హెన్రీ కిసింజర్: అమెరికా-చైనా మధ్య ఈ దౌత్య దిగ్గజం రాయబారం చేస్తున్నారా? బీజింగ్‌లో ఆయనతో జిన్‌పింగ్ ఏమన్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టెసా వోంగ్
- హోదా, ఏసియా డిజిటల్ రిపోర్టర్, బీబీసీ న్యూస్
చైనా, అమెరికాల మధ్య క్షీణించిన సంబంధాలను పునరుద్ధరించేందుకు 100 ఏళ్ల వయసులో ఓ దౌత్య కురువృద్ధుడు నడుంబిగించారా?
అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు.
1970ల ప్రాంతంలో ప్రపంచ రాజకీయాలలో ఒంటరిగా మిగిలిపోయిన చైనాను ప్రధాన స్రవంతిలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన అప్పటి దౌత్య దిగ్గజం హెన్రీ కిసింజర్ మళ్లీ ఇప్పుడు రంగంలోకి దిగారు.
వందేళ్ల వయసులో ఆయన చైనాలో అడుగుపెట్టగా ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆయనకు సాదర స్వాగతం పలికారు.
అమెరికా ప్రభుత్వంలోని కీలక నేతలైన విదేశీ వ్యవహారాల మంత్రి ఆంటోనీ బ్లింకెన్, ఆర్థిక మంత్రి జానెట్ యెలెన్‌లు గత నెల రోజుల్లో చైనాలో పర్యటించారు.
వారి తరువాత ఇప్పుడు అనూహ్యంగా హెన్రీ కిసింజర్ చైనాలో అడుగుపెట్టడం, షీ జిన్‌పింగ్ ఆయనతో భేటీ కావడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.
అయితే, అమెరికా మాత్రం హెన్రీ కిసింజర్ పర్యటనకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, అది ఆయన వ్యక్తిగత పర్యటన అని చెప్తోంది.

ఫొటో సోర్స్, Reuters
అయితే, చైనాలో ఆయనకున్న స్థాయి పరంగా చూస్తే రెండు దేశాల మధ్య చర్చలకు ఆయన తెరవెనుక సూత్రధారిగా వ్యవహరించే అవకాశాలున్నాయి.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. కిసింజర్‌ను కలిసి ‘మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది సార్!’ అని నవ్వుతూ చెబుతున్న వీడియోను చైనా అధికారిక టీవీ చానల్ ప్రసారం చేసింది.
అంతేకాదు.. విదేశీ దౌత్యవేత్తలు, నేతలతో అధికారిక సమావేశాలు నిర్వహించే అత్యంత విశాలమైన ‘గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్’ కంటే అధ్యక్షుడికి మరింత ఆంతరింగక ప్రదేశమైన ‘డయాయుటై గెస్ట్ హౌస్’లో వీరిద్దరి భేటీ జరిగింది.
50 ఏళ్ల కిందట కిసింజర్ అప్పటి చైనా అధికారులను రహస్యంగా కలుసుకున్నది ఈ గెస్ట్ హౌస్‌లోనేనని.. అమెరికా, చైనాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరడానికి అప్పటి కిసింజర్ పర్యటన సహాయపడిందని జిన్‌పింగ్ గుర్తుచేశారు.
‘మేం మా పాత స్నేహితులను ఎన్నటికీ మర్చిపోం. అమెరికా, చైనా సంబంధాలను.. రెండు దేశాల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి మీరు అందించిన చారిత్రక సహకారాన్ని ఎన్నటికీ మర్చిపోం’ అని జిన్‌పింగ్ చెప్పారు.
జిన్‌పింగ్ ఆప్యాయతతో కూడిన గొంతుతో పలికిన మాటలు.. సోమవారం కిసింజర్ చైనాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన్ను కలిసిన ఇతర ఉన్నతాధికారుల నుంచి అందిన సానుకూల సందేశాన్ని ప్రతిబింబించింది.
చైనాకు చెందిన అగ్రశ్రేణి దౌత్యవేత్త వాంగ్ యి, రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫుతో కిసింజర్ భేటీలపై చైనా చేసిన ప్రకటనలలో రెండు దేశాల మధ్య సహకారం, పరస్పర గౌరవం, శాంతియుత సహఅస్తిత్వం అవసరమన్న భావన ప్రబలంగా కనిపించింది.
‘నేను చైనాకు మిత్రుడిని’ అని కిసింజర్ చెప్పినట్లు.. ‘అమెరికా కానీ చైనా కానీ ఒకరినొకరు శత్రువులుగా చూడవు’ అని.. ‘రెండు దేశాల మధ్య స్నేహం ప్రపంచ శాంతికి, సమాజ ప్రగతికి కేంద్రంగా ఉంటుంది’ అని కిసింజర్ పేర్కొన్నట్లు చైనా చేసిన ప్రకటనల్లో ఉంది.
అంతేకాదు, చైనా అధికారిక మీడియా కిసింజర్ పర్యటనను అత్యంత సానుకూలంగా చూపించింది. మరోవైపు కిసింజర్ స్టామినా చూసి సోషల్ మీడియాలో అనేక మంది ఆశ్చర్యపోయారు. ‘100 ఏళ్ల వయసులో బీజింగ్‌కు బిజినెస్ ట్రిప్ కోసం రావొచ్చు’ అన్న అర్థం వచ్చే చైనీస్ హ్యాష్‌ట్యాగ్‌తో ఆ దేశ సోషల్ మీడియాలో వీబోలో లక్షలకొద్దీ పోస్ట్‌లు కనిపిస్తున్నాయి.
అదేసమయంలో ఆన్‌లైన్‌లో కొందరు ‘అమెరికా చైనాతో సంబంధాలు కలుపుకోవడానికి వందేళ్ల వృద్ధుడిని పంపించింది’ అంటూ నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. ‘తెలివైన రాజకీయ నాయకులు తగ్గిపోతున్నారు’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘కిసింజర్ దౌత్య విజ్ఞానం అమెరికాకు అవసరం’
అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఒకరు ఈ వారం ప్రారంభంలో మాట్లాడుతూ.. కిసింజర్ పర్యటన గురించి తమకు ముందే తెలుసని.. ఆయన చైనా నుంచి తిరిగి వచ్చాక తమకు ఆ వివరాలు తెలియజేయాలనుకున్నా తామేమీ ఆశ్చర్యపోబోమని అన్నారు.
కిసింజర్ తన ఇష్టప్రకారం చైనా వెళ్లారే తప్ప అమెరికా ప్రభుత్వం తరఫున వెళ్లలేదని ఆ ప్రతినిధి అన్నారు.
ఒక ప్రైవేట్ పౌరుడిగా కిసింజర్ చైనాలో ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇతర అధికారులతో తన చర్చలలో స్పష్టతతోనే వ్యవహరించి ఉండొచ్చు, అమెరికాకు ఉన్న ఆందోళనలు, డిమాండ్లను చైనా ఎదుట ఉంచొచ్చు.
మరోవైపు.. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసినందుకు 2018 నుంచి అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫును కిసింజర్ కలవడం కూడా పెద్దగా వివాదాస్పదమేమీ కాదు. సింగపూర్‌లో ఓ సమావేశం సందర్భంగా అమెరికా రక్షణ మంత్రి చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫును కలవాలనుకున్నా చైనా అందుకు అనుమతి ఇవ్వడం లేదు. అమెరికా ఆంక్షలు విధించినందుకు నిరసనగానే చైనా అలా చేసింది. అయితే, అమెరికా ఆంక్షలలో ఉన్న లీ షాంగ్‌ఫును కిసింజర్ కలిశారు.
కిసింజర్ తన పర్యటనతో రెండు దేశాల మధ్య విషయాలను తన చేతుల్లోకి తీసుకోవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.

ఫొటో సోర్స్, Getty Images
డిసెంబరులో ఓ ఇంటర్వ్యూలో కిసింజర్ మాట్లాడుతూ చైనా విషయంలో ట్రంప్, బైడెన్ ప్రభుత్వాల తీరును తప్పుపట్టారు.
కిసింజర్ చైనాకు కొత్త ఏమీ కాదు. ఆయన 100 కంటే ఎక్కువ సార్లు చైనాలో పర్యటించారు. చివరిగా 2019లో ఆయన జిన్‌పింగ్‌ను చైనాలో కలిశారు. ఆ పర్యటన తరువాత అమెరికా, చైనా సంబంధాలు మలుపు తిరిగాయి.
అయితే, ఈ ఏడాది స్పై బెలూన్ వ్యవహారంతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. కానీ, గత కొద్దిరోజులుగా అమెరికాకు చెందిన మంత్రులు, ఉన్నత స్థాయి దౌత్యాధికారులు చైనాలో పర్యటించడంతో సంబంధాలు మళ్లీ గాడినపడుతున్నట్లుగా ఉంది.
అయితే, గత నెలలో అమెరికా విదేశీవ్యవహారాల మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ను కలిసిన తరువాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కలిసిన మరో అమెరికా కీలక వ్యక్తి కిసింజరే. చైనా ప్రభుత్వం వద్ద, పాలకుల వద్ద ఇప్పటికీ కిసింజర్‌కు ఉన్న గౌరవాన్ని ఇది సూచిస్తుంది.
అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెలెన్, అమెరికా పర్యావరణ ప్రత్యేక రాయబారి జాన్ కెర్రీలు కూడా ఇటీవల బీజింగ్ వచ్చినా జిన్‌పింగ్ వారిని కలవలేదు.
కిసింజర్‌ను జిన్‌పింగ్ స్వాగతించిన తీరు, ఆయన్ను గౌరవించిన తీరు అమెరికాతో చైనా సయోధ్య కోరుకుంటోందని, ఉద్రిక్తతలు కోరుకోవడం లేదని సంకేతం పంపినట్లయింది. వాంగ్ యి మాట్లాడుతూ.. ‘అమెరికా చైనా విధానానికి కిసింజర్ దౌత్య జ్ఞానం, నిక్సన్ రాజకీయ తెగింపు’ అవసరం అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇందిరాగాంధీపై అప్పట్లో వివాదాస్పద వ్యాఖ్యలు, ఆపై క్షమాపణలు
అయితే, చైనా తన జాతీయ ప్రాధాన్యాలకు కట్టుబడి ఉంటుందనే వాస్తవం ఈ పరిణామాలతో మారబోదని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన పొలిటికల్ సైంటిస్ట్ ‘వెన్ టి సుంగ్’ అన్నారు.
‘చైనా తన మిత్రుడు కిసింజర్ స్థాయిని నిలపడానికి, ఆయన పర్యటన తరువాత కృతజ్ఞతలు తెలుపుతూ కనబరిచిన సుహృద్భావంగా దీన్ని పరిగణించొచ్చు’ అని ఆయన అన్నారు.
‘అయితే, అమెరికా, చైనా సంబంధాలను నడిపించే ప్రాథమిక అంశాలను మారుస్తుందని ఆశించలేం. చైనా వ్యక్తిగత అంశాలపై కాకుండా సొంత జాతీయ ప్రయోజనాల ఆధారంగా పనిచేస్తుంది’ అని వెన్ అన్నారు.
చైనా నుంచి గొప్ప గౌరవాన్ని అందుకుంటున్న కిసింజర్‌కు ఆసియాలోని మరికొన్ని దేశాలలో అందుకు విరుద్ధమైన పేరు ఉంది. ముఖ్యంగా వియత్నాం యుద్ధ సమయంలో కిసింజర్ పోషించిన పాత్రకు గాను ఆసియాలోని మిగతా కొన్ని దేశాలలో ఆయన అపఖ్యాతి పాలయ్యారు.
1971 బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో భారత్‌పై, భారతీయులపై, అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అనంతరం ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.
1971లో అమెరికా, చైనా మధ్య అధికారికంగా ఎలాంటి సంబంధాలు లేవు.. అయితే, అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ చైనాలో పర్యటించేందుకు వీలు కల్పించేలా కిసింజర్ అనేకసార్లు చైనాకు రహస్య పర్యటనలు జరిపారు.
కిసింజర్ పర్యటనల తరువాత ఏడాది నిక్సన్ చైనాలో పర్యటించారు. మావో జెడాంగ్ సహా చైనా అగ్రనేతలతో ఆయన భేటీ అయ్యారు. అది అమెరికా, చైనాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరడానికి... చైనా ఆర్థిక వ్యవస్థ విస్తరించడానికి దోహదపడింది.
ఇవి కూడా చదవండి:
- సంక్షోభం నుంచి శ్రీలంక నిజంగానే కోలుకుందా?
- అమీనా: నెల్సన్ మండేలా మనసుపడ్డ ఈ భారత సంతతి మహిళ ఆయన ప్రేమను ఎందుకు తిరస్కరించారు?
- ఇరాన్ : మళ్లీ వీధుల్లోకి మొరాలిటీ పోలీసులు, హిజాబ్ ధరించకుంటే విచారణ
- నెలకు రూ.5 వేలు ఇచ్చే ‘నేషనల్ యూత్ వాలంటీర్ స్కీమ్’కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- బెంగళూరు సమావేశం: విపక్షాల్లో ఇన్ని సమస్యలుంటే మోదీని ఎదుర్కోవడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














