‘‘జైల్లో కెమెరాల ముందు దుస్తులు విప్పించారు.. శానిటరీ ప్యాడ్లు, టాంపాన్‌లను తొలగించమన్నారు’’-ఇరాన్ మహిళల ఆరోపణ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పర్హామ్ గోబాదీ
- హోదా, బీబీసీ వరల్డ్ న్యూస్
జైల్లో కెమెరాల ముందు దుస్తులు విప్పించి తనిఖీలు చేసేవారని బీబీసీతో ఇరాన్ మహిళా మాజీ ఖైదీలు చెప్పారు.
అంతేకాకుండా మహిళలను శానిటరీ ప్యాడ్లు, టాంపాన్లను తొలగించాలని కూడా బలవంతం చేసేవారని వెల్లడించారు. ఆ సమయంలో కొట్టేవారని కూడా తెలిపారు.
‘‘మమ్మల్ని అవమానించడానికే వారు ఇలా చేస్తారు’’ అని ఎవిన్ అండ్ క్వార్చక్ జైలులో దాదాపు మూడేళ్లు జైలు శిక్ష అనుభవించిన మోజ్‌గాన్ కేశవార్జ్ బీబీసీతో అన్నారు.
సెక్యూరిటీ కెమెరాల ముందు మూడుసార్లు దుస్తులు విప్పించి తనను సోదా చేశారని ఆమె తెలిపారు. 2022లో జైలు నుంచి కేశవార్జ్ బయటకు వచ్చారు.
మూడోసారి దుస్తులు విప్పి నగ్నంగా ఉన్నప్పుడు అక్కడి మహిళా గార్డు తనను ఫొటో తీశారని ఆమె చెప్పారు.
ఇలా ఫొటో తీయడంపై తాను అభ్యంతరం వ్యక్తం చేయగా, భవిష్యత్తులో తాము చిత్రహింసలకు గురిచేశామనే ఆరోపణలను ఎదుర్కోకుండా ఉండేందుకు ఇలా చేయాల్సిన అవసరం ఉందని గార్డు చెప్పారన్నారు.
"ఈ వీడియోలు, ఫొటోలను ఎవరు చూస్తారు? తర్వాత మా గొంతుల్ని అణచివేయడానికి ప్రభుత్వం వీటిని ఉపయోగించుకుంటుందా?’’ అని ఆమె ప్రశ్నించారు.
మోజ్‌గాన్ కేశవార్జ్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో హిజాబ్ లేకుండా చాలా ఫొటోలు ఉన్నాయి. "దేశ భద్రతకు వ్యతిరేకంగా కుట్ర, ఇస్లాం మతాన్ని అవమానించడం, ఇరాన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, అవినీతిని, వ్యభిచారాన్ని ప్రోత్సహించడం" వంటి ఆరోపణలపై ఆమెపై ఉన్నాయి.
ఆమెకు 12 ఏళ్ల శిక్ష పడింది. ఇటీవలే ఆమె అవినీతి ఆరోపణల్లో దోషిగా తేలారు. ప్రస్తుతం ఆమె ప్రవాసంలో ఉన్నారు. అక్కడి నుంచే బీబీసీతో ఆమె మాట్లాడారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫిల్మింగ్ సాధారణం
డ్రగ్స్ సంబంధిత కేసుల్లో పట్టుబడిన ఖైదీల దుస్తులు విప్పించి తనిఖీ చేసే విధానం చాలా ఏళ్లుగా ఇరాన్‌లో కొనసాగుతోందని బీబీసీకి ఇరాన్ మహిళా మాజీ ఖైదీలు తెలిపారు.
కానీ, మంచి ప్రవర్తన ఉన్న ఖైదీలను ఈ విధానానికి దూరంగా ఉంచారు. వారికి అసలు కెమెరాను ఉపయోగించకపోయేవారని చెప్పారు.
ఖైదీలు చేసిన ఈ ఆరోపణలను ఇరాన్ న్యాయ వ్యవస్థ జూన్ ప్రారంభంలో తప్పుబట్టింది. ఇది పూర్తిగా హైబ్రిడ్ యుద్ధమని, పశ్చిమ దేశాల దుష్ప్రచారం అని కొట్టివేసింది.
అయితే, ఖైదీలను కెమెరాతో చిత్రీకరిస్తారని జూన్ మధ్యలో ఇరాన్ న్యాయవ్యవస్థ అధిపతి అంగీకరించారు. మహిళా గార్డులు మాత్రమే ఆ ఫుటేజీని చూస్తారు అని చెప్పారు.
‘‘స్ట్రిప్ సెర్చ్‌లను రికార్డ్ చేయడం ఇరాన్‌కు కొత్త కాదు. ఆస్ట్రేలియాలోని సౌత్ వేల్స్‌లో ఇలాంటి ఒక సంఘటన చాలా చర్చనీయాంశమైంది’’ అని బీబీసీతో టెహరాన్‌లోని న్యాయవాది మొహమ్మద్ హుస్సేన్ చెప్పారు.
సోదాలు చేసే సమయంలో పలుమార్లు అధికారులు చిత్రీకరించినట్లు పత్రాలు చూపిస్తున్నాయి.
కానీ, ఇరాన్‌లో భిన్నమైన, భయానకమైన విషయం ఏంటంటే, ఈ ఫిల్మింగ్ ప్రక్రియ తమను అవమానించేందుకే రూపొందించారని మాతో మాట్లాడిన వారు చెప్పారు.
హ్యాకింగ్ గ్రూప్ ఇదాలత్ అలీ నుంచి 2021 నాటి గూఢచార పత్రాలు బీబీసీకి లభించాయి. అందులో ఒక లేఖ ఉంది. ఆ లేఖలో స్ట్రిప్ సెర్చ్ అంశాన్ని ఇరాన్ న్యాయవ్యవస్థ అంగీకరిస్తున్నట్లుగా ఉంది.

ఫొటో సోర్స్, MOZHGAN KESHAVARZ/INSTAGRAM
ఈ లేఖలో కుర్దుల హక్కుల కోసం తన గళాన్ని వినిపించిన మోజ్‌గన్ కావోసీ గురించిన ప్రస్తావన ఉంది. కావోసీ కూడా జైలులో ఈ వ్యవహారానికి బలి కావాల్సి వచ్చింది.
కావోసీని అయిదుసార్లు దుస్తులు విప్పించి తనిఖీ చేశారని వివరాలు చెప్పేందుకు ఇష్టపడని ఒక వ్యక్తి బీబీసీకి చెప్పారు.
కావోసీ స్ట్రిప్-సెర్చ్‌పై మానవ హక్కుల వార్తా సంస్థ హరానా ఒక నివేదికను ప్రచురించిన తర్వాత, దీనిపై దర్యాప్తు చేయాలని ఇరాన్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి ఆదేశాలు వెళ్లాయని ఆ దస్తావేజుల్లో ఉంది.
కావోసీ ఇప్పుడు బెయిల్‌పై బయటకు వచ్చారు.
బలూచ్ మైనారిటీ కోసం పనిచేసే హక్కుల కార్యకర్త ఎల్హెహ్ ఇజ్బారీ బీబీసీతో మాట్లాడుతూ, "రెండు అరెస్టుల తర్వాత, నాతో దుస్తులు విప్పించి నన్ను తనిఖీ చేశారు. నా శరీరం గురించి ఎగతాళిగా మాట్లాడారు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తన చేతిపై ఉన్న ఒక మచ్చను చూపిస్తూ తనిఖీ చేసే సమయంలో అధికారులు తనను సిగరెట్‌తో కాల్చారని ఇజ్బారీ చెప్పారు. 2022 నవంబర్‌లో ఎల్హెహ్ ఇజ్బారీని అరెస్టు చేసి మూడు వేర్వేరు అజ్ఞాత ప్రదేశాల్లో ఉంచారు.
భద్రతా సంస్థల నుంచి పదే పదే కాల్స్ రావడం, అరెస్టు బెదిరింపుల కారణంగా ఆమె ఇరాన్ నుంచి పారిపోయారు. నసీబ్ షంషీ మరో ఇరాన్ మహిళ. ఆమెను కూడా మూడుసార్లు బట్టలు తొలగించి పరీక్షించారు.
ఆమె ‘రివల్యూషన్ స్ట్రీట్’ అనే బృందంలో సభ్యురాలు. 2018లో నిర్బంధ హిజాబ్‌కు వ్యతిరేకంగా తన హిజాబ్‌ను తొలగించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో డజన్ల మందిని అరెస్టు చేశారు.
ఆమెపై అనేక అభియోగాలను మోపారు. అందులో హిజాబ్‌ను తొలగించడం ద్వారా ఇరాన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, ఇరాన్ సుప్రీం లీడర్‌ను అవమానించడం అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
మూడు నెలల జైలు జీవితం తర్వాత విడుదలైన షంషీ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు.
సీసీటీవీ ముందు దుస్తులు విప్పడం గురించి తాను అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు, "ఈ రోజు నుంచి ఇక్కడ అన్నీ జరుగుతాయి" అని ఒక గార్డు అన్నట్లు ఆమె తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ట్రినిటైట్: అణుబాంబు బద్దలై రంగు రాళ్లు బయటపడ్డాయి
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














