విజయవాడ: రైల్వే స్టేషన్లకు తాళాలు పడుతున్నాయి, రెండు నెలల్లో 23 స్టేషన్లు ఎందుకు మూతపడ్డాయి?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
వందేళ్లకు పూర్వమే తెరుచుకున్న రైల్వే స్టేషన్లకు తాళాలు పడుతున్నాయి. సుదీర్ఘకాలం పాటు ప్రయాణికులకు సేవలందించిన రైల్వే స్టేషన్లకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. 2019 తర్వాత దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కూడా ఇది కొనసాగుతోంది. ఒక్క విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోనే రెండు నెలల వ్యవధిలో 23 స్టేషన్లు మూతపడ్డాయి.
సామాన్యులు చౌకగా, వేగంగా ప్రయాణించేందుకు వీలుగా ఉండే రైల్వే స్టేషన్ల మూసివేతకు కారణాలేంటి? రైల్వే స్టేషన్ల కుదింపునకు దారితీసిన పరిస్థితులేంటి? అనే అంశాలపై చర్చ జరుగుతోంది.
పల్లెలకు రైల్వే సేవలను అందుబాటులో లేకుండా చేస్తున్నారంటూ కొందరు ఈ విషయంలో విమర్శలు చేస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామీణులకు రైల్వేలను దూరం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న స్టేషన్లు కూడా మూతవేయడం ద్వారా ఉద్యోగుల కుదింపు జరుగుతుందని రైల్వే కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
అయితే నిర్వహణ భారాలను తగ్గించుకోవడం కోసమే స్టేషన్లు మూసివేయాల్సి వస్తోందని రైల్వే శాఖ అంటోంది. కనీస సంఖ్యలో కూడా టికెట్ల అమ్మకాలు జరగని స్టేషన్లను కొనసాగించడం సాధ్యం కాదని చెబుతోంది. గత కొంతకాలంగా పరిశీలించిన తర్వాత విధానపరమైన నిర్ణయాల్లో భాగంగానే స్టేషన్ల మూసివేతకు సిద్ధపడినట్టు ప్రకటించింది.

ఒకేసారి 23 స్టేషన్లు...
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మే నెలలో 16 స్టేషన్లలో కార్యకలాపాలు నిలిపివేశారు. ముఖ్యంగా ప్రయాణికులకు టికెట్ల అమ్మకాలు ఆపేశారు. ఆయా స్టేషన్లలో ఇకపై రైళ్లు ఆగబోవని ప్రకటించారు.
2023 మే 1 నుంచి ప్రయాణికులకు అందించే సేవలు నిలిపివేసి, టికెట్ల అమ్మకాలు ఆపేసిన స్టేషన్ల జాబితాలో ఆలూరు రోడ్డు స్టేషన్, బాదంపూడి, బయ్యవరం, చాగల్లు, దెందులూరు, హంసవరం, ముస్తాబాద్, నవాబ్ పాలెం, పెన్నాడ అగ్రహరం, పెద్ద అవుటపల్లి, రావికంపాడు, తాడి, శ్రీవెంకటేశ్వరాపురం, తలమంచి, తెలప్రోలు, వట్లూరు స్టేషన్లు ఉన్నాయి. గతంలో ఈ స్టేషన్లలో పాసింజర్ ట్రైన్లు ఆగగా, ఇప్పుడు వాటిని ఆపడం లేదు.
జులై 1 నుంచి ఈ జాబితాలో మరో 7 స్టేషన్లు చేరాయి. వాటిలో కొలనుకొండ, వీరవల్లి, ఉంగుటూరు, బ్రాహ్మణగూడెం, బలభద్రపురం, తిమ్మాపురం, చింతవర్లు వంటి స్టేషన్లున్నాయి.
ప్రస్తుతం ఈ స్టేషన్ల నుంచి ప్రయాణికుల రాకపోకలకు అవకాశం లేదు. టికెట్ల అమ్మకాలు నిలిపివేసి, కొన్ని చోట్ల నుంచి సిబ్బందిని వేరే ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేశారు. కొన్ని స్టేషన్లలో తాళాలు కూడా వేశారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న పశివేదల స్టేషన్ క్యాబిన్లకు తాళాలు వేసి ఉండడం బీబీసీకి కనిపించింది.
అయితే పశివేదల రైల్వే స్టేషన్ మూత వేయలేదని విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు చెప్పారు.
"తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేశాం, పూర్తిగా మూత పడినట్టు కాదు. అనేక అంశాలు పరిశీలిస్తున్నాం. తుది నిర్ణయం తీసుకోలేదు" అని పీఆర్‌వో నుశ్రత్ బీబీసీతో అన్నారు.

అంతకుముందు 31 ...
భారతీయ రైల్వేలలో ఇటీవల కీలక మార్పులు జరుగుతున్నాయి. అందులో భాగంగా పాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మారుస్తున్నారు. దాదాపుగా అవే స్టేషన్లు, అదే ట్రైన్‌ను పేరు మార్చి ఎక్స్‌ప్రెస్‌గా నడిపిన రోజులున్నాయి.
ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలు కుదింపు కొంతకాలం క్రితమే మొదలయ్యింది. ఇటీవల స్లీపర్ క్లాసులను తగ్గించడం, ఏసీ బోగీలు పెంచడం వేగంగా జరుగుతోంది. దాని కారణంగా సామాన్య ప్రయాణికులు సతమతమవుతున్నారనే వాదన ఉంది. అయినప్పటికీ రైల్వే శాఖ మాత్రం వ్యవస్థీకృత మార్పులతో వేగంగా ముందుకు సాగుతోంది.
ఆ క్రమంలోనే రైల్వే స్టేషన్ల సంఖ్య తగ్గింపు వ్యవహారం కూడా ముందుకొచ్చింది. కరోనా కాలంలోనే 2021లో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని వివిధ డివిజన్లలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.
జోన్ పరిధిలో ఉన్న సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్ , నాందేడ్ డివిజన్ల పరిధిలో ఉన్న 31 స్టేషన్లను 2021 ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో మూసివేశారు. అప్పట్లో తాత్కాలికంగా అక్కడి నుంచి కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆ తర్వాత మళ్లీ రాకపోకలు పునరుద్ధరించిన జాడ లేదు.
దాంతో కరోనా తర్వాత మూడేళ్ల వ్యవధిలోనే ఒక్క దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 54 రైల్వే స్టేషన్లను కుదించినట్టు అధికారికంగా వెల్లడయ్యింది. దేశవ్యాప్తంగా ఇలాంటివి వందల సంఖ్యలో ఉంటాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.

కారణాలేంటి?
కరోనా కాలంలో వివిధ రైళ్లు రద్దయ్యాయి. అందులో ప్రధానంగా పాసింజర్ సర్వీసులు నిలిచిపోయాయి. దానికి ముందే పాసింజర్లను కూడా ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చడంతో కొన్ని స్టేషన్లకు రైళ్ల రాకపోకలు పరిమితమయిపోయాయి. దాంతో ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది.
కొన్ని స్టేషన్లలో నామమాత్రపు సంఖ్యలో కూడా ప్రయాణికులు రావడం లేదు. దాంతో సిబ్బంది జీతభత్యాలు, స్టేషన్ల నిర్వహణ సహా అనేకం భారంగా మారుతున్నాయి.
నిజానికి కొన్నేళ్ల క్రితం నుంచే ఆయా స్టేషన్లలో టికెట్ల అమ్మకం వంటివి ప్రైవేట్ ఏజన్సీల ద్వారా జరుగుతోంది. కమిషన్ల పద్ధతిపై కార్యకలాపాలు జరిగేవి. ఇప్పుడు ఆదాయం లేదనే పేరుతో మొత్తంగా మూసివేస్తున్నారు.
రోజుకు కనీసంగా 25 టికెట్లు కూడా అమ్ముడుపోని స్టేషన్లను మూసివేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది.
"విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా ఇది జరుగుతోంది. రైల్వే శాఖ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మూసివేసిన స్టేషన్ల నుంచి పెద్దగా కార్యకలాపాలు లేవు. ప్రయాణికుల సంఖ్య నామమాత్రం. వాటిని కొనసాగించడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. అందుకే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ ఎం. మండ్రూప్కర్ బీబీసీకి తెలిపారు.
ప్రస్తుతం కార్యకలాపాలు నిలిపివేసిన స్టేషన్లలో పెద్దగా ప్రయాణికులు కనిపించకపోవడంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని, ఇది ఎవరికీ అసౌకర్యం కలిగించే నిర్ణయం కాబోదని ఆమె అభిప్రాయపడ్డారు.

వచ్చి వెళ్లిపోతున్నారు...
విజయవాడకి చేరువలో ఉన్న పెద అవుటపల్లి నుంచి విజయవాడకు మంత్లీ రైల్వే పాస్ సుమారుగా రూ. 150గా ఉండేది. దాంతో ఆ స్టేషన్ నుంచి పది మంది వరకూ విద్యార్థులు, మరో పది మంది ఉద్యోగులు రోజూ వెళ్లి వచ్చేవారు.
ఉదయం కాకినాడ - విజయవాడ మెమూ పాసింజర్ రైలుకు వెళ్లి, సాయంత్రం మళ్లీ అదే రైలుకి తిరిగి వచ్చే వారు కనిపించేవారు. కానీ ప్రస్తుతం పెద అవుటపల్లి కూడా మూతపడిన స్టేషన్ల జాబితాలో ఉంది.
"విజయవాడ చదువుకోవడానికి వెళ్లే వాళ్లు, రాజమండ్రి, ఏలూరు వైపు వెళ్లే చిరు వ్యాపారులు, సామాన్య ప్రయాణికులు రైలు కోసం వచ్చి ఇక్కడ ఆగడం లేదని తెలిసి నిరాశతో వెళ్లిపోతున్నారు. స్వస్థత సభలు వంటివి జరిగినప్పుడు ఒకే రోజు ఈ స్టేషన్ నుంచి 200, 300 మంది వరకూ ప్రయాణించిన సందర్భాలున్నాయి. చాలామందికి సౌకర్యంగా ఉండేది. కానీ ఇప్పుడు మూసేసిన తర్వాత వాళ్లంతా సతమతమవుతున్నారు. బస్సు మీద వెళ్లే విద్యార్థులకు అదే మంత్లీ పాస్ కోసం రూ. 400 వరకూ అవుతుంది. ఇది వాళ్లకు చాలా భారంగా మారుతుంది" అని పెద అవుటపల్లి రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న అప్పలనాయుడు అనే ఉద్యోగి అన్నారు.
"మొదట రాయగడ తీసేశారు.. ఆ తర్వాత ఫాస్ట్ పాసింజర్ తీసేశారు. చివరకు ఇప్పుడు ఏ ట్రైన్ కూడా ఆగదని అంటున్నారు. ట్రైన్లు లేకుండా ప్రయాణికులు ఎక్కడం లేదని ఎలా చెబుతారు" అని ఆయన బీబీసీతో అన్నారు.
‘‘మనం ఊరెళ్దామంటే చిన్న చిన్న స్టేషన్లన్నీ క్యాన్సిల్ చేశారంట. రూ. 20, 30కి వెళ్ళే ప్రయాణాలకు ఇప్పుడు రూ.40 అవుతుంది. కరోనాకు ముందు ఉన్న స్టేషన్లన్నీ కొనసాగించాలని కోరుకుంటున్నాం’’ అని చాగల్లుకు చెందిన పి.నిర్మల అనే ప్రయాణికురాలు అన్నారు.

ప్రైవేటీకరణలో భాగమే...
గ్రామీణుకులకు రైల్వే సేవలను దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని రైల్వే ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. తొలుత పాసిజంర్లు తీసేసి, ఆ తర్వాత వాటి చార్జి పెంచేసి, ఇప్పుడు ప్రయాణికులు రావడం లేదనే కారణంతో స్టేషన్లు కూడా కుదించడం రైల్వేలను గ్రామీణులకు దూరం చేయడమేనని రైల్వే ఉద్యోగుల సంఘం నాయకుడు వి. ఉమామహేశ్వర రావు అన్నారు.
‘‘పల్లె ప్రజలకు రైల్వేల ద్వారా అనేక సౌకర్యాలున్నాయి. ప్రతీ స్టేషన్లో మూడు, నాలుగు రైళ్లు ఆగిన కాలంలో అన్ని చోట్లా సందడి ఉండేది. కేవలం రోజుకు ఒక్క రైలు మాత్రమే మిగిల్చి, దానికి సరిపడా టికెట్లు అమ్ముడుపోవడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇదంతా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా రైల్వేలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నంలో భాగమే. అందుకు తగ్గట్టుగా సిబ్బందిని కుదిస్తున్నారు. ఒకనాడు రైల్వేలు లాభాల్లో నడిచి, ఇప్పుడు నష్టాలు వస్తుంటే వాటికి కారణం గ్రామీణ స్టేషన్లు అంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఒక్కో స్టేషన్ మూసివేత ద్వారా కనీసంగా అరడజను మంది ఉద్యోగాలు కుదింపు జరుగుతోందని, తద్వారా రైల్వేలను సామాన్యులకు దూరం చేస్తున్నారని ఉమా మహేశ్వర రావు అన్నారు. స్పీడ్ ట్రైన్లు తీసుకురావడం, సౌకర్యాలు మెరుగుపరచడం పట్ల జనం సంతృప్తి చెందుతుంటే, ఉన్న సేవలను తొలగించడం సమంజసం కాదని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సంక్షోభం నుంచి శ్రీలంక నిజంగానే కోలుకుందా?
- అమీనా: నెల్సన్ మండేలా మనసుపడ్డ ఈ భారత సంతతి మహిళ ఆయన ప్రేమను ఎందుకు తిరస్కరించారు?
- ఇరాన్ : మళ్లీ వీధుల్లోకి మొరాలిటీ పోలీసులు, హిజాబ్ ధరించకుంటే విచారణ
- నెలకు రూ.5 వేలు ఇచ్చే ‘నేషనల్ యూత్ వాలంటీర్ స్కీమ్’కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- బెంగళూరు సమావేశం: విపక్షాల్లో ఇన్ని సమస్యలుంటే మోదీని ఎదుర్కోవడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















