పాకిస్తాన్‌లో 150 ఏళ్ల నాటి హిందూ దేవాలయం కూల్చివేత.. మద్రాసీ, గుజరాతీ సముదాయాల మధ్య వివాదం

మారీ మాత విగ్రహం
    • రచయిత, షుమైలా ఖాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది పాకిస్తాన్‌లోని కరాచీ. అక్కడి సోల్జర్ బజార్ ప్రాంతంలో రాత్రి సమయంలో భారీ యంత్రాలతో డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయి.

అయితే ఆ ప్రాంతంలో హిందువుల 'మారీ మాత ఆలయం' ఉండటంతో వివాదం తలెత్తింది. దీంతో '150 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు' అంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ గ్రూపుల్లో చాలామంది షేర్‌ చేశారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులు ఉదయమే అక్కడికి చేరుకున్నారు.

ఈ విషయంలో ఏ ముస్లిం సంస్థ లేదా ముస్లిం వ్యక్తి ప్రమేయం లేదని, ఇది హిందూ సమాజానికి మధ్య ఉన్న సమస్య అని అధికారులు ప్రకటించారు.

మారీ మాత మందిర ప్రాంగణం

అసలేం జరిగింది?

45 ఏళ్ల రేఖ తాను సూర్యవంశీ రాజ్‌పుత్‌‌నని 'మారీ మాత' ఆలయానికి నాలుగో తరం సంరక్షకురాలినని చెబుతున్నారు. తన పూర్వీకులు గత 150 ఏళ్లుగా ఈ ఆలయాన్ని సంరక్షిస్తున్నారని ఆమె తెలిపారు.

అయితే, ఆలయ ప్రాంగణంలో ఆమె నిర్మాణ పనులు ప్రారంభించడంతో వివాదం మొదలైంది. నిర్మాణ పనులపై పలువురు హిందువులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే ఈ దేవాలయం తన ఆస్తి అని, దీనికి ఏ పంచాయతీకి లేదా ట్రస్టుతో సంబంధం లేదని రేఖ వాదించారు.

“150 నుంచి 200 సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్న ఆలయాన్ని మనుషులే నడిపారు. వారు మద్రాసీ ట్రస్ట్ లేదా మరే ఇతర కుటుంబానికి చెందినవారు కాదు'' అని రేఖ అంటున్నారు.

కాగా, ఆలయం వద్ద నిర్మాణ పనులకు అభ్యంతరం చెప్పిన వారిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు రేఖ. ఆ వ్యక్తులను (అభ్యంతరాలు లేవనెత్తే వారిని) హిందువులుగా పరిగణించబోనని ఆమె చెప్పారు.

ఇక్కడి పనులకు అభ్యంతరాలను లేవనెత్తడం దుర్మార్గమంటున్నారు రేఖ.

'వాస్తవానికి వారు గుడి సాకుతో నా ఇంటిని ఆక్రమించాలనుకుంటున్నారు, ఎందుకంటే నేను ఒంటరి మహిళను. వారిని నేను ఎలా ఎదిరించగలను' అని ఆమె అంటున్నారు.

రేఖ

'నేను ఇస్లాం మతంలోకి మారలేదు'

మారీ మాత ఆలయం కరాచీలోని సోల్జర్ బజార్ ప్రాంతంలో 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.

మేం వచ్చేసరికి, రేఖ గుడి కాంపౌండ్ వాల్ బయట కుర్చీలో కూర్చుని తమలపాకు నములుతూ ఉన్నారు.

గుడి ఇనుప తలుపు తెరిచి లోపలి దృశ్యాన్ని చూపించారు. ఈ ప్లాట్‌లో నిర్మించిన చిన్న గదిలో విగ్రహాలను ఉంచగా, ఇతర వస్తువులను ఇతర గదులలోని సోఫాలో ఉంచారు.

ఇంతకుముందు గుడి ఒక చిన్న గదిలో ఉండేదని, దానిని విశాలంగా చేసి, మార్బుల్ టైల్స్‌ను అమర్చి, మరమ్మతులు చేయించానని రేఖ బీబీసీతో చెప్పారు.

ఆ తర్వాత ఆమె మమ్మల్ని అన్ని వైపుల నుంచి మూసివేసిన నిర్మాణ ప్రదేశానికి తీసుకువెళ్లారు. దానికి ఒక వైపు గోడ ఉండగా రెండు వైపులా ఎత్తైన భవనాలు, నాల్గవ సైట్‌లో పెద్ద ఆకుపచ్చ తెర వేలాడుతూ ఉంది.

ఆమె అనుమతి లేకుండా ఎవరూ ఆలయంలోకి ప్రవేశించలేరు.

రేఖ పచ్చని కర్టెన్ తీసేసి మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు. అక్కడ లోతైన గొయ్యి ఉంది. ఆమె మాకు చూపించిన గుడి గది, గొయ్యికి కొన్ని మీటర్ల దూరంలో ఉంది.

“ఆరు నుంచి ఏడు గదులు, వాష్‌రూమ్‌లు ఉన్నాయి. 42 మంది సభ్యులు గల ఎనిమిది కుటుంబాలు ఇక్కడ నివసించాయి. ఈ దేవాలయం మా పూర్వీకులది. మేం ఇక్కడ మద్రాసీని ఎన్నడూ చూడలేదు. వాళ్లు ఇక్కడికి రావడానికి కారణం ఈ ప్రదేశం బంగారం కావడమే'' అని రేఖ ఆరోపించారు.

రేఖ ఇస్లాం మతంలోకి మారారని పలువురు ఆరోపించగా దానిని ఆమె ఖండించారు. ఎవరి దగ్గరైనా రుజువులుంటే చూపించండని సవాల్ విసిరారు రేఖ.

ఆలయం వద్ద నిర్మాణ పనులు
ఫొటో క్యాప్షన్, ఆలయం వద్ద నిర్మాణ పనులు

మద్రాసీ వర్గాల ఆరోపణ ఏమిటి?

సెంట్రల్ కరాచీలో ఈ మారీ మాతా మందిర్ ఉంది. సోల్జర్ బజార్ అని పిలిచే ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి.

ఈ ఆలయం చుట్టూ మద్రాసీ, గుజరాతీ కమ్యూనిటీ ప్రజలు నివసిస్తున్నారు.

గుడి తమ సొత్తు అని ఈ సంఘాలు వాదిస్తున్నాయి. రేఖ పూర్వీకులది ఆలయం సంరక్షణ బాధ్యత మాత్రమేనని అంటున్నారు.

ఈ దేవాలయం మద్రాసీ కమ్యూనిటీకి చెందినదని, ఆలయం కేవలం సంరక్షణకు మాత్రమే రేఖ పూర్వీకులకు ఇచ్చారని శారదా దేవీ వాదిస్తున్నారు.

“నకిలీ పత్రాలు సిద్ధం చేసి, భవనం నిర్మించారు. ఆలయం చిన్నది చేశారు. మేం ప్రతి ఆదివారం ఇక్కడ పూజలు చేసేవాళ్లం. కానీ ఇప్పుడు దానికి తాళం వేశారు" అని ఆమె అన్నారు.

ఆలయం వద్ద వివాదం గురించి విని, తన స్నేహితులతో కలిసి ఆ ప్రదేశానికి చేరుకున్నారు కరాచీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డు బాయ్ ప్రకాశ్ కుమార్.

''ఆలయాన్ని మేం రక్షించుకోగలం ఆలయం తలుపులు తెరవండి'' అని రేఖను కోరినట్లు ప్రకాశ్ కుమార్ తెలిపారు.

“భవనం నిర్మించడానికి ఈ స్థలాన్ని రూ. 7 కోట్లకు అమ్మారు. ఆలయాన్ని డ్రైనేజీ వద్దకు మార్చారు ''అని ఆరోపించారు ప్రకాశ్.

తన పూర్వీకులు ఇక్కడ 'దేవి కా స్థాన్‌'ని నిర్మించారని సాగర్‌ అనే వ్యక్తి చెప్పారు.

ఎవరినీ అడగకుండానే విగ్రహాన్ని కాలువపై ఉంచారని, ఇది దైవదూషణ అని, దీనికి బాధ్యులైన వారెవరైనా పాకిస్థాన్ చట్ట ప్రకారం శిక్షించాలని సాగర్ డిమాండ్ చేశారు.

సుఖ్ దేవ్
ఫొటో క్యాప్షన్, సుఖ్ దేవ్

అధికారులు ఏం తేల్చారు?

ఆలయం కూల్చివేత వార్త స్థానిక వార్తాపత్రికలు, యూట్యూబ్‌ ఛానళ్లలో ప్రచారమైంది. దీంతో కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ ఘటనపై స్పందించారు.

మైనారిటీలు, వారి ప్రార్థనా స్థలాలను రక్షిస్తామని అన్నారు.

ఆలయ సముదాయంలో నిర్మాణ పనులను సింధ్ మానవ హక్కుల కమిషన్ నిలిపివేయించింది. ఈ ఆలయం ఎవరికి చెందుతుంనేది తేల్చాల్సిందిగా మైనారిటీ వ్యవహారాల శాఖ, కరాచీ కమిషనర్‌‌లను మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.

కాగా, మద్రాసీ హిందూ పంచాయితీ, రేఖ ఇరు పార్టీలు ఆలయ యాజమాన్యానికి సంబంధించి ఎటువంటి రుజువులను సమర్పించలేకపోయారని బీబీసీతో సింధ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యుడు సుఖ్‌దేవ్ హేమ్నానీ వెల్లడించారు.

“ఘటనపై దర్యాప్తు చేయాలని మేం మైనారిటీ వ్యవహారాల కార్యదర్శి, కరాచీ కమిషనర్‌కు ఒక లేఖ రాశాం. అది ప్రైవేట్ ప్రాపర్టీనా లేదా కమ్యూనిటీ ప్రాపర్టీనా అనేది కనుగొంటారు. తద్వారా చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చు'' అని అన్నారు సుఖ్‌దేవ్.

కరాచీలోని 150కి పైగా దేవాలయాల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని కూడా ఇక్కడ గమనించాలి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)