ట్రినిటైట్: చరిత్రలో మొట్టమొదటి అణు విస్ఫోటం సందర్భంగా వెలుగుచూసిన వస్తువు

ట్రినిటైట్

ఫొటో సోర్స్, CESAR MENOR-SALVÁN

    • రచయిత, సీజర్ మెనోర్-సాల్వాన్
    • హోదా, బీబీసీ ముండో

అందరు పిలుస్తున్నట్లు ట్రినిటైట్ అనేది ఒక ఖనిజం కాదు, సహజమైనది అంతకన్నా కాదు. ఇది ఒక చారిత్రక సంఘటన సమయంలో బయటపడిన పదార్థం.

చరిత్రలో మొట్టమొదటి అణు విస్ఫోటం అమెరికాలోని అలమోగోర్డోలో 1945 జూలై 16న జరిగింది.

విషాదకరమైన ఆ క్షణంలో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం.

రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. 1941 నుంచి మాన్‌హటన్ ప్రాజెక్ట్ కొనసాగుతోంది.

జర్మనీ సామూహిక విధ్వంసం కలిగించే ఒక కొత్త తరహా ఆయుధాన్ని అభివృద్ధి చేయడంలో విజయం సాధించగలదని అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ భావించారు. దీంతో చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సాంకేతిక, శాస్త్రీయ సవాళ్లలో ఒకదానిని ప్రారంభించేందుకు రూజ్‌వెల్ట్ ఆదేశించారు.

ఈ ప్రాజెక్ట్‌లో భౌతిక శాస్త్రవేత్తలు, రసాయన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, గణిత శాస్త్రజ్ఞులు, వేలాది మంది కార్మికులు పాలుపంచుకున్నారు.

మాన్‌హటన్ ప్రాజెక్ట్ సాంకేతిక విజయాలు అమెరికా పారిశ్రామిక, సాంకేతిక అభివృద్ధికి ఊతమిచ్చాయి.

1945 జులైలో న్యూ మెక్సికోలోని లాస్ అలమోస్‌లో తయారైన గాడ్జెట్ ప్రచ్ఛన్న యుద్ధానికి బీజం వేసింది.

గాడ్జెట్

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ గాడ్జెట్?

గాడ్జెట్ అనేది అణుబాంబు మొదటి నమూనా .

1945 జులై 15న అణుబాంబును పరీక్షించడానికి సిద్ధమయ్యారు. ఆ పరీక్షకు ట్రినిటీ అనే పేరు పెట్టారు.

ఈ బాంబులో ప్లూటోనియం-239 కోర్‌ ఉంటుంది. ఇది మునుపెన్నడూ చూడని శక్తిని విడుదల చేసే కేంద్రక సంలీన చర్యకు కారణమవుతుంది.

ప్లూటోనియం -239 అనేది యురేనియంను న్యూట్రాన్‌లతో వికిరణం చేయడం ద్వారా తయారైన ఒక ఫిసైల్ ఐసోటోప్.

ప్లూటోనియం "సహజ అణు రియాక్టర్లు" తయారయ్యే కొన్ని యురేనియం నిక్షేపాలలో తప్ప ప్రకృతిలో కనిపించదు.

యురేనియం నుంచి తగినంత స్వచ్ఛమైన ప్లూటోనియం పొందడం ప్రాజెక్ట్ సవాళ్లలో ఒకటి.

దీని కోసం వారు రహస్య హాన్‌ఫోర్డ్ (వాషింగ్టన్) ప్లూటోనియం ఉత్పత్తి కర్మాగారం అయిన 'రియాక్టర్ బి'ని వినియోగించారు.

ఇప్పుడు ఈ మ్యూజియం ప్లూటోనియం ఉత్పత్తికి మొదటి వాణిజ్య న్యూక్లియర్ రియాక్టర్. దీన్ని డ్యూపాంట్ కంపెనీ నిర్వహించింది.

అయితే, బాంబు డెవలప్‌మెంట్‌కు ఆ కంపెనీ దూరంగా ఉంది.

1945 జూలై 16న ఉదయం 5:29 గంటలకు జోర్నాడా డెల్ మ్యూర్టో మారుమూల ఎడారిలో ఈ గాడ్జెట్‌ను పేల్చారు.

ఇది చరిత్రలో మొదటి అణు విస్ఫోటం, సుమారుగా 19 కిలోటన్నుల శక్తి ఉత్పత్తైంది.

ఇది ఊహించిన దానికంటే శక్తిమంతంగా పేలింది. అంతేకాదు సురక్షితమైన దూరంలో ఉంచిన కొన్నిసైంటిఫిక్ పరికరాలనూ నాశనం చేసింది.

అణు బాంబు

ఫొటో సోర్స్, Getty Images

"నౌ వియ్ ఆర్ ట్రూ సన్ ఆఫ్ బిచెస్"

పేలుడు అనంతరం ట్రినిటీ పరీక్ష సైంటిఫిక్ డైరెక్టర్ కెన్నెత్ బైన్‌బ్రిడ్జ్ "నౌ వియ్ ఆర్ ట్రూ సన్ ఆఫ్ బిచెస్" అని అన్నారు.

పేలుడు తర్వాత చెప్పిన అత్యంత సముచితమైన వ్యాఖ్యలు ఇవేనని రాబర్ట్ ఓపెన్‌హైమర్ వ్యాఖ్యానించారు.

లిటిల్ బాయ్, ఫ్యాట్ మ్యాన్ (గాడ్జెట్ మిలిటరీ వెర్షన్) అని పిలిచే తదుపరి రెండు బాంబులు జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిలో దాదాపు 214,000 మందిని బలితీసుకున్నాయి .

వీరిలో సగం మంది పేలుళ్ల కారణంగా మరణించారు. మిగిలిన వారు రేడియోధార్మిక కాలుష్యం కారణంగా చనిపోయారు.

ప్లూటోనియం-239 విచ్ఛిత్తి ప్రతిచర్యను ఏర్పరుస్తుంది.

దీనిలో ఒక న్యూట్రాన్ 'పరమాణు కేంద్రకాన్ని' శకలాలుగా విభజించి, సగటున 2.88 న్యూట్రాన్‌లను విడుదల చేస్తుంది. ఇది ఇతర ప్లూటోనియం కేంద్రకాలను విచ్ఛిన్నం చేస్తుంది.

స్వచ్ఛమైన ప్లూటోనియం పరిమిత ద్రవ్యరాశిని అధిగమించినప్పుడు ఈ చైన్ రియాక్షన్ విస్తరిస్తుంది.

ఈ సందర్భంలో కేంద్రకాల చీలిక ద్వారా ఉత్పత్తి అయిన శక్తి పేలుడు రూపంలో విడుదల అవుతుంది.

కేంద్రకాల విచ్ఛిత్తి అనేది ఇతర రసాయన మూలకాలను ఉత్పత్తి చేస్తుంది.

ఈ మూలకాలు వాటి సాధారణ వెర్షన్స్ (ఐసోటోపులు) మాదిరి ఉండవు, కానీ అధిక రేడియోధార్మికత కలిగి ఉంటాయి.

న్యూట్రాన్‌లు రేడియోధార్మిక మూలకాలుగా కనిపించే పదార్థాల రూపాంతరాన్ని కూడా కలిగిస్తాయి .

ఫలితంగా భయంకరమైన పేలుడుతో పాటు అయోడిన్-131 లేదా క్రిప్టాన్-85 వంటి మూలకాల గ్యాస్ కారణంగా వందల కిలోమీటర్ల దూరం రేడియోధార్మిక కాలుష్యం ఏర్పడుతుంది .

గాజు ముక్కలు

ఫొటో సోర్స్, Getty Images

ఎడారి ఇసుక కరిగిపోయేంత వేడి..

గాడ్జెట్ విస్ఫోట ఉష్ణోగ్రత అనేది సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంది. ఆ వేడి ఎడారి ఇసుకను కరిగించేలా ఉంటుంది. విస్ఫోటనం కారణంగా అక్కడ వందల మీటర్ల పరిధిలో గాజు ముక్క(ట్రినిటైట్)లు పడ్డాయి.

పరిశోధకులు చారిత్రక సంఘటన స్మారకార్థం అక్కడి నమూనాలను సేకరించారు. వీటిలో కొన్నింటిని ప్రత్యేకమైన నగలు తయారు చేయడానికి కూడా ఉపయోగించారు.

అయితే, ఆ ప్రయోగం ఒక చెత్త ఆలోచన అని వాళ్లు గ్రహించారు. ఎందుకంటే ట్రినిటి పేలుడులో పలు మూలకాలు ఉత్పత్తి అయ్యాయి. అవి తీవ్రమైన రేడియో ధార్మికతను కలిగి ఉండటం, దానికి చర్మం కాలే అవకాశం ఉండటం గ్రహించారు.

ఇపుడు ట్రినిటైట్‌లో రేడియోధార్మికత చాలావరకు లేదు. సురక్షితంగా నిర్వహిస్తున్నారు. కానీ ఆ పేలుడుకు సాక్ష్యాలు మాత్రం ఉన్నాయి.

సిసియం-137: ప్లూటోనియం ప్రధాన విచ్ఛిత్తి ఉత్పత్తులలో ఒకటి.

ఇది ఓ పదిహేనేళ్ల వరకు ఉండే ట్రినిటైట్ అతిపెద్ద రేడియోధార్మిక మూలకం. అణు విస్ఫోటనంలో రేడియోధార్మిక కాలుష్యానికి ప్రధాన కారణాలలో సిసియం-137 ఒకటి.

అమెరిసియం-241: ఈ బాంబు ప్లూటోనియం-239తో తయారైందని సూచిస్తుంది. ఇది వెయ్యేళ్ల వరకు ఉంటుంది.

బేరియం-133: దీన్ని గుర్తించడం కష్టం. ఎందుకంటే 10 సంవత్సరాలలో దాని రేడియో ధార్మికత సగానికి తగ్గిపోవడమే కారణం.

బేరియం నైట్రేట్‌తో తయారైన బారాటోల్ అని పిలిచే బాంబు పేలుడు పదార్థంలో దీని మూలం ఉన్నట్లు భావిస్తున్నారు.

యూరోపియం-152: ట్రినిటైట్ లక్షణ రేడియోధార్మిక మూలకమిది. ట్రినిటైట్ నిర్ధరణలో, నకిలీలు కనుగొనడానికి ఉపయోగిస్తారు.

రేడియోధార్మిక మూలకాలు కాలక్రమేణా అదృశ్యమవుతాయి. అయితే ఈ పదార్థం లక్షణాలు, క్వాసిక్రిస్టల్స్ వంటి నిర్మాణం, ఐసోటోపిక్ సిగ్నేచర్ వాటి మూలాలను తెలిసేలా చేస్తాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)