మండువా: ఇల్లు ఇలా కట్టుకుంటే ఏసీలు అక్కర్లేదా, ఏమిటీ టెక్నాలజీ?

ఫొటో సోర్స్, Wuyuan Skywells Hotel
- రచయిత, షావొయింగ్ యు
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఏసీలు లేని కాలంలోనూ దక్షిణ చైనాలోని ఇళ్లను చల్లగా ఉంచడంలో మండువాల పాత్ర కీలకంగా ఉంది. అందుకే మండువాలకు చైనీయులు మళ్లీ ప్రాధాన్యం ఇస్తున్నారా?
భారతదేశంలో పాతకాలం మండువా ఇళ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. గ్రామీణ భవన నిర్మాణాల్లో మండువాలు చాలా కామన్.
బయట గాలి లోపలికి వచ్చేందుకు వీలుగా సరిగ్గా ఇంటి మధ్యలో ఖాళీ ఉంటుంది. దీనివల్ల వెలుతురు, గాలి ఇంటిలోపలికి పుష్కలంగా అందుతాయి.
ప్రాచీన చైనాలోనూ ప్రజల జీవనంలో మండువా ఇళ్లు ఎక్కువగా ఉండేవి. అయితే వాటి కింద నీటి తొట్టె లేదా చిన్న సైజు నీటి ట్యాంకుల ఏర్పాటుని మనం ప్రత్యేకంగా గమనించాలి. దీని వలన ప్రాచీన చైనా ఇళ్లు చాలా చల్లగా ఉండేవి.
చైనాలో స్కైవాల్స్‌గా పిలుస్తున్న మండువాల్లో సమయం గడిపేందుకు ఇష్టపడతారు రూ లింగ్. మండే ఎండల సమయంలో ఉక్కపోత రోజుల్లో రూ లింగ్ కోరుకునేది పాత కాలం చైనా ఇళ్లలోని మండువాలే.
“వాటిలోంచి మంచి గాలి వస్తుంది. చల్లగా ఉంటుంది. నీడ దొరుకుతుంది,” అని నలభై ఏళ్ల రూ అంటున్నారు.
2014 నుంచి 2021 మధ్యలో తూర్పు చైనాలోని ఆన్‌హూయి ప్రావిన్స్‌లో గ్వాంగ్లూ గ్రామంలో రూ ఉండేవారు. అక్కడ వందేళ్ల క్రితం కలపతో కట్టిన ఇంట్లో ఉన్నారు. చాలా ఏళ్లుగా ఏసీలతో నిర్మించిన భవనాల్లో పని చేస్తూ, ఆధునిక కట్టడాల్లోనే బతికిన రూ, తన జీవితంలో కొత్త మార్పు కోసం ఆ ఇంట్లోకి వెళ్లారు.
“వేసవిలో ఇల్లు సహజంగానే చల్లబడి సేదతీరేలా ఉంటుంది. ఈ ఆధునిక ప్రపంచంలో ఇలాంటి వ్యవస్థ ఉండటం చాలా అరుదైన విషయం. దీనివల్ల ఇల్లు ప్రశాంతంగా మారుతుంది.”
ఇంటిని చల్లగా ఉంచడంలో ఇంట్లోని స్కైవెల్ సాయపడుతుందని రూ అంటున్నారు. అయితే ఆమె కేవలం వేసవి రోజుల గురించే చెప్పట్లేదు. కొన్ని అధ్యయనాల ప్రకారం దక్షిణ చైనాలో స్కైవెల్స్ ఉన్న ఇళ్లల్లో ఉష్ణోగ్రతలు, బయటి వాతావరణం కంటే 4.3 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉంటున్నాయని తేలింది.

ఫొటో సోర్స్, Wuyuan Skywells Hotel
నగర నిర్మాణాలు వేగంగా జరుగుతున్న ఆధునిక చైనాలో చాలా తక్కువ మంది ప్రజలు మండువా ఉన్న ఇళ్లల్లో జీవిస్తున్నారు. ప్రస్తుతం, ఏసీలతో నిర్మించిన అపార్టుమెంట్లు, బహుళ అంతస్తు భవనాలు, ఆకాశహర్మ్యాలే ప్రజల జీవనానికి ప్రధాన ఆవాసాలుగా ఉన్నాయి.
సంప్రదాయ చైనా ఆర్కిటెక్చర్‌ను తిరిగి బతికించాలనే లక్ష్యంతో స్కైవెల్స్‌తో కూడిన ఆధునిక భవన నిర్మాణాలను చేపడుతోంది చైనా. అలానే భవన నిర్మాణ రంగంలో తక్కువ కర్బన ఉద్గారాలను కారణమయ్యే అవిష్కరణలను చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దాంతో భవనాలను సహజ పద్దతుల్లో చల్లగా ఉంచేందుకు ప్రాచీన, సంప్రదాయ చైనా నిర్మాణ పద్దతులకు ఆర్కిటెక్ట్స్ ప్రాధాన్యం ఇస్తున్నారు.
మేండరిన్ భాషలో స్కైవెల్‌ని టియాంగ్ జింగ్ అంటారు. దక్షిణ, తూర్పు చైనాలోని సంప్రదాయ ఇళ్ల నిర్మాణంలో ఇవి కీలకం. అయితే ఉత్తర చైనాలో స్కైవెల్స్ నిర్మాణం వేరుగా ఉంటుంది. వాటిని చిన్నగా, బయటి వాతావరణం ఎక్కువగా కనిపించని రీతిలో నిర్మించేవారు.
ఇటువంటి కట్టడాలు ఎక్కువగా 14 నుంచి 17వ శతాబ్దాల మధ్య కాలానికి చెందిన మింగ్ సామ్రాజ్యంలోనూ, 15 నుంచి 20వ శతాబ్దాల మద్య కాలానికి చెందిన ఖింగ్ సామ్రాజ్యంలోనూ కనిపించేవని చైనాలోని నాన్‌ఛంగ్ యూనివర్సిటీ 2010లో ప్రచురించిన రీసెర్చ్ పేపర్ చెబుతోంది.
మొత్తానికి స్కైవెల్‌గా చెబుతున్న మండువా నిర్మాణం, డిజైన్, పొడవు ప్రాంతాలను బట్టీ మారుతుంది. కొన్ని పెద్ద పెద్ద భవనాల్లో ఒకటి కంటే ఎక్కువ స్కైవెల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి.
అయితే దక్షిణ, తూర్పు చైనా ప్రాంతాల్లోని సిచువాన్, జేంగ్సూ, ఆన్‌హుయి, జియాంగ్షీ ప్రాంతాల్లో భారీ ప్రాంగణాల్లో నిర్మించిన చారిత్రక కట్టడాల్లో ఒకటి కంటే ఎక్కువ స్కైవెల్స్ కనిపిస్తాయి. వీటిలో పరిరక్షించిన కొన్ని కట్టడాలు చారిత్రక ప్రాంతం హుయిజోలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Ru Ling
ఏసీల ఆవిష్కరణకు ముందు కాలంలోనే ఇళ్లను చల్లగా ఉంచేందుకు స్కైవెల్స్ నిర్మించేవారు. మండువాలోంచి బయటి గాలి లోపలికి వీస్తుంది. ఇంటిలోపల గాలి కన్నా బయటి గాలి చల్లగా ఉంటుంది. కాబట్టి చల్లటి గాలి లోపలికి వస్తూ గోడలమీదుగా కిందకి వీస్తూ గాలి ప్రవాహాన్ని సృష్టిస్తుంది. అలా ఇంట్లోని వేడిగాలి పైకి లేచి మండువా ఖాళీలోంచి బయటకి వెళ్తుంది.
జియాంగ్షి ప్రావిన్స్‌లోని వుయువాన్ గ్రామంలో, మండువా ఇళ్లు తిరిగి ప్రజల జివితంలో భాగమవ్వాలని యు యోహాంగ్ గత ముప్పై ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇప్పుడాయన వయసు 55 ఏళ్లు. జియంగ్షీ ఒకనాటి హుయిజో ప్రాంతంలో భాగంగా ఉండేది. చైనా సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వారసుడిగా యు యోహాంగ్‌ను గుర్తించింది చైనా సాంస్కృతిక పర్యటక శాఖ.
మంచి వెలుతురు, మెరుగైన వెంటిలేషన్, వర్షపు నీటిని అందిపుచ్చుకోవడమే స్కైవెల్స్ ముఖ్య ఉద్దేశమని యూ యోహాంగ్ అంటున్నారు. హుయిజోలో స్కైవెల్ పరిమాణంలో చిన్నగా ఉన్నా దాని పొడవు ఎక్కువగా ఉంటుంది. దాని చుట్టూ ఉండే గదులు వేసవిలో సూర్యకాంతిని లోపలికి రానివ్వకుండా చేస్తాయి.
దీని వలన స్కైవెల్ కింది భాగం చల్లగా ఉంటుందని యు యోహాంగ్ చెబుతున్నారు. అలానే ఇంటిలోపల వేడి గాలి పైకిలేచి మండువా ఖాళీలోంచి బయటకు వెళ్లిపోతుందని, ఇది అచ్చం చిమ్నీలానే పనిచేస్తుందని కూడా యు చెబుతున్నారు.
పాత హుయిజో ఇళ్లల్లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో సాధారణంగా పొడవాటి పైకప్పులుంటాయి. అవి నేరుగా మండువాలవైపు నిర్మించి ఉంటాయి. దీని వలన మంచి వెంటిలేషన్ ఉంటుందని యు అంటున్నారు. “ఉన్న కుటుంబాల ఇళ్లల్లో రెండు లేదా మూడు స్కైవెల్స్ కూడా ఉండేవి. దాని వలన వాళ్లకు మంచి వెంటిలేషన్ ఉండేది.”

ఫొటో సోర్స్, Zhou Jie
ఏదేమైనా చైనాలో కొన్ని వందల ఏళ్లుగా మండువా ఇళ్లు మనుగడలో ఉన్నాయి. కానీ ఆధునిక చైనా ప్రజలకు అత్యాధునిక వసతులు అందుబాటులో ఉన్న కారణంగా మండువాలను మర్చిపోయారు. సంప్రదాయ చైనా సంస్కృతిని తిరిగి ఉనికిలోకి తెచ్చే విస్తృత ప్రయత్నంలో భాగంగా, సంప్రదాయ చైనా భవన నిర్మాణ పద్దతులపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. దాంతో స్కైవెల్స్ ఉన్న భవనాలు తిరిగి నగరాల్లో ప్రత్యక్షమవుతున్నాయి.
వుయుయాన్ కౌంటీలోని యాన్ గ్రామంలో మండువా ఉన్న ఒక ఇంటిని తిరిగి బాగుచేశారు యూ. ఎవరూ పట్టించుకోకుండా వదిలేసిన 300 ఏళ్ల నాటి ఈ పాత ఇంటిని 2015లో ఎడ్వర్డ్ గాన్, ఆయన భార్య లియావొ మిన్‌షిన్ కొన్నారు. ఎడ్వర్డ్ బ్రిటన్‌కు చెందిన ఒక కంపెనీలో మాజీ మార్కెటింగ్ డైరక్టర్. ఆయన భార్యది చైనా. ఈ దంపతులు, యూ సాయంతో మూడు అంతస్తుల భవనాన్ని 14 గదుల బొటిక్ హోటల్‌గా మార్చేశారు.
అయితే అన్ని గెస్ట్ రూముల్లోనూ ఏసీలు బిగించారు. కానీ మంచి గాలి వీచేందుకు వీలుగా సహజరీతిలో స్కైవెల్స్ ఉన్నాయి. అందరూ ఒకచోట కలుసుకుని సేదతీరేలా ఉన్నాయి. వేసవిలో ఏసీలు లేకపోయినా స్కైవెల్స్ ఉన్న చోట హాయిగా ఉంటుందని ఎడ్వర్డ్ చెబుతున్నారు. “ఎవరైనా సరే లోపలికి రాగానే సహజంగా ఏర్పడుతున్న చల్లదనాన్ని గుర్తిస్తున్నారు.”
స్కైవెల్స్‌ను ఆర్కిటెక్చర్ లక్షణంగా చూస్తున్నారు యూ. పర్యావరణహిత పద్దతులతో చేపట్టే నూతన భవన నిర్మాణాల్లో మెరుగైన వెంటిలేషన్, వెలుతురు లాంటి వాటికి యువత ఆకర్షితులవుతున్నారు. అందుకే స్కైవెల్స్ కాన్సెప్ట్ యువతలో బాగా పాపులర్ అవుతోంది.
సహజంగా వీచే గాలి లేకపోయినా, చిమ్నీ ఎఫక్ట్ కారణంగా మండువా ఉన్న ఇంట్లోకి గాలి వస్తోంది. మండువా పైన, లోపల, ఉష్ణోగ్రతల్లో ఉండే తేడా కారణంగా, మండువా లోపల వేడి గాలి పైకి లేస్తూ చల్లని గాలిని లోపలికి లాగుతుంది.
ఇంటిలోపల జీవన స్థితికి, ఇంటి బయటి పర్యావరణానికి మధ్య అనుసంధానంగా ఉండే మండువా, వేడి గాలి నుంచి లోపలి వ్యక్తులను రక్షించే కవచంగాలాగా మారుతుంది. అయితే మండువా కింద నీటి తొట్టె ఉన్నపుడే ఎక్కువ శాతం చల్లదనం ఉంటుంది.
నీటి తొట్టెలోని నీరు ఆవిరై వేడి గాలిని చల్లగా మారుస్తుంది. దీనిని ఎవాపరేటివ్ కూలింగ్ అంటారు. ఈ పద్దతిలో నిర్మించిన మండువాలు హుయిజో ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. గతంలో హుయిజోలోని కుటుంబాలు తమ ఇళ్లలోని మండువాల్లో వర్షపు నీటిని పట్టి ఉంచేవారు. ఇలా చేస్తే వాళ్ల సంపద పెరుగుతుందని నమ్మేవారు.
పైకప్పుల నుంచి కిందకు పారే వర్షపు నీటి కోసం, మండువాలోని నీటి తొట్టెల చుట్టూ ప్రత్యేక కాల్వలను తవ్వేవారు. సంపన్న కుటుంబాలు తమ ఇళ్లలోని మండువా కింద ప్రత్యేక డ్రయిన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేవని యూ చెబుతున్నారు. ఈ డ్రయిన్ కాల్వలు గ్రౌండ్‌ఫ్లోర్‌లోని హాల్ చుట్టూ కడతారు. వాటి లోంచి వర్షపు నీరు ఇంటి బయటకు వెళ్లిపోతుంది.
హుయిజో స్కైవెల్స్ కింద భారీ పరిమాణంలో రాతితో నిర్మించిన నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తారు. ఇవి వర్షపు నీటిని సేకరిస్తాయి. ఈ నీటిని ఇంట్లోని రోజువారి పనులకు, మంటలను ఆర్పేందుకు వాడతారు.
హుయిజో ప్రాంతంలోని రెండు సంప్రదాయ గ్రామాల్లో, పాతకాలం ఇళ్లల్లో నీటి తొట్టెలోని నీరు ఆవిరై వేడి గాలిని చల్లగా మారుస్తోంది. ఈ పద్దతి కారణంగానే మండువా ఇళ్ల లోపల ఉష్ణోగ్రతలు సగటున 2.6 నుంచి 4.3 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని మండువా ఇళ్లపైన 2021లో జరిపిన అధ్యయనం చెబుతోంది.

ఫొటో సోర్స్, CCDI Group
ఆధునిక భవన నిర్మాణ పద్దతుల్లో మండువాల పునరాగమనంలో ప్రభుత్వ ఆదేశాలు కీలక పాత్ర పోషించాయి. వనరుల పరిరక్షణ, కాలుష్య నివారణ లక్ష్యాలతో హరిత భవనాలను ప్రోత్సహిస్తోంది చైనా కేంద్ర ప్రభుత్వం. దీనికి అనుగుణంగా 2022 నాటికి పూర్తయ్యే భవన నిర్మాణాల్లో 70 శాతం హరిత
ప్రస్తుతం భవన నిర్మాణ నిపుణులు మండువాల మూల సూత్రాలను అధ్యయనం చేస్తున్నారు. వీటి ద్వారా వనరులను ఆదా చేసేలా ఆధునిక నిర్మాణాలను డిజైన్ చేస్తున్నారు.
దీనికి ఉదాహరణ తూర్పు చైనా నగరం జినాన్‌లోని నేషనల్ హెవీ వెహికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్. పద్దెనిమిది అంతస్తుల అద్దాల భవన నిర్మాణం గతేడాది పూర్తయింది. ఈ భవనం లోపల భారీ స్కైవెల్ ఉంటుంది. ఇది ఐదవ అంతస్తు నుంచి మొదలై భవనం పైభాగం దాకా ఉంటుంది. ఎలివేటర్లు, టాయిలెట్లు, మీటింగ్ రూంలు అన్నీ కూడా దీనికి చుట్టూరా ఉంటాయి.
ఇటువంటి డిజైన్ కారణంగా వీటిలో వెలుతురు, వెంటిలేషన్ మెరుగవుతాయని, శక్తి వనరుల వినియోగం తగ్గుతుందని షాంఘైకు చెందిన సీసీడీఐ గ్రూప్ ఆర్కిటెక్ట్స్ చెబుతున్నారు.
మరో ఉదాహరణ, ప్రఖ్యాత పర్యటక కేంద్రమైన సిచువాన్ ప్రావిన్స్‌లోని ఒక గ్రామంలో వేడి వాతావరణ పరిస్థితులుంటాయి. ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ గుండ్రని ఆకారంలో ఇళ్లను నిర్మించారు. వాటిలో మండువాలు, పైకప్పు చుట్టూ ఇంటిచూరులను నిర్మించారు.
కొన్ని ఆకాశహర్మ్యాలలో స్కైవెల్స్ మూల సూత్రాలను అన్వయిస్తూ ప్రత్యామ్నయ పద్దతులతో కట్టడాలు చేపడుతున్నారు. బహుళ అంతస్తు భవనాల్లో మండువా ఏర్పాటులో కొన్ని ఆచరణాత్మక సమస్యలు ఎదురవడమే అందుకు కారణం.
గువాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని 68 అంతస్తుల డాంగువాన్ టీబీఏ టవర్‌లో ఏర్పాటు చేసిన గాలి గొట్టాల ద్వారా అన్ని అంతస్తులకూ సహజ గాలి ప్రవాహాన్ని మళ్లిస్తున్నారు.
ఈ గాలిగొట్టాలు స్కైవెల్స్‌లానే పని చేస్తాయని ఈ టవర్ మేనేజర్ ఒక స్థానిక వార్తాపత్రికకు చెప్పారు. దీని వలన వసంత, శరత్కాలాల్లో బిల్డింగ్‌లోపల ఉష్ణోగ్రత హాయిగా ఉంటుందని ఆయన చెబుతున్నారు. దీని కోసం సహజసిద్ధంగా ఉన్న వెంటిలేషన్ విధానాన్నే ఉపయోగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ప్రాచీన గ్రీన్ విజ్డమ్‌గా భావించే స్కైవెల్స్ లాంటి కాన్సెప్ట్స్, ఆధునిక కాలంలో పర్యావరణ హిత పద్దతులను అలవాటు చేసుకునేలా స్పూర్తి నింపుతున్నాయి. సహజ పద్దతుల్లో చల్లదనానికి కారణమయ్యే ఆవిష్కరణలనూ స్కైవెల్స్ కాన్సెప్ట్ ముందుకు నడిపిస్తుందని వాంగ్ జెంగ్‌ఫెంగ్ అంటున్నారు.
నెదర్లాండ్స్‌లోని లీడన్ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ హ్యుమానిటీస్‌లో పోస్ట్ డాక్టోరల్ పరిశోధకులుగా ఉన్నారు వాంగ్. పాసివ్ కూలింగ్ పద్దతిలో - టెక్నాలజీ, డిజైన్ కలయికతో బిల్డింగ్ చల్లగా మారుతుంది. దీని కోసం విద్యుత్ అవసరం ఉండదని వాంగ్ చెబుతున్నారు.
కానీ ఆధునిక డిజైన్లలో స్కైవెల్స్‌ను చేర్చాలంటే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని వాంగ్ చెబుతున్నారు. మండువాలంటే సహజంగా వచ్చే వెలుతురుకి, వెంటిలేషన్‌కు, వర్షపు నీటి సేకరణకూ బాగా పేరు పొందాయి. కానీ మండువా సూత్రాలను అమలు చేయడం స్థానిక భౌగోళిక పరిస్థితులమీద ఆధారపడి ఉంటుందని వాంగ్ చెబుతున్నారు.
ఎందుకంటే సంప్రదాయ మండువాలు - వేర్వేరు రూపాలు, పరిమాణాలు, లక్షణాలు కలిగి ఉంటాయి. అవి ముఖ్యంగా చుట్టూ ఉన్న పరిసరాలమీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ఒక ప్రాంతంలో సూర్యకాంతి ఎంత ఉంటుంది, ఎంత వర్షపాతం ఉంటుందనే విషయాలు తెలియాలి.
మరోవైపు కృత్రిమ వెలుతురు, ఏసీలు, నీటి సరఫరా వంటివి ఎలానూ అందుబాటులో ఉంటున్నాయి. వీటిపైనే ఆధరపడుతూ మనం పర్యావరణాన్ని పట్టించుకోవడం లేదని వాంగ్ అంటున్నారు.
“చరిత్ర నేర్పిన విషయాలు ప్రస్తుత మనిషి ప్రవర్తనలో మార్పు తేలేకపోతే, పర్యావరణహితంగా జీవించడం, మనుగడ సాగించడం అంత తేలికైన విషయం కాదు.”
అయితే ఆధునికా చైనా ప్రజలను స్కైవెల్స్ ఎందుకంతగా ఆకర్షిస్తున్నాయని అడిగిన ప్రశ్నకు వాంగ్ సమాధానమిస్తూ, కుటుంబంలోని అందరూ కలుసుకునే విధంగా వీటిని నిర్మిస్తారు. ఇక్కడ ఆచారవ్యవహారాలను నిర్వహిస్తారని చెప్పారు.
“బహుశా కాంక్రీట్, గ్లాస్ జంగిల్స్‌లో జీవిస్తున్న ప్రజల్లో మండువా ఇళ్లు తమ ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలపైన ఆసక్తిని ప్రేరేపిస్తున్నాయి.”
ఇవి కూడా చదవండి:
- నిర్మల్ కొయ్య బొమ్మలకు ప్రాణం పోసే ఆ చెట్టు ఏమిటి? నంబర్లు వేసి కాపాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?
- పెట్రికోర్: తొలకరి జల్లుల్లో మట్టి వాసనకు కారణం ఇదే
- తల్లి ప్రాణాన్ని ఆరేళ్ల చిన్నారి రెండుసార్లు అలెక్సా సాయంతో ఎలా కాపాడింది?
- మహిళలకు 3 లక్షల రుణం.. దళితులకు వడ్డీ కూడా ఉండదు.. ఈ కేంద్ర పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- చంద్రయాన్-3ను ఇస్రో ఎందుకు ప్రయోగిస్తోంది? చంద్రయాన్-2తో ఏం సాధించింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














