ఇదే సమయానికి అంటే జూలై మొదటి వారానికి 16500 క్వింటాళ్ల టమాటాలు వస్తే, ఈ ఏడాది జూలై మొదటివారానికి అది దాదాపు సగానికి పడిపోయింది.
ఈ ఏడాది జూలై 6 నాటికి మార్కెట్‌కు 8980 క్వింటాళ్ల ఉత్పత్తి మాత్రమే చేరుకుంది.
ఇక ధర విషయానికి వస్తే గత ఏడాది మొదటి వారంలో టమాటా ఫస్ట్ క్వాలిటీ క్రేట్ ధర కనిష్టం రూ.1100 నుంచి గరిష్టంగా రూ.1400 పలికితే, సెకండ్ క్వాలిటీ ధర ఒక రూ.700 నుంచి రూ.1080 మధ్య ఉంది.
దిగుబడి దాదాపు సగానికి పడిపోవడంతో ఈ ఏడాది ఈ ధరల్లో మార్పులు వచ్చాయి.
ఈ ఏడాది ఫస్ట్ క్వాలిటీ టమాటా క్రేట్ ధర రూ.950 నుంచి రూ. 1600 ఉండగా, సెకండ్ క్వాలిటీ ధర క్రేట్ రూ.840 నుంచి 950 వరకు పలుకుతోంది.

దేశవ్యాప్తంగా కూడా తగ్గిన దిగుబడి
కూరగాయల మార్కెట్ కమిటీ రికార్డుల ప్రకారం చూస్తే దేశవ్యాప్తంగా కూడా ఈసారి టమాటా దిగుబడి బాగా తగ్గింది.
గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ గణాంకాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, దిల్లీ, పంజాబ్ రాష్ట్రాల నుంచి వచ్చిన టమాటా దిగుబడిని మనం పై ఫొటోలో చూడవచ్చు. మహారాష్ట్రతో సహా ఉత్తరాది రాష్ట్రాల మొత్తం దిగుబడి జూన్ నుంచి నవంబర్ వరకూ బాగా ఉన్నట్టు ఇవి చూపిస్తున్నాయి.
ఉదాహరణకు గత ఏడాది ఏప్రిల్లో 2 లక్షలా 40 వేల క్వింటాళ్లు ఉన్న టమాటా దిగుబడి ఈ ఏడాది మార్చి నాటికి సగానికంటే దిగువకు అంటే 56 వేల 840 క్వింటాళ్లకు పడిపోయింది. ఇది కూడా టమాటా ధరలు విపరీతంగా పెరగడానికి కారణంగా భావిస్తున్నారు.

‘‘మార్కెట్ చరిత్రలో ఈ రేటు లేదు...’’
మదనపల్లి మార్కెట్ కమిటీని కేవలం టమాటా విక్రయాల కోసం 1969లో ప్రారంభించారు. దీంతో అప్పటివరకూ బయట అమ్ముకుంటున్న టమాటాలను మార్కెట్లో అమ్మడం మొదలు పెట్టారు.
మొదట 20 మంది ట్రేడర్స్ ప్రారంభమైన మదనపల్లి మార్కెట్లో ఇప్పుడు వందమంది వరకు ట్రేడర్స్ ఉన్నారు.
అప్పట్లో రైతులు గంపల్లో తీసుకు వచ్చి మార్కెట్లో అమ్ముకుంటే, ఇప్పుడు టమాటాల విక్రయాలకు ట్రే సిస్టమ్ వచ్చింది.
మార్కెట్లో మొదటిసారి ఈ రేటు చూస్తున్నామని మదనపల్లి మార్కెట్ కార్యదర్శి అభిలాష్ చెప్పారు.
ధర పెరగడంతో మదనపల్లి నుంచి రాష్ట్రమంతటా టమాటా ఎగుమతి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.
“70వ దశకం నుంచి చూస్తున్నాం. ఈ ధర ఎప్పుడు కనివిని ఎరగనిది. క్రేట్ రూ.2500, రూ.2600 అయితే అత్యధిక ధర అనుకునేవాళ్లం. ఈసారి చరిత్రలోనే మొట్టమొదటిసారి కిలో రూ.160 పలుకుతోంది. క్రేట్ రూ.4000 వరకు రావడం అంటే పంట దిగుబడి ఇక్కడ మాత్రమే ఉండడం, బయట లేకపోవడమే కారణం. రాష్ట్రమంతా కూడా ఇప్పుడు ఇక్కడి నుంచే సరఫరా చేయాల్సిన పరిస్థితి వచ్చింది’’ అని అభిలాష్ అన్నారు.

గతంలో టమాటాను మూడు గ్రేడ్లుగా విభజించి అమ్మేవాళ్లమని, కానీ ఇప్పుడు అసలు టమాటా దొరికితే చాలు అని కొనేస్తుండడం వల్లే ఈ రేటు పలుకుతోందని అంటున్నారు అభిలాష్.
“ఇక్కడ మార్కెట్ కమిటీలో గత నెల రోజుల నుంచి చూసుకుంటే గత జూన్ 20 నుంచి టమాటా ధర పెరగడం ప్రారంభమైంది. జూన్ 24న రూ.50 నుంచి మొదలైంది. జూన్ 30న రూ.120కు చేరుకుంది. ఆ తర్వాత జూలై 4న రూ.140, జూలై 12న ఏకంగా రూ.160 పలికింది. మేం రూ.120 ఎక్కువే అనుకుంటే, ఈ రేటు రూ.160 చేరింది.
మదనపల్లి మార్కెట్‌కు అనుసంధానంగా కొన్ని ప్రైవేట్ మార్కెట్స్ కూడా ఉన్నాయి. వాటిలో కూడా రేటు ఎక్కువగా పలకడం, వర్షాభావ పరిస్థితి, ఇతర ప్రాంతాల్లో సరుకు లేకపోవడం వల్ల ఈ రేటు వచ్చింది.” అని అన్నారు.

మార్కెట్ చరిత్రలో టమాటాకు ఈ రేటు పలకడం ఎప్పుడూ లేదని రైతుల నుంచి టమాటాలు కొనే వ్యాపారి మదనపల్లికి చెందిన అల్తాఫ్ చెప్పారు.
‘’ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ ఇది. 20 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నా. మార్కెట్ చరిత్రలో ఇంత రేటు ఎప్పుడూ చూడలేదు. ఒక క్రేట్‌కు 25 నుంచి 27 కిలోల టమాటాలు ఉంటాయి. గత సంవత్సరం నుంచి ఎండలు ఎక్కువైపోయి, వైరస్ సోకి పంట తగ్గిపోయింది.
బయటి రాష్ట్రాల్లో బాగా వానలు పడుతుండటంతో పంట సరిగా లేదు. దాదాపు చుట్టుపక్కల ఏ రాష్ట్రంలో కూడా సరుకు లేదు. వంద మంది పంట వేసినా 90 మందికి దిగుబడి లేదు. అందుకే ఇక్కడ ఇప్పుడు హోల్‌సేల్ రేటు రూ.120, రూ.140, 160 దాకా పడుతుంది. ఇక రిటైల్ రేటు అయితే వాటిని తీసుకెళ్లే ప్రాంతాలను బట్టి ఉంటోంది” అని తెలిపారు.

ఇతర ప్రాంతాల్లోనూ ప్రభావం
మదనపల్లి నుంచి విజయవాడ వంటి ఇతర ప్రాంతాలకు టమాటా వెళ్తుంది.
ఈ సారి దిగుబడి సరిగ్గా లేకపోవడం వల్ల మదనపల్లి మార్కెట్ నుంచి వెళ్లే లోడుల సంఖ్య తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.
విజయవాడలోని పీడీఆర్ మండీకి చెందిన హరికుమార్, ఏటా మదనపల్లి నుంచే టమాటాలు కొంటూ ఉంటారు.
“విజయవాడలో డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వరకు పంట వస్తుంది. మిగతా 9-10 నెలలు మేం మదనపల్లి వచ్చి కొంటాం. ఈసారి పంట ఎక్కువగా రాలేదు కాబట్టి, రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. క్రేట్ రూ.4000 పెట్టి కొన్నాం. దీనికి రవాణా ఖర్చు అదనం.
ఇదంతా కలిపితే టమాటా రేటు బాగా పెరుగుతుంది. అంత రేటు పెట్టి వినియోగదారులు కొంటారా లేదా అనే భయం ఉంది. అందుకే ఇంతకు ముందు రెండు బండ్ల లోడ్ తీసుకెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు సగం లోడ్ మాత్రమే తీసుకెళ్తున్నాం. ఒకప్పుడు మదనపల్లి మార్కెట్లో 150 బండ్లు లోడ్ అయ్యేవి ఇప్పుడు తగ్గిపోయాయి’’ అని హరికుమార్ తెలిపారు.

మూడు సార్లు నష్టపోయాం. ఇప్పుడే...
టమాటా పంట వేసి మూడు సార్లు నష్టపోయిన తమకు ప్రస్తుతం లాభాలు రావడం ఉపశమనం కలిగించిందని మదనపల్లికి చెందిన మహిళా రైతు అరుణ చెప్పారు.
‘‘గతంలో మూడుసార్లు పంట వేస్తే నష్టం వచ్చింది. అప్పుడు సరైన రేటు లేదు. ఇప్పుడు రేటు బాగానే ఉంది. ప్రస్తుత లాభాలకు అప్పటి నష్టాలకు లెక్క సరిపోయింది. చెట్టు బాగా పెరిగింది కాపు తక్కువగా ఉంది. బాగా కాపు వచ్చి ఉండే లాభం పెరిగి ఉండేది’’ అని అరుణ అన్నారు.
ధరలు పెరిగినప్పుడే అందరూ మాట్లాడతారని, రైతుకు గిట్టుబాటు ధర దొరక్క టమాటాలను రోడ్ల మీద పోసే సందర్భాలు కూడా ఉంటాయని మదనపల్లి మండలం, దిగవగాండ్లపల్లికి చెందిన వెంకట రమణ అనే రైతు అన్నారు.
‘‘కొన్ని చోట్ల వానలు పడి పంటకు నష్టం జరిగింది. అందువల్ల కాపు తగ్గింది. డిమాండ్‌కు తగిన దిగుబడి లేకపోవడం వల్ల రేట్లు పెరిగాయి. అందరూ ధరలు పెరిగాయని అంటున్నారు కానీ టమాటా రైతుకు నష్టాలు వచ్చినపుడు ఎవరూ మాట్లాడరు.
టమాటా కిలో పది పైసలకు అమ్ముకున్నప్పుడు ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు రూ.100, రూ.140 పెట్టాల్సి వస్తోందని అంటున్నారు. ఈరోజు ధర ఉంది కాబట్టి చెబుతున్నారు. రేపు తగ్గినపుడు ఎవరూ మాట్లాడరు’’ అని వెంకట రమణ అన్నారు.

అధిక ఉష్ణోగ్రతలు కూడా కారణమే...
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సాధారణంగా జనవరి నుంచి జూన్ వరకూ 60 శాతం టమాటాను సాగు చేస్తారని మదనపల్లి ఉద్యాన అధికారి ఈశ్వర ప్రసాద్ రెడ్డి చెప్పారు.
‘‘ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి చుట్టుపక్కల 25 వేల నుంచి 35 వేల ఎకరాల విస్తీర్ణంలో టమాటా పంటను వేస్తారు. దిగుబడి తగ్గడానికి ఉష్ణోగ్రతలు పెరగడం కూడా కారణం. మదనపల్లి చుట్టుపక్కల ఎండాకాలంలో టమాటా సాగు చేయాలంటే 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం.
ఆ ఉష్ణోగ్రతలో ఎకరాకు 25 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ సంవత్సరం మదనపల్లిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అందుకే మొక్కల ఎదుగుదల తగ్గి, తెగుళ్లు వంటి సమస్యలు వచ్చి దిగుబడి పడిపోయింది’’ అని ఈశ్వర ప్రసాద్ రెడ్డి తెలిపారు.
కొత్తగా పంట వేసేవారు ముందుకు రావకపోవడంతో మరో నెల రోజులు టమాటా ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉందని ఈశ్వర ప్రసాద్ రెడ్డి చెప్పారు.
“ఆగస్టు 15 వరకు కూడా రేట్లు ఇలాగే ఉండే అవకాశాలున్నాయి. మదనపల్లి చుట్టుపక్కల రైతులు సాధారణంగా పంటను మార్చి, ఏప్రిల్లో సాగు చేస్తారు. కానీ పోయిన సంవత్సరం మే నెలలో రేట్లు పెరగడంతో సాగు కాలాన్ని ముందుకు తీసుకెళ్లారు. అంటే మార్చిలో నాటాల్సిన 20, 30 వేల ఎకరాల పంటను జనవరిలోనే వేసేశారు.
ఆ పంటల దిగుబడి మార్చి లోపలనే పూర్తిగా వచ్చేసింది. ఆ తరువాత పంట సాగు లేదు. పంట సాగు విస్తీర్ణంలో ఎలాంటి మార్పు లేదు. కాకపోతే దిగుబడి తగ్గుతోంది. ఈ కారణాల వల్ల రేట్లు పెరుగుతున్నాయి’’ అని ఈశ్వర ప్రసాద్ రెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ - నీరా కేఫ్: తాటిచెట్టు నుంచి నీరాను ఉదయాన్నే ఎందుకు తీస్తారు?
- చైనాకు శ్రీలంక లక్ష కోతులను ఎందుకు పంపిస్తోంది?
- ఆంధ్రప్రదేశ్: మిరియాలను ఎక్కడ సాగు చేయొచ్చు? పెట్టుబడి ఎంత, ఆదాయం ఎంత?
- ప్లాస్టిక్ కాలుష్యం: మైక్రోప్లాస్టిక్స్ మీరు తినే పండ్లు, కూరగాయల్లోనూ ఉండవచ్చు... అవి ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా?
- రొయ్యలు: టెక్నాలజీ సాయంతో దిగుబడి పెంచుకోవచ్చా, ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














