ప్రేమ కోసం పోలాండ్ నుంచి భారత్‌కు.. సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడి ఇల్లు కట్టిస్తూ పెళ్లికి సిద్ధమైన మహిళ

ఫొటో సోర్స్, SARTAJ ALAM
- రచయిత, సర్తాజ్ ఆలం
- హోదా, బీబీసీ హిందీ, ఝార్ఖండ్
‘వీలైతే రేపే షాదాబ్‌ను పెళ్లి చేసుకుంటా’
44 ఏళ్ల బార్బరా ఈ మాటలు అంటున్నప్పుడు, ఎదురుగా ఉన్న ఆమె ప్రేమికుడు 27 ఏళ్ల షాదాబ్ ఆలం మురిసిపోయారు.
ఇటీవలే ఆమె షాదాబ్ కోసం పోలాండ్ నుంచి భారత్‌కు వచ్చారు.
‘‘కానీ, మేమిద్దరం చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే భవిష్యత్‌లో మాకెలాంటి సమస్య రాకూడదు’ అని షాదాబ్ ఆలం చెప్పారు.
బార్బరా పోలాక్ జులై రెండో వారంలో తన ప్రేమికుడు షాదాబ్ ఆలంను కలుసుకునేందుకు హజారీబాగ్(ఝార్ఖండ్)కు వచ్చారు.
బార్బరా పోలాక్ జూన్ నెలలోనే భారత్‌కు వచ్చారు. జూన్ 26న ఆమె ఏడేళ్ల కూతురు అనియా పోలాక్‌తో పోలాండ్ నుంచి దిల్లీకి చేరుకున్నారు.
ఆ తర్వాత, షాదాబ్‌తో కలిసి దిల్లీలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలన్నింటినీ చూశారు.
‘‘మేం దిల్లీలో పర్యాటక ప్రదేశాలను చూస్తూ తిరుగుతున్నప్పుడు, ఇక్కడి ప్రజలు బార్బరా, అనియాతో కలిసి ఫోటోలు తీసుకోవాలనుకున్నారు. ’’ అని షాదాబ్ వివరించారు.

ఫొటో సోర్స్, SARTAJ ALAM
బార్బరా ఏం చెబుతున్నారు?
బార్బరాను తొలిసారి మేం కలుసుకున్నప్పుడు ఆమె మాకు నమస్కారం చెప్పారు.
ఎక్కడ నేర్చుకున్నారని మేం అడిగినప్పుడు ఈ గ్రామానికి వచ్చిన తర్వాతనేనని తెలిపారు.
‘‘తొలుత నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు, షాదాబ్ నాకు నమస్కారం చెప్పడం చూశాను. అప్పటి నుంచి నన్ను కలవడానికి వచ్చే ప్రతి ఒక్కరినీ నేను ఇలానే పలకరిస్తున్నాను’’ అని బార్బరా చెప్పారు.
ఆ తర్వాత మిగతా సంభాషణ అంతా కూడా ఇంగ్లిష్‌లోనే సాగింది. కొన్ని సమాధానాలు బార్బరా ఇంగ్లీష్‌లో కొన్నింటిన్ని పోలిష్‌లో చెప్పారు.
పోలిష్‌లో చెప్పిన సమాధానాలను షాదాబ్ మాకు ట్రాన్స్‌లేట్ చేశారు.
భారత్‌ను కొనియాడిన బార్బరా, ‘‘ఇక్కడ అతిథులను దేవుళ్లతో సమానంగా భావిస్తారు. భారత్ చాలా అద్భుతమైన దేశం. ఇక్కడి ప్రజలు స్నేహపూర్వకమైనవారు. ఇక్కడి పండ్లు చాలా తియ్యగా ఉన్నాయి. ఇక్కడి ఆహారం నాకు నచ్చింది’’ అని అన్నారు.
‘‘నా కూతురు ఇక్కడ నాతో పాటు సెలవుల్ని గడపడాన్ని చాలా ఆనందంగా భావిస్తుంది. తను షాదాబ్‌కు చాలా క్లోజ్. ఇప్పటి నుంచి ఆమె షాదాబ్‌ను డాడీ అని పిలుస్తుంది. ఇద్దరూ కలిసి బాగా ఆడుకుంటున్నారు’’ అని బార్బరా తెలిపారు.
విజిటింగ్ వీసాపై ఇక్కడికి వచ్చిన బార్బరా హజారీబాగ్ రావడం ఇదే తొలిసారన్నారు.
‘‘కుట్రా గ్రామ సంస్కృతి నాకు బాగా నచ్చింది. కానీ, ఇక్కడ ఇళ్లు చాలా చిన్నవిగా ఉన్నాయి. పోలాండ్‌లో ఇళ్లు పెద్దగా ఉంటాయి. అయినప్పటికీ, షాదాబ్‌తో కలిసి ఇక్కడ నివసించడం నాకు సంతోషంగా ఉంది’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, SARTAJ ALAM
బార్బరా, షాదాబ్ ఎలా కలుసుకున్నారు?
షాదాబ్ మహారాష్ట్ర కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. ఈయన మంచి డ్యాన్సర్.
‘‘డ్యాన్స్ వీడియోలు చేసి, నేను వాటిని టిక్‌టాక్‌లో పోస్ట్ చేసే వాణ్ని. వాటిని చూసిన బార్బరా నన్ను ఫాలో అవ్వడం ప్రారంభించారు.
బార్బరా పలు సార్లు డైరెక్ట్ మెసేజ్‌లు పంపారు. కానీ, ఆమె అకౌంట్ డీపీలో విదేశీ మహిళ ముఖం చూసి, అదేదో నకిలీ అకౌంట్ అయ్యుంటుందని భయపడ్డాను. అందుకే, ఆమెకు తిరిగి సమాధానమిచ్చేవాణ్ని కాదు. కానీ, నన్ను కాంటాక్ట్ చేసేందుకు ఆమె ప్రయత్నిస్తూనే ఉన్నారు. ’’
‘‘టిక్‌టాక్ ఆగిపోయిన తర్వాత, నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ప్రారంభించాను. బార్బరా నన్ను అక్కడ కూడా ఫాలో అవ్వడం ప్రారంభించారు. ఒకరోజు నేను లైవ్‌లో ఉన్నప్పుడు, బార్బరా కూడా చూడటం చూశాను. నన్ను కాంటాక్ట్ అయ్యేందుకు ఆమెకున్న ఆసక్తిని వ్యక్తపరిచారు. నా నెంబర్‌ను ఆమెకి పంపాను. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా మా మాటలు మొదలయ్యాయి. అది లాక్‌డౌన్‌కి ముందు’’ అని షాదాబ్ తెలిపారు.
‘‘బార్బరా కొన్నిసార్లు ఎర్ర గులాబీలు పంపేవారు. వాటిని చూసిన తర్వాత, నేను ఆమె ప్రేమను ఆస్వాదించడం మొదలు పెట్టాను. ఒక రోజు బార్బరానే ఆమె ప్రేమను తెలిపారు. నేను ఓకే చెప్పాను’’ అని షాదాబ్ వివరించారు.
‘‘ఆమె నన్ను మెరుగైన జీవితం గడిపేలా స్ఫూర్తినిచ్చేవారు. నాకు వివరించే వారు. బార్బరా నన్ను అలా చూసుకోవడం నాకు బాగా నచ్చింది. ఆమె నన్ను చాలా బాగా చూసుకునేదనిపించింది. మేమిద్దరం ఒకరికొకరం అనిపించింది’’ అని షాదాబ్ అన్నారు.
‘‘నేను షాదాబ్‌కు పోలాండ్ నుంచి విజిటింగ్ వీసాను పంపించాను. కానీ, సాంకేతిక కారణాల చేత ఆయన పోలాండ్ రాలేకపోయారు. దీంతో, 2021 చివరిలో షాదాబ్‌ను కలుసుకునేందుకు నేను భారత్‌కు వచ్చాను.’’ అని బార్బరా తెలిపారు.
తాను పోలాండ్‌కు వెళ్లలేకపోయానని.. అందుకే, బార్బరానే ఆమె కూతుర్ని తీసుకుని భారత్‌కు వచ్చారని షాదాబ్ చెప్పారు.
షాదాబ్‌ను పెళ్లి చేసుకునేందుకు బార్బరా ఎంతో ఆసక్తితో ఉన్నారు.

ఫొటో సోర్స్, SARTAJ ALAM
మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు?
ఈ ప్రశ్నకు బార్బరా వెంటనే సమాధానమిచ్చారు.
‘‘నాకు రేపే షాదాబ్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ, మేమిద్దరం రెండు భిన్న దేశాలకు చెందినవాళ్లం. దాని కోసం మేం డాక్యుమెంట్లను తయారు చేసుకోవాలి. ఆ తర్వాత చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవాలి. అందుకే పెళ్లికి కాస్త సమయం పడుతుంది’’ అని బార్బరా అన్నారు.
పెళ్లి అయిన తర్వాత భారత్‌లో స్థిరపడతారా? లేదా షాదాబ్‌ను తీసుకుని పోలాండ్‌కి వెళ్తారా? అనే ప్రశ్నకు కూడా బార్బరా సమాధానమిచ్చారు.
‘‘పెళ్లి తర్వాత, నేను షాదాబ్‌ను పోలాండ్‌కు తీసుకెళ్లాలనుకుంటున్నాను. నాకు అక్కడ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉంది. దానిలోనే షాదాబ్ ఉద్యోగం చేసుకోవచ్చు.
కానీ తర్వాత, భారత్‌లో మాకు మంచి భవిష్యత్ ఉందనిపిస్తే, మేం ఇక్కడ కూడా స్థిరపడొచ్చు. ఇక్కడ రెస్టారెంట్ బిజినెస్‌లో పెట్టుబడి పెడతాను’’ అని చెప్పారు.
‘‘నేను ఎక్కడున్నా షాదాబ్‌తో కలిసి ఉండాలనుకుంటున్నాను. ఆయన కోసం ఎలాంటి త్యాగానికైనా నేను సిద్ధం’’ అని బార్బరా అన్నారు.
‘‘బార్బరా లేకుండా నేను జీవించలేను. అందుకే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత బార్బరాతో కలిసి పోలాండ్ వెళ్లాలనుకుంటున్నాను. ఆమె నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు’’ అని షాదాబ్ తెలిపారు.

ఫొటో సోర్స్, SARTAJ ALAM
బార్బరా జీవితం
తన మొదటి పెళ్లి గురించి కూడా బార్బరా వివరించారు.
‘‘నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి నాతో విడిపోయి స్విట్జర్లాండ్‌లో ఉంటున్నారు. కూతురు అనియా మాత్రమే నాతో పోలాండ్‌లో ఉంటుంది. ఇప్పుడు షాదాబ్‌నే ఆమె తండ్రి’’ అని చెప్పారు.
‘‘బార్బరా నాకన్ని చెప్పారు. ఏ విషయం దాచిపెట్టలేదు. ఆమె మునపటి పెళ్లి, కూతురు వంటి విషయాలన్ని ముందే చెప్పారు. దాని గురించి ఆమెతో నేను మాట్లాడాలనుకోవడం లేదు. అనియా చాలా మంచి కూతురు’’ అని షాదాబ్ అన్నారు.
బార్బరాకు ఏ భారతీయ భాష తెలియదు. మీకు పోలీష్ రాదు, కానీ, మీరిద్దరూ ఎలా ఒకరికొకరి మాటలను అర్థం చేసుకోగలరు? అనే దానిపై షాదాబ్ స్పందించారు.
‘‘బార్బరా ఇంగ్లీష్ మాట్లాడలేదు. కానీ, అర్థం చేసుకోగలదు. నాకు ఇంగ్లీష్ తెలుసు. పోలీష్ ట్రాన్స్‌లేటర్ సాయంతో నేను ఏం మాట్లాడుతున్నానో ఆమె అర్థం చేసుకుంటారు.
అంతకుముందు నాకసలు పోలిష్ అర్థమయ్యేది కాదు. కానీ, ఇప్పుడు అర్థం చేసుకోవడం ప్రారంభించాను. నేను కూడా మాట్లాడటం నేర్చుకున్నాను’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, SARTAJ ALAM
షాదాబ్ కుటుంబ సభ్యులెవరు?
షాదాబ్‌కు తల్లిదండ్రులు లేరు. ఆయనకు ముగ్గురు చెల్లెళ్లు. ఒక అన్న ఉన్నారు. ముగ్గురు చెల్లెళ్లకి పెళ్లి అయింది. అన్న కోల్‌కతాలో ఉంటున్నారు.
షాదాబ్ చిన్న వయసులోనే తల్లి చనిపోయారు. తండ్రి కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు.
ఆయనతో పాటు, తన తోబుట్టువులను కూడా ముంబైలో ఉన్న తన మేనమామనే పెంచి పెద్ద చేశారు.
‘‘ఇప్పుడు నేనొక్కడినే పెళ్లికి మిగిలి ఉన్నాను. నేను కూడా స్థిరపడాలనుకుంటున్నాను’’ అని షాదాబ్ చెప్పారు.
‘‘బార్బరా గురించి విని తొలుత నా చెల్లెళ్లు చాలా షాకయ్యారు. కానీ, ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. త్వరలోనే బార్బరాను నా చెల్లెళ్లకు పరిచయం చేస్తాను’’ అని షాదాబ్ తెలిపారు.
కరోనా సమయంలో తన ఉద్యోగం పోయిందని, అప్పటి నుంచి బార్బరా ఎల్లప్పుడూ తనకు సపోర్ట్ చేస్తూ వచ్చిందన్నారు.
గ్రాడ్యుయేషన్ తర్వాత షాదాబ్ హార్డ్‌వేర్ నెట్‌వర్కింగ్‌లో డిప్లోమా చేశారు. ముంబైలో ఐటీ ఇంజనీర్‌గా కూడా షాదాబ్ పనిచేశారు.

ఫొటో సోర్స్, SARTAJ ALAM
షాదాబ్ ఇంటికి బార్బరా ఎప్పుడు వచ్చారు?
‘‘కొన్ని రోజుల పాటు హోటల్‌లో స్టే చేసిన తర్వాత, కుట్రా గ్రామంలో ఉన్న మా ఇంట్లో ఉండేందుకు బార్బరా ఆసక్తి చూపారు. హజారీబాగ్ నగరానికి పది కిలోమీటర్ల దూరంలో మా గ్రామం ఉంది. ఆమెకు మా ఇంటికి రావాలని ఉండటంతో, బార్బరాను ఇంటికి తీసుకెళ్లాను’’ అని షాదాబ్ చెప్పారు.
బార్బరాను కలిసేందుకు ప్రతి రోజూ మా ఇంటికి గ్రామస్తులు వస్తుంటారు.
బార్బరా మరో దేశానికి, మరో మతానికి చెందిన వ్యక్తి. ఆమెను తొలిసారి మీ ఇంట్లో చూసినప్పుడు గ్రామస్తులు ఎలా స్పందించారు? అనే ప్రశ్నకు కూడా షాదాబ్ సమాధానమిచ్చారు.
‘‘బార్బరా ఇంటికి వచ్చిన తర్వాత, ఆమెను చూసి గ్రామ ప్రజలు చాలా సంతోషం కనబరుస్తున్నారు. కొందరు మమ్మల్ని పెళ్లెప్పుడు అని అడుగుతున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని నేను వారికి చెబుతున్నాను’’ అని షాదాబ్ చెప్పారు.
‘‘షాదాబ్ పేదరికాన్ని మేం చూశాం. ముంబైలో ఉంటూనే అతను ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. కష్టపడి పనిచేసే ఈ యువకుడి జీవితంలో ఒక విదేశీ మహిళ వచ్చారు. షాదాబ్ రోజులు మారతాయని గ్రామస్తులం చాలా సంతోషంతో ఉన్నాం’’ అని గ్రామపెద్ద అన్వరుల్ హక్ అన్నారు.
పెళ్లి అయిన తర్వాత షాదాబ్ విదేశాలకు వెళ్లిపోతాడా? అనే ప్రశ్నకు, ‘‘షాదాబ్ కుటుంబంలో అతనికి ముందు వెనుకాల ఎవరూ లేరు. అతను కోరుకున్న జీవితాన్ని అనుభవించే హక్కు అతనికి ఉంది.
ఒకవేళ విదేశాలకు వెళ్తే, గ్రామం నుంచి విదేశాలకు వెళ్లిన తొలి యువకుడు ఇతనే. ప్రతి దానిలో గ్రామస్తులమందరం అతనితో ఉంటాం’’ అని అన్వరుల్ హక్ అన్నారు.
గ్రామస్తులమందరం ఎంత వీలైతే అంత త్వరగా వారు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు.

ఫొటో సోర్స్, SARTAJ ALAM
షాదాబ్ ఇల్లు కట్టుకునేందుకు సాయపడిన బార్బరా
5 వేల ఇళ్లున్న కుట్రా గ్రామంలో ప్రధాన రహదారి నుంచి కిలోమీటర్ దూరంలో లోపలకి చిన్న మసీదుకి దగ్గర్లో షాదాబ్ పూర్వీకుల ఇల్లు ఉంది.
కిచెన్, హాల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
తన జీవితంలో రెండోసారి ఈ ఇంటిని నిర్మించడం చూస్తున్నట్లు 60 ఏళ్ల గ్రామ పెద్ద అన్వరుల్ హక్ అన్నారు.
‘‘తొలిసారి ఇందిరా ఆవాస్ కింద ఈ మట్టి ఇల్లును రెండు పక్కా రూమ్‌లతో షాదాబ్ నాన్నమ్మ నిర్మించారు. పోలాండ్ నుంచి వచ్చిన ప్రేమికురాలి సాయంతో షాదాబ్ తన ఇంటిని రెండోసారి నిర్మిస్తున్నారు.’’ అని తెలిపారు.
షాదాబ్ ఇల్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. రెండు రూమ్‌లతో దీన్ని కడుతున్నారు. ఒక గది వస్తువులు ఉంచుకునేందుకు, మరో గది బెడ్‌రూమ్. బెడ్‌కి పైన బార్బరాకి చెందిన చిన్న ఫోటో కూడా ఉంది.
బార్బరా హోటల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు, ఇంటి పరిస్థితి చూసి చాలా బాధను వ్యక్తం చేశారని షాదాబ్ అన్నారు.
ఆమె సలహాతోనే ఈ ఇంటిని తిరిగి నిర్మించడం ప్రారంభించినట్లు తెలిపారు.
‘‘బార్బరా, ఆమె కూతురి పేపర్లన్నింటిన్నీ నేను చూశాను. వీరి టూరిస్ట్ వీసాలు 2028 వరకు వాలిడ్‌లో ఉన్నాయి.’’ అని స్థానిక డీఎస్‌పీ రాజీవ్ కుమార్ బీబీసీకి తెలిపారు.
కుట్రా గ్రామానికి చెందిన షాదాబ్‌కు ఎలాంటి నేరపూరిత చరిత్ర లేదన్నారు.
ఇది కూడా చదవండి:
- అస్సాం: బహుభార్యత్వాన్ని నిషేధిస్తామంటున్న ప్రభుత్వం.. ముస్లింలలో భయం
- విదేశీ భర్తల చేతిలో మోసపోయిన మహిళలు న్యాయ పోరాటానికి రూ.2.45 లక్షల సాయం పొందడం ఎలా?
- డీఎంఐటీ టెస్ట్: పెళ్లికి ముందే పెళ్లి కొడుకు తెలివితేటలను కొలిచే ఈ పరీక్ష ఏంటి, శాస్త్రీయత ఎంత?
- టెక్నాలజీ మ్యారేజేస్: భాగస్వామి హృదయ స్పందనను తెలిపే ఉంగరాలు, లాకెట్ల కథ ఏంటి?
- 'మాకు పెళ్లి అవసరం లేదు, ప్రేమ చాలు' -సహజీవనంలో ఉన్న ఓ మహిళ అనుభవాలు















