ఆంధ్రప్రదేశ్: ఆదోనిలో ఒకే ఇంట్లో 700 మంది ఓటర్లు... ఎన్నికల ముంగిట ఓటర్ల జాబితాలో ఈ తికమకలేంటి?

- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో డోర్ నెంబర్ కూడా లేకుండా 650 ఓట్లు, స్థానికుల అనుమానం..
మచిలీపట్నంలో పట్టణ ఓటర్లను రూరల్‌కి, గ్రామీణ ఓటర్లను మచిలీపట్నంలోని వివిధ వార్డులకు మార్చేసిన తీరు మీద కోర్టులో పిటిషన్...
విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులు...
తాజాగా ఆదోని పట్టణంలో ఒకే ఇంట్లో 700కి పైగా ఓట్లు, అధికారులకు ఫిర్యాదులు..
రాష్ట్రంలోని అన్ని మూలల నుంచి ఓటర్ల జాబితా మీద అభ్యంతరాలు వస్తున్నాయి. తీవ్ర లోపాలు బయటపడుతున్నాయి. ఏపీ ఎన్నికల సంఘం ముందు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చివరకు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి.
రాష్ట్రంలో ఎన్నికల సన్నాహాలు మొదలవ్వబోతున్న తరుణంలో తాజాగా ముద్రించిన ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఓట్ల గల్లంతుతో పాటుగా దొంగ ఓట్లను చేర్చే ప్రయత్నం ఉద్దేశ పూర్వకంగా జరిగిందనే వాదన వినిస్తోంది. అధికారపక్షం వాటిని తోసిపుచ్చుతోంది.
అదే సమయంలో ఎన్నికల సంఘం మాత్రం కొన్ని తప్పిదాలు జరిగినట్టు అంగీకరిస్తోంది. వాటిని సవరిస్తామని అధికారికంగానే చెబుతోంది. అయినా గానీ వందల సంఖ్యలో ఓట్లు ఒకే ఇంటి అడ్రస్‌తో రావడం, అనేక మంది ఓట్లను తారుమారు చేయడంతో అనుమానాలు బలపడుతున్నాయి.
ఇంతకీ ఏపీలో ఓటర్ల జాబితా వ్యవహారం ఎందుకు వివాదాస్పదమవుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
ఆదోని ఉదాహరణగా...
ఓటర్ల జాబితా మీద రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. వివిధ జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలతో పాటుగా నుంచి స్థానిక అధికారులకు కూడా పార్టీలు, సంఘాలు, వ్యక్తులు ఫిర్యాదులు చేశారు.
తాజాగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఒకే ఇంట్లో 706 మంది ఓటర్లున్నట్టు ఓటర్ల జాబితాలో ఉంది.
223వ బూత్ నెంబర్‌లో 17/836లో భారీ సంఖ్యలో ఉన్న ఓటర్ల జాబితాలో కొందరు స్థానికులు కూడా కాదని చెబుతున్నారు. మరికొందరు మరణించి పదేళ్లు దాటుతున్నా ఇంకా లిస్టులో వారి పేర్లు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సమీపంలోని మరో బూత్ 222లో కూడా ఒకే ఇంటి నెంబర్‌తో 644 ఓట్లు నమోదయ్యాయి. పైగా ఆ జాబితాలో ఉన్న పేర్లు స్థానికంగా ఎవరూ గుర్తు పట్టడం లేదు. దాంతో ఈ జాబితా మీద అనుమానాలు మొదలయ్యాయి.
అదోని పట్టణంలో 2022 నాటి ఓటర్ల జాబితా కూడా మార్చేసి, 2023 ఓటర్ల లిస్టులో కొత్త పేర్లు చేర్చడం, ఇంటి నెంబర్లు మార్చేయడం వంటివి జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.
"ఆదోనిలో ఓటర్ల లిస్టు చూసి మాకే ఆశ్చర్యం వేసింది. 2014లో చనిపోయిన వాళ్ల పేర్లు కూడా కలిపేశారు. 2019 లిస్టుకి ఇప్పటి లిస్టుకి చాలా తేడా ఉంది. సరిచేయాలని మండల కార్యాలయానికి ఫిర్యాదు చేశాం. స్పందించి తక్షణమే సరిదిద్దుతారని ఆశిస్తున్నాం. ఇలాంటి జాబితా వల్ల అందరిలో అపోహలు పెరుగుతున్నాయి. ఆరోపణలకు తగ్గట్టుగా అధికారులు నిర్లక్ష్యంగా ఈ జాబితా తయారుచేసినట్టు కనిపిస్తోంది" అంటూ ఆదోని కల్లుబావి ప్రాంతానికి చెందిన పి.షేకప్ప చెప్పారు.
తమ ఇంటి నెంబర్ కూడా లిస్టులో మార్చేశారని ఆయన బీబీసీకి తెలిపారు.

అంతకుముందు కూడా...
ఇలాంటి తీరు ఆదోనిలో మాత్రమే కాదు, గతంలో కూడా ఓటర్ల జాబితాలో ఇలా ఒకే చోట వందలాది పేర్లున్న ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. టీడీపీ సహా వివిధ పార్టీల నాయకులు దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఏపీ గవర్నర్‌కి , కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు.
ఓటర్ల జాబితాలో కొన్ని లోపాలున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అంగీకరించారు. ఒకే ఇంటి నెంబర్ మీద 500కి పైగా ఓట్లున్నట్లు 6 చోట్ల గుర్తించామని ఆయన మీడియాకు తెలిపారు.
అందులో విజయవాడ, గుంటూరు వంటి నగరాలున్నాయని వివరించారు. మరో 2,100 చోట్ల ఒకే ఇంటి నెంబర్‌తో 50కి పైగా ఓట్లున్నాయని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అక్రమాలే ఎక్కువ...
ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్ల చేరిక కోసం దరఖాస్తులు స్వీకరించి ఓటర్ల జాబితాను అప్ డేట్ చేసే ప్రయత్నం ప్రతి ఏడాది జరుగుతుంది.
అయితే, ఎన్నికల సమయంలో ఇది మరింత పగడ్బందీగా జరుగుతుంది. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే కూడా చేయాల్సి ఉంటుంది. ప్రతీ ఇంటిని సందర్శించి, ఓటర్ల జాబితాను పరిశీలించి మార్పుచేర్పులు చేయాల్సి ఉంటుంది.
ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో వారం క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను సీఈసీ పిలిచింది. ఫిర్యాదుల మీద ఆరా తీసింది. ఈ నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాలో లోపాలను సవరించే ప్రయత్నం చేస్తామని అధికారులు అంటున్నారు.
జులై 21 నుంచి ఇంటింటి సర్వే మొదలవుతోంది. అయితే, 2023 జాబితాలో ప్రకటించిన వాటిలో అత్యధికంగా అక్రమాలే ఉన్నాయనే విమర్శలు విపక్ష టీడీపీ చేస్తోంది.
"ఎన్నికల సంఘం ముద్రించిన ఓటర్ల జాబితా నిండా అక్రమాలే. అత్యధికంగా అవకతవకలే. అధికార దుర్వినియోగం జరుగుతోంది. ఆయా నియోజకవర్గాలకు సంబంధం లేని వారి పేర్లు జాబితాలో చేరుస్తున్నారు. విపక్ష ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారు.
అందుకే ఓటర్లందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పటికప్పుడు తమ ఓటు ఉందో లేదో చూసుకోవాలని సూచిస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం చొరవతో అయినా ఓటర్ల జాబితా సజావుగా సిద్ధం చేయాలని కోరుతున్నాం" అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.
ఎన్నికల సంఘం అధికారులకు ఆధారాలను సైతం సమర్పించామని, వాటిని పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు.

ఫొటో సోర్స్, INCTELANGANA/FACEBOOK
తుది జాబితాలో సరిదిద్దుతాం...
ఆదోనిలో వెలుగుచూసిన ఓటర్ల జాబితా అవకతవకలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు అంటున్నారు. రాజకీయ పార్టీలన్నీ అందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ జి. సృజన కోరారు.
"ఇటీవల ముద్రించిన ఓటర్ల జాబితాలో కొన్ని లోపాలున్నాయి. వాటిని సరిదిద్దుతాం. సక్రమంగా ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా కీలకం. దానికోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.
ఓటర్ల జాబితా సవరణలో బీఎల్వో(బూత్ లెవెల్ ఆఫీసర్)లకు రాజకీయ పార్టీలు కూడా సహకరించాలి. పోలింగ్ బూత్‌ల వారీగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని బీఎల్వోలతో సమన్వయం చేసుకుంటే లోపాలు సరిదిద్దగలం.
జులై 21 నుంచి ఆగస్ట్ 24 వరకు ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేస్తాం. అక్టోబర్ 17 ముసాయిదా ప్రకటిస్తాం" అంటూ ఆమె వివరించారు.
ఆదోని పట్టణంలోని కొన్ని బూత్‌లలో ఓటర్ల లిస్టుని సరిచేసి పగడ్బందీగా రూపొందించే ప్రయత్నం మొదలైందని ఆమె తెలిపారు. ఒకే ఇంటి నెంబర్‌తో 10కి పైగా ఓట్లు నమోదై ఉంటే వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామన్నారు.
సాధారణ ఎన్నికలకు ముందర సిద్ధమవుతున్న ఓటర్ల జాబితా కావడంతో రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. అయితే, తుది జాబితా సిద్దమయ్యేలోగా అధికారులు తమ దృష్టికి వచ్చిన లోపాలను ఎప్పటికప్పుడు సవరించేలా మార్పులు చేయాలనే సూచనలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ట్రినిటైట్: అణుబాంబు బద్దలై రంగు రాళ్లు బయటపడ్డాయి
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














