రివెంజ్ పోర్న్ కేసులో దోషికి 'ఎవరికీ వేయని శిక్ష' వేసిన కోర్టు

ఫొటో సోర్స్, DAVIES SURYA/BBC INDONESIA
ఇండోనేషియాలో రివెంజ్ పోర్న్ కేసులో దోషికి అరుదైన శిక్ష పడింది.
నిందితుడు అల్వీ హుస్సేన్ ముల్లాను కోర్టు దోషిగా నిర్ధరిస్తూ, ఆరేళ్ల శిక్ష విధించింది. అంతేకాకుండా ఎనిమిదేళ్లపాటు ఇంటర్నెట్‌ను ఉపయోగించకుండా నిషేధం విధించింది.
ఈ కేసు ఇండోనేషియాలోని బాంటన్ ప్రావిన్స్‌లో నమోదైంది.
ఒక అమ్మాయికి సంబంధించిన పూర్తిగా వ్యక్తిగతమైన చిత్రాలను ఆమె అంగీకారం లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అల్వీ హుస్సేన్ ముల్లా.
అల్వీ హుస్సేన్‌కు ఈ శిక్ష సరిపోదని బాధితురాలి కుటుంబం బీబీసీతో చెప్పింది.
"ఈ ఘటన నా సోదరిపై శాశ్వత ముద్ర వేసింది, ఆమె బాధకు ఈ శిక్ష సరిపోదు" అని బాధితురాలి సోదరుడు ఇమాన్ జనాతుల్ హ్యారీ బీబీసీతో అన్నారు.
అల్వీ హుస్సేన్‌పై పోలీసులకు ఇప్పుడు మళ్లీ ఫిర్యాదు చేస్తామని ఇమాన్ చెప్పారు. లైంగిక హింస చట్టం కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు.
శిక్షపై పోలీసు కమిషనర్ అమీనా టార్డీ స్పందిస్తూ- కోర్టు నిర్ణయం చరిత్రాత్మకమన్నారు.
''ఈ తీర్పు చాలా ముఖ్యమైంది, చట్టం విజయం సాధించింది, ఎందుకంటే ఇంతకుముందు చాలా అరుదుగా నిందితుల ఇంటర్నెట్ హక్కులు రద్దు చేశారు'' అని అమీనా తెలిపారు.
దోషికి గరిష్ఠంగా ఆరేళ్ల శిక్ష విధించడం వెనుక సోషల్ మీడియా పాత్ర కూడా ఉందని బాధితురాలి కుటుంబీకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, DETIK.COM
'వైరల్ కావడం వల్లే ఈ శిక్ష'
బాధితురాలిని ప్రాసిక్యూషన్ పట్టించుకోలేదని, 8 నెలలపాటు ఆమె వాదన వినలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
దీనికి సంబంధించి ట్విటర్‌లో బాధితురాలి కుటుంబం ఒక ఉద్యమం చేపట్టింది. వారి పోస్టు వైరల్ కావడంతో ఈ ఘటన ఇండోనేషియాలో చర్చనీయాంశమైంది.
ఈ కేసులో నిందితులకు ఈ నెల 13న కోర్టు శిక్ష ఖరారు చేసింది.
2023 జూన్ 26న బాధితురాలి సోదరుడు ఇమాన్ ట్విటర్‌లో పలు పోస్టులు పెట్టారు. “నా సోదరికి ఏం జరిగిందో బహిరంగంగా మాట్లాడటం సరికాదని తెలుసు. ఇది నా సోదరిపై మానసిక ప్రభావాన్ని కూడా చూపింది" అని ఆయన అన్నారు.
తన సోదరికి న్యాయం జరగాలంటే సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేయడం తప్ప మరో మార్గం లేదని ఇమాన్ చెప్పారు.
“ఈ కేసులో సాధారణ చట్టపరమైన ప్రక్రియను అనుసరించి ఉంటే ఫలితం ఇలా ఉండేది కాదు. అందుకే మా కుటుంబం దీన్ని వైరల్ చేయాలనే రిస్క్ తీసుకుంది'' అన్నారు.

ఫొటో సోర్స్, DAVIES SURYA/BBC INDONESIA
అసలేం జరిగింది?
2022 డిసెంబర్ 14న బాధితురాలికి తెలియని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఆమె అపస్మారక స్థితిలో ఉన్న వీడియో రికార్డ్ ఉంది.
ఇమాన్ సోదరి ఏడుస్తూ అతనికి అన్నీ చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.
తన సోదరిపై లైంగిక దాడి వీడియోను ప్రచారం చేస్తామని మూడేళ్లుగా బెదిరింపులు వస్తున్నాయని ఇమాన్ వరుస ట్వీట్లలో తెలిపారు. ఈ సమయంలో ఆమె మానసిక వేదనకు గురైందన్నారు.
సుదీర్ఘ విచారణ తర్వాత నిందితుడిని పోలీసులు 2023 ఫిబ్రవరి 21న అరెస్టు చేశారు.
ఆ సమయంలో తన కుటుంబం చాలా ఒత్తిడిలోకి వెళ్లిందని ఇమాన్ అన్నారు.
“నా సోదరిని బలవంతంగా లాగారు, కొట్టారు. నా సోదరి గొంతుపై కత్తి పెట్టి చంపేస్తానని నేరస్థుడు పదేపదే బెదిరించాడు. వీడియోను పంపించి, బెదిరిస్తూ నా సోదరికి బాయ్‌ఫ్రెండ్‌గా ఉంటానని ఒత్తిడి చేశాడు” అని ఇమాన్ తెలిపారు.
తన సోదరికి జరిగినదాని గురించి ఇమాన్ ట్విటర్‌లో పెట్టిన పోస్టులను లక్షల మంది చూశారు.

ఫొటో సోర్స్, Getty Images
'కేసు విచారణ జరుగుతోందని కూడా తెలియదు'
ఈ కేసులో నిందితుడు అల్వీ హుస్సేన్ ముల్లాపై పలు అభియోగాలు నమోదు చేశారు పోలీసులు. దీని ప్రకారం దోషికి గరిష్ఠంగా ఆరేళ్ల వరకు శిక్ష పడుతుంది.
అయితే, ఈ కేసు మొదటి విచారణ గురించి తనకు గాని, తన లాయర్లకుగాని ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఇమాన్ చెప్పారు.
రెండోసారి తన సోదరిని సాక్ష్యం చెప్పేందుకు పిలిచినప్పుడు మాత్రమే విచారణ జరిగిన విషయం తెలిసిందన్నారు. నిందితుడిని క్షమించాలని తన సోదరిపై కోర్టులో ఒత్తిడి తెచ్చారని ఇమాన్ ఆరోపించారు.
కోర్టులో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఘటనకు సంబంధించిన వీడియోను తన ల్యాప్‌టాప్‌లో చూపించడానికి కూడా ప్రాసిక్యూటర్ నిరాకరించారని తెలిపారు.
ప్రాసిక్యూటర్ తన సోదరిని బెదిరిస్తున్నారని, తనకు సరిగా సహకరించడం లేదని ఇమాన్ ఆరోపించారు.
అశ్లీల వీడియో కేసులో దోషికి కోర్టు శిక్ష విధించింది. కానీ, నిందితుడి మీద వచ్చిన అత్యాచారం ఆరోపణలపై ఏమీ చెప్పలేదు.
తనపై అత్యాచారం జరిగిందని తన సోదరి ఎప్పటి నుంచో చెబుతోందని, అందుకే ఈ విషయమై తాజాగా ఫిర్యాదు చేస్తానని ఇమాన్ చెప్పారు.
అల్వీ హుస్సేన్ ముల్లా ఉద్దేశపూర్వకంగానే ఇంటర్నెట్‌లో అభ్యంతరకర విషయాలను షేర్ చేశాడని పాండేలాంగ్ జిల్లా కోర్టు న్యాయమూర్తి తన తీర్పులో చెప్పారు.
దోషికి ఆరేళ్ల జైలు శిక్ష విధించడంతోపాటు ఎనిమిదేళ్ల పాటు ఇంటర్నెట్ వినియోగాన్ని నిషేధిస్తూ తీర్పు చెప్పారు.
చాలా మందికి ఇండోనేషియాలో ఈ కేసు ఒక ఉదాహరణగా ఉంటుందని పలువురు విశ్వసిస్తున్నారు. ఓ కేసులో నిందితుల ఇంటర్నెట్ హక్కులు రద్దు కావడం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి:
- రోజుకు 24 గంటలేనా? ఈ లెక్క ఎలా మొదలైంది? ఆ గ్రంథాల్లో ఈజిప్షియన్లు ఏం రాశారు?
- గ్రహాంతరవాసులు ఉన్నారా....పెంటగాన్ విడుదల చేయబోయే రిపోర్టులో ఏముంది?
- అవతార్ 3, ద లయన్ కింగ్: హాలీవుడ్లో సమ్మెతో ఈ సినిమాల భవిష్యత్ ఏం కాబోతోంది?
- UFO: అంతుచిక్కని ఫ్లయింగ్ సాసర్ల రహస్యం ఏంటి? ఒకప్పుడు అమెరికాను ఊపేసిన ఈ ‘ఏలియన్ స్పేష్ షిప్‌లు’ ఇప్పుడు ఏమయ్యాయి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














