సింగిల్ ఫాదర్: భార్య లేకుండానే ఇద్దరు పిల్లలకు తండ్రయ్యారు, ఇకపై అందరికీ ఇది సాధ్యం కాదా?

ప్రీతేశ్ దవే
ఫొటో క్యాప్షన్, తన కవల పిల్లలతో ప్రీతేశ్ దవే
    • రచయిత, జయ్ శుక్లా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గుజరాత్‌కు చెందిన ప్రీతేష్ దవేకుకు పిల్లలంటే చాలా ఇష్టం. తనకొక కుటుంబం ఉంటే బాగుణ్ను అనుకుంటుండే వారు. కానీ, ఆయనకు పెళ్లి కాలేదు.

ప్రీతేష్ వయస్సు ఇప్పుడు 37 సంవత్సరాలు. చాలామంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని కొందరు, ప్రభుత్వ ఉద్యోగం లేదని మరికొందరు ఆయనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారట. ఈ విషయం ఆయన కుటుంబ సభ్యులే చెప్పారు.

పిల్లల కోసం తపించే ఆయన, పెళ్లి చేసుకోకపోయినా సరే తండ్రిగా మారి వారిని సాకాలనుకున్నారు. ఇందుకోసం సరోగసీ విధానాన్ని ఆశ్రయించారు.

వివాహం కాకుండానే కవలలకు తండ్రిగా మారిన అతి కొద్దిమందిలో ఆయన కూడా ఒకరు.

ఇప్పుడాయన తన కొడుకు, కూతుళ్లను ప్రేమగా పెంచుతున్నారు. వారికి ఏడాది వయసు వస్తోంది. కొత్త సరోగసీ చట్టం అమల్లోకి రాకముందే ఆయన తండ్రి అయ్యారు. లేదంటే ఇక ముందు అలా చేయడం సాధ్యమయ్యేది కాదు.

సరోగసి
ఫొటో క్యాప్షన్, మనవళ్లతో దివ్యానీ దవే

ఎలా ఈ ఆలోచన?

భావ్‌నగర్‌లోని ఓ జాతీయ బ్యాంకుకు ప్రీతేష్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను నడుపుతున్నాడు. ఆయన తల్లిదండ్రులు సూరత్‌లో ఉంటుంటారు. ప్రీతేష్ తరచూ సూరత్, భావ్‌నగర్ మధ్య తిరుగుతూ ఉండేవాడు.

తాను ఒంటరివాడినని భావించిన ఆయన, పెళ్లి చేసుకోకపోయినా తండ్రి కావాలనుకున్నాడు. కొంతమంది ఆయనకు సరోగసీ విధానాన్ని సూచించారు. అదే మార్గాన్ని అనుసరించిన ఆయన చివరకు తండ్రి అయ్యారు.

"నేను సరోగసీ ద్వారా తండ్రి అయినందుకు గర్వపడుతున్నాను. అదృష్టవంతుడినని భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం, నాలాంటి అవివాహితుడు అద్దె గర్భం ద్వారా తండ్రి కాలేడు." అని ప్రీతేష్ అన్నారు.

‘‘పెళ్లి చేసుకోలేకపోయినందుకు ఆయన చాలా బాధపడేవారు. తనకొక కుటుంబం ఉండాలని ఆయన కోరుకున్నారు. ఆ కోరికతోనే నా దగ్గరకు వచ్చారు’’ అని ఆయనకు అద్దె గర్భాన్ని పొందడంలో సహకరించిన సరోగసీ కన్సల్టెంట్ డాక్టర్ పార్థ బావిసి అన్నారు.

సరోగసి

కవలలకు తండ్రి

ప్రీతేష్‌కి తండ్రి అయ్యే క్షణం చాలా ప్రత్యేకమైంది. “ఆ ఇద్దరు పిల్లలు నా ప్రపంచంలోకి వచ్చాక, నా ఆనందానికి అవధులు లేవు. మొదట్లో పిల్లలు బలహీనంగా ఉండడంతో ఇంక్యుబేటర్‌లో ఉంచారు. వారిని నేను మొదటిసారి తాకినప్పుడు ఆ క్షణం నా జీవితంలో అత్యుత్తమ క్షణం. నేను దానిని మాటల్లో వర్ణించ లేను’’ అని ప్రీతేష్ అన్నారు.

''అప్పుడు ప్రీతేష్‌ని చూస్తే ప్రపంచంలోని ఆనందానంతటినీ తానే అనుభవిస్తున్నట్లు కనిపించారు. తండ్రి అయ్యానని నమ్మలేకపోయారు’’ అని డాక్టర్ పార్థ అన్నారు.

తాతయ్య, నాయనమ్మ అయినందుకు ప్రీతేష్ తండ్రి భానుశంకర్ దవే, తల్లి దివ్యాని దవేలు ఆనందంలో మునిగితేలారు. ‘‘పిల్లలు లేకుంటే ఇల్లు బోసిపోయినట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఇల్లంతా ఆనంద కాంతులతో వెలిగిపోయినట్లే. ప్రకృతి దయతో కూతురు, కొడుకు ఇద్దరూ ఇంటికి వచ్చారు.’’ అని భానశంకర్ దవే అన్నారు. ‘‘ఆ ఇద్దరి రాకతో మాకు వెలకట్టలేని ఆనందం దొరికింది’’ అని దివ్యానీ దవే అన్నారు.

అబ్బాయికి ధైర్య అని, అమ్మాయికి దివ్య అని పేరు పెట్టింది ఆ కుటుంబం.

సరోగసి
ఫొటో క్యాప్షన్, మనవడు ధైర్యతో ప్రీతేశ్ తండ్రి భానుశంకర్ దవే

'పెళ్లి కానందుకు బాధ లేదు'

పెళ్లి చేసుకోనందుకు పశ్చాత్తాపపడటం లేదని పిల్లలు పుట్టాక ప్రీతేష్ చెప్పారు. నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అడిగినప్పుడు “ధైర్య, దివ్య వచ్చిన తర్వాత నాకు ఇక పెళ్లి అవసరం లేదనిపిస్తోంది. కాబోయే భార్య ఈ పిల్లలను సరిగ్గా చూసుకుంటుందో లేదో తెలియదు. అందుకే ఒంటరిగా ఉన్నా...వీరిని చూసుకోవడం ఆనందంగా ఉంది. ఇప్పుడు నాకు జీవితంలో ఒకే ఒక లక్ష్యం ఉంది - నా పిల్లలను బాగా పెంచడం’’ అని ప్రీతీష్ అన్నారు.

మనవళ్లతో ఆడుకోవాలనే మా కల నెరవేరుతోందని భానుశంకర్ చెప్పగా, వీరిద్దరినీ చూసుకుంటూనే మా సమయం హాయిగా గడిచిపోతోంది అని దివ్యాని దవే అన్నారు.

పిల్లల విషయంలో మాకు ఆడామగా తేడాలేదని వారు చెప్పారు.

సరోగసి

ఫొటో సోర్స్, Getty Images

ఇకపై సింగిల్ ఫాదర్ కాలేరు

కొత్తగా వచ్చిన సరోగసీ (రెగ్యులేషన్) యాక్ట్ చట్టం 2021 ప్రకారం, వివాహిత జంటలు మాత్రమే సరోగసీని ద్వారా పిల్లలను కనే అవకాశం ఉంది.

సింగిల్‌గా ఉండే ఏ మగవాడు ఇకపై సరోగసీ ద్వారా పిల్లలను పొందలేరు. అయితే సింగిల్ విమెన్‌కు ఈ అవకాశం ఇప్పటికీ ఉంది. కానీ వారు విడాకులు తీసుకున్నవారు లేదా వితంతువులు అయ్యుండాలి. వారి వయస్సు 35 నుండి 45 సంవత్సరాల మధ్య ఉంటేనే అవకాశం ఉంటుంది.

స్వలింగ సంపర్కులు సరోగసీని ఉపయోగించడం కూడా నిషేధమే. ఇంతకు ముందు అందుకు అవకాశం ఉండేదని నిపుణులు చెబుతున్నారు.

సినిమా నిర్మాత కరణ్ జోహార్, నటుడు తుషార్ కపూర్ సరోగసీ సహాయంతో సింగిల్ ఫాదర్స్ అయ్యారు.

బేబీ ఫ్యాక్టరీ అని పిలిచే గుజరాత్‌లోని ఆనంద్ నగరంలో సరోగసీ క్లినిక్‌ని నడుపుతున్న డాక్టర్ నైనా పటేల్ "చట్టంలోని ఈ నిబంధన మనిషికి ఉండే పునరుత్పత్తి హక్కును అణచివేస్తుంది" అని అన్నారు.

“ఈ రోజు ప్రీతేష్ లాంటి చాలామంది పురుషులు తమకిష్టమైన జీవిత భాగస్వామిని పొందలేదని వివాహం చేసుకోకుండా ఉంటారు. అలాంటి వారికి తండ్రి కావాలన్న కోరిక ఉంటే అది ఎలా తీరుతుంది? భారతదేశంలో లింగ నిష్పత్తిని పరిశీలిస్తే, పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య తక్కువగా ఉంది. అలాంటి సందర్భాలలో, పురుషులలో తాము తండ్రి కావాలనే భావాలను గౌరవించాలి’’ అని డాక్టర్ పార్థా అన్నారు.

సరోగసీ పద్ధతిలో ఒంటరి పురుషులు, ఒంటరి మహిళలు సంతానం పొందడానికి వీలు లేదన్న చట్టాన్ని సవాల్ చేస్తూ దేశవ్యాప్తంగా పలు కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

ఇది రాజ్యాంగంలోని 14, 21 అధికరణలను ఉల్లంఘించడమేని ఇండియన్ సొసైటీ ఫర్ అసిస్టెడ్ రీప్రొడక్షన్ సంస్థ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ మనీష్ బ్యాంకర్ అన్నారు.

“వివిధ కోర్టుల్లో కేసులు విచారణ జరుగుతున్నప్పటికీ, చట్టం ఇప్పటికే అమలులో ఉంది. ప్రభుత్వం తన వైఖరిని కోర్టుకు తెలిపింది. తాము ఈ విషయంలో ఎటువంటి రాజీకి సిద్ధంగా లేమని ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి తెలుస్తోంది’’ అని ఆయన అన్నారు.

2023 ఏప్రిల్ 5న ది ప్రింట్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, ఈ విషయంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ కొత్త నిబంధనలను సామాజిక, నైతికతలకు సంబంధించిన అంశంగా అభివర్ణించింది. వీటిని సడలించడానికి నిరాకరించింది.

సరోగసి

ఫొటో సోర్స్, Getty Images

కొత్త సరోగసీ చట్టం ఏమిటి?

కొత్త చట్టం ప్రకారం పిల్లలు లేని దంపతులు మాత్రమే సరోగసీ ద్వారా సంతానాన్ని పొందగలరు. వారి వయస్సు 25 నుండి 50 మధ్య ఉండాలి. వారికి అంతకు ముందే బిడ్డ ఉండకూడదు లేదా దత్తత తీసుకుని ఉండకూడదు.

ఒక స్త్రీ వితంతువు లేదా విడాకులు తీసుకున్న వ్యక్తి అయితే, ఆమె వయసు 35 నుండి 45 సంవత్సరాల మధ్య ఉంటే సరోగసీ ద్వారా పిల్లలను పొందవచ్చు.

వితంతువు లేదా విడాకులు తీసుకున్న స్త్రీ సరోగసీ కోసం తన అండాలను దానం చేయడానికి చట్టం అనుమతి ఉంది. అయితే, అప్పటికి ఆమె వయసు 35 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

సరోగసీ కింద బిడ్డను కనాలనుకునే దంపతులు ఇందుకోసం ప్రభుత్వ మెడికల్ బోర్డును ఆశ్రయించాల్సి ఉంటుంది. బోర్డు ఆమోదం పొందిన తర్వాతే సరోగసీ ప్రక్రియ కొనసాగుతుంది.

ఈ జంటతోపాటు, అద్దె గర్భాన్ని ఇవ్వదలుచుకున్న మహిళలు అర్హత సర్టిఫికెట్ పొందిన తర్వాత అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ)ని అందించే సంస్థలను సంప్రదించవచ్చు.

గర్భాన్ని అద్దెకు ఇచ్చే తల్లులు, జంటలు తమ ఆధార్ కార్డులను లింక్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఈ విధానంలో పాల్గొన్న వ్యక్తుల బయోమెట్రిక్‌లు నమోదవుతాయి. రానున్న రోజుల్లో ఏవైనా అనుమానాలు వస్తే, ఈ రికార్డు సహాయంతో పరిష్కరించుకోవచ్చు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష. 25 లక్షల రూపాయల జరిమానా విధించవచ్చు.

బిడ్డ పుట్టకముందే దంపతులు చనిపోతే, ఆ బిడ్డను సంరక్షించే బాధ్యత దంపతులు నామినేట్ చేసిన వ్యక్తిపైనే ఉంటుంది. అది అద్దె తల్లి బాధ్యత కాదు.

సరోగసి

ఫొటో సోర్స్, Getty Images

సరోగసీ సాయం తీసుకున్న సెలబ్రిటీలు

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ సరోగసీ సహాయంతో తల్లిదండ్రులు అయ్యారు. బాలీవుడ్ నటి ప్రీతి జింటా, ఆమె భర్త జీన్ గూడెనఫ్ కూడా సరోగసీ ద్వారా కవలలకు తల్లిదండ్రులు అయ్యారు.

సరోగసీ సహాయంతోనే శిల్పాశెట్టి సమీషాకు తల్లి అయ్యారు. సినిమా నిర్మాత కరణ్ జోహార్ సరోగసీ ద్వారా తండ్రి అయిన సింగిల్ ఫాదర్. 2017లో ఆయన కవలలకు తండ్రి అయ్యారు. సరోగసీ సహాయంతో ఏక్తా కపూర్ కూడా సింగిల్ మదర్ అయ్యారు.

నటి లీసా రే సరోగసీ సాయం తీసుకున్నారు. సన్నీ లియోన్ మొదట ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. తర్వాత సరోగసీ సహాయంతో ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ కూడా 2013లో సరోగసీ సహాయంతో తల్లిదండ్రులయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)