డీప్‌ఫేక్: ఒక్క రోజులోనే వందల వీడియోలు క్రియేట్ చేయొచ్చా? సెలబ్రిటీలు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెర్స్ రహస్యం ఇదేనా

ఫొటో సోర్స్, NICK WALL/Netflix
- రచయిత, నిక్ మార్ష్
- హోదా, బీబీసీ న్యూస్
తనపై డీప్‌ఫేక్ వీడియోలు చేసినా ఎలాంటి సమస్యాలేదని సింగపూర్ నటి, మోడల్, మాజీ రేడియో డీజే జేమీ యో తాజాగా చెప్పారు. అంతేకాదు, డీప్‌ఫేక్ టెక్నాలజీ కోసం ఆమె ఓ సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నారు.
‘‘ఇది సల్మా హయెక్‌తో ఒక బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్ చేసినట్లే ఉంటుంది’’ అని ఆమె నవ్వులు కూడా పూయించారు.
చార్లీ బకెర్ నెట్‌ఫ్లిక్స్ షో బ్లాక్ మిర్రర్ కొత్త సిరీస్ విడుదలైన మరుసటి రోజు జేమీ యో బీబీసీతో మాట్లాడారు.
ఈ సిరీస్‌లోని మొదటి ఎపిసోడ్‌లో నటి సల్మా హయెక్ ఒక డీప్‌ఫేక్‌లో కనిపిస్తారు. దీని కోసం ఒక ప్రొడక్షన్ కంపెనీతో ఆమె ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఒప్పందంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెనరేటెడ్ డీప్‌ఫేక్ రూపంలో కొత్త సీజన్‌లో ఆమెను చూపించారు. దీనిలో ఆమె చెప్పేవి, చేసేవి అన్నింటినీ కంప్యూటర్‌తో రూపొందించారు.
హాలీవుడ్‌లో ప్రస్తుత రచయితలు, నటుల సమ్మె వెనుక కారణాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో తమపై పడే ప్రభావమూ ఒకటి. ఈ సమ్మె వల్ల అమెరికాలో చాలా సినిమా, టీవీ షోల షూటింగ్ ఆగిపోయే పరిస్థితి వచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు అమెరికాలోని దిగ్గజ సంస్థలు చర్యలు తీసుకోవాలని ఒప్పందం కుదుర్చుకోవడానికి సంబంధించిన చర్చలు విఫలం కావడంతో స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ (ఎస్ఏజీ-ఏఎఫ్‌టీఆర్ఏ) సమ్మెకు పిలుపునిచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సృజనాత్మకతతో ముడిపడివున్న వృత్తుల అస్తిత్వానికే ముప్పుందని నటులు, రచయితల సంఘం ఆందోళన వ్యక్తంచేస్తోంది.
అయితే, ‘జేమీ యో’కు ఈ విషయంలో ఎలాంటి ఆందోళనా లేదు. ఏఐ జెనరేటెడ్ అడ్వర్టైజింగ్ కోసం పనిచేస్తున్న ప్రముఖుల్లో ఆమె కూడా ఒకరు.
ఈ ఆధునిక టెక్నాలజీకి సినీ వర్గాల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, Jamie Yeo
ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ ‘హ్యూగోసేవ్’తో జేమీ యో ఒక ఒప్పందం కుదర్చుకున్నారు. దీనిలో భాగంగా జేమీ యో డీప్‌ఫేక్‌లను రూపొందించి, ఈ కంటెంట్‌ను విక్రయిస్తారు.
ఇది చాలా సులువైనపనని ఆమె చెబుతున్నారు. దీని కోసం ఒక గ్రీన్ స్క్రీన్ ఎదుట కొన్ని గంటలపాటు ఉండాల్సి ఉంటుంది. అక్కడ ఆమె ముఖ కవళికలు, శరీర కదలికలను క్యాప్చర్ చేస్తారు. ఆ తర్వాత వాయిస్‌ను క్యాప్చర్ చేసేందుకు మరికొన్ని గంటలు ఆమె రికార్డింగ్ స్టూడియోలో గడపాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఏఐ ప్రోగ్రామ్ ద్వారా ఈ ఇమేజ్‌లు, ఆడియోలను కలిపి డిజిటల్ అవతార్‌లను రూపొందిస్తారు. వీటితో ఏమైనా చేయించొచ్చు.
‘‘నేను ఆందోళనలను అర్థం చేసుకోగలను. కానీ, ఈ టెక్నాలజీ మనతో ఉండబోతోందనే విషయాన్ని మనం గ్రహించాలి. భయంతో దీన్ని పక్కన పెట్టేస్తే, మిగతావారు దీన్ని చక్కగా ఉపయోగించుకొని ముందుకు వెళ్తారు’’ అని ఆమె చెప్పారు.
ఇప్పటికే కొందరు డీప్‌ఫేక్ టెక్నాలజీని మెరుగ్గా ఉపయోగించుకుంటున్నారు. దీనికి ఉదాహరణగా ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీని చెప్పుకోవచ్చు. లేస్ క్రిస్ప్స్ కోసం పెప్సికో కంపెనీతో ఆయన ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీంతో ఈ ప్రకటనల్లో ఆయన డీప్‌ఫేక్‌లను ఉపయోగిస్తున్నారు.
మెస్సీ డీప్‌ఫేక్‌లతో ఆన్‌లైన్ యూజర్లు కూడా తమకు నచ్చినట్లుగా మెసేజ్‌లు తయారుచేయొచ్చు. అంతేకాదు, మెస్సీ.. ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీసు, తుర్కియే భాషల్లో మాట్లాడేలానూ చేయొచ్చు.
మరో ఫుట్‌బాలర్ డేవిడ్ బెకమ్, హాలీవుడ్ లెజెండ్ బ్రూస్ విలిస్‌లు కూడా డీప్‌ఫేక్ టెక్నాలజీ కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

ఫొటో సోర్స్, LAY'S
‘‘డీప్‌ఫేక్‌లు అనేవి ఇకపై అడ్వర్టైజింగ్‌లో సర్వసాధారణం అయిపోతాయి. వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఇలాంటివి మనం చాలా చూడొచ్చు’’ అని కింగ్స్ కాలేజీ లండన్‌లోని మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్ డా. కిర్క్ ప్లాంగెర్ అన్నారు.
‘‘చాలా సృజనాత్మక అవకాశాలకు ఇది తలుపులు తెరుస్తుంది. దీని సాయంతో వినియోగదారులను మెరుగ్గా చేరుకోవచ్చు. దీని వల్ల మెరుగైన ఫలితాలు కూడా వస్తాయి’’ అని కిర్క్ చెప్పారు.
డీప్‌ఫేక్‌లతో మెరుగైన దృశ్యాలు రావడంతో వాణిజ్యపరంగానూ ఇవి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
‘‘ఇదివరకటిలా మనం ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉండదు’’ అని యో చెప్పారు.
‘‘బడ్జెట్ విషయంలో దీని వల్ల క్లయింట్‌లకూ మేలు జరుగుతుంది. ఎందుకంటే మామూలు షూట్ నుంచే చాలా కంటెంట్ తీసుకోవచ్చు. అందరికీ ఇది పనిచేస్తుంది’’ అని ఆమె అన్నారు.
ప్రస్తుత కేసులో సింగపూర్‌కు చెందిన క్లయింట్ హ్యూగోసేవ్ కూడా ఆమె చెప్పిన మాటలతో ఏకీభవించారు.
‘‘ఈ టెక్నాలజీ ఉంటే కొన్ని రోజుల వ్యవధిలోనే వందల సంఖ్యలో వీడియోలు రూపొందించొచ్చు. అదే సాధారణంగా రికార్డు చేస్తే దీనికి కొన్నిసార్లు నెలలు లేదా సంవత్సరాలు కూడా పట్టొచ్చు’’ అని హ్యూగోసేవ్ కో-ఫౌండర్, చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ బ్రహమ్ జీజేల్లి చెప్పారు.
‘‘మేం ఏఐను మెరుగ్గా ఉపయోగించుకుంటున్నాం. అదే సమయంలో నటులకూ ప్రాధాన్యం ఇస్తున్నాం’’ అని బ్రహమ్ చెప్పారు.
అయితే, ఈ టెక్నాలజీలో చీకటి కోణం కూడా ఉంటుందని డా. ప్లాంగెర్ చెబుతున్నారు.
‘‘దీని వల్ల వచ్చే ముప్పులను కూడా అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ గుర్తించాలి. ఈ టెక్నాలజీని నైతికంగా, సముచితంగా ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయంపై దృష్టిసారించాలి’’ అని ప్లాంగెర్ అన్నారు.
ప్లాంగెర్ చెబుతున్న ముప్పుల్లో ‘‘క్రైసిస్ ఆఫ్ ట్రస్ట్’’ కూడా ఒకటి. అంటే, ఏది నిజమైనదో ఏది ఫేకో వినియోగదారులు గుర్తించలేకపోవడం. మరోవైపు కొందరు పోర్న్ కోసం, మరికొందరు రాజకీయ దురుద్దేశాల కోసమూ ఉపయోగించుకుంటున్నారు.
ఇక్కడ స్వచ్ఛందంగా కొందరు డీప్‌ఫేక్‌ల కోసం సైనప్ చేసుకుంటున్నారు. అయితే, వీరి డేటాను అనైతిక మార్గాల కోసం ఉపయోగించుకోకుండా రక్షణ కల్పించే స్పష్టమైన నిబంధనలు ప్రస్తుతం అమలులోలేవు.
ఉదాహరణకు మీ డిజిటల్ అవతార్‌ను మీ ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకు ఒక బ్రాండ్ ఉపయోగిస్తే లేదా అనైతిక మార్గాల్లో ఎవరైనా దీన్ని ఉపయోగించుకుంటే?
‘‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీల్లో మనం అర్థం చేసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి’’ అని సింగపూర్‌లోని మేధోసంపత్తి హక్కుల న్యాయవాది టెంగ్ షెంగ్ రాంగ్ అన్నారు.
‘‘చాలా కొత్త సమస్యలు రావచ్చు. వీటిపై మేధో సంపత్తి హక్కులు ఎవరికి ఉంటాయి? ఏదైనా చట్టపరమైన చిక్కులు వస్తే, ఎక్కడికి వెళ్లాలి? లాంటి ప్రశ్నలు ఉండనే ఉన్నాయి’’ అని టెంగ్ వివరించారు.

ఫొటో సోర్స్, NICK WALL/NETFLIX
బహుశా అడ్వర్టైజింగ్ సంస్థలు కూడా ఇందుకే అంత దూకుడుగా ముందుకు వెళ్లే ప్రయత్నాలేమీ చేయడం లేదు.
ముప్పుల విషయంలో జాగ్రత్తగా ఉంటానని యో కూడా చెప్పారు. కానీ, ప్రస్తుతం తన నిర్ణయానికి హ్యూగోసేవ్‌తోపాటు సింగపూర్‌లో ఈ టెక్నాలజీ ఉపయోగించే విధానమూ ఒక కారణమని ఆమె వివరించారు.
చివరగా మనం అందరికంటే ముందుండాలంటే టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని ఆమె అన్నారు.
‘‘మీరు ఈ పోటీలో ఉండాలని అనుకుంటే, కొత్త విషయాలు నేర్చుకోవాలి. లేకపోతే పదవీ విరమణ తీసుకోవాల్సి ఉంటుంది’’ అని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సంక్షోభం నుంచి శ్రీలంక నిజంగానే కోలుకుందా?
- అమీనా: నెల్సన్ మండేలా మనసుపడ్డ ఈ భారత సంతతి మహిళ ఆయన ప్రేమను ఎందుకు తిరస్కరించారు?
- ఇరాన్ : మళ్లీ వీధుల్లోకి మొరాలిటీ పోలీసులు, హిజాబ్ ధరించకుంటే విచారణ
- నెలకు రూ.5 వేలు ఇచ్చే ‘నేషనల్ యూత్ వాలంటీర్ స్కీమ్’కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- బెంగళూరు సమావేశం: విపక్షాల్లో ఇన్ని సమస్యలుంటే మోదీని ఎదుర్కోవడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















