భారత్‌లోని ఆఫ్రికన్ చీతాలను చంపుతున్నది ఇదేనా?

చీతాలు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో చీతాలను సంరక్షిస్తున్నారు
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

జంతువుల కదలికలను ట్రాక్ చేయడంలో సహాయపడే కీలక ఎలక్ట్రానిక్ పరికరమైన ‘రేడియో కాలర్స్’ వాడకం జంతువులకు హానికారకంగా మారుతోందా?

కునో నేషనల్ పార్క్‌లో గత వారం రెండు చీతాలు చనిపోయిన తర్వాత నుంచి ఈ ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. నిరుడు ఆర్భాటంగా భారత్‌కు తీసుకొచ్చిన 20 చీతాలలోని ఈ రెండూ.

భారత్‌లో చీతాలు అంతరించిపోయినట్లుగా 1952లోనే ప్రకటించారు. ‘మాంసాహార జంతువుల ప్రపంచ తొలి ఖండాంతర పునరావాస కార్యక్రమం’లో భాగంగా వాటిని భారత్‌కు తీసుకు వచ్చారు.

మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్క్‌లో ఉంచి ఈ చీతాలను సంరక్షిస్తున్నారు.

ఇప్పటివరకు మార్చిలో పుట్టిన మూడు కూనలతో సహా ఎనిమిది చీతాలు చనిపోయాయి.

వీటిలో కొన్ని మరణాలు కార్డియాక్ ఫెయిల్యూర్ వంటి కారణాల వల్ల జరిగాయి.

కానీ, చివరి రెండు చీతాల మరణాలు చర్మ సంబంధిత ఇన్‌ఫెక్షన్లు ముదరడం వల్ల సంభవించినట్లు బీబీసీతో పలువురు వన్యప్రాణి నిపుణులు, వెటర్నరీ డాక్టర్లు చెప్పారు.

చీతాల మృతికి వాటి మెడకు అమర్చే రేడియో కాలర్ కూడా ఒక కారణం కావచ్చని వారు అన్నారు. జంతువుల రక్షణ కోసం రేడియో కాలర్‌ను వాటికి అమర్చుతారు.

కునో చీతా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, నిరుడు ఎంతో ఆర్భాటంగా చీతాలను భారత్‌కు తీసుకొచ్చారు

అయితే, పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ దీన్ని తిరస్కరించింది. ఎదిగిన చిరుతలన్నీ సహజ కారణాలతో చనిపోయాయని, రేడియో కాలర్‌ల మీద వస్తోన్న ఆరోపణలన్నీ ఊహజనితమని, శాస్త్రీయ ఆధారాలు లేనివని అధికారిక ప్రకటనలో పర్యావరణ మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది.

చీతా ప్రాజెక్ట్‌ చైర్మన్ రాజేశ్ గోపాల్‌ను కూడా బీబీసీ సంప్రదించింది. కానీ, దీనిపై ఆయన స్పందించలేదు.

ఇలాంటి గాయాలు ఇతర పులి జాతుల్లో కూడా అసాధారణమేమీ కాదని, ముఖ్యంగా వర్షకాలంలో ఇవి సాధారణమని వన్యప్రాణి నిపుణులు అన్నారు.

చీతాల మరణాలకు ఎన్నో కారణాలు ఉన్నాయని, వాటిలో వాటి మనుగడకు కీలకమైన రేడియో కాలర్ పాత్ర కూడా ఉండొచ్చని బీబీసీతో మధ్యప్రదేశ్ అడవుల మాజీ చీఫ్ కన్జర్వేటర్ అలోక్ కుమార్ చెప్పారు.

‘‘ఈ రేడియో కాలర్లలో చిప్ ఉంటుంది. అది ఉపగ్రహాల ద్వారా ఈ జంతువులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తుంది. చీతాల భద్రత, సంరక్షణ కోసం వాటి కదలికలను పర్యవేక్షించడం ఇది చాలా అవసరం. టైగర్లలో కూడా కాలర్ పరికరం వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్లను నేను చూశాను’’ అని ఆయన వివరించారు.

చీతాల తరలింపు ప్రాజెక్ట్‌కు ప్రణాళిక రచించి, పర్యవేక్షించిన వెటరన్ కన్జర్వేషనిస్ట్ యద్వేంద్రదేవ్ ఝాలా మాట్లాడుతూ, చెమట వల్ల మెడ చుట్టూ తరచుగా గీరుకోవడం వల్ల చీతాలకు ఆ గాయాలై ఉంటాయని అన్నారు.

చీతా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, జంతువుల రక్షణ, భద్రత కోసం వాటి కదలికలను పర్యవేక్షించడంలో రేడియో కాలర్ల అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు

‘‘ఆఫ్రికా నుంచి వచ్చిన చీతాలకు భారత్‌లో ఇదే తొలి వర్షాకాలం. ఆఫ్రికా అడవులు డ్రై జోన్లు. అందుకే అక్కడి నుంచి భారత్‌కు వచ్చిన చీతాలు ఇక్కడి వర్షాకాల వాతావరణ పరిస్థితులకు అలవాటుపడేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నాయి’’ అని ఆయన అన్నారు.

చీతాల మెడ కింద జుట్టు దట్టంగా ఉంటుంది. అది తేమను గ్రహించడంతో మృదువుగా మారడంతో పాటు దురదను కూడా కలిగిస్తుంది.

‘‘చీతా తన మెడ చుట్టూ గీరుకుంటున్నప్పుడు ఒకవేళ అక్కడి చర్మానికి గాయమైతే ఈగలు అక్కడ గుడ్లు పెడతాయి. వివిధ రకాల క్రిములు దాడి చేస్తాయి. అది బ్యాక్టీరియా ముట్టడికి దారి తీస్తుంది. దీనివల్ల సెప్టిసీమియా అనే పరిస్థితి తలెత్తి మరణానికి కారణం అవుతుంది’’ అని ఆయన వివరించారు.

భారత్‌లో చీతా ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కిందటేడాది సెప్టెంబర్‌లో తొలి విడతలో భాగంగా నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను కునో జాతీయ పార్క్‌లో ప్రవేశపెట్టే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొన్నారు. వాటిని జాతీయ పార్క్‌లో వదిలిపెట్టారు.

రెండో విడతలో భాగంగా ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను తీసుకొచ్చారు. కాబట్టి వీటి జనన, మరణాలు సహజంగానే వార్తల్లో ప్రాధాన్యాన్ని అందుకుంటున్నాయి.

చీతా

ఫొటో సోర్స్, CHARL SENEKAL

చీతా కూనల మరణాలు పౌష్టికాహార లేమి, డీహైడ్రేషన్ కారణంగా జరిగినప్పుడు అధికారులు వాటిని రక్షించడానికి సరైన సమయంలో ఎందుకు జోక్యం చేసుకోలేదని పలువురు ప్రశ్నించారు.

ఇప్పుడు తాజాగా రెండు చీతాలు చనిపోవడంతో ఇలాంటి ప్రశ్నలే పునరావృతం అవుతున్నాయి.

చనిపోయిన రెండు చీతాల్లో ఒకదాని మృతదేహం వీడియోను చూసిన ఒక పశువైద్యుడు ‘‘దాని తల నుంచి కాలి వరకు శరీరంపై వేలాది లార్వాలు పరుచుకున్నాయి’’ అని చెప్పారు. ఆయన తన పేరు ప్రచురించడానికి ఇష్టపడలేదు.

‘‘లార్వాల ముట్టడి కారణంగా ఒక జంతువు చనిపోవడానికి చాలా రోజుల సమయం పడుతుంది. ఎందుకు అంతకాలం వీటిని ఎవరూ గుర్తించలేకపోయారు?’’ అని ఆయన ప్రశ్నించారు.

అన్నింటికంటే చివరగా చనిపోయిన చీతా పేరు సూరజ్. గతవారం పర్యవేక్షణ బృందం సూరజ్‌ను గుర్తించినప్పుడు దాని మెడ చుట్టూ ఈగలతో చాలా బలహీనమైన స్థితిలో కనిపించిందని వార్తా పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. మూడు గంటల తర్వాత అది చనిపోయిన స్థితిలో కనిపించింది.

మెడ, వీపుపై అయిన గాయాల కారణంగానే సూరజ్ చనిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఒక వన్యప్రాణి అధికారి చెప్పారు.

సూరజ్ కంటే కొన్ని రోజుల ముందు చనిపోయిన మరో మగ చీతాకు కూడా ఇలాంటి గాయాలు ఉన్నాయని, దీనికి శాటిలైట్ కాలర్లు కూడా ఒక కారణం కావచ్చొని మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ జేఎస్ చౌహాన్ చెప్పినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. మగ చీతా మరణం తర్వాత చౌహాన్‌ను ఆ పదవి నుంచి తప్పించారు.

మరో మూడుకు పైగా చీతాలు కూడా ఇలాంటి గాయాలతోనే ఉన్నాయని, చీతాల మరణాల్లో రేడియో కాలర్ల పాత్రపై దర్యాప్తు చేయాలని అధికారులను వన్యప్రాణి నిపుణులు కోరుతున్నట్లు బుధవారం నాటి నివేదికలు పేర్కొన్నాయి.

చీతాలు

ఫొటో సోర్స్, Getty Images

ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలంటే మిగిలిన చీతాల్లో ఇలాంటి గాయాలేమైనా ఉన్నాయో లేదో తనిఖీ చేయడమే ఏకైక మార్గమని ఝాలా అన్నారు.

‘‘ఒకవేళ చీతాకు గాయాలు ఉన్నట్లు గుర్తిస్తే, వెంటనే వాటికి చికిత్స అందించాల్సి ఉంటుంది. వాటికి పూర్తిగా నయం అయ్యేంతవరకు రేడియో కాలర్లను వాటి మెడకు అమర్చకూడదు. కాబట్టి వాటిని రక్షిత ఎన్‌క్లోజర్లలో ఉంచాల్సి ఉంటుంది’’ అని ఆయన వివరించారు.

భారత్‌లో చీతాలను తిరిగి తీసుకువచ్చే ప్రాజెక్టు అమలైన తొలి ఏడాదిలో మరణాల రేటు 50 శాతం ఉంటుందని ప్రాజెక్ట్ కార్యాచరణ ప్రణాళిక అంచనా వేసింది.

వేటాడటం, వాహనాలు ఢీకొట్టడం, చిరుతలతో ఘర్షణ కారణంగా ఈ మరణాలు సంభవిస్తాయని ఊహించినట్లు ఝాలా చెప్పారు.

‘‘ఊహించిన కారణాల వల్ల మరణాలు జరగకపోవడం చాలా సానుకూలాంశం. అయితే, ఇప్పటివరకు సంభవించిన మరణాలు చాలా పాఠాలను నేర్పించాయి.

చీతాలు కొత్త జాతి జంతువులు. భారత ఉపఖండ పరిస్థితులకు అవి అలవాటు పడటానికి 5 నుంచి 10 ఏళ్లు పట్టొచ్చు. చీతాల రక్షణలో మేం రోజూ పాఠాలు నేర్చుకుంటున్నాం’’ అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)