బెంగళూరు సమావేశం: విపక్షాల్లో ఇన్ని సమస్యలుంటే మోదీని ఎదుర్కోవడం సాధ్యమేనా?

విపక్ష పార్టీలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జూన్ 23న పట్నాలో సమావేశమైన విపక్ష పార్టీలు
    • రచయిత, ప్రియాంక
    • హోదా, బీబీసీ హిందీ

కాంగ్రెస్‌తో సహా దేశంలోని 26 రాజకీయ పార్టీలు కర్ణాటక రాజధాని బెంగళూరులో సోమవారం నుంచి రెండు రోజుల పాటు సమావేశమవుతున్నాయి.

ఈ విపక్ష పార్టీల ఏకైక లక్ష్యం 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని గెలవకుండా చేయడమే.

విపక్ష పార్టీల ఐక్యతకు జూన్ 23న బిహార్ రాజధాని పట్నాలో బీజం పడింది. ఆ సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా 15 విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి.

నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటం, మైనార్టీలపై జరుగుతోన్న దాడులను నిరసిస్తూ అన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యాయి.

అయితే, ఎంత కాలం ఈ సమస్యలు విపక్ష పార్టీలను ఐక్యతగా ఉంచగలవన్నది ఇక్కడ ప్రశ్న.

దిల్లీ ఆర్డినెన్స్‌ విషయంపై కాంగ్రెస్ తన వైఖరిని ప్రజల ముందు ఉంచనంత వరకు, కాంగ్రెస్ హాజరయ్యే ఏ సమావేశంలో తాను పాల్గొనమని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విపక్ష పార్టీల ఐక్యత తొలి సమావేశంలోనే షరతు పెట్టారు.

ఇది జరిగిన వెంటనే, బెంగళూరులో విపక్ష పార్టీలు సమావేశానికి ఒక్కరోజు ముందు అంటే ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఈ ఆర్డినెన్స్‌పై స్పందించింది.

దిల్లీ బ్యూరోక్రాట్లపై నియంత్రణ పెడుతూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌పై ఆమ్ ఆద్మీ చేస్తోన్న పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

ఈ ప్రకటన తర్వాత బెంగళూరులో జరిగే విపక్ష పార్టీల సమావేశానికి తాము కూడా వెళ్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. కేజ్రీవాల్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలకు సీట్ల పంపిణీ, ఉమ్మడి అభ్యర్థులను నిర్ణయించడం, ప్రాంతీయ పార్టీల లక్ష్యాలను నెరవేర్చడం వంటి ఎన్నో సవాళ్లు ఉన్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

మోదీకి పోటీ అభ్యర్ధి ఎవరు?

2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్లీ రాకుండా చూడాలని విపక్ష పార్టీలు కోరుకుంటున్నాయి.

ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాకపోతే, విపక్ష పార్టీలకు మెజార్టీ దక్కితే, ప్రధానమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారన్నది అతిపెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఏ విపక్ష పార్టీ కూడా దీనిపై ఏం మాట్లాడాలనుకోవడం లేదు. ఎందుకంటే ఈ ప్రశ్నే పెద్ద ప్రతిష్టంభన అన్నది అందరికీ తెలుసు.

సమావేశానికి ముందు కర్నాటకలో పత్రికా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, విపక్ష పార్టీల నేత ఎవరన్న ప్రశ్నపై స్పందించారు.

ప్రస్తుతం సమస్యలు చాలా ముఖ్యమైనవని అన్నారు. బీజేపీని ఓడించడమే విపక్ష పార్టీల ప్రధాన అజెండా అని చెప్పారు. విపక్ష పార్టీల నేతలకు ప్రధాని పదవి కోరిక లేదన్నారు.

ప్రధాని మోదీని ఎదుర్కొంటున్న వారిలో తాను ముందున్నానని అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించుకుంటూ ఉంటారు.

లోక్‌సభలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకే ఒక్క ఎంపీ సీటు ఉంది. ఈ సీటును జలంధర్‌లో రెండు నెలల కిందట జరిగిన ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది.

2014లో తొలిసారి నరేంద్ర మోదీ గుజరాత్‌కి బయట లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, అరవింద్ కేజ్రీవాల్ ఆయనపై వారణాసిలో పోటీ చేశారు. 3.37 లక్షల ఓట్లతో మోదీ గెలుపొందారు.

వివాదాస్పదమైన ప్రశ్నలపై స్పందించేందుకు ప్రస్తుతం విపక్ష పార్టీలు నిరాకరిస్తున్నాయని సీనియర్ పాత్రికేయులు ప్రమోద్ జోషి అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మోదీకి వ్యతిరేకంగా నిలబడే ఉమ్మడి అభ్యర్థి ఎవరన్నది ఎన్నికలయ్యేంత వరకు వేచిచూడాల్సిందే.

ఈ కూటమి పేరు కంటే ప్రధాని అభ్యర్థి ఎవరన్నదే అతిపెద్ద ప్రశ్న అని జోషీ భావిస్తున్నారు.

‘‘తొలి ప్రశ్న ఈ కూటమి పేరేంటి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అంతకుముందు దీని పేరు యూపీఏ (యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలియెన్స్)గా ఉండేది. ఇదే పేరు ఉంటుందా? లేదా కొత్త పేరు పెడతారా? ఒకవేళ కొత్త పేరు పెడితే, ప్రధాని అభ్యర్థి కూడా కొత్తవారు అవుతారు’’ అని ప్రమోద్ జోషి అన్నారు.

దేశ రాజకీయాల్లో హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌లు అప్పటికీ పెద్దగా తెలిసిన ముఖాలు కాకపోయినా, ప్రధానులు అయ్యారని ప్రమోద్ జోషి గుర్తుకు చేసుకున్నారు.

విపక్ష పార్టీలకు ప్రధాని అభ్యర్థుల జాబితాలో నితీష్ కుమార్, మమతా బెనర్జీ, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీలున్నారు.

‘‘మోదీ బలమైన నేత అని అందరూ భావిస్తున్నారు. రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంతాల వారితో కూడా మోదీ అనుసంధానమవుతున్నారు. ఇదే ఆయన ప్రత్యేకత. కానీ, ఇది విపక్ష పార్టీల నేతలలో మనం చూడలేదు. అందుకే ఎన్నికలు వచ్చేంత వరకు ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రకటించాలనుకోవడం లేదని అనిపిస్తుంది’’ అని ప్రమోద్ జోషి అన్నారు.

విపక్ష పార్టీలు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, దిల్లీ, పంజాబ్‌లో సీట్ల పంపిణీపై సమస్య రావొచ్చు

పార్టీల మధ్య ఇబ్బందులు

వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఈ పార్టీలు చాలా వరకు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. 20 లోక్‌సభ సీట్లున్న కేరళలో కాంగ్రెస్, సీపీఎంలు బద్ధ శత్రువులు.

అదే సమయంలో దిల్లీలో ఏడు లోక్‌సభ సీట్ల పంపిణీ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్‌కి విభేదాలున్నాయి. ప్రస్తుతం, దిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ సీట్లలో కూడా బీజేపీ ఎంపీలే ఉన్నారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో 22 శాతం ఓట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో, 18 శాతం ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ మూడో స్థానంలో నిలిచింది.

పంజాబ్‌లో 13 లోక్‌సభ సీట్లున్నాయి. వాటిలో ఏడు కాంగ్రెస్‌వి కాగా, ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీది. ఇలాంటి పరిస్థితుల్లో, ఒకదానికొకటి ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లను వదులుకునేందుకు సిద్ధంగా ఉంటుంది? అన్నది ప్రశ్నార్థకంగా నిలిచింది.

పంజాబ్‌లో చాలా సీట్లను కాంగ్రెస్ పార్టీ త్యాగం చేయాల్సి ఉందని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన చాలామంది నేతలు కోరుకుంటున్నారని ది ప్రింట్ రిపోర్ట్ చేసింది.

అలాగే దిల్లీలో సీట్ల పంపిణీలో కూడా వారు కాంగ్రెస్ పార్టీ నుంచి త్యాగాన్ని కోరుకుంటున్నారు.

జాతీయ స్థాయి సమస్యలపై దృష్టిపెట్టడం ప్రారంభించిన తర్వాత రాష్ట్ర స్థాయి సమస్యలు అంత ఎక్కువగా ప్రభావం చూపవని పంజాబ్‌లో రాజకీయాలను సునిశితంగా పరిశీలిస్తోన్న సీనియర్ జర్నలిస్ట్ జగ్తార్ సింగ్ తెలిపారు.

దిల్లీలో, పంజాబ్‌లో ఐక్యతా ప్రక్రియ అన్నది ఇరు పార్టీలకు పెద్ద సవాలని చెప్పారు.

‘‘బహుశా ఎవరి అభ్యర్ధి బలంగా ఉన్నారో అక్కడ వారే పోటీ చేయాలన్న దానిపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య అవగాహన కుదిరి ఉండొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీని తమ వెంట తీసుకెళ్లాలని కేవలం దిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ స్థానిక నాయకత్వం నిర్ణయించింది . కానీ, ప్రస్తుతం సమావేశం జరుగుతున్న నేపథ్యంలో స్థానిక నాయకత్వం దీనిపై ఏం మాట్లాడటం లేదు.’’ అని తెలిపారు.

కేరళ, పంజాబ్, దిల్లీలో మొత్తం 40 లోక్‌సభ సీట్లున్నాయి.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

కాంగ్రెస్ 'త్యాగం'పైనే ప్రతిపక్షాల ఐక్యత

విపక్షాల సమావేశంలో పాల్గొనే పార్టీలన్నీ రెండు వర్గాలుగా విడిపోవచ్చని ‘ది ప్రింట్’ పొలిటికల్ ఎడిటర్ డీకే సింగ్ అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్నవారు, లేని వారు అన్నవి ఈ రెండు వర్గాలు.

మొదటి వర్గం: డీఎంకే, ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, జేడీయూ, ఆర్జేడీ, సీపీఐ, సీపీఐ(ఎం), ఆర్ఎస్‌పీ, ఫార్వర్డ్ బ్లాక్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే), ఝార్ఖండ్ ముక్తి మోర్చా, యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్) వంటి 16 పార్టీలు ఉన్నాయి.

రెండో వర్గం: తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, సమాజ్‌వాదీ, రాష్ట్రీయ లోక్ దళ్, కేరళ కాంగ్రెస్ (మణి), నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ వంటి ఏడు పార్టీలు ఉన్నాయి.

బీజేపీకి నేరుగా పోటీ ఇవ్వలేని రాష్ట్రాలు ఉండటం అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ మూడో స్థానం లేదంటే అంతకంటే తక్కువ స్థానంలో ఉండడం కాంగ్రెస్‌కు అతిపెద్ద సమస్య.

గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, బిహార్ , పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పనితీరు ఏమంత బాగా లేదు.

ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ఒకటి (రాయ్ బరేలీ) గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ ఐదు సీట్లు గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో సమాజ్‌వాదీ పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని ముందుకొస్తే కాంగ్రెస్ అందుకు ఒప్పుకోకపోవచ్చని భావిస్తున్నారు.

ఇది కాకుండా, పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్‌కు రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ 22 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 18 సీట్లు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది.

బెంగాల్‌లో కాంగ్రెస్, లెఫ్ట్, టీఎంసీల మధ్యనున్న ఘర్షణాత్మక సంబంధాలు ఈ కూటమి ఐక్యతకు సమస్యగా మారవచ్చని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ఒక కథనంలో పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్ శాసనసభలో టీఎంసీకి బలమైన స్థానామున్నా, లోక్‌‌సభ సీట్లను కూడా ఆ పార్టీ వదులుకోకపోవచ్చని ప్రొఫెసర్ సంజయ్ కుమార్ అన్నారు.

ఈ ఏడాది కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయాన్ని నమోదు చేసిన సందర్భంలో మమతా బెనర్జీ ఒక వ్యాఖ్య చేశారు. ‘‘కాంగ్రెస్ తాను ఎక్కడ బలంగా ఉంటే అక్కడ పోరాడాలి. దానికి మేం మద్దతిస్తాం. అందులో తప్పేమీ లేదు. కానీ కాంగ్రెస్ కూడా ఇతర పార్టీలకు అలాగే మద్దతివ్వాలి’’ అన్నారు.

‘‘అంటే 2019 ఎన్నికల్లో రెండే సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ, మిగిలిన సీట్లను టీఎంసీకి వదిలేయాలి అని అర్ధం’’ అని డీకే సింగ్ ఈ వ్యాఖ్యల వెనకున్న అర్ధాన్ని వివరించారు.

‘‘ఉత్తరప్రదేశ్ విషయానికొస్తే, రాయ్‌బరేలీ, అమేథీలతోపాటు మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీకి సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ఇస్తుంది. ఇందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీ తన ముస్లిం ఓటు బ్యాంకును మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్‌లకు త్యాగం చేయాలి. అది కూడా తన సొంత ఓటు బ్యాంకును ఫణంగా పెట్టి’’ అని డీకే సింగ్ అభిప్రాయపడ్డారు.

ఆమ్‌ఆద్మీ, సమాజ్‌వాదీ , తృణమూల్ కాంగ్రెస్‌లకు కలిస్తే, కాంగ్రెస్‌కు గరిష్టంగా 25 నుంచి 30 సీట్లు మాత్రమే మిగులుతాయని, వీటిలోనే కాంగ్రెస్ పోటీ చేయాల్సి ఉంటుందని డీకే సింగ్ చెప్పారు. ఇందులో మళ్లీ కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలవగలదో చెప్పలేమన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీలకు స్థానమివ్వడమంటే మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, కేజ్రీవాల్‌లు కేంద్రంలో బీజేపీ ఎదుర్కొనే వ్యక్తులుగా నిలవడానికి కాంగ్రెస్ అవకాశమివ్వడమేనని డీకే సింగ్ అంటున్నారు.

ఆదిత్య ఠాక్రేతో రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఆదిత్య ఠాక్రేతో రాహుల్ గాంధీ

ఈ రాష్ట్రాల్లో సులభం కాదు

బిహార్‌లో 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. జనతాదళ్ యునైటెడ్ 2019 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. అప్పట్లో ఈ కూటమి 40 సీట్లకు గాను 39 సీట్లు గెలుచుకోగా ఒకటి కాంగ్రెస్ ఖాతాలో ఉంది.

ఇప్పుడు జేడీయూ ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి బిహార్‌లో మహాకూటమి ప్రభుత్వాన్ని నడుపుతోంది. బిహార్ లోనూ కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు రావడం కష్టమేనని అంటున్నారు.

విపక్షాల ఐక్యత మొదటి, రెండో సమావేశాల మధ్య మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఎన్సీపీ కూడా రెండు గ్రూపులుగా విడిపోయింది. ఇంతకు ముందు శివసేన కూడా విడిపోయింది.

ఎన్నికలకు ముందు శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), కాంగ్రెస్‌లు కలిసి రావడం ఇదే తొలిసారి.

2019లో మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు గాను 18 స్థానాల్లో శివసేన విజయం సాధించింది. అదే సమయంలో ఎన్‌సీపీకి నాలుగు, కాంగ్రెస్‌కు ఒక సీటు దక్కింది.

ఈ మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాల ఫార్ములా ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు.

శరద్ పవార్‌

ఫొటో సోర్స్, ANI

ఎన్‌సీపీ, ఆమ్‌ఆద్మీ బలం ఉపయోగపడుతుందా?

హాజరవుతాయా లేదా అన్న ఊహాగానాల మధ్య ఎన్సీపీ, ఆప్ పార్టీలు బెంగళూరు సమావేశానికి వస్తామని చెప్పాయి. ప్రతిపక్ష పార్టీల ఐక్యతలో ఎన్‌సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు బలహీన బంధంగా మారుతాయని సీనియర్ జర్నలిస్టు ప్రమోద్ జోషి అభిప్రాయపడ్డారు.

శరద్ పవార్‌ది ద్వంద్వ వైఖరి అని, 2014లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీ బీజేపీ మెజారిటీకి 22 సీట్ల దూరంలో ఉన్నప్పుడు శరద్ పవార్ బయటి నుంచి మద్దతు ప్రకటించారని నిపుణులు అన్నారు. రెండోసారి 2019లో రెండు మూడు రోజులు మాత్రమే ప్రభుత్వంలో ఉన్న బీజేపీతో అజిత్ పవార్ చేతులు కలపడాన్ని శరద్ పవార్ తప్పుపట్టలేదని నిపుణులు చెప్పారు.

గత ఏడాది శివసేనలో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేసి బీజేపీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడుకూడా బీజేపీతో కలవాలో లేదో తెలుసుకోవాల్సిందిగా పార్టీ లీడర్లను కనుక్కోవాల్సిందిగా ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్‌ను శరద్ పవార్ కోరారని ప్రమోద్ జోషి పేర్కొన్నారు.

మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ పాత్రపై ప్రమోద్ జోషి కూడా పెదవి విరిచారు. ఈ సమావేశానికి వస్తున్నామని చెప్పినప్పటికీ, ఆమ్‌ఆద్మీ పార్టీ కాంగ్రెస్, బీజేపీలిద్దరికీ వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని బీజేపీ బీ టీమ్‌గా ఆరోపణలు చేస్తుంటుంది.

రాష్ట్రీయ లోక్‌దళ్‌కు చెందిన జయంత్ చౌధరి కూడా ఊగిసలాట ధోరణిలో ఉన్నారని ప్రమోద్ జోషీ అన్నారు. గత యూపీ ఎన్నికల్లో ఆ పార్టీ సమాజ్‌వాదీతో పొత్తు పెట్టుకుంది. వ్యక్తిగత కారణాలు చూపి జయంత్ ఈ సమావేశానికి హాజరు కావడం లేదు.

బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జయంత్ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోందని. కానీ, బీజేపీ ఆయనపై దృష్టి పెట్టడం లేదని ప్రమోద్ జోషి అంటున్నారు. అటువంటి పరిస్థితిలో, అతని వైఖరి కూడా చెప్పడం కష్టం.

ఇన్ని సమస్యలున్నా, ఈ కసరత్తును ఒక మంచి ప్రయత్నంగానే చెబుతున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీల ఈ ఐక్యత ఎంతవరకు ఫలవంతం అవుతుందో చూడాలంటే ఇంకా పది నెలలు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)