పిల్లల వల్ల భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రవి ప్రకాష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బిడ్డ పుట్టాడన్న వార్త తెలియగానే చాలా జంటల్లో, ముఖ్యంగా కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. అదే సమయంలో పిల్లలు వద్దనుకునే జంటలూ చాలామంది ఉన్నారు.
అయితే, వారి నిర్ణయానికి భిన్నమైన కారణాలు ఉండవచ్చు. ఇక్కడ అది వారి వ్యక్తిగత విషయం. బిహార్‌లోని గయా జిల్లాకు చెందిన మీనూ సింగ్‌కు పిల్లలంటే చాలా ఇష్టం.
వృత్తి రీత్యా టీచర్ అయిన మీను.. తనకు 2018లో పెళ్లయిందని, రెండేళ్ల తర్వాత కూతురు పుట్టిందని చెప్పారు.
కుమార్తె పుట్టిన తర్వాత కలిగిన ఆనందం ఎన్నో రోజులు నిలవలేదని, ఆ తర్వాత జీవితం పూర్తిగా మారిపోయిందని అన్నారు.
"నేను, నా భర్త ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం, కూతురు పుట్టిన తరువాత, మేం ఇద్దరం తన పెంపకంలో నిమగ్నమయ్యాం, కాబట్టి మేం ఒకరికొకరం సమయం ఇచ్చుకోలేకపోయాం. ఇంతకుముందు వారి దృష్టి నాపై ఉండేది. ఇప్పుడు ఇంట్లోని వాళ్లంతా చిన్నారిపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు" అని అన్నారు మీనూ.
‘‘నా కూతురు అందరి ప్రేమాభిమానాలను పొందడం, నా భర్త కూతురిని బాగా చూసుకోవడం చూస్తుంటే బావుంది. కానీ నాకూ, నా భర్తకూ మధ్య మొదట్లోని అన్యోన్యత ఇక లేదనే అనిపిస్తోంది. నా మీద ప్రేమ లేదని కాదు, కానీ ఆ ప్రేమను ఇప్పుడు విభజించారు''అని ఆవేదన వ్యక్తంచేశారు.
గతంలో ముంబైలో ఉండి ఇప్పుడు పట్నాలో ఉంటున్న శైలజ ఓజా కథ కూడా అలాంటిదే. ఆమె తన భర్త వివేక్ రంజన్, ఏడాది కొడుకుతో సంతోషంగానే ఉన్నారు.
కానీ కొడుకు పుట్టిన తర్వాత వారి సంబంధం కొద్దిగా దెబ్బతిందని ఆమె అనుకుంటున్నారు.
“పెళ్లికి ముందు, తరువాత మా జీవితం బాగానే ఉంది. మా మధ్య ప్రేమ మాత్రమే ఉంది. మేం 2021లో వివాహం చేసుకున్నాం, చాలా సంతోషంగా ఉండేవాళ్లం.అయితే, నేను గర్భవతి అయినప్పుడు, నా భర్త నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. కానీ 2022లో నాకు కొడుకు పుట్టాక, పరిస్థితులు మారిపోయాయి. చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చేసేది. నన్ను ఆయన పట్టించుకోకపోతే నాకు మరింత కోపం వచ్చేంది. నెమ్మదిగా అలవాటు పడ్డాం. ఇప్పుడు మా జీవితం మారిపోయింది" అని బీబీసీతో శైలజా ఓజా తెలిపారు.

ఫొటో సోర్స్, RAVI PRAKASH
పిల్లలు లేని దంపతులు ఎలా ఉన్నారు?
పిల్లల పుట్టుక భార్యాభర్తల మధ్య సంబంధాలను ప్రభావితం చేస్తుందని ఒక పరిశోధన చెప్పింది.
బిడ్డ పుట్టిన తర్వాత నలుగురు తల్లులలో ఒకరు ,10 మంది తండ్రులలో ఒకరు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని యూనివర్శిటీ ఆఫ్ బోర్న్ 2021 సంవత్సరంలో నిర్వహించిన పరిశోధన తెలిపింది.
పిల్లలు లేని జంటలు పిల్లలతో ఉన్న జంటల కంటే సంతృప్తిగా ఉన్నారని కూడా గమనించారు.
అదే సమయంలో దంపతుల మధ్య ప్రేమ బిడ్డ పుట్టిన తదనంతర 10 సంవత్సరాలలో నిరంతరం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
మరోవైపు పిల్లలు లేని 62 శాతం మంది మహిళలు సంతోషంగా ఉన్నారని కూడా పరిశోధనలో చెప్పారు.
అయితే, నవజాత శిశువుల తల్లులలో ఈ సంఖ్య 38 శాతం మాత్రమే ఉంది. దీనికి వారి లైంగిక సంబంధాలు తగ్గడం లేదా దాని ప్రభావమూ ఒక కారణం.

ఫొటో సోర్స్, RAVI PRAKASH
మానసిక నిపుణులు ఏమంటున్నారు?
బిడ్డ పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య సంబంధాలపై ప్రభావం చూపడం వల్ల సలహా కోసం చాలాసార్లు వైద్యుల వద్దకు వెళ్లాల్సి వస్తోంది.
కొన్ని జంటలు గర్భం దాల్చిన వెంటనే కౌన్సెలింగ్ కోసం వస్తారని, తద్వారా బిడ్డ పుట్టిన తర్వాత వారి సంబంధం ప్రభావితం కాదని డాక్టర్ సంజయ్ ముండా చెప్పారు.
డాక్టర్ సంజయ్ ముండా జార్ఖండ్‌లో రాంచీలోని కాంకే హాస్పిటల్ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ (సీఐపీ) అసోసియేట్ ప్రొఫెసర్.
“పిల్లల పుట్టుక భార్యాభర్తల మధ్య సంబంధాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం సానుకూలంగా, ప్రతికూలంగా ఉంటుంది. చిన్ని కుటుంబాల కారణంగా అలాంటి సమయాల్లో సలహాలు ఇవ్వడానికి ఎవరూ అందుబాటులో ఉండరు. మొదటిసారి తల్లిదండ్రులుగా మారిన జంటకు మునుపటి అనుభవం లేనందున ఉద్రిక్తత పెరుగుతుంది''అని డాక్టర్ సంజయ్ ముండా బీబీసీతో అన్నారు.
“పిల్లలు పుట్టిన తరువాత, పిల్లల డిమాండ్ల ప్రకారం తల్లిదండ్రులు తమను తాము మార్చుకునే క్రమంలో సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితిలో ఆ జంట మమ్మల్ని సంప్రదించినప్పుడు, కౌన్సెలింగ్ ఇస్తున్నాం'' అని చెప్పారు.

సోషల్ మీడియా కూడా..
"చిన్న కుటుంబమే కాదు, సోషల్ మీడియాలో ఎక్కువసేపు ఉండటం, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయడం కూడా బిడ్డ పుట్టిన తర్వాత వారి సంబంధంపై ప్రభావాన్ని చూపుతుంది." అని రాంచీకి చెందిన డా. అనూజ్ కుమార్ అంటున్నారు.
''ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవాళ్లం. పిల్లవాడిని చూసుకోవడానికి తాతలు, అమ్మానాన్నలు ఉండేవారు. ఇప్పుడు చాలామంది చిన్న కుటుంబంలో భాగమయ్యారు. అందులో భర్త, భార్య, పిల్లలు మాత్రమే ఉన్నారు. అలాంటి పరిస్థితిలో మీరు పిల్లల అవసరాలన్నీ తీర్చాలి. దీంతో పాటు మీ పని కూడా చేసుకోవాలి. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగంలో ఉంటే, అప్పుడు సమస్యలు పెరుగుతాయి. దీంతో భార్యాభర్తల మధ్య సంబంధం మరింత దెబ్బతింటుంది." అని తెలిపారు.
‘‘బిడ్డను భార్యే చూసుకోవాలని భర్త కోరుకుంటాడు, అదే సమయంలో భార్య కూడా తమ భర్త నుంచి అదే ఆశిస్తుంది. తర్వాత సమస్యలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా పెరుగుతాయి. చివరికి అది గొడవలకు దారితీస్తుంది. పిల్లలను కనే ముందు ప్లాన్ చేసుకోవడం ముఖ్యం'' అని చెప్పారు డా. అనూజ్.

ఫొటో సోర్స్, Getty Images
ప్రసవం ప్రతి జంటను ప్రభావితం చేస్తుందా?
పిల్లలు పుట్టడం వల్ల దంపతులందరి జీవితంపై చెడు ప్రభావం పడుతుందని కాదు. బంధం బలపడటానికి పిల్లలు కూడా కారణం అయిన జంటలూ ఉన్నాయి.
అలాంటి వారిలో బాలీవుడ్ ప్రముఖ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కూడా ఉన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత వారి బంధం మరింత బలపడిందని వారు నమ్ముతున్నారు.
ఈ విషయంపై కరీనా కపూర్ 'ప్రెగ్నెన్సీ బైబిల్' అనే పుస్తకంలో రాశారు.
ఇందులో 'తైమూర్ పుట్టిన తర్వాత మా మధ్య బంధం మరింత బలపడింది. ప్రేమ మరింత పెరిగింది' అని సైఫ్ అలీఖాన్ చెప్పినట్లు సమాచారం.
ఈ పుస్తకంలో కరీనా కపూర్ తన గర్భధారణ సమయంలో సమస్యలు, ఒత్తిడిని కూడా ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి
- వందే భారత్ రైళ్లలో సీట్లు ఖాళీగా ఎందుకుంటున్నాయి?
- ట్విటర్ Vs. థ్రెడ్స్: ఎలాన్ మస్క్ ట్రిక్స్ ఎందుకు పారడం లేదు... మెటా యజమాని జుకర్‌బర్గ్ కొత్త యాప్‌తో పోటీ ఎలా ఉండబోతోంది?
- సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల వివాహాల కేసు జడ్జిలకు పరీక్షగా మారిందా?
- టెక్నాలజీ మ్యారేజేస్: భాగస్వామి హృదయ స్పందనను తెలిపే ఉంగరాలు, లాకెట్ల కథ ఏంటి?
- ప్రేమలో విడిపోతే గుండెపోటు వచ్చినట్లు ఎందుకు అనిపిస్తుంది, ఆ బాధలో గుండెకు ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















