భారత మామిడి పళ్లు బావుంటాయా, లేక పాకిస్తాన్‌వా? ఏవి బెటర్?

- రచయిత, నియాజ్ ఫారూఖి, తర్హబ్ అస్ఘర్
- హోదా, బీబీసీ దిల్లీ, ముల్తాన్ ప్రతినిధులు
భారత్‌లోని మలీహాబాద్ మామిడి పండ్లు బావుంటాయా? లేక పాకిస్తాన్‌లోని ముల్తాన్ మామిడి పండ్లా? ఈ రెండింటిలో ఏవి బెటర్?
విరాట్ కోహ్లీ గొప్పా , లేక బాబర్ ఆజాద్ గొప్పా అని చర్చ జరిగినట్టే మామిడి పండ్లపై కూడా తరచూ చర్చ జరుగుతుంటుంది.
భారత్, పాకిస్తాన్ మామిడి పండ్లకు ప్రసిద్ధి. ప్రపంచవ్యాప్తంగా మామిడి సాగులో 40 శాతం భారత్‌లోనే ఉంటుంది. అయినప్పటికీ మామిడి పండ్ల ఎగుమతుల్లో మాత్రం భారత్, పాకిస్తాన్ దాదాపు సమానమే.
పండ్లలో రారాజైన మామిడి సాగు భారత్, పాకిస్తాన్‌లలో ఎక్కడ ఎక్కువనే చర్చ కంటే ముందు, అక్కడ సాగు చేస్తున్న మామిడి పండ్ల ప్రత్యేకత ఏంటనే విషయాలపై రెండు దేశాల్లోని రైతులతో బీబీసీ మాట్లాడింది.
మామిడి పండ్లకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయని వాటిని అమితంగా ఇష్టపడే కవి మిర్జా గాలీబ్ ఒక సందర్భంలో చెప్పారు. మొదటిది మామిడి పండ్లు తియ్యగా ఉంటాయని, చాలా రకాలు దొరుకుతాయని అన్నారు.
''ఇక్కడ చాలా వెరైటీలు దొరుకుతాయి'' అని భారత్‌కు చెందిన 'మ్యాంగో మ్యాన్' కలీముల్లా ఖాన్ అన్నారు. మలీహాబాద్‌లో ఆయన చాలా ఫేమస్.
కలీముల్లా ఖాన్ వివిధ రకాల మామిడి పండ్లను పండిస్తుంటారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన చౌసా, దసెరీ, లంగ్డా మామిడి రకాలను ఆయన పండిస్తున్నారు.
వాళ్లు మామిడిలో ఇంకా చాలా రకాల పేర్లు చెప్పారు.
ఖాసుల్‌ఖాస్, గులాబ్‌ఖాస్, షంషుల్ అస్మర్, బద్రుల్ అస్మర్, మహ్మదుల్ అస్మర్, అమిన్ కలాన్, అమిద్ ఖుర్ద్, సోర్ఖా ఖాలిస్‌పూర్, సోర్ఖా ముర్షిదాబాద్, సోర్ఖా షహబాద్, కచ్చా మీఠా, గోల్ భదైయాన్, రామ్‌కేలా, ఫజ్రి, హుస్నారా, రాతౌల్, జర్డాలు, బేగంపసంద్, గులాబ్‌జామూన్ ఇలా చాలా రకాల గురించి చెప్పారు.
ముల్తాన్ మామిడి పండ్లకు ప్రసిద్ధి. అందుకే ఇతరులు ముల్తాన్ వాళ్లతో స్నేహం చేస్తారని పాకిస్తాన్‌లోని ముల్తాన్‌కు చెందిన సోహైల్ ఖాన్ సరదాగా అన్నారు.
ముందుగా మలీహాబాద్ వెళ్లి భారత్‌లో దొరికే మామిడి పండ్ల గురించి మ్యాంగో మ్యాన్ నుంచి తెలుసుకుందాం.

ఒకే చెట్టు నుంచి 300కి పైగా మామిడి రకాలు
కొద్దివారాలుగా వాతావరణంలో మార్పుల తర్వాత కురిసిన వర్షం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మలీహాబాద్‌కు చెందిన మ్యాంగో మ్యాన్ కలీముల్లా ఖాన్ ముఖంలో సంతోషం కనిపించేలా చేసింది.
మామిడి పండ్లకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో అసాధారణ వాతావరణ పరిస్థితులు, ఎప్పుడు పడితే అప్పుడు కురిసే వర్షాలు మామిడి పండ్ల ఉత్పత్తిపై ప్రభావం చూపాయి.
''1919లో మలీహాబాద్‌లో దాదాపు 1,300 మామిడి రకాలు ఉండేవి. ఇప్పుడు 600 రకాలు కూడా లేవు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా క్రమేణా మామిడి రకాల సంఖ్య తగ్గుతోంది'' అని కలీముల్లా వాపోయారు.
మామిడి రకాలు తగ్గిపోతుండడంపై ఆందోళన చెందిన కలీమ్ ఖాన్, తన ప్రయోగాత్మక మామిడి చెట్టుతో ఆ లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చెట్టు 300కు పైగా మామిడి రకాలను ఉత్పత్తి చేస్తుందని ఆయన చెప్పారు.
కలీమ్ ఖాన్ అంటుకట్టు ప్రయోగాల వల్ల 120 ఏళ్ల నాటి ఈ మామిడి చెట్టులోని ఒక్కో కొమ్మ ఒక్కో రకం మామిడి పండ్లను ఇస్తుంది.
''వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ ఈ చెట్టు 30 రకాల మామిడి పండ్లను ఇచ్చింది'' అని కలీముల్లా వివరించారు.
వేర్వేరు పరిమాణాల్లో, వేర్వేరు రంగుల్లో ఉన్న మామిడి పండ్లతో ఈ చెట్టు కృత్రిమ చెట్టులా కనిపిస్తుంది. కానీ, నిజానికి అది ప్రజలకు కొత్త రుచులు అందించాలనే ఒక వ్యక్తి అభిరుచికి నిదర్శనం.
ఈ చెట్టు అస్రరుల్ ముకర్రర్ రకం మామిడి చెట్టు. ఈ చెట్టే ఒక తోట. మామిడి పండ్ల ప్రపంచంలో ఈ చెట్టు ఒక కాలేజీ లాంటిదని కలీముల్లా చెబుతారు. తన ప్రయోగాలు రాబోయే తరాలకు ఉపయోగపడాలన్నదే ఆయన ఆకాంక్ష.
కలీముల్లా వయసు 83 ఏళ్లు. ఇప్పటికీ దూరప్రాంతాల నుంచి నర్సరీకి వచ్చే మామిడి ప్రియులు ఆయన మామిడి పండ్ల ప్రయాణం గురించి అడుగుతుంటారు.
మామిడి చెట్లపై తన మొదటి ప్రయోగాన్ని కలీమ్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. తన మొదటి ప్రయోగం విఫలమైందని, తాను నాటిన మొక్క బతకలేదని ఆయన చెప్పారు. ఇప్పటికీ ఆ మొక్క నాటిన ప్రదేశం ఖాళీగానే ఉందన్నారాయన.

పాక్ మామిడి ఎక్కువ తీపి.. భారత్ మామిడిలో గుజ్జు, సువాసన
కలీమ్ ఖాన్ నర్సరీలో పాకిస్తాన్ మామిడి రకాలు కూడా ఉన్నాయి. వాటిలో అన్వర్ రతౌల్, చౌసా, లంగ్డా ముఖ్యమైనవి.
పాకిస్తాన్‌లోని సింధీ మామిడి గురించి గొప్పగా విని ఆ మొక్కను కూడా తెచ్చి నాటినట్లు ఆయన చెప్పారు.
అయితే, ఇరుదేశాల మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. అందువల్ల అది కచ్చితంగా సింధీ రకమేనని నిర్ధరించడం సాధ్యం కాలేదు.
దీంతో తెలిసిన వారితో ఫోన్ మాట్లాడడం, ఇంటర్నెట్‌లో ఆ రకం మామిడి గురించి చదవడం, యూట్యూబ్ వీడియోల ద్వారా ఆయన సింధీ మామిడి ఎలా ఉంటుంది, దాని రుచి గురించిన వివరాలు తెలుసుకున్నారు.
''అది మా ప్రతిష్టకు సంబంధించిన విషయం. అందులో మేము ఎలాంటి తప్పూ చేయం'' అని కలీమ్ ఖాన్ కుమారుడు నజీమ్ అన్నారు.
వాతావరణంలో వస్తున్న అసాధారణ మార్పులు, హానికారక రసాయనాలు, ద్రవ్యోల్బణం వంటి వాటి వల్ల మామిడి తోటల విస్తీర్ణం తరాలుగా తగ్గిపోతోంది. విదేశాల నుంచి పోటీ కూడా పెరుగుతోంది. కొత్త తరం రైతులు ఇతర ఆదాయ మార్గాల వైపు వెళ్లిపోతున్నారు.
మామిడి రకాల కోసం నిబద్ధతతో కృషి చేయాల్సిన అవసరం ఉందని, అయితే ఇందులో ఆదాయానికి మార్గం లేకుండా పోయిందని నజీమ్ చెప్పారు.
''కొత్త తరానికి ఇది సరిపడదు'' అని ఆయన అన్నారు.
తియ్యదనంలో పాకిస్తాన్ మామిడి మేలని, కానీ గుజ్జు, సువాసనలో భారత్ మామిడి బాగుంటుందని ఆయనఅభిప్రాయపడ్డారు.

పాకిస్తాన్ మామిడి ప్రత్యేకత ఏంటి?
పాకిస్తాన్ మామిడి పండ్ల గురించి తెలుసుకోవాలంటే నేరుగా ముల్తాన్ వెళ్లాల్సిందే.
ప్రపంచంలో దొరికే మామిడి పండ్లలో పాకిస్తాన్ మామిడి పండ్ల రుచి, రంగు వేరని ముల్తాన్ మామిడి పరిశోధన సంస్థ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అబ్దుల్ గఫార్ గ్రేవాల్ అన్నారు.
''పాకిస్తాన్, భారత్‌లో దొరికే మామిడి రకాలు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ, కొన్నేళ్లుగా పాకిస్తాన్ సెన్సేషన్ లేదా చీనాబ్ గోల్డ్ వంటి కొత్త రకాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది. భారత్ తన పాత రకాలపైనే ఆధారపడుతోంది'' అని ఆయన చెప్పారు.
పాకిస్తాన్‌లో దాదాపు 200 రకాల మామిడి పండ్ల రకాలు ఉన్నప్పటికీ, కేవలం పది మామిడి రకాలకు మాత్రమే వాణిజ్యపరంగా గుర్తింపు ఉంది.
పాకిస్తాన్‌లో కేవలం పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లోనే మామిడి సాగవుతోంది. మొత్తం పాకిస్తాన్ మామిడి ఉత్పత్తిలో పంజాబ్ వాటా 70 శాతం కాగా, మిగిలిన 30 శాతం సింధ్ రాష్ట్రం నుంచి వస్తోంది.
''పంజాబ్‌లో సుమారు 470 కిలోమీటర్ల విస్తీర్ణంలో మామిడి సాగవుతోంది. రహిమ్యార్ ఖాన్, ముల్తాన్, బహవల్‌పూర్ ప్రాంతాల్లో మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి.''

మామిడి సాగులో ఆవిష్కరణలు
ముల్తాన్‌కి చెందిన సొహైల్ ఖాన్ బాబర్ తోటలో చౌసా, లంగ్డా వంటి అనేక రకాల మామిడి చెట్లు ఉన్నాయి. నలభై ఏళ్లకు పైగా, భారీగా పెరిగిన చెట్లు కూడా ఉండడంతో వాటిని ఆయన నరికేస్తున్నారు.
అలా ఎందుకు చేస్తున్నారని అడిగితే యూహెచ్‌డీ టెక్నాలజీకి మారుతున్నట్లు ఆయన చెప్పారు.
''గతంలో మామిడి చెట్టు పెరిగి పండ్లు కాయాలంటే ఐదు, ఆరేళ్లు పట్టేది. కానీ ఇప్పుడు మూడేళ్లలోనే చెట్లు పెరిగి గతంలో వచ్చినంత దిగుబడి కూడా వస్తోంది. అదొక్కటే కాదు. చెట్లు కూడా మరీ భారీగా పెరగవు'' అని అన్నారు.
సొహైల్ ఖాన్‌తో సహా చాలా మంది ఈ నూతన విధానంలో మామిడి సాగు చేస్తున్నారు.
జలాల్‌పూర్ పీర్వాలాకు చెందిన గులామ్ ఖదీర్ కూడా తక్కువ ఎరువులు, రసాయనాలు వాడి మామిడి సాగు చేస్తున్నారు. గత మూడేళ్లుగా తన తోటలో ఆర్గానిక్ మామిడి సాగు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
''ఎరువులు ఎక్కువగా వాడకపోవడం వల్ల నీటిని ఎక్కువగా అందించే అవసరం కూడా తగ్గింది. అతిగా నీరు అందించడం కూడా చెట్టు ఎదుగుదలపై ప్రభావం చూపించేది'' అని ఆయన అన్నారు.
''చెట్టు చుట్టూ మట్టితో పాదు ఏర్పాటు చేయడం వల్ల నీరు అతిగా చెట్టు మొదలుకు చేరదు. అందువల్ల పండ్లకు కూడా హాని కలగదు'' అని సొహైల్ ఖాన్ బాబర్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ 'మామిడి దౌత్యం'
ఇటీవల పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ విదేశీ పర్యటనల వీడియోల్లో- ''పాకిస్తాన్ ఉత్తమ మామిడి పండ్లను మీకోసం తెచ్చాను'' అని ఇతర దేశాల అధినేతలతో చెప్పడం తరచుగా కనిపిస్తోంది.
దీనిని ఎక్కువ మంది మామిడి పండ్ల దౌత్యంగా అభివర్ణిస్తున్నారు.
పాకిస్తాన్ మామిడి పండ్లను బహుమతిగా ఇచ్చిన వారిలో షహబాజ్ షరీఫ్ మొదటి వారు కాదు. 1968లో అప్పటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చైనా అధ్యక్షుడు మావోకు మామిడి పండ్లను బహుమతిగా ఇచ్చారు. ఆయన ఆ బహుమతిని చరిత్రలో నిలిచిపోయేలా చేశారు.
అప్పట్లో చైనాలో సాంస్కృతిక విప్లవం నడుస్తుండడంతో మావో వాటిని తినకుండా ప్రత్యేకంగా కార్మికుల కోసం పంపారు.
చైనా మామిడి రకాలను దిగుమతి చేసుకున్న పాకిస్తాన్, మామిడి ఉత్పత్తిలో మాత్రం వెనుకబడిపోయింది.
మామిడి పండ్ల ఎగుమతిలో భారత్ తొలి స్థానంలో ఉండగా, చైనా నాలుగు, పాకిస్తాన్ ఐదో స్థానాల్లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- నాంటెరెలో ఫ్రాన్స్ పోలీసుల కాల్పులో చనిపోయిన 17 ఏళ్ల నహెల్ ఎవరు? అతడు ఏం చేస్తుంటాడు?
- వెస్టిండీస్: ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ జట్టు వరల్డ్ కప్ 2023కి ఎందుకు అర్హత సాధించలేకపోయింది?
- అజిత్ పవార్ తిరుగుబాటు: శరద్ పవార్ మరో ఉద్ధవ్ ఠాక్రే అవుతారా?
- హైడ్రోజన్: పెట్రోల్-డీజిల్, విద్యుత్‌లకు ప్రత్యామ్నాయం ఇదేనా?
- ఫ్రాన్స్: అల్లర్లు, అరెస్టులు, హింసాకాండకు 3 ప్రధాన కారణాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














