యమున: దారుణమైన కాలుష్యం, దడ పుట్టించే వరదలు... ఈ నదికేమైంది ?

ఫొటో సోర్స్, ANI
దేశ రాజధానివాసులను భయభ్రాంతులకు గురి చేస్తూ యమునా నది జోరుగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ఉధృతి పెంచుకుంటూ రికార్డు స్థాయిలను దాటింది.
గత కొన్ని దశాబ్ధాలుగా యమునా వరద బారిన పడని అనేక ప్రాంతాలు కూడా తాజా వరదల ధాటికి నీట మునుగుతున్నాయి. శుక్రవారం ఉదయానికి యమునా నది ప్రవాహం 208.45 మీ.లకు చేరుకుందని సెంట్రల్ వాటర్ కమిషన్ వెల్లడించినట్లు ‘ది హిందూ’ పత్రిక పేర్కొంది. ఇది గురువారం కంటే 20 సెంటీమీటర్లు తక్కువ.
నది ప్రమాదకర స్థాయి 204.5 మీటర్లు కాగా, అత్యంత ప్రమాదకర స్థాయి 205.33 మీ.లు. ఈ లెవెల్‌ను నది సోమవారమే దాటింది. 1978లో చివరిసారిగా యమునా నీటిమట్టం 207.49 మీటర్లకు చేరుకున్నట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ వెబ్‌సైట్ చెబుతోంది. దిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఈ నీటి ప్రవాహ స్థాయిని కొలిచే సూచిక ఉంటుంది.
ఇక 208.13 మీటర్లకు చేరుకోవడం ద్వారా 60 ఏళ్ల కిందటి భారీ వరదల స్థాయిని దాటి ప్రవహించినట్లయిందని, 1963లో యమునా నది ఈ స్థాయిలో ప్రవహించిందని ‘ది హిందూ’ పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, Getty Images
ముంపు ముప్పులో రాజధాని ప్రాంతం
దిల్లీ నగరంలో కీలక ప్రాంతాలైన ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు ఉండే సెక్రటేరియట్‌తోపాటు ఐటీవో, సుప్రీంకోర్టు, ఎర్రకోట, రాజ్‌ఘాట్ (మహాత్మా గాంధీ సమాధి) లాంటి ప్రాంతాలు కూడా వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి.
నగరం రోడ్లను కప్పేసిన వరద నీటి కారణంగా స్కూళ్లకు ఆదివారం వరకు సెలవులు ప్రకటించారు. కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్‌లో పని చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గత నాలుగు రోజులుగా పెద్దగా వర్షాలు లేకపోయినా కేవలం యమునా నది కారణంగా దిల్లీ నగరం వరదలు గుప్పిట్లో చిక్కుకోవాల్సి వచ్చింది. ఈ నది క్యాచ్‌మెంట్ ఏరియా ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లలో కురిసిన భారీ వర్షాలు నది పోటెత్తడానికి ప్రధాన కారణం.
మరి దిల్లీ నగరాన్ని ఇంతగా ప్రభావితం చేస్తున్న యమునా నది ఎక్కడ పుట్టింది, ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది, దాని చరిత్ర ఏంటి?

ఫొటో సోర్స్, HTTPS://REGISTRATIONANDTOURISTCARE.UK.GOV.IN/
యమునా నది పుట్టుక
భారతదేశంలో నదులను హియలయన్, పెనిన్సులార్, కోస్టల్, ఇన్‌లాండ్ డ్రైనేజ్ బేసిన్ నదులుగా పేర్కొంటారు. హిమాలయాల్లో మంచు కరగడంతోపాటు, అక్కడ కురిసిన వర్షాల వల్ల వచ్చే వరద నీటిని మోసుకొచ్చే నదులను హిమాలయన్ నదులుగా చెబుతుంటారు.
ఇండస్, గంగ, బ్రహ్మపుత్ర నదులు ప్రధానమైన హిమాలయన్ నదులు కాగా, గంగా నదికి ఉపనది కావడంతోపాటు, దానికి సమాంతరంగా వందల కిలోమీటర్లు ప్రవహించే మరో ప్రధానమైన నది యమున.
ఉత్తరాఖండ్ లోని లోయర్ హిమాలయన్ రేంజ్‌లో ఉన్న యమునోత్రి (జమునోత్రి అని కూడా అంటారు) అనే ప్రాంతం ఈ నది జన్మస్థలం. సముద్రమట్టానికి సుమారు 20 వేల అడుగుల( సుమారు 6.5 వేట మీటర్లు) ఎత్తులో ఉంటుంది.
హిందువులు అతి ముఖ్యమైనవిగా భావించే చార్ ధామ్ (గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాల) యాత్రలో యమునా నది జన్మక్షేత్రం కూడా ఒకటి. యమునను కాళింది నది అని కూడా అంటారు.
పుట్టిన ప్రదేశం నుంచి అనేక లోయలను దాటుకుంటూ దాదాపు 200 కి.మీ.లు ప్రవహించిన తర్వాత ఈ నది ఇండో గాంజాటిక్ ప్లెయిన్ (గంగా మైదానం)లోకి ప్రవేశిస్తుంది.
మళ్లీ అక్కడి నుంచి అనేక ఉపనదులను కలుపుకుంటూ గంగకు సమాంతరంగా, తాను ప్రవహించే ప్రాంతంలో అనేక జీవితాలను ప్రభావితం చేస్తూ ప్రవహిస్తుంటుంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని శివాలిక్ రేంజ్ నుంచి జాలువారే ఈ నదికి ఉత్తరాఖండ్‌లోని డాక్ పత్తర్ ప్రాంతంలో తొలి రెగ్యులేటర్ ఎదురవుతుంది. అక్కడున్న ఒక విద్యుత్ ప్రాజెక్టు కోసం నిర్మించిన డ్యామ్ నుంచి యమునా ప్రవాహం తిరిగి కొనసాగుతుంది.
ఆ తర్వాత అది సిక్కుల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పోంటా సాహిబ్ మీదుగా సాగి హరియాణాలోని యమునా నగర్ జిల్లాలో ఉన్న హత్నికుండ్ రిజర్వాయర్‌కు చేరుకుంటుంది.
హత్నీకుండ్ రిజర్వాయర్ దగ్గర యమున నీటిని తూర్పు యమునా కాలువ, పశ్చిమ యమునా కాలువలకు మళ్లిస్తారు. దిల్లీ నగరం, దాని చుట్టుపక్కల సాగు, తాగు నీటి అవసరాలకు ఈ కాలువల నీటినే ఉపయోగిస్తారు.
ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేవ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, దిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల మీదుగా ప్రవహించే ఈ నది తను పుట్టిన ప్రదేశం నుంచి సుమారు 1376 కిలో మీటర్లు ప్రవహించి ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమం వద్ద గంగానదిలో కలుస్తుంది.
మధ్యలో అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ గంగా నదివైపు ప్రవహిస్తుంది యమున.

ఫొటో సోర్స్, Getty Images
ఆధ్యాత్మికతకు నిలయం
భారతీయ పురాణాల్లో గంగా నదిలాగే యమునా నదికి అత్యంత ప్రశస్తి ఉంది. దేశపు అత్యంత పుణ్య నదులుగా భక్తులు భావించే నదుల్లో యమున కూడా ఒకటి. రుగ్వేద కాలం నుంచి ఈ నది ప్రస్తావన కనిపిస్తుంది. హిందువులు పవిత్రంగా భావించే సప్త నదుల్లో గంగతో పాటు యమున కూడా ఉంది. యమున నది సూర్యుదేవుడి కుమార్తెగా యమ ధర్మరాజుకు సోదరిగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ నదిలో మునిగిన వారికి చావు భయం ఉండదని కూడా నమ్ముతారు.
శ్రీకృష్ణుడికి, యమునా నదికి పురాణాల్లో అవినాభావ సంబంధం కనిపిస్తుంది. తాను అవతరించే సమయంలో శ్రీకృష్ణుడు యమునా నదికి పవిత్రను చేకూర్చాడని పురాణాల్లో రాశారు. వసుదేవుడు, శ్రీకృష్ణుడిని కంసుడి బారి నుంచి రక్షించేందుకు యమునా నదిని దాటి వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో యమునా ఉప్పొంగి ప్రవహిస్తోందని, ఆ సమయంలో కృష్ణుడి పాదాలు తాకగానే నదీ ప్రవాహం తగ్గిపోయిందని పురాణాలు పేర్కొంటున్నాయి.
గంగా, యమునా, సరస్వతీ నదులు కలిసే త్రివేణి సంగమం హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ జరిగే కుంభమేళా ప్రపంచ ప్రసిద్ధం. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని హిందువులు నమ్ముతారు.

ఫొటో సోర్స్, ANI
యమున ఉప నదులు
గంగకు అది పెద్ద ఉప నదుల్లో యమున ఒకటి. అయితే, ఈ నదీ గమనంలో దీనికి కూడా అనేక ఉప నదులు కలుస్తుంటాయి. టోన్స్, కెన్, హిండాన్, చంబల్, సింధ్, బెత్వా, మందాకినిలాంటివి ఇందులో ప్రధానమైనవి.
టోన్ నది యమునకు అతి పెద్ద ఉపనది కాగా, చంబల్ నది అది పొడవైన ఉపనది. మధ్య ప్రదేశ్, హిమాచల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఈ ప్రధాన నదులతోపాటు పలు చిన్న చిన్న నదుల యమునలో కలుస్తుంటాయి.
దేశం మొత్తం మీద 10.7% ప్రాంతం, గంగా బేసిన్‌లో 42.5% ప్రాంతం యమునా నదికి క్యాచ్ మెంట్ ఏరియాగా ఉందని ‘‘ది యమునా రివర్ బేసిన్, వాటర్ రీసోర్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’’ అనే పుస్తక రచయితలు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, MONEY SHARMA / AFP
యమునా నది ప్రధాన నగరాలు
యమునా నది ప్రవహించే మార్గంలో దేశ రాజధాని దిల్లీతోపాటు, ప్రముఖ పర్యాటక నగరం ఆగ్రా, ఆధ్యాత్మిక కేంద్రాలైన మధుర, బృందావన్, ప్రయాగరాజ్ లాంటి ప్రముఖ పట్టణాలు కూడా ఉన్నాయి.
దిల్లీ నగరపు ప్రధాన తాగు నీటి మూలాల్లో యమున ప్రధానమైంది. అలాగే ఆగ్రా, మధుర, అలహాబాద్ నగరాలు కూడా తాగునీటి కోసం యమునా నది నీటి మీదే ప్రధానంగా ఆధారపడతాయి. ఇవి కాక చిన్న పట్టణాలు, గ్రామాలు అనేక ఈ నదీ తీరంలో ఉన్నాయి.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టూరిస్ట్ ప్లేస్ తాజ్‌మహల్ ఈ నది ఒడ్డునే ఉంది. పర్యటకంగా తాజ్‌మహల్‌కు ఆకర్షణ పెంచే అంశాలలో యమునా నది కూడా ఒక భాగం.
మరో ప్రధానమైన పట్టణం మధుర, దానికి ఆనుకుని ఉండే వృందావన్ (బృందావనం), అక్కడి ఆధ్యాత్మిక కథలు, గాథలు అన్నీ యమునతో అల్లుకుని ఉంటాయి. మూడు నదుల నదులు కలిసే ప్రయాగ ప్రపంచవ్యాప్తంగా హిందువులు పవిత్ర క్షేత్రాలలో ఒకటి.
కోట్లమంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తుంటారు. త్రివేణి సంగమ స్నానం అన్ని పాపాల నుంచి విముక్తి చేస్తుందని హిందువులు నమ్ముతుంటారు. ఇక్కడ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
కాలుష్యమే కాలుష్యం
ఒకప్పుడు యయునా నది జలాలంటే పవిత్రమైనవిగా భావించేవారు. హిమాలయాల నుంచి వచ్చే స్వచ్ఛమైన జలాలు. కానీ, ఇప్పుడు యమునా జలాలంటే కాలుష్యానికి ఆలవాలం. జనాభా పెరగడం, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నదీ తీరాన పారిశ్రామికీకరణ విపరీతంగా జరగడంతో నది కాలుష్యం కాలక్రమేణా పెరుగుతూ వచ్చింది.
మానవ, పారిశ్రామిక వ్యర్ధాలన్నీ నదిలోకి చేరి కాలుష్యానికి యమునా నది కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీ సమీపంలో యమునా నది మురుగు కాల్వను తలపిస్తుంటుంది.
పారిశ్రామిక వ్యర్ధాల కారణంగా నది నురగలు తేలుతూ దర్శనమిచ్చిన సందర్భాలు అనేకం. దిల్లీ సమీపంలో ప్రవహించే ఈ నది నీటిని నేరుగా తాగడం, పంటలకు వాడటం ప్రమాదకరమన్న హెచ్చరిక రిపోర్టులు కూడా వచ్చాయి.
ఈ నీళ్లు తాగడానికి కాదుగదా కనీసం ఒంటి మీద పోసుకోవడానికి కూడా పనికి రావని, మానవ వ్యర్థాలు సాధారణ స్థితికంటే 500 రెట్లు అధికంగా ఉన్నాయని దిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) ఫిబ్రవరిలో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు ది హిందూ పత్రికి రిపోర్ట్ చేసింది.
దిల్లీ నగరానికి అవసరమైన తాగునీటిలో సగం వాటాను అందించే యమునా నదికి, దేశంలోనే అత్యంత కాలుష్యపూరిత నదుల్లో ఒకటిగా చెడ్డ పేరుంది. ఈ కాలుష్యంలో 70 నుంచి 80 శాతం దిల్లీ సమీపంలో ఈ నది ప్రవహించే 22 కిలోమీటర్ల పరిధిలోనే చేరుతున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
యమునా యాక్షన్ ప్లాన్ పేరుతో 1992 నుంచి యమునా ప్రణాళికలు ఉన్నా, ఇందుకోసం వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టులు చేపడుతున్నా కాలుష్యంలో తగ్గుదల కనిపించడం లేదు.
''నది సహజ ప్రవాహానికి వీలు కల్పించలేకపోతే కాలుష్య నియంత్రణ సాధ్యం కాదు. భారత్ లాంటి దేశాల్లో కలుషిత జలాల కారణంగా నదులు, ఇతర నీటివనరులు దెబ్బ తింటున్నాయి. నీటిలోని ప్రాణులు చనిపోతున్నాయి'' అని పర్యావరణ కార్యకర్త మనోజ్ మిశ్రా గతంలో బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, ANI
ఇప్పుడు వరద ముప్పు
యమునా కాలుష్యానికి తోడు వరదలు ఇటీవలి కాలంలో దిల్లీ నగరానికి పెను ముప్పుగా పరిణమించాయి. యమునా ప్రవాహ (ఫ్లడ్ ప్లెయిన్స్) ప్రాంతంలో విపరీతంగా పెరుగుతున్న కట్టడాలు, ఆక్రమణలు ప్రధాన కారణంగా చెబుతున్నారు.
దీనికి తోడు వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ శ్రేణులలో విపరీతంగా కురస్తున్న వర్షాల కారణంగా యమునా నదికి వరద నీరు పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
గతం రికార్డులను బద్ధలు చేస్తూ ప్రవహిస్తున్న యమునా నది ఉధృతికి దిల్లీ నగరంలో వేలమంది నిరాశ్రయులయ్యారు. ఇది ఇంతటితో ఆగేది కాదని, రానున్న కాలంలో దిల్లీ నగరంలో మరిన్ని వరద ముప్పులను ఎదుర్కోవాల్సి రావచ్చన్న ఆందోళన వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ఎగిరే టాక్సీలు వచ్చేస్తున్నాయి
- గ్రహాంతరవాసులు ఉన్నారా....పెంటగాన్ విడుదల చేయబోయే రిపోర్టులో ఏముంది?
- గ్రహాంతరవాసులు భూమిపైకి వస్తే ఏమవుతుంది? స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పారు
- UFO: అంతుచిక్కని ఫ్లయింగ్ సాసర్ల రహస్యం ఏంటి? ఒకప్పుడు అమెరికాను ఊపేసిన ఈ ‘ఏలియన్ స్పేష్ షిప్‌లు’ ఇప్పుడు ఏమయ్యాయి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















