జపాన్: 2019 తరువాత ఆ దేశంలో అడుగుపెడుతున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జీన్ మెకెంజీ, షైమా ఖలీల్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
దక్షిణ కొరియా, జపాన్ దేశాధినేతలు గురువారం టోక్యోలో సమావేశం అవుతున్నారు.
ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు విచిత్రంగా ఉంటాయి. ఓ పక్క భేదాభిప్రాయాలు, వైరం.. మరో పక్క స్నేహానికి ప్రయత్నం.
ఈ నేపథ్యంలో, గురువారం సమావేశం ప్రాముఖ్యం సంతరించుకుంటుందని నిపుణులు అంటున్నారు. 2011 తరువాత ఇరు దేశాలు సమావేశం కావడం ఇదే తొలిసారి.
దక్షిణ కొరియా మొదటి అడుగు వేసింది..
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఈ సమావేశం కోసం చాలా త్యాగాలే చేయాల్సి వచ్చింది. అభిప్రాయభేదాలన్నీ పక్కనపెట్టి ముందడుగు వేశారు.
గత 12 ఏళ్లల్లో సౌత్ కొరియా అధ్యక్షుడికి టోక్యో నుంచి పిలుపు రావడం ఇదే తొలిసారి.
ఈ రెండు దేశాల మధ్య చారిత్రకంగా శత్రుత్వం ఉంది. 1910 నుంచి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేవరకు సౌత్ కొరియా.. జపాన్ వలసరాజ్యంగా ఉండేది. సుమారు 35 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోయింది.
వేలాదిమంది సౌత్ కొరియాన్లు జపాన్ గనులు, కర్మాగారాల్లో బానిసలుగా పనిచేసేవారు. మహిళలు లైంగిక బానిసత్వానికి లోనయ్యారు.
1945లో దక్షిణ కొరియాకు జపాన్ నుంచి విముక్తి లభించింది. 1945 ఆగస్టు 15న ఆ దేశానికి స్వాతంత్రం వచ్చింది.
ఇది జరిగి దశాబ్దాలు గడిచినప్పటికీ సౌత్ కొరియా ఈ అవమానాలను మరచిపోదు, క్షమించదు.
రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో జపాన్ కర్మాగారాల్లో బానిసలుగా పనిచేసిన సౌత్ కొరియన్లకు ఆ దేశం పరిహారం చెల్లించాలని సౌత్ కొరియా ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తూ వచ్చింది.
కానీ, గత వారం సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ ఈ డిమాండ్‌ను విరమించుకున్నారు. బదులుగా స్వదేశమే వారికి పరిహారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఆవిధంగా, యూన్ గతాన్ని పక్కనపెట్టే ప్రయత్నంచేశారు. ఈశాన్య ఆసియా దేశాల భద్రతకు ఇది ముఖ్యమని భావించారు.
సౌత్ కొరియాలో ప్రతిపక్షాలు ఈ డీల్‌ను తమ దేశ చరిత్రలో "అత్యంత అవమానకర ఘటన"గా పేర్కొన్నాయి.
కానీ, అదే యూన్‌కు టోక్యో ఆహ్వానం అందించింది. ఈ పరిణామాల పట్ల దౌత్యవేత్తలు ఆశ్చర్యపోయారు. సంతోషించారు కూడా. యూన్ ధైర్యంగా ముందడుగు వేసినట్లు భావించారు. అంతగా రాజకీయానుభవం, విదేశాంగ విధానంలో అనుభవం లేని వ్యక్తికి ఇది సాహసోపేతమైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు.
దక్షిణ కొరియా అధ్యక్షుడు కాకముందు, యూన్ ఒక న్యాయవాది. పదవిని చేపట్టాక జపాన్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి పెద్దపీట వేశారు. సౌత్ కొరియా విదేశాంగ విధానాంలో ఇదొక ముఖ్యమైన పర్వంగా భావించారు.
ఇటు చూస్తే, ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు జరుపుతూ, అణుశక్తి పెంచుకుంటోంది. అలాంటప్పుడు జపాన్‌తో కలిసి పనిచేయడం, స్నేహ సంబంధాలు నెరపడం సౌత్ కొరియకు లాభదాయకమవుతుంది. రెండు దేశాల మధ్య సైన్య సహకారం, గూఢచర్య సహకారం మేలు చేస్తుంది.
మరోపక్క అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికి కూడా యూన్ ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికే స్నేహసంబంధాలు ఉన్నాయి. వాటిని మరింత బలపరచుకోవాలని భావిస్తున్నారు.
ఇది అమెరికాకూ మంచిదే. చైనా ఎదుగుదలను ఎదుర్కోవడానికి తన భాగస్వామ దేశాలకు మరింత చేరువ కావాలని ప్రయత్నిస్తోంది అమెరికా.
యూన్ జపాన్ డీల్ "మార్పు దిశగా ఓ సరికొత్త అధ్యాయం" అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసించారు. ఆ మర్నాడే వైట్ హౌస్‌ను సందర్శించాల్సిందిగా యూన్‌కు ఆహ్వానం పంపారు.
అంతేకాకుండా, ఉత్తర కొరియాపై దక్షిణ కొరియా దృక్పథం కూడా మార్చాలనుకుంటున్నారు యూన్. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో దక్షిణ కొరియా పెద్ద పాత్ర పోషించగలదని, అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని యోచిస్తున్నారు. మే నెలలో జపాన్‌లోని హిరోషిమాలో జరగబోయే జీ7 సదస్సుకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, సౌత్ కొరియాని ఆహ్వానిస్తే యూన్ లక్ష్యం నెరవేరినట్టే.
దీనివల్ల ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి. 2019లో ఇరు దేశాల మధ్య సంబంధాలు వీగినప్పుడు జపాన్.. సౌత్ కొరియాకు అవసరమైన రసాయనాల ఎగుమతులపై పరిమితులు విధించింది. ఈ ఆంక్షలను సడలించేలా చేయడం సౌత్ కొరియాకు అతిముఖ్యం అని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
రెండు దేశాల మధ్య గురువారం జరగనున్న సమావేశం చారిత్రక గాయాలకు మందుపూస్తుందని భావిస్తున్నారు.
ఒక సీనియర్ దౌత్యవేత్త మాటల్లో చెప్పాలంటే, "సౌత్ కొరియా డాన్స్ ఫ్లోర్‌పైకి వెళ్లి, లైట్లువేసి తనతో డాన్స్ చేయమని జపాన్‌కు చేయి అందించింది. అందుకు జపాన్ ఒప్పుకుంది. కానీ, సౌత్ కొరియా అంతకన్నా ఎక్కువే ఆశిస్తోంది".

ఫొటో సోర్స్, Reuters
జపాన్‌కు కూడా ఇది వ్యూహాత్మకంగా లాభం
ఈ సమావేశంలో సౌత్ కొరియా అధ్యక్షుడికి మాట్లాడవలసిన అంశాలు చాలానే ఉన్నాయి. అవి కాకుండా, తనకు చాలా ఇష్టమైన వంటకం "ఒమురైస్"ను ఆస్వాదించే ప్లాన్ కూడా ఉందని స్థానిక మీడియా చెబుతోంది. ఒమురైస్ అంటే ఫ్రైడ్ రైస్‌పై ఆమ్లెట్ వేసి అలంకరిస్తారు.
మీటింగ్ తరువాత జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా, యూన్‌ను ప్రఖ్యాత రెస్టారెంట్ రెంగాటేకి తీసుకెళతారని కథనాలు వస్తున్నాయి.
"స్నేహం కోసం మరో అడుగు ముందుకు" అంటూ స్థానిక చానెళ్లు అభివర్ణిస్తున్నాయి. సోషల్ మీడియలో దీన్ని "ఒమురైస్ దౌత్యం" అంటున్నారు.
ఇది కాకుండా, ఇరు దేశాల విదేశాంగ, రక్షణ శాఖల అధికారులు కూడా భద్రత అంశాలపై చర్చల్లో పాల్గొంటారని జపాన్ న్యూస్ ఏజెన్సీ క్యోడో తెలిపింది.
ఈ స్నేహం ద్వారా రెండు దేశాలు కచ్చితంగా లాభపడతాయి. అయితే, ఇది జపాన్‌కు వ్యూహాత్మక, దౌత్యపరమైన గెలుపు. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన జపాన్ మే నెలలో హిరోషిమాలో జీ7 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనుంది.
గురువారం సమావేశంలో నార్త్ కొరియా, చైనాల నుంచి పొంచి ఉన్న ముప్పు ఎజెండాలో ప్రధానాంశం అవుతుంది. సౌత్ కొరియాతో సన్నిహిత భద్రతా సంబంధాలు జపాన్‌కు మరింత స్థిరత్వం తీసుకొస్తాయి.
ఇది అమెరికాకు జపాన్ పంపించే ఒక ముఖ్యమైన సందేశం కూడా. అస్థిరత పెరుగుతున్న ప్రాంతంలో ఇప్పటికీ జపాన్ తమకు కీలకమైన మిత్రదేశమని, దానిపై భరోసా ఉంచవచ్చన్న సందేశాన్ని అమెరికాకు పంపినట్టవుతుంది.

ఫొటో సోర్స్, AFP
2019లో జపాన్, సౌత్ కొరియాల మధ్య సంబంధాలు క్షీణించినప్పటి నుంచి సౌత్ కొరియా అధ్యక్షులు ఎవరూ జపాన్ పర్యటనకు వెళ్లలేదు.
జపాన్ ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
గతాన్ని పక్కకు పెట్టాలని సౌత్ కొరియా నిర్ణయించుకోవడంతో, అందరిలో ఆసక్తి, ఉత్సాహం చెలరేగాయి.
జపాన్ ప్రధాని కిషిడా ఈ నిర్ణయాన్ని కొనియాడారు. విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి "ఇరుదేశాల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలకు ఇది నాంది" అన్నారు.
కానీ, ఇరు దేశాల నాయకులకూ ఇది సులభమైన ప్రయాణం కాబోదు. చారిత్రంగా ఉన్న అవిశ్వాసం, ఆగ్రహం మధ్యలో కలుగచేసుకోవచ్చు.
ప్రస్తుతం ఇరు దేశాలకు ఒకే ముప్పు, ఆందోళన... నార్త్ కొరియా క్షిపణి పరీక్షలు. ఈ వారం ఉత్తర కొరియా రెండు అల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను జపాన్ సముద్రంలోకి ప్రయోగించింది. త్వరలో అణ్వాయుధాల పరీక్షలు జరుపుతుందనే భయం ఉంది.
మరోవైపు, చైనా దూకుడుగా విస్తరిస్తోంది. సోలమన్ దీవులలో చైనా స్థావరాలు ఏర్పాటు చేస్తోందన్న అనుమానంతో అమెరికా, దాని మిత్రదేశాలు కలవరపడుతున్నాయి.
గత నెల అమెరికా, చైనా నిఘా బెలూన్‌ను పడగొట్టిన తరువాత జపాన్ స్పందిస్తూ, 2019 నుంచి తమ దేశంపై కూడా మూడు గుర్తుతెలియని పరికరాలు ఎగురుతున్నాయని, అవి చైనాకు చెందిన నిఘా బెలూన్లేనని సందేహపడుతున్నట్టు ప్రకటించింది.
తమ దేశ గగనతలాన్ని విదేశీ బెలూన్లు ఉల్లంఘించకుండా చూసే నిబంధనలను సత్వరమే సమీక్షిస్తామని జపాన్ విదేశాంగ శాఖ తెలిపింది. అలాంటి బెలూన్లు కనిపిస్తే నేలకూల్చడానికి వెనుకడమని స్పష్టం చేసింది.
చైనా, తైవాన్‌పై దురాక్రమణను పాల్పడవచ్చన్న ఆందోళన కూడా జపాన్‌కు ఉంది.
యుక్రెయిన్ యుద్ధం విషయంలో చైనా, రష్యా వైపు మొగ్గుతున్న కొద్దీ ఈ ఆందోళనలు మరింత తీవ్రమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సౌత్ కొరియా, జపాన్ దేశాల మధ్య సమావేశం ఆసక్తి రేపుతోంది.
ఇవి కూడా చదవండి:
- ఉప్పు తగ్గించాలంటూ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక.. రోజుకు ఎంత ఉప్పు తినడం మేలు?
- యుక్రెయిన్‌లో ఆరు నెలల పాటు దాక్కుని దొరికిపోయిన రష్యా సైనికుడు
- ఇమ్రాన్ ఖాన్‌ను గురువారం ఉదయం 10 గంటల వరకు అరెస్ట్ చేయొద్దు: లాహోర్ హైకోర్టు
- వానరాలకు ఉన్నట్లుగా మన దేహమంతటా దట్టమైన జుత్తు ఎందుకు లేదు? ఈ మానవ పరిణామానికి, సెక్స్‌కు సంబంధం ఏమిటి?
- తెలంగాణ: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం ఎలా జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














