ఇరాన్ : మళ్లీ వీధుల్లోకి మొరాలిటీ పోలీసులు, హిజాబ్ ధరించకుంటే విచారణ

ఇరాన్‌ మహిళలు

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, డేవిడ్ గ్రిట్టెన్, లారా గోజీ
    • హోదా, బీబీసీ న్యూస్

మహిళలు వస్త్రాధారణ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించేలా ఇరాన్ మోరల్ పోలీసులు ( అమలులో ఉన్న నైతిక నియమాలను పాటించేలా చూసే విభాగం ) మళ్లీ గస్తీని మళ్లీ ప్రారంభించారు.

ప్రభుత్వ మీడియా నివేదికల ప్రకారం, హిజాబ్ ధరించని మహిళలపై వారు విచారణ చేపట్టినట్లు తెలిసింది.

‘గష్త్-ఇ-ఇర్షాద్(మార్గదర్శక పహారా)’ లేదా నైతిక పోలీసు వ్యవస్థ మళ్లీ అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

హిజాబ్‌కు సంబంధించిన చట్టాలు అమలయ్యేలా ఈ వ్యవస్థ చూస్తుందన్నారు.

పోలీసుల కస్టడీలో మహసా అమినీ అనే మహిళ మరణించిన తర్వాత ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగి ఇప్పటికీ 10 నెలలు అవుతోంది.

హిజాబ్ నిబంధనలను సరిగ్గా పాటించలేదన్న ఆరోపణలతో ఆమెను మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమినీ మరణం తర్వాత ఆ దేశంలో చెలరేగిన ప్రజా ఉద్యమంతో గష్త్-ఇ-ఇర్షాద్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

అయితే, రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు మాత్రం చాలా కాలంగా ఈ గస్తీ వ్యవస్థను మళ్లీ తీసుకురావాలని డిమాండ్ చేశాయి.

ఇరాన్ చట్టం ప్రకారం, మహిళలు తమ జుట్టును హిజాబ్‌తో కప్పుకోవాల్సి ఉంటుంది. అంతేకాక, వదులుగా ఉండే వస్త్రాలను మాత్రమే వారు ధరించాలి. ఇలా ధరించడం వల్ల వారి శరీర ఆకృతి ఇతరులకు కనిపించదు.

ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు అయ్యేలా చూడటమే నైతిక పోలీసులు గష్త్-ఇ-ఇర్షాద్ బాధ్యత. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలను సరిగ్గా అనుసరించకపోతే వారిని కస్టడీలోకి తీసుకుంటారు.

ఈ నిబంధనలను అనుసరించని మహిళలకు తొలుత పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తారని పోలీసుల అధికార ప్రతినిధి సయీద్ మోంటాజెరోల్మాహ్ది చెప్పారు.

అయినప్పటికీ, వారు ఈ నిబంధనలను అతిక్రమిస్తే, అప్పుడు మొరాలిటీ పోలీసులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అన్నారు.

ఇరాన్ నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1979 మార్చిలో ఇరాన్‌లో మిన్నంటిన యాంటీ హిజాబ్ నిరసనలు

మహసా అమినీ మరణం తర్వాత చెలరేగిన నిరసనలు

గత ఏడాది సెప్టెంబర్‌లో 22 ఏళ్ల మహసా అమినీ తన కుటుంబంతో కలిసి ఇరాన్ రాజధాని టెహ్రాన్ వెళ్లారు. ఆ సమయంలో గష్త్-ఇ-ఇర్షాద్ సభ్యులు ఆమెని ఆపారు. హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదన్న ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకుని డిటెన్షన్ సెంటర్‌కు పంపారు.

ఆమెను డిటెన్షన్ సెంటర్‌లో బాగా కొట్టినట్లు మీడియా రిపోర్టులు తెలిపాయి. ఆ తర్వాత వారి దెబ్బలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహసా అమినీ చనిపోయారు. అమినీ మరణించిన తర్వాత, హిజాబ్ నిబంధనలకు వ్యతిరేకంగా లక్షలాది మంది ఇరాన్ మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేశారు.

పలు నెలల పాటు ఇరాన్‌లో ఈ నిరసనలు కొనసాగాయి. వీటిలో 600 మందికి పైగా ఆందోళనకారులు మరణించారు. భద్రతా దళాలు వేలాదిమందిని అదుపులోకి తీసుకున్నాయి.

ఈ నిరసనల తర్వాత ఇరాన్‌లో చాలా మంది మహిళలు పూర్తిగా హిజాబ్ ధరించడం ఆపి వేశారు. 1979లో ఇస్లామిక్ నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇరాన్‌లో జరిగిన అతిపెద్ద నిరసనలు ఇవే.

రోడ్లపై నిరసనలు చేస్తూనే, పబ్లిక్‌లో జుట్టును కవర్ చేసుకోకుండా మహిళలు, అమ్మాయిలు తిరుగుతున్నట్లు తెలిపేలా వీడియోలను, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో, ఈ విషయంలో ఇరాన్ అడ్మినిస్ట్రేషన్ మరింత కఠినంగా ఈ నిబంధనలను అమలు చేసింది. హిజాబ్‌ లేకుండా షాపింగ్ చేసిన మహిళలు కనిపిస్తే, ఆ దుకాణాలను మూసివేసేలా చర్యలు చేపట్టారు.

అయినప్పటికీ, పెద్ద ఎత్తున హిజాబ్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. మరోవైపు కఠినతరమైన ఇస్లామిక్ నిబంధనలను సపోర్ట్ చేసే వారు కూడా పెద్ద మొత్తంలో ఉన్నారు.

మహసా అమినీ మరణం తర్వాత హెడ్ స్కార్ఫ్‌లను తొలగించి సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేసిన మహిళలు

ఫొటో సోర్స్, BBC PERSIAN

ఫొటో క్యాప్షన్, మహసా అమినీ మరణం తర్వాత హెడ్ స్కార్ఫ్‌లను తొలగించి సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేసిన మహిళలు

‘డ్రస్ కోడ్ అమలు చేయడం అంత తేలిక కాదు’

హిజాబ్ లేకుండా కనిపించిన ఇద్దరు మహిళలపై ఒక వ్యక్తి పెరుగు పోసిన వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

ఆ వ్యక్తి పక్కనే నిల్చున్న వారిలో ఎవరూ దీన్ని ఆపేందుకు ప్రయత్నించలేదు.

ఆ తర్వాత, ఆ వ్యక్తిని, ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే హిజాబ్ చట్టాన్ని అమలు చేయడం అంత తేలిక కాదని ఇరాన్‌లో చాలా మంది ప్రజలు భావిస్తున్నారు.

డ్రస్ కోడ్‌ను అమల్లోకి తేవడం అంత తేలికైన విషయం కాదని తనకనిపిస్తున్నట్లు యూనివర్సిటీ విద్యార్థి ఇస్మాయిల్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్‌కి తెలిపారు.

‘‘అంతకుముందులాగా వారు దీన్ని అమలు చేయలేరు. ప్రస్తుతం చాలా మంది ఈ నిబంధనలను పట్టించుకోవడం లేదు. అలాంటి వారందరినీ వీళ్లు డీల్ చేయలేరు. ఇక వాళ్లు చేయగలిగింది పోలీసు బలగాలను ఉపయోగించి బలవంతంగా అమలు చేయడం. కానీ, అది కూడా అంత సులభం కాదు’’ అని ఇస్మాయిల్ అన్నారు.

గష్త్-ఇ-ఇర్షాద్

ఫొటో సోర్స్, AFP

గష్త్-ఇ-ఇర్షాద్ అంటే ఏమిటి?

1979 విప్లవం తర్వాత నుంచి ఇరాన్‌లో నైతిక పోలీసు వ్యవస్థ వివిధ రూపాలలో అమల్లోకి వచ్చింది. తాజాగా చేపట్టిన నైతిక పోలీసు వ్యవస్థను గష్త్-ఇ-ఇర్షాద్ అని పిలుస్తున్నారు. 2006 నుంచి ఇది అమల్లోకి ఉంది.

బీబీసీ మానిటరింగ్ రిపోర్ట్ ప్రకారం, 1979 విప్లవం తర్వాత నుంచి ఇరాన్‌లో సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు పలు రూపాలలో ‘నైతిక పోలీసు’ వ్యవస్థ ఉందని తెలిసింది.

ప్రభుత్వ ఏజెన్సీ గష్త్-ఇ-ఇర్షాద్ అనేది నైతిక పోలీసుగా వ్యవహరిస్తోంది. వీరు ఇరాన్‌లో పబ్లిక్ ప్రదేశాల్లో ఇస్లామిక్ కోడ్‌ అమలు అయ్యేలా చూస్తుంటారు. మహసా అమినీ మరణానికి వీరిదే బాధ్యతని ప్రజలు ఆరోపిస్తున్నారు.

గష్త్-ఇ-ఇర్షాద్ 2006లో ఏర్పాటైంది. న్యాయవ్యవస్థ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌కి అనుసంధానమైన పారామిలటరీ బలగాలు బస్జితో కలిసి పనిచేస్తోంది.

మహసా అమినీ మరణం తర్వాత, సెప్టెంబర్ 23న అమెరికా గష్త్-ఇ-ఇర్షాద్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.

ఇరాన్ మహిళలకు, శాంతియుతంగా ఆందోళనలు చేసే వారి హక్కులకు వ్యతిరేకంగా దీని ఆంక్షలున్నాయని ట్రెజరీ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

మహసా అమినీ తర్వాత 2022 డిసెంబర్‌లో ఒక మత పరమైన సమావేశంలో గష్త్-ఇ-ఇర్షాద్‌ను రద్దు చేస్తున్నట్లు ఇరాన్ ప్రాసిక్యూటర్ జనరల్ ప్రకటించారు.

అయితే, ఇరాన్ కఠినమైన హిజాబ్ చట్టాలను మాత్రం మార్చడం లేదన్నారు.

ప్రస్తుతం ఈ పోలీసు వ్యవస్థ మళ్లీ ప్రారంభమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)