జపాన్‌: కొత్త తరం వ్యాపారులను తయారు చేసేందుకు ఒక పాఠశాల

వీడియో క్యాప్షన్, సిలికాన్ వ్యాలీకి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న జపాన్‌లోని ఒక చిన్న పట్టణం

విద్యార్థులకు స్టార్టప్స్‌లో శిక్షణ కోసం 1.5 ట్రిలియన్ డాలర్ల పెన్షన్ నిధుల్లోంచి సాయం అందిస్తామని ప్రకటించింది జపాన్.

దాంతో టోక్యో, ఒసాకా వంటి బడా నగరాల్లోనే ఈ కార్యక్రమాలు జరుగుతాయని చాలా మంది భావించారు.

కానీ దానికి భిన్నంగా కొన్ని చిన్న పట్టణాలు కూడా కొత్త తరహా విద్యాలయాలతో ముందుకు వస్తున్నాయి.

టొకుషిమా నుంచి బీబీసీ ప్రతినిధి మరీకో ఓయ్ అందిస్తున్న కథనం.

టొకుషిమా పచ్చని కొండలకు, గ్రామీణ వ్యవసాయానికి పెట్టింది పేరు.

దక్షిణాన షికొకు దీవిలో ఉండే ఈ పట్టణంలో దాదాపు యాభయ్యేళ్లుగా జనాభా తగ్గిపోతోంది. వృద్ధుల శాతం పెరిగిపోతోంది.

5 వేలకన్నా తక్కువ జనాభా ఉన్న ఈ పట్టణంలో ఇప్పుడు ఒక కొత్త బోర్డింగ్ స్కూల్ నిర్మాణమవుతోంది. జపాన్‌లో కొత్త తరం వ్యాపారులను తయారు చేసే ఉద్దేశంతో ఈ స్కూలును నిర్మిస్తున్నారు. 15 నుంచి 20 ఏళ్ల వయసు గల యువత ఇందులో విద్యాభ్యాసం చేస్తారు. ఈ వినూత్నమైన స్కూలు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది.

దీని రూపశిల్పి చికాహిరో టెరాడా. టోక్యో నుంచి నడిచే సాన్సన్ అనే స్టార్టప్‌కు ఆయన బాస్. బిజినెస్ కార్డులను డిజిటలైజ్ చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. ఆయనది ఈ ఊరు కాదు, కానీ ఓ స్థానిక వ్యాపారితో టీమ్ అప్ అయ్యి టొకుషిమాను ఎంచుకున్నారు.

ఇప్పుడు 30కి పైగా కంపెనీలు దీని వెనుక నిలబడ్డాయి. వీటిలో చాలా వరకు జపాన్ కంపెనీలే కాగా.. డెలాయిట్ లాంటి అంతర్జాతీయ కంపెనీలు కూడా ఉన్నాయి.

దేశంలో ఎలైట్ స్టూడెంట్స్ అందరూ ఇటీవలి వరకూ బడా కార్పొరేట్ కంపెనీల్లోనే చేరాలని కోరుకుంటూ ఉండేవారు. కానీ ఈయన ప్రణాళిక పట్ల ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. మొదటి 40 స్లాట్స్‌లో స్థానం కోసం జపాన్ వ్యాప్తంగా 500 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ బ్రీఫింగ్స్‌కు హాజరయ్యారు. ఈ స్కూలు అమ్మాయిలు, అబ్బాయిల మధ్య 50;50 నిష్పత్తికి కట్టుబడి ఉంది. జపాన్‌లో ఇదో కీలకమైన ముందడుగు. ఎందుకంటే స్టార్టప్‌లలోనూ, శ్రమశక్తిలోనూ ఎక్కువగా పురుషులే కనిపిస్తారు.

ఈ విద్యార్థుల్లోనే కొందరు స్కూలు సమ్మర్ క్యాంపుకు హాజరవుతారు.

జపాన్ ప్రభుత్వం ఏం చూడాలని ఆశిస్తోందో... వీళ్లిక్కడ సరిగ్గా అదే పని చేస్తున్నారు. దేశవ్యాప్తంగా స్టార్టప్‌లు, వ్యాపారసంస్థలు ఎదుగుతున్నాయి. కానీ వాస్తవం ఏంటంటే... జపాన్ ఇప్పటికీ తన ప్రాంతీయ ప్రత్యర్థులతో సమస్థాయిలోనే ఉంది. ఆలోచనల్లో వచ్చిన ఈ మార్పు ఈ పరిస్థితిని తక్షణం మార్చెయ్యలేదు.

ఈ స్కూలులో హాజరు కావాలంటే ప్రస్తుతం దాదాపు 20 వేల డాలర్లు ఖర్చవుతుంది. అయితే మరిన్ని నిధులు సమకూర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో విద్యార్థులు ఉచితంగా విద్యాభ్యాసం చేయొచ్చని దీని వ్యవస్థాపకుడు భావిస్తున్నారు. సిలికాన్ వ్యాలీతో జపాన్ పోటీ పడాలంటే... భవిష్యత్తులోకి తొంగిచూడగల వ్యాపారుల తరంపైన పెట్టుబడి పెట్టడం అవసరం అని ఆయన అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)