డీమిలిటరైజ్డ్ జోన్ : అతికొద్ది మంది మాత్రమే దాటగలిగిన ఈ సరిహద్దు ప్రత్యేకత ఏంటి? అమెరికా సైనికుడు అందులోకి ఎలా వెళ్లారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అతాహువాల్ప అమెరీస్
- హోదా, బీబీసీ న్యూస్
ప్రపంచంలోని భారీగా సైనికులను మోహరించిన సరిహద్దుల్లో కొరియా డీమిలిటరైజ్డ్ జోన్ (డీఎంజెడ్) కూడా ఒకటి.
పెద్ద మొత్తంలో సైనికులు ఇక్కడ గస్తీ గాయడంతో ఈ సరిహద్దును దాటడం చాలా కష్టం. మరోవైపు రెండు దేశాల్లోనూ దీన్ని దాటడంపై నిషేధం విధిస్తూ చట్టాలను కూడా తీసుకొచ్చారు.
అందుకే ఎవరైనా ఈ సరిహద్దును దాటితే, ఆ వార్తలు హెడ్‌లైన్స్‌గా మారుతుంటాయి. దాదాపు ఏడు దశాబ్దాల చరిత్రలో గుట్టుచప్పుడు కాకుండా ఈ సరిహద్దును దాటిన వారిని వెళ్లపై లెక్కపెట్టొచ్చు.
సాధారణంగా మెరుగైన జీవితం కోసం ఉత్తర కొరియావాసులు సరిహద్దు దాటి దక్షిణ కొరియాకు వస్తుంటారు. కొందరు దక్షిణ కొరియావాసులు కూడా హక్కులపై పోరాటాల కోసం మరికొన్ని ఇతర కారణాలపై అటువైపుకు వెళ్తుంటారు.
అయితే, ప్రస్తుతం సరిహద్దుదాటిన ట్రావిస్ కింగ్ కేసు చాలా భిన్నమైనది. ఎందుకంటే ఆయన అమెరికా సైనికుడు.

దక్షిణ కొరియాలో అమెరికా మోహరించిన 28,500 మంది సైనికుల్లో ట్రావెస్ కింగ్ కూడా ఒకరు. ఆయన కావాలనే, అనుమతి లేకుండా ఉత్తర కొరియా వైపు వెళ్లినట్లు అమెరికా, దక్షిణ కొరియా వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం కింగ్ ఉత్తర కొరియాలోనే ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. ఆయనను వెనక్కి తీసుకువచ్చేందుకు ఉత్తర కొరియా సైన్యాన్ని కూడా సంప్రదించారు.
ఇదివరకు కూడా కింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. తోటి సైనికులతో గొడవలు పడటంపై ఆయనను కొన్ని రోజులు నిర్బంధంలోనూ పెట్టారు. ఆయనను తిరిగి అమెరికా పంపించాలని భావిస్తున్న సమయంలో ఆయన అక్కడి నుంచి తప్పించుకొని సరిహద్దు దాటారు.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధానికి చిహ్నం
డీఎంజెడ్ నాలుగు కి.మీ. వెడల్పు, 263 కి.మీ. పొడవుతో ఉండే ఒక జోన్. కమ్యూనిస్టు ఉత్తర కొరియా, క్యాపిటలిస్టు దక్షిణ కొరియాలను ఇది రెండుగా విభజిస్తుంది.
రెండు దేశాల మధ్య ఘర్షణకు దీన్ని చిహ్నంగా చూస్తారు. నిజానికి ఈ రెండు దేశాలు ఇప్పటికే యుద్ధంలో ఉన్నట్లే. ఎందుకంటే కొరియా యుద్ధం (1950-53) తర్వాత వీటి మధ్య ఎలాంటి శాంతి ఒప్పందమూ కుదరలేదు.
మూడేళ్లపాటు 50 లక్షల మందిని బలితీసుకున్న యుద్ధం చివర్లో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ డీమిలిటరైజ్డ్ జోన్‌ను ఏర్పాటుచేశారు.
రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటే ఈ ప్రాంతం బఫర్ జోన్‌గా ఉంటుందని భావించారు. త్వరలోనే రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం నెలకొంటుదని అప్పట్లో అనుకున్నారు. కానీ, ఆ ఒప్పందం కుదరలేదు.
1953లో పన్ముంజుమ్ నగరంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇక్కడే జాయింట్ సెక్యూరిటీ ఏరియా (జేఎస్‌ఏ) ఉంటుంది. ఇది రెండు దేశాల మధ్య చర్చలకు ప్రధాన కార్యాలయం లాంటిది. ఇక్కడ రెండు దేశాల సైనికులు ఎదురెదురుగా కూర్చొని చర్చలు జరుపుతారు.
డీఎంఎజ్ ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సరిహద్దుగా కొనసాగుతూ వస్తోంది. ఇక్కడ కూడా కొరియా సైనిక కేంద్రాలు ఉంటాయి. ఇటీవల కాలంలో విదేశీ పర్యటకులను ఈ జోన్ విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
చరిత్రను పరిశీలిస్తే..
గత ఏడు దశాబ్దాల్లో రెండు కొరియాలు కొన్ని ఘర్ణణలు, కొన్ని సుహృద్భావ పరిణామాలను చూశాయి. చాలాసార్లు చర్చలకు, కొత్త బంధాలను పెనవేసుకునేందుకు.. కొన్నిసార్లు ఘర్షణలకు ఈ డీఎంజెడ్ వేదికైంది.
1998 నుంచి 2008 మధ్య ‘సన్‌షైన్ పాలసీ’తో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలోనూ ఈ డీఎంజెడ్ ప్రధాన పాత్ర పోషించింది.
2018లోనూ పన్ముంజొమ్‌లో రెండు దేశాల నాయకులు భేటీ అయ్యారు. అంతేకాదు ఆ తర్వాత ఉత్తర కొరియా నాయకుడు యుద్ధం తర్వాత తొలిసారి దక్షిణ కొరియాలో అడుగుపెట్టారు.
2019లోనూ అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ డీఎంజెడ్‌లోనే ఉత్తర కొరియా నాయకుడి కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశమయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉద్రిక్తత.. ఘర్షణ..
డీఎంజెడ్‌ను ఉత్తర, దక్షిణ కొరియా, అమెరికా బలగాలు నిత్యం ఒక కంట కనిపెడుతూ ఉంటాయి. ఇక్కడ ప్రజలు ఇళ్లు లేదా వాణిజ్య ప్రాంతాలు ఉండవు. ఫలితంగా ఇక్కడ పచ్చని చెట్లు, జంతువులు కనిపిస్తాయి.
నిత్యం పర్యవేక్షిస్తున్నప్పటికీ చాలాసార్లు డీఎంజెడ్ పరిసరాల్లో హింస చోటు చేసుకుంటోంది. 1976లో ఉత్తర కొరియా వాసులు గొడ్డళ్లతో దాడి చేయడంతో ఇద్దరు అమెరికా సైనికులు మరణించారు.
2017లో ఒక ఉత్తర కొరియా సైనికుడు దక్షిణ కొరియాలోకి అడుగుపెట్టాడు. అతడిపై ఐదుసార్లు కాల్పులు జరిపారు. అయినప్పటికీ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.
కొంతమంది ఉత్తర కొరియా పౌరులు కూడా తరచూ ఈ సరిహద్దును దాటుతుంటారు. అదేరీతిలో కొందరు దక్షిణ కొరియా వాసులు కూడా సరిహద్దును దాటి ఉత్తర కొరియాలోకి వెళ్తుంటారు.
అయితే, ఈ సరిహద్దును దాటడం చాలా కష్టం. అందుకే చాలా మంది ఉత్తర కొరియావాసులు చైనా మీదుగా ప్రమాదకర మార్గాల్లో దక్షిణ కొరియాకు వెళ్తుంటారు.
ఉద్రిక్తలు, ఘర్షణలు అప్పుడప్పుడు పెరుగుతూ, అప్పుడప్పుడు తగ్గుతూ కనిపిస్తుంటాయి. కానీ, ఈ జోన్ మాత్రం రెండు దేశాల మధ్య దూరానికి, దేశ విభజనకు చిహ్నంగా నిలబడుతోంది.
ఇవి కూడా చదవండి:
- సంక్షోభం నుంచి శ్రీలంక నిజంగానే కోలుకుందా?
- అమీనా: నెల్సన్ మండేలా మనసుపడ్డ ఈ భారత సంతతి మహిళ ఆయన ప్రేమను ఎందుకు తిరస్కరించారు?
- ఇరాన్ : మళ్లీ వీధుల్లోకి మొరాలిటీ పోలీసులు, హిజాబ్ ధరించకుంటే విచారణ
- నెలకు రూ.5 వేలు ఇచ్చే ‘నేషనల్ యూత్ వాలంటీర్ స్కీమ్’కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- బెంగళూరు సమావేశం: విపక్షాల్లో ఇన్ని సమస్యలుంటే మోదీని ఎదుర్కోవడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















