అవతార్ 3, ద లయన్ కింగ్: హాలీవుడ్‌లో సమ్మెతో ఈ సినిమాల భవిష్యత్ ఏం కాబోతోంది?

ఫొటో సోర్స్, 20TH CENTURY STUDIOS/DISNEY
- రచయిత, జార్జ్ బోడెన్, పాల్ గ్లైన్
- హోదా, బీబీసీ న్యూస్
హాలీవుడ్‌లో రచయితలు, నటుల మెగా సమ్మెతో చాలా సినిమాలు, ప్రముఖ టీవీ షోల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయే అవకాశముంది.
చివరిసారిగా ఇలా స్క్రీన్ యాక్టర్ గిల్డ్ – అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్ (ఎస్ఏజీ-ఏఎఫ్‌టీఆర్ఏ) 1980 జులైలో సమ్మె చేసింది.
షోలు, సినిమాల విక్రయాల నుంచి వచ్చే లాభాల్లో వాటాల కోసం దిగ్గజ సంస్థలతో వివాదం నడుమ ఎస్ఏజీ-ఏఎఫ్‌టీఆర్ఏ సభ్యులు సమ్మె చేపట్టినట్లు అప్పట్లో న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.
40 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఇంచుమించు అదే డిమాండ్లతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా తమపై పడే ప్రభావం గురించి నటులు, రచయితలు ఆందోళన చెందుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ సినిమాలపై ప్రభావం పడుతోంది?
‘2020 టీవీ అండ్ థియేట్రికల్ కాంట్రాక్ట్’లో భాగంగా ఒప్పందాలు కుదుర్చుకున్న సభ్యులందరూ గురువారం నుంచి సమ్మెలో పాల్గొంటారని విలేఖరుల సమావేశంలో ఎస్ఏజీ-ఏఎఫ్‌టీఆర్ఏ స్పష్టంచేసింది.
ప్రస్తుతం ఘోస్ట్‌బస్టర్స్ 4, ముఫాసా: ద లయన్ కింగ్, అవతార్ 3, 4 లు కూడా నిర్మాణ దశలో ఉన్నట్లు ఇంటర్నెట్ మూవీస్ డేటాబేస్ వెల్లడించింది. మరోవైపు పాడింగ్టన్‌లో మూడో సినిమా పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రీకరణ ఈ నెలలో మొదలుకావాల్సి ఉంది. అయితే, ఇది కూడా వాయిదా పడే అవకాశముంది.
ఈ సినిమాల రచనకు సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తయి ఉండొచ్చు. అయితే, నటుల సమ్మె వల్ల నిర్మాణం పనులు నిలిచిపోవచ్చు. మరోవైపు ప్రముఖ నటుల షెడ్యూళ్లలో కూడా చాలా ఇబ్బందులు రావొచ్చు.

ఫొటో సోర్స్, EPA
లాస్ ఏంజెలిస్‌లో ఫీచర్ ఫిల్మ్స్, టెలివిజన్ ప్రాజెక్టుల షూటింగ్ కోసం నిర్మాణ సంస్థలు కోరిన అనుమతులు గత వారంలో 64 శాతం తగ్గిపోయినట్లు ఫిల్మ్ఎల్ఏ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది.
‘‘పరిస్థితులు సాధారణంగా ఉండుంటే ఈ సమయంలో డజన్ల కొద్దీ ప్రాజెక్టులు షూటింగ్ జరగాలి. కానీ, ప్రస్తుతం అనుమతులు పొందిన ఏ సిరీస్ కూడా షూటింగ్ జరగడం లేదు.’’ అని సంస్థ తెలిపింది.
ప్రాజెక్టులో సింహభాగమైన ప్రిన్సిపల్ ఫొటోగ్రఫీ పూర్తయిన షోల విషయంలోనూ రీ-షూట్‌లు, రీ-రికార్డింగ్‌ల కోసం నటులెవరూ ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో లేరు.
బ్రిటన్‌లో నిర్మాణంలోనున్న సినిమాల విషయానికి వస్తే, ర్యాన్ రేనాల్డ్స్, హ్యూజ్ జాక్‌మన్‌ల ‘డెడ్‌పూల్ 3’పైనా ప్రభావం పడే అవకాశముంది. ఈ సినిమా 2024 మే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం అది వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.
మరోవైపు టిమ్ బర్టన్ సినిమా బీటెల్‌జ్యూస్ సీక్వెల్ కోసం కూడా ప్రేక్షకులు మరిన్ని రోజులు ఎదురుచూడాల్సి రావచ్చు.

ఫొటో సోర్స్, UNIVERSAL/GETTY IMAGES
మైఖెల్ కీటన్, వినోవా రైడర్, జెన్నా ఓర్టెగాల బీటెల్‌జ్యూస్ 2.. 2024 సెప్టెంబరులో విడుదల కావాల్సి ఉంది. ఈ షూటింగ్ పనులు వెర్మోంట్‌లో ఇటీవల మొదలయ్యాయి. ఇప్పుడు సమ్మెతో అవి నిలిచిపోయే పరిస్థితి వచ్చింది.
మరోవైపు అరియానా గ్రాండే, సింథియా ఎరివో నటిస్తున్న ‘వికెడ్’ కూడా 2024 నంబరులో విడుదల కావాల్సి ఉంది. దీనికి సంబంధించిన షూటింగ్స్ కూడా బ్రిటన్‌లో జరుగుతున్నాయి.
విదేశాల్లో షూటింగ్ జరుపుకొంటున్న పాల్ మెస్కల్, డెంజెల్ వాషింగ్టన్‌ల ‘గ్లాడియేటర్ సీక్వెల్’ కూడా త్వరలో నిలిచిపోయే అవకాశముంది.
ప్రస్తుతం మొరాకో, మాల్టాలలో గ్లాడియేటర్ షూటింగ్ జరుగుతోంది. అయితే, దీని కోసం పనిచేస్తున్న వారిలో చాలా మంది బ్రిటన్ నటులే ఉన్నారు. సినిమాల ప్రమోషన్లపై కూడా ప్రస్తుతం ప్రభావం పడుతోంది.

ఫొటో సోర్స్, 20TH CENTURY STUDIOS
బ్రిటన్ నటులు కూడా సమ్మెలో ఉన్నారా?
ఎస్ఏజీ-ఏఎఫ్‌టీఆర్ఏకు అనుబంధంగా పనిచేస్తున్న బ్రిటన్‌కు చెందిన ‘ఈక్విటీ’లోని నటులకు మాత్రం ఈ సమ్మె వర్తించరు. వీరు ఎప్పటిలానే షూటింగ్‌లకు హాజరుఅవుతారు.
‘‘బ్రిటన్‌లో సమ్మెలో పాల్గొంటే వారిని ప్రాజెక్టుల నుంచి తీసివేయడం లేదా కేసులు పెట్టడం లాంటి చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.’’ అని ఈక్విటీ తెలిపింది.
మరోవైపు అటు ఎస్ఏజీ-ఏఎఫ్‌టీఆర్ఏతోపాటు ఇటు ఈక్విటీలోనూ సభ్యత్వముండే వారు బ్రిటన్‌లో కొనసాగే షూటింగ్స్‌లో పాల్గొనాల్సి ఉంటుందని ఈక్విటీ స్పష్టంచేసింది.

ఫొటో సోర్స్, HBO
టీవీ షోల సంగతేంటి?
‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ లాంటి హెచ్‌బీవో ప్రాజెక్టులకు సంబంధించిన స్క్రిప్టుల పని ఇప్పటికే పూర్తయిందని వార్నర్ బ్రదర్స్ స్పష్టంచేసింది. అయితే, దీనిలో నటిస్తున్న నటుల్లో చాలా మంది ఎస్ఏజీ-ఏఎఫ్‌టీఆర్ఏ సభ్యులు. కాబట్టి వీటి పనులు కూడా నిలిచిపోయే అవకాశముంది.
మరోవైపు ద శాండ్‌మ్యాన్ సెకండ్ సిరీస్ కూడా వాయిదా పడే అవకాశముంది. కొన్ని ప్రాజెక్టుల షూటింగ్ కొనసాగేలా ప్రస్తుతం విడిగా కొన్ని ఒప్పందాలు చేసుకునే అవకాశముందని కూడా వార్తలు వస్తున్నాయి.
అమెరికాలో నైట్ కోర్ట్, షికోగో మెడ్, ఫైర్ అండ్ పీడీ, యంగ్ షెల్డన్, ఫ్యామిలీ గయ్, ద సింప్సన్ లాంటి టీవీ ప్రాజెక్టుల షూటింగ్ కూడా త్వరలో వాయిదా పడే అవకాశముంది.
బ్రిటన్‌లోనూ ద డే ఆఫ్ ధ జాకల్, ఎ థౌసండ్ బ్లోస్ లాంటి టీవీ సిరీస్‌ల నిర్మాణంపైనా ప్రభావం పడొచ్చు.
రచయితల సమ్మె వల్ల స్ట్రేంజర్ థింగ్స్, ద లాస్ట్ ఆఫ్ అస్, ఎల్లోజాకెట్స్ ఇప్పటికే వాయిదా పడ్డాయి.
అయితే, త్వరలో జరగబోయే ఎమ్మీ అవార్డులు, ద టోరంటో, వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లాంటి ఈవెంట్లు ప్రధాన స్టార్లు లేకుండా జరిగే అవకాశముంది.
ఇప్పుడు ఏం జరగొచ్చు ?
సమ్మే ప్రభావం అమెరికాతోపాటు చాలా దేశాల్లోని షూటింగ్‌లపై పడుతున్న నేపథ్యంలో దిగ్గజ సంస్థల ప్రతినిధులతో నటుల ప్రతినిధులు చర్చలు జరపొచ్చు.
1980ల్లో దాదాపు పది వారాలపాటు సమ్మె కొనసాగింది. దీని వల్ల పరిశ్రమకు 100 మిలియన్ల డాలర్లు (రూ.820 కోట్లు) వరకూ నష్టం సంభవించింది.
చివరిసారిగా రచయితలు, నటులు కలిసి 1960ల్లో సమ్మె చేశారు. అప్పుడు రచయితలు 21 వారాలు, నటులు ఆరు వారాలు సమ్మెలో పాల్గొన్నారు.
ప్రస్తుతం కాస్త కఠినంగా ఉండాలని కొంతమంది నటులు తమ సంఘాలను కోరుతున్నట్లు ‘ఇండస్ట్రీ బైబుల్ వెరైటీ’ వెబ్‌సైట్ రాసుకొచ్చింది.
ఎస్ఏజీ-ఏఎఫ్‌టీఆర్ఏ నిర్ణయంపై హాలీవుడ్ దిగ్గజ సంస్థలు, ప్రొడ్యూసర్లు అసంతృప్తి వ్యక్తంచేశారు. సమ్మెపై అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ స్పందిస్తూ.. ‘‘మేం సమ్మెను కోరుకోవడం లేదు. నటులు లేకుండా స్టూడియోలు పనిచేయలేవు. కానీ, సినీ రంగంపై ఆధారపడిన లక్షల మందికి ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఎస్ఏజీ-ఏఎఫ్‌టీఆర్ఏ నడుచుకుంటోంది.’’ అని వివరించింది.
ఇవి కూడా చదవండి
- బేబీ రివ్యూ: ‘అమ్మాయిని ఓ అబ్బాయి ఇంతలా ప్రేమిస్తాడా? ’ అనిపించే ఈ కథలో నిజమైన ప్రేమ ఎవరిది?
- Annuity plans: నెల జీతంలాగా స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే మార్గమిది, ఎవరు చేరొచ్చు, తెలుసుకోవాల్సిన విషయాలేంటి
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















