బీచ్ హత్యలు: సీరియల్ కిల్లర్‌ని అతను తిన్న పిజ్జా బాక్స్ పట్టించింది, ఎలాగంటే...

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, బెర్న్డ్ డెబస్మాన్ జూనియర్
- హోదా, బీబీసీ న్యూస్
న్యూయార్క్ రాష్ట్రంలో చాలా కాలంగా పరిష్కారం కాని గిల్గో బీచ్ హత్యల కేసులో 11 మంది బాధితుల్లో ముగ్గురి మరణంలో ప్రమేయముందంటూ ఒక ఆర్టిటెక్ట్‌పై అభియోగాలు మోపారు.
ఈ ముగ్గురు మహిళల హత్య కేసులో 59 ఏళ్ల రెక్స్ హ్యూర్‌మాన్‌పై అభియోగాలు మోపారు. నాలుగో మహిళ మరణంలో కూడా ఆయన ప్రమేయమున్నట్లు అనుమానిస్తున్నారు.
అనుమానితుడు తిన్న పిజ్జాలో సేకరించిన డీఎన్‌ఏ, చనిపోయిన మహిళల అవశేషాలపై దొరికిన డీఎన్ఏతో మ్యాచ్ అయినట్లు డిటెక్టివ్‌లు చెప్పారు.
‘‘రెక్స్ హ్యూర్‌మాన్ మన మధ్యనే ఉండే నరరూప రాక్షసుడు. కుటుంబాలను నాశనం చేసేందుకు క్రూరంగా వారిని వేటాడతాడు’’ అని పత్రికా సమావేశంలో సఫోల్క్ కౌంటీ పోలీసు కమిషనర్ రాడ్నీ హ్యారిసన్ చెప్పారు.
గురువారం రాత్రి హ్యూర్‌మన్‌ను ఆయన ఇంట్లోనే అరెస్ట్ చేశారు. ముగ్గురు మహిళలను హత్య చేసిన కేసులో ఈయనపై అభియోగాలు మోపారు.
నేరాలు జరిగిన తీవ్రత కారణంగా అతన్ని కస్టడీలోనే ఉంచాలని జడ్జి ఆదేశించారు.
కోర్టులో ఆయన ఫిర్యాదు విచారణకు వచ్చినప్పుడు, హ్యూర్‌మాన్ కన్నీటి పెట్టుకున్నారు. ‘‘ ఇవన్నీ నేను చేయలేదు’’ అని అటార్నీకి చెప్పారు.
‘‘నా క్లయింట్ తీవ్ర మానసిక వ్యధకు గురయ్యాడు’’ అని హ్యూర్‌మన్ న్యాయవాది మైఖేల్ బ్రౌన్ అన్నారు.
కోర్టులో తాము దీనిపై పోరాడాలనుకుంటున్నామని, ప్రజాభిప్రాయం అనే న్యాయస్థానంలో కాదని బ్రౌన్ అన్నారు.

ఫొటో సోర్స్, RH CONSULTANTS AND ASSOCIATES
నాలుగో బాధితురాలి శవానికి దగ్గర్లోనే 2010లో హత్యకు గురైన ఈ ముగ్గురు మహిళల మృతదేహాలను కనుగొన్నారు.
హత్యకు గురైన వారంతా వారందరూ సెక్స్ వర్కర్లేనని ప్రాసిక్యూటర్లు అందించిన సమాచారంలో తెలిసింది.
‘‘నలుగురు బాధితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఒకే విధంగా పడి ఉన్నారు. బెల్టులు, టేపులతో వారిని ఒకే విధంగా కట్టారు. ముగ్గురు బాధితుల్ని గోనె సంచుల్లో చుట్టారు.’’ అని సఫోల్క్ కౌంటీ డిస్ట్రిక్ అటార్నీ రే టియర్నీ చెప్పారు.
బాధితులతో ఆయనకున్న సంబంధాలను తెలియజేసే మొబైల్ ఫోన్ రికార్డులు, బాధితుల్లో ఒకరి ఇంటికి సమీపంలో కనిపించిన పికప్ ట్రక్కు ఆధారంగా హ్యూర్‌మాన్‌ను పట్టుకున్నట్లు స్థానిక ప్రాసిక్యూటర్లు చెప్పారు.
బర్నర్ ఫోన్ల (ఫీచర్ ఫోన్ల)తో బాధితులతో మాట్లాడి, ఆ తర్వాత వాటిని ధ్వంసం చేసినట్లు హ్యూర్‌మాన్‌పై ఆరోపణలున్నాయి.
భార్య, పిల్లలు ఊరులో లేని సమయంలో హ్యూర్‌మాన్ ఈ హత్యలు చేసేవాడని ఇన్వెస్టిగేటర్లు ఫోన్ రికార్డుల ద్వారా గుర్తించారు.
బాధితుల్లో ఒకర్ని చుట్టిన గోనె సంచిపై దొరికిన వెంట్రుక, 2023 జనవరిలో మన్‌హట్టన్‌లో హ్యూర్‌మాన్ తిని డెస్ట్‌బిన్‌లో వేసిన పిజ్జా బాక్స్‌పై దొరికిన వెంట్రుక శాంపిల్స్‌తో సరిపోయినట్లు అధికారులు గుర్తించారు.
2009లో బాధితుల్లో ఒకరైన బార్తెలెమి అనే మహిళ అపహరణకు గురి కాగా, వాటర్‌మ్యాన్, కోస్టెల్లో అనే ఇద్దరు 2010లో కనిపించకుండా పోయారు.
2007లో కనిపించకుండా పోయి శవమై కనిపించిన మిస్ బ్రెయినార్డ్ బార్నెస్ కేసులో కూడా ప్రధాన అనుమానితుడు మిస్టర్ హ్యూర్‌మాన్‌నే.
అయితే, ఇప్పటి వరకు ఆమె మరణంపై అతనిపై ఎలాంటి అభియోగాలు మోపలేదు.
2010లో కనిపించకుండా పోయిన షానాన్ గిల్బర్ట్‌ను వెతికే క్రమంలో, ఈ నలుగురు మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
2010-11 మధ్య కాలంలో, గిల్గో బీచ్ ప్రాంతంలో మొత్తం 11 మంది మృతదేహాలను గుర్తించారు. దానిలో 9 మహిళలవి, ఒక మగవ్యక్తిది, మరొకటి చిన్నారిది.
చిన్నారి, ఆమె తల్లి మృతదేహంతో పాటు మరో ఐదు మృతదేహాలు ఎవరివన్నది ఇంకా గుర్తించ లేదు.
షానాన్ గిల్బర్ట్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కానీ, అధికారిక పోస్ట్ మార్టం పరీక్ష ఇంకా పూర్తి కాలేదు.
ఆమెను హత్య చేసి చంపేసినట్లు ఆమె కుటుంబం అనుమానిస్తోంది. కుటుంబ సభ్యులు సొంతంగా చేయించిన పోస్టుమార్టంలో ఈ విషయం తెలిసింది.

ఫొటో సోర్స్, Getty Images
గిల్గో బీచ్ హత్యలపై విచారణ జరిపేందుకు 2022 ఫిబ్రవరిలో ఒక కొత్త టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.
ఈ కేసులో ఇన్వెస్టిగేటర్లు 300కి పైగా సమన్లు, సెర్చ్ వారెంట్లు జారీ చేశారు.
టాస్క్ ఫోర్స్ ఏర్పాటైనప్పటి నుంచి, సీరియల్ కిల్లర్స్, లాంగ్ ఐల్యాండ్ ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన అంశాలపై హ్యూర్‌మాన్ తన ఫీచర్ ఫోన్ ద్వారా 200 సార్లకు పైగా సెర్చ్ చేసినట్లు ఆరోపణలున్నాయి.
ఎందుకు లాంగ్ ఐల్యాండ్ సీరియల్ కిల్లర్ పట్టుబడటం లేదు? లాంగ్ ఐల్యాండ్ మర్డర్ బాధితుల మ్యాపింగ్ వంటివి కూడా హ్యూర్‌మాన్ సెర్చ్ చేసిన అంశాల్లో ఉన్నట్లు కోర్టు డాక్యుమెంట్లలో తెలిపారు.
హ్యూర్‌మాన్ కంప్యూటర్‌పై ‘టార్చర్ పోర్న్’, ‘మహిళలను అభ్యంతరకరంగా చూపించడం’, ‘చంపేయడం’ వంటివి ఉన్నట్లు టియర్నీ చెప్పారు.
ఇతర బాధితుల గురించి కూడా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
మన్‌హట్టన్ ఆర్కిటెక్చర్ సంస్థ ఆర్‌హెచ్ కన్సల్టెంట్స్, అసోసియేట్స్‌కి హ్యూర్‌మాన్ యజమాని. ‘‘న్యూయార్క్ సిటీ ప్రీమియర్ ఆర్కిటెక్చరల్ సంస్థ’’గా తన సంస్థను అభివర్ణించుకుంటారు.
హ్యూర్‌మాన్‌కి ఒక కూతురు, ఒక సవతి కొడుకు ఉన్నారని అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్టు చేసింది.
6 అడుగుల 4 అంగుళాలుండే హ్యూర్‌మాన్ ప్రతి రోజూ ఉదయం చక్కగా సూట్ వేసుకుని, టై కట్టుకుని, బ్రీఫ్‌కేసు పట్టుకుని ఆఫీసుకి వెళ్తుంటారని పక్కింటి వారు చెప్పారు.
హ్యూర్‌మాన్ వద్ద 92 గన్ లైసెన్స్‌లున్నాయి. వీటన్నింటినీ దాచి పెట్టడానికి ఒక పెద్ద సేఫ్ లాకర్ ఉంది.
1987 నుంచి న్యూయార్క్ సిటీ కేంద్రంగా తాను పనిచేస్తున్నట్లు గత ఏడాది రియల్ ఎస్టేట్ ఫోకస్డ్ చానల్‌కి ఇచ్చిన యూట్యూబ్ ఇంటర్వ్యూలో తెలిపారు.
తనకు తాను ‘ట్రబుల్ షూటర్’గా అభివర్ణించుకున్నారు.
ప్రజల్ని అర్థం చేసుకునేందుకు తన పని తనకు సాయం చేసినట్లు తెలిపారు.
లాంగ్ ఐల్యాండ్ మసాపెక్యా పార్క్‌లో అతని ఇంటి పక్కన నివసించే వారు, అరెస్ట్‌ను విని ఆశ్చర్యపోయారు.
‘‘ఈ మనిషి చాలా నెమ్మదస్తుడు. పెద్దగా ఎవరితో మాట్లాడరు. ఎవరి విషయంలో తలదూర్చరు’’ అని బీబీసీ యూఎస్ పార్టనర్ సీబీఎస్ ప్రతినిధి ఎటిన్నే డీ విలియర్స్ చెప్పారు.
‘‘మేమంతా షాక్ కు గురయ్యాం. మేమంతా ఒకరికి ఒకరం తెలిసిన వాళ్లం. పక్కపక్కన ఉండేవాళ్లం. చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఇలా జరుగుతోందని తెలియదు’’ అని వారు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మాట్లాడటం మానేసిందని యువతిపై వేట కొడవలితో దాడి
- చైల్డ్ పోర్న్ ఫోటోలు చూస్తున్నారంటూ నకిలీ సమన్లు.. రూ.31 కోట్లు వసూలు
- కోతి పిల్లలను చిత్రహింసలు పెడుతూ వీడియోలు తీసి అమ్ముకుంటున్నారు.. బీబీసీ ఇన్వెస్టిగేషన్లో బయపడిన దారుణమైన ఇంటర్నేషనల్ బిజినెస్
- శవాల నుంచి అవయవాలను తీసి ఆన్లైన్లో అమ్ముకున్న మార్చురీ మాజీ అధికారి, కేసు నమోదు
- చెరిల్: 53 ఏళ్ల కిందటి చిన్నారి మిస్సింగ్ కేసును రీ-ఓపెన్ చేయాలంటూ కోర్టుకెక్కిన కుటుంబం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














