ప్రదీప్ కురుల్కర్‌: డీఆర్‌డీవో శాస్త్రవేత్త పాకిస్తాన్ ‘హనీ ట్రాప్’లో ఎలా పడ్డారు? భారత రక్షణ రహస్యాలను ఎలా చేరవేశారు?

డీఆర్‌డీవో శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్
ఫొటో క్యాప్షన్, డీఆర్‌డీవో శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్

డీఆర్‌డీవో పరిశోధన, అభివృద్ధి విభాగం డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ కురుల్కర్‌ను 2023 మే 4న యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్) అరెస్టు చేసింది.

సోషల్ మీడియా ద్వారా సున్నితమైన ప్రభుత్వ రహస్యాలను పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌ల(PIOs)తో పంచుకున్నారనే ఆరోపణలపై ఏటీఎస్ ఆయన్ను అరెస్టు చేసింది.

డాక్టర్ జరా దాస్‌గుప్తా అనే పేరు గల అకౌంట్‌లో ప్రదీప్ కురుల్కర్ సంభాషణ జరిపినట్లు విచారణలో వెల్లడైంది.

వీరిద్దరి చాటింగ్‌లో పలు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. డీఆర్‌డీవో ఆర్ & డీ విభాగంలో అభివృద్ధి చేసిన ప్రాజెక్టుల గురించి కురుల్కర్ ఎప్పటికప్పుడు జరా దాస్‌గుప్తాకు సమాచారం అందించినట్లు వెల్లడైంది.

ప్రభుత్వ రహస్యాల చట్టం కింద కురుల్కర్‌పై అభియోగాలు నమోదుచేశారు. 1,837 పేజీల చార్జిషీటును కోర్టులో దాఖలు చేసింది ఏటీఎస్.

హనీట్రాప్

ఫొటో సోర్స్, Getty Images

ఎవరీ ప్రదీప్ కురుల్కర్?

డీఆర్‌డీవోలో ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరు ప్రదీప్ కురుల్కర్.

కురుల్కర్ 1963లో జన్మించారు.

సీవోఈపీ పుణేలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన తర్వాత ఆయన 1988లో సీవీఆర్‌డీఈ, అవాడి వద్దనున్న డీఆర్‌డీవోలో చేరారు.

ఐఐటీ కాన్పూర్ నుంచి పవర్ ఎలక్ట్రానిక్స్‌లో అడ్వాన్స్డ్ కోర్సులను పూర్తిచేశారు.

మిలటరీ వాడకం కోసం మిసైల్ లాంచర్లు, మిలటరీ ఇంజినీరింగ్ ఎక్విప్‌మెంట్, అడ్వాన్స్డ్ రోబోటిక్స్, మొబైల్ అన్‌నేమ్డ్ సిస్టమ్స్‌ను రూపొందించడంలో ఈయన నిపుణుడు.

డీఆర్‌డీవోలో ఎన్నో ముఖ్యమైన ప్రాజెక్టులలో కురుల్కర్ పనిచేశారు.

డీఆర్‌డీవో మిసైల్ లాంచ్, గ్రౌండ్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

యాంటీ శాటిలైట్ మిసైల్ 'మిషన్ శక్తి'ని కురుల్కర్ నేతృత్వంలోనే డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది.

2000లో ఉత్తమ ప్రచురణకు గాను సైన్స్ డే అవార్డు వచ్చింది. అలాగే 2002లో డీఆర్‌డీవో అగ్ని అవార్డు, ఆకాశ్ ప్రాజెక్ట్‌కు 2008లో డీఆర్‌డీవో అవార్డును కురుల్కర్ పొందారు.

మరికొన్ని నెలల్లో కురుల్కర్ పదవీ విరమణ పొందనున్నారు. ఈ సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

హనీట్రాప్

ఫొటో సోర్స్, Getty Images

అసలేంటీ కేసు?

డీఆర్‌డీవో ఫిర్యాదుతో కురుల్కర్‌పై ఏటీఎస్ కేసు నమోదు చేసింది.

"ఇది ఒక హనీట్రాప్ అని ప్రాథమిక విచారణ ద్వారా తెలుస్తోంది" అని ఏటీఎస్ పుణె యూనిట్‌లోని ఒక సీనియర్ అధికారి బీబీసీతో తెలిపారు.

“ఇది ఒక రకమైన హనీట్రాప్‌లాగా అనిపిస్తుంది. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌ మహిళలకు సంబంధించిన కొన్ని సోషల్ మీడియా ప్రొఫైల్‌లను రూపొందించింది. డిఫెన్స్ లేదా సెక్యూరిటీలో పని చేసే వారికి ప్రొఫైల్స్ ఉంటే నెమ్మదిగా రిక్వెస్ట్‌లు పంపడమే వాళ్లు చేసే పని.

వారి ఖాతాల్లో అందమైన అమ్మాయిల చిత్రాలు ఉంటాయి. ఆడవాళ్ల గొంతులో మాట్లాడుతారు. కొన్నిసార్లు వారు ముందుకెళ్లి వీడియోలో ఇతర పనులు కూడా చేస్తారు (ఇది వారి పద్ధతి.) ఇది ఇక్కడ జరిగిందా, లేదా అనేది విచారణలో తేలుతుంది'' అన్నారు.

కానీ వారి దగ్గర చాట్ ఎక్కువుంటే, కచ్చితంగా ఏదో జరిగి ఉండొచ్చు అని ఆయన తెలిపారు.

"ఇంటర్నెట్‌లో ఇలాంటివి నిత్యం జరుగుతుంటాయి. కొన్నిసార్లు పెద్ద చేప చిక్కుకుపోతుంది. సెక్స్టింగ్ సాధారణ వ్యక్తులతో చేస్తారు. ఇది వేరే రకం" అని ఆ అధికారి చెప్పారు.

కురుల్కర్‌కు సంబంధించి వాట్సాప్‌లో ప్రధానంగా చాటింగ్‌లు కనిపించాయి.

అదే చాట్‌లో జరా దాస్‌గుప్తాకు క్షిపణులకు సంబంధించిన రహస్య సమాచారాన్ని కురుల్కర్ అందించినట్లు విచారణలో వెల్లడైంది.

డీఆర్‌డీవో అతిథి గృహంలో ప్రదీప్ కురుల్కర్ కొంత మంది మహిళలను కలిసేవాడని యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ పేర్కొంది.

దివ్య మరాఠీ మీడియా కథనం ప్రకారం కురుల్కర్, జరా దాస్‌గుప్తా మధ్య జరిగిన చాట్‌ను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఛార్జిషీట్‌లో జత చేసింది.

ఈ చాట్ ద్వారా జరా దాస్‌గుప్తాకు కురుల్కర్ సమాచారం ఎలా తెలియజేశారో వెలుగులోకి వచ్చింది.

లాంచర్‌‌ను ఎలా డిజైన్ చేశారనే దాని నుంచి డీఆర్‌డీవో క్యాంపస్ సమాచారం వరకు చాట్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

జరా దాస్‌గుప్తాను ‘బేబీ’ అని కురుల్కర్ పిలిచేవారని కూడా అందులో పేర్కొన్నారు.

బ్రహ్మోస్, అగ్ని-6 సమాచారం?

కురుల్కర్ ముఖ్యమైన క్షిపణుల గురించిన సమాచారం జరా దాస్‌గుప్తాకు తెలియజేశారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తల ప్రకారం వీటిలో బ్రహ్మోస్, అగ్ని-6, రుస్తం ప్రాజెక్ట్, ఉపరితలం నుంచి గగనతలంలోకి (సర్ఫేస్ టు ఎయిర్) ప్రయోగించే క్షిపణి, మానవరహిత యుద్ధ ఎయిర్ వెహికల్, డ్రోన్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.

లాంచర్ రూపకల్పనను కురుల్కర్ ఎలా తయారు చేశారనే దాని గురించి జరా దాస్‌గుప్తాకు గొప్పగా చెప్పారని కూడా ఉంది.

ఇది మాత్రమే కాదు, 'అస్త్ర' క్షిపణి ఎంత కచ్చితమైనదో కూడా ఆయన పంచుకున్నారు.

అత్యంత గోప్యమైన సమాచారాన్ని వెల్లడిస్తున్నానని కురుల్కర్‌కు తెలిసినప్పటికీ పంచుకున్నట్లు ఏటీఎస్ ఛార్జిషీట్ పేర్కొంది.

కురుల్కర్ తన ఫోన్‌లో రహస్య సమాచార పత్రాలను భద్రపరిచారని, ఇది మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని కూడా ఛార్జిషీట్‌ తెలిపింది.

వీడియో చాట్ కోసం మరికొన్ని యాప్‌లను డౌన్‌లోడ్ చేయమని కురుల్కర్‌ను జరా కోరినట్లు కూడా ప్రస్తావించింది.

నంబర్ బ్లాక్ చేశాక మరో నంబర్ నుంచి మెసేజ్

ఇది జరిగిన కొన్ని నెలలకు కురుల్కర్, జరా దాస్‌గుప్తా నంబర్‌ను బ్లాక్‌ చేశారు.

అయితే, జరా దాస్‌గుప్తా వేరే నంబర్ నుంచి తనను ఎందుకు బ్లాక్‌ చేశారని ప్రశ్నిస్తూ కురుల్కర్‌‌కు మెసేజ్ పంపారు.

ఈ నంబర్‌ నుంచే ఎయిర్ ఫోర్స్ అధికారుల లింక్ బయటపడింది.

కురుల్కర్‌తో చాట్ చేసిన జరా దాస్‌గుప్తా అదే ఐపీ అడ్రస్‌తో ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కూడా చాట్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

ఈ విషయంపై ఎయిర్ ఫోర్స్ సిబ్బంది స్టేట్‌మెంట్‌ను కూడా ఏటీఎస్ రికార్డు చేసింది.

ఏటీఎస్ దాఖలు చేసిన చార్జ్‌షీటును తాము పొందినట్లు కురుల్కర్ న్యాయవాది, అడ్వకేట్ రిషికేశ్ గను బీబీసీకి తెలిపారు.

‘‘జులై 7న మేం ఈ చార్జ్‌షీటును పొందాం. వెయ్యికి పైగా పేజీలతో ఈ డాక్యుమెంట్లున్నాయి. నా క్లయింట్‌తో మాట్లాడిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం’’ అని రిషికేశ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)