ఉత్తర కొరియా: అమెరికా సైనికుడి అరెస్టు, అక్రమంగా సరిహద్దు దాటినందుకేనా?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, ఆంటోనిట్ రాడ్‌ఫోర్డ్
- హోదా, బీబీసీ న్యూస్
సరిహద్దు దాటాడాన్న ఆరోపణలపై అమెరికా సైనికుడిని ఉత్తర కొరియా అదుపులోకి తీసుకుందని ఐక్యరాజ్యసమితి కమాండ్ తెలిపింది.
ఆ వ్యక్తి వద్ద ఎలాంటి అధికార పత్రం లేదని, డీమిలటరైజ్డ్ జోన్, జాయింట్ సెక్యూరిటీ ఏరియా(జేఎస్ఏ)ను పర్యవేక్షించే ఐక్యరాజ్యసమితి కమాండ్ చెప్పింది.
‘‘ఈయన ప్రస్తుతం డీపీఆర్‌కే(డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా) కస్టడీలో ఉన్నారని మాకు తెలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు మా కేపీఏ ప్రతినిధులతో మాట్లాడుతున్నాం’’ అని తెలిపింది.
ఈ విషయంపై స్పందించేందుకు అమెరికా విదేశాంగ శాఖను బీబీసీ న్యూస్ సంప్రదించింది.
నవ్వుకుంటూ బోర్డర్ వైపు పరిగెత్తాడు: ప్రత్యక్ష సాక్షి
అమెరికా సైనికుడు సరిహద్దు దాటేటప్పుడు చూసిన ఒక వ్యక్తి బీబీసీ యూఎస్ పార్టనర్ సీబీఎస్ న్యూస్‌తో ఆ విషయాన్ని పంచుకున్నారు.
‘‘ఉత్తర కొరియా సరిహద్దు వైపు ఉన్న కొన్ని భవంతుల మధ్యలో పరిగెత్తుకుంటూ వెళ్లే ముందు ఆయన గట్టిగా నవ్వారు. నేను మొదట ఇదేదో జోక్ అనుకున్నా. కానీ, ఆ వ్యక్తి తిరిగి వెనక్కి రాలేదు. ఆ తర్వాత ఇది జోక్ కాదని నాకర్థమైంది. వెంటనే ప్రతి ఒక్కరూ స్పందించారు. ఆ వ్యక్తి సరిహద్దు దాటినప్పుడు ఉత్తర కొరియా సైనికులెవరూ మాకు కనిపించలేదు. ’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
ఉత్తర కొరియా అదుపులోకి తీసుకున్న అమెరికా పౌరుడు సైనికుడేనని సీబీఎస్ న్యూస్ తెలిపింది.
ఉత్తర కొరియాలోకి వెళ్లిన సైనికుడు ప్రైవేట్ రెండో తరగతికి చెందిన ట్రావిస్ కింగ్ అని అధికారులు తెలిపినట్లు సీబీఎస్ న్యూస్ రిపోర్ట్ చేసింది.
కావాలనే ఆయన సరిహద్దు దాటారని, కానీ ఆయన ఉద్దేశ్యం ఏంటన్నది అస్పష్టంగా ఉందని డిఫెన్స్‌కు చెందిన అధికారులు తెలిపారు.
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్యలో జాయింట్ సెక్యూరిటీ ఏరియా వద్ద చేపట్టిన ఓరియెంటేషన్ టూర్‌లో ట్రావిస్ కింగ్ సరిహద్దు దాటారని పలు న్యూస్ ఏజెన్సీలు తెలిపాయి.
ప్రస్తుతం ఉత్తర కొరియా కస్టడీలో ఉన్న ఒకే ఒక్క అమెరికా పౌరుడు ఇతనే.
గతంలోనూ ఇలాంటి ఘటనలు
కేపీఏ అంటే నార్త్ కొరియా ఆర్మీ. ఉత్తర కొరియా సైన్య వ్యవస్థ ఇది. డీమిలటరైజ్డ్ జోన్(డీఎంజెడ్) రెండు కొరియాలను విడదీస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ రక్షణాత్మక ప్రాంతాల్లో ఇదొకటి.
ఈ ప్రాంతమంతా ల్యాండ్‌మైన్లతో ఉంటుంది. దీని చుట్టూ ఎలక్ట్రిక్, ముళ్లతీగతో రక్షణ ఏర్పాటు చేశారు. నిరంతరం ఒక కంట కనిపెట్టే నిఘా కెమెరాలుంటాయి. 24 గంటలు సాయుధ దళాలు అలర్ట్‌గా ఉంటాయి.
1950లలో కొరియా యుద్ధం తర్వాత రెండు దేశాలను డీమిలటరైజ్డ్ జోన్ విడదీసింది.
యుద్ధ విరమణ సంధితో ఈ యుద్ధం ముగిసింది. అంటే సాంకేతికంగా చూస్తే ఇరు దేశాలు ఇంకా యుద్ధంలో ఉన్నట్లే.
పేదరికం, తీవ్ర ఇబ్బందులతో ప్రతి సంవత్సరం ఉత్తర కొరియా నుంచి వేల సంఖ్యలో ప్రజలు పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.
డీఎంజెడ్ చుట్టూ ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన వ్యవస్థ చాలా ప్రమాదకరంగా ఉంటోంది. దీని దాటుకుని వెళ్లడం చాలా కష్టం.
2017లో ఒకసారి ఉత్తరకొరియా సైనికుడు ఒకరు ఏకంగా దక్షిణకొరియాలోకి పారిపోవడానికి సరిహద్దు దాటారు. ఆయన్ని వెంబడించిన సహచర ఉత్తర కొరియా సైనికులు కాల్పులు జరిపారు.
ఇరు దేశాల మధ్య ఉన్న సంయుక్త భద్రతా ప్రాంతం (జేఎస్ఏ) వద్ద సరిహద్దు దాటాలని ఆయన ప్రయత్నించారు.
ఒక జీపులో వేగంగా సరిహద్దు దాటాలని చూడగా.. ఉన్నట్టుండి జీపు చక్రం ఒకటి విరిగిపోయింది. దీంతో ఎలాగైనా ఉత్తర కొరియా నుంచి బయటపడాలని దక్షిణ కొరియా వైపు పరిగెత్తారు.
ఈ హఠాత్ పరిణామానికి ఖంగుతిన్న ఉత్తర కొరియా సైనికులు వెంటనే స్పందించి ఆయన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు.
మొత్తం 40 సార్లు అతనిపై కాల్పులు జరిపారు. ఉత్తర కొరియా సైనికుల చేతిలో గాయపడి ఆస్పత్రి పాలైన ఆ సైనికుడు, చివరికి ప్రాణాలతో బయటపడ్డారు.

ఫొటో సోర్స్, EPA
ఇంతకు ముందు కూడా....
కరోనాకు ముందు ప్రతి ఏడాది ఉత్తర కొరియా నుంచి చైనాకు వెయ్యి మందికి పైగా ప్రజలు వలస వెళ్లేవారని దక్షిణ కొరియా ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి.
ప్రస్తుతం ఉత్తర కొరియా కస్టడీలో ఆరుగురు దక్షిణ కొరియన్లు ఉన్నారు.
2017 నుంచి అమెరికా, ఉత్తర కొరియా మధ్యనున్న సంబంధాలు క్షీణించాయి. అంతకు ముందు ఏడాదే అమెరికా విద్యార్థి ఒకరిని ఉత్తర కొరియా అరెస్ట్ చేసింది. అతను కోమాలోకి వెళ్లాక, అమెరికాకు తిప్పి పంపించింది. ఆ తర్వాత విద్యార్థి మరణించారు.
2018లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ముగ్గురు అమెరికా పౌరులు కూడా ఉత్తర కొరియా నుంచి విడుదలయ్యారు. కిమ్ జోంగ్ ఉన్‌కి, మాజీ అధ్యక్షుడికి జరిగిన వరుస చర్చలతో ఆ దేశాల మధ్య సంబంధాలు కాస్త మెరుగుపడ్డట్టు కనిపించాయి.
అమెరికా, దాని సన్నిహిత దేశాలు విధించే ఆంక్షల నడుము ఉత్తర కొరియా పలు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది.
1981 తర్వాత తొలిసారి అమెరికా న్యూక్లియర్ సామర్థ్యపు సబ్‌మెరైన్ దక్షిణ కొరియా చేరుకున్న రోజే అమెరికా పౌరుడిని ఉత్తర కొరియా అదుపులోకి తీసుకుంది.
ఉత్తర కొరియా నుంచి పొంచి ఉన్న న్యూక్లియర్ ముప్పును ఎదుర్కొనేందుకు ఈ సబ్‌మెరైన్ సాయం చేయనుంది.
ఇవి కూడా చదవండి:
- జపాన్: 2019 తరువాత ఆ దేశంలో అడుగుపెడుతున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు
- ఉత్తర కొరియా- కిమ్ జోంగ్ ఉన్: మిలిటరీ గొప్పలు, ప్రచార యావ ప్రజలను ఆకలి చావులవైపు నడిపిస్తున్నాయా?
- కిమ్ జోంగ్ ఉన్ అధికారాన్ని కూతురుకు కట్టబెట్టనున్నారా?
- ఉత్తర కొరియా: 2023లో కిమ్ అణుబాంబును పరీక్షిస్తారా? ఉభయ కొరియాల మధ్య ఘర్షణ జరుగుతుందా?
- కిమ్ జోంగ్ ఉన్: దీపావళి టపాకాయల్లా మిసైళ్లను పేలుస్తున్న ఉత్తరకొరియా అధినేత, అసలు లక్ష్యం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














