ఉత్తరప్రదేశ్: ముజఫర్‌నగర్‌లో హిందూ దేవుళ్ళ పేర్లతో ముస్లింలు నడిపే హోటళ్లపై వివాదం ఏంటి?

కావడ్ యాత్ర

ఫొటో సోర్స్, AMIT SAINI

    • రచయిత, అమిత్ సైనీ, దిల్ నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో కావడ్ యాత్ర సందర్భంగా ముస్లింలకు చెందిన దుకాణాలను మూసివేశారు.

యాత్ర జరిగే మార్గంలో ఉన్న ముస్లిం సిబ్బందితో నడిచే లేదా ముస్లింల యాజమాన్యంలో ఉన్న అన్ని హోటళ్లు, దాబాలను దాదాపు 15 రోజుల పాటు మూసి ఉంచారు.

రెండు వారాలకు పైగా హోటళ్లు మూతపడటంతో వాటి యజమానులు ఆర్థికంగా నష్టపోయారు.

ఇప్పుడు ఈ హోటళ్లు, దాబాలు తెరవడం నెమ్మదిగా మొదలైనప్పటికీ, వీటి ముందు ఇప్పుడు మరో కొత్త సవాలు నిలిచింది.

ముజఫర్‌నగర్‌లోని ఒక హిందూ మత సాధువు ఇప్పుడు ఈ దాబాలకు వ్యతిరేకంగా నిరసన ప్రారంభించారు.

కొన్నేళ్లుగా కావడ్ యాత్ర సందర్భంగా ఆ యాత్ర వెళ్లే మార్గాల్లో మాంసం, చేపల దుకాణాలను మూసివేస్తున్నారు.

‘‘ప్రస్తుతం కావడ్ యాత్ర ముగిసిపోయింది. ఇప్పుడు ఇక ఎలాంటి ఇబ్బంది లేదు’’ అని ముజఫర్‌నగర్ జిల్లా మేజిస్ట్రేట్ అరవింద్ బంగారి అన్నారు.

అసలు కావడ్ యాత్ర మార్గంలో ముస్లింల శాకహార హోటళ్లు, దాబాలు ఎందుకు మూతపడ్డాయి? వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? వారికి ఎంత నష్టం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు, మేం ముజఫర్‌నగర్‌లోని పలువురు దాబా యజమానులతో మాట్లాడాం.

కావడ్ యాత్ర

ఫొటో సోర్స్, AMIT SAINI

దాబా యజమానులు ఏమంటున్నారు?

కావడ్ యాత్ర ప్రధాన మార్గమైన ఎన్‌హెచ్-58పై బాగ్ వాలీ చౌరాహా వద్ద ఉన్న పంజాబీ న్యూ స్టార్ శుద్ధ్ దాబాకు చెందిన సోనూ పాల్, సాదిక్ త్యాగిలను మేం కలిశాం.

ఈ అంశంపై సోను పాల్ బీబీసీతో మాట్లాడారు.

“నేను హోటల్ యజమానిని. కానీ, ఈ హోటల్ వ్యాపారంలో మొహమ్మద్ యూసుఫ్ అలియాస్ గుడ్డు నా భాగస్వామి. ఈ భూమి కూడా ఆలం అనే ముస్లింకు చెందినది.

ఇది కావడ్ సీజన్. ఇక్కడి యంత్రాంగం మా హోటల్‌ను మూసివేయించింది. ఫుడ్ లైసెన్స్ నుంచి అన్ని పనులు నా పేరు మీద అంటే సోనూ పేరు మీదే నడుస్తాయి.

మా వద్ద 30-35 మంది అబ్బాయిలు పనిచేస్తుంటారు. హోటల్ మూసేయడంతో అందరూ ఖాళీగా ఉన్నారు. సీజన్ కావడంతో ముందుగానే సరకులన్నీ తెచ్చి పెట్టుకున్నాం. ఇప్పుడు అంతా చెడిపోయింది. దాదాపు మూడు, నాలుగు లక్షల నష్టం వచ్చింది.

మాకు ఎలాంటి నోటీసులు అందలేదు. ఒక ఇద్దరుముగ్గురు పోలీసులు వచ్చి హోటల్‌ను మూసివేశారు. ఎందుకని అడిగితే, ముస్లిం అయిన నువ్వు ఒక హిందువు పేరుతో హోటల్ నడుపుతున్నావని అన్నారు’’ అని సోను పాల్ బీబీసీకి వివరించారు.

హోటళ్ల మూసివేతకు సంబంధించి ముజఫర్‌నగర్ పరిపాలన యంత్రాంగం ఎలాంటి రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేయలేదు.

అయితే, హిందూ పేరుతో నడిచే ముస్లిం యజమానులున్న హోటళ్లను మూసివేయించినట్లు మీడియాకు జిల్లా పరిపాలన అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడలేదు.

కావడ్ యాత్ర

ఫొటో సోర్స్, AMIT SAINI

ఫొటో క్యాప్షన్, పంజాబీ న్యూ స్టార్ దాబా యజమాని సోనూ పాల్

ఎన్‌హెచ్-58లో ‘ఓం శివ వైష్ణో’ పేరుతో ఉండే దాబా పేరును కావడ్ యాత్ర సందర్భంగా మార్చేశారు. దానికి ఇప్పుడు 'వెల్‌కమ్ టు పిక్నిక్ పాయింట్ టూరిస్ట్ దాబా' అని పేరు పెట్టారు. కావడ్ యాత్ర సందర్భంగా జరిగిన నిరసనల తర్వాత దాని పేరును మార్చారు.

దాబా యజమాని ఆదిల్ రాఠౌర్ మాట్లాడుతూ, “ ఓం శివ వైష్ణో పేరుతో ఉన్న ఈ దాబాను గతంలో కన్వర్‌పాల్ నడిపేవారు. ఆయన నుంచి దీన్ని మేం కిరాయికి తీసుకున్నాం. తర్వాత అదే పేరుతో కొనసాగించాం.

మేం శాకహారం భోజనం వండుతాం. మా వద్ద పనిచేసే మింటూ, అమన్, సోను, బిజేంద్ర, విక్కీ మొదలైన వారంతా హిందువులే. వంటల్లో కోడిగుడ్లు వాడం. ఉల్లి, వెల్లుల్లిని కూడా మేం ఉపయోగించం. అయినప్పటికీ మా హోటల్‌ 4వ తేదీన మూతపడింది. ఈరోజే హోటల్‌ తెరిచాం. దాదాపు నాలుగైదు లక్షల నష్టం వాటిల్లింది.

కొంతమంది సిబ్బంది పిల్లలతో పాటు దాబాలోనే ఉంటారు. దాబా మూసివేయడంతో వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక్కడికి 30 కి.మీ దూరంలో మా ఊరు ఉంటుంది. అక్కడి నుంచి వీరికి కావాల్సిన వస్తువులను మా సోదరుడు తెచ్చి ఇచ్చేవాడు.

ఇప్పుడు అద్దెతో పాటు కరెంటు బిల్లు, సిబ్బందికి జీతాలు చెల్లించాలి. అదే దిగులుగా ఉంది.

ఈ హోటల్ వల్ల హిందువులకు ఎలా ఇబ్బంది కలుగుతుందో నాకు అర్థం కాలేదు. దీనికంటే ముందు మీరాపుర్‌లో ‘బాబా అమృత్‌సరీ’ పేరుతో కూడా ఎన్నో ఏళ్లు ఒక హోటల్‌ను నడిపాను. అప్పుడు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు’’ అని ఆయన చెప్పారు.

కావడ్ యాత్ర

ఫొటో సోర్స్, AMIT SAINI

‘‘శాకాహారమే వండుతాం’’

ఆదిల్ తండ్రి సనవ్వర్ రాఠౌర్ కూడా గతంలో ఆ హోటల్‌ను కన్వర్‌పాల్ నడిపేవారని చెప్పారు.

“మేం ముస్లిం రాజపుత్రులం. హిందూ దేవుళ్లను మేం కూడా గౌరవిస్తాం. మేం దాబా వ్యాపారం మొదలుపెట్టినప్పటి నుంచి స్వచ్ఛమైన శాకాహారం మాత్రమే చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా శాకాహారాన్ని మాత్రమే వండుతాం.

కావాలనుకుంటే మేం ఒక ముస్లిం దాబాను కూడా నిర్వహించవచ్చు. కానీ, శాకాహారం అమ్మడంలోనే ఆనందం ఉంటుంది. మా హోటల్ పేరుపై ఎవరో అభ్యంతరం వ్యక్తం చేశారంట. దాంతో పేరు మార్చాలని పోలీసులు చెప్పడంతో దాన్ని ‘వెల్‌కమ్ టు పిక్నిక్ పాయింట్ టూరిస్ట్ దాబా’గా మార్చాం. ఇక నుంచి ఈ పేరుతోనే దాబా నడిపిస్తాం’’ అని ఆయన వివరించాం.

కావడ్ యాత్ర

ఫొటో సోర్స్, AMIT SAINI

ఫొటో క్యాప్షన్, వెల్‌కమ్ టూ పిక్నిక్ పాయింట్ టూరిస్ట్ దాబా యజమాని ఆదిల్ రాఠౌర్

'మేం మా గుర్తింపును దాచుకోలేదు'

అదే మార్గంలో ముందుకు వెళ్ళినప్పుడు భోపా బైపాస్ దగ్గర ‘చండీగఢ్ ద దాబా’ అనే హోటల్ కనిపించింది. అక్కడ అఫ్సర్ అలీని మేం కలిశాం.

తాను ఆ హోటల్‌లో పనిచేస్తున్నట్లు, యజమాని మరో వ్యక్తి అని అఫ్సర్ చెప్పారు.

‘‘ఇక్కడ పనిచేసేవారిలో ఇద్దరు ముస్లింలు కాగా ఏడుగురు హిందువులు. ముస్లిం ఉద్యోగుల పని... బిల్లు తీసుకోవడం, సరుకుల రవాణా మాత్రమే. మిగిలిన పనిని హిందు సిబ్బంది చేస్తారు.

కరోనా ప్రభావంతో హోటల్ రంగం ఇబ్బందుల్లో పడింది. కావడ్ యాత్ర, వేసవి సెలవులు వంటి సీజన్లపైనే హోటళ్లు ఆధారపడతాయి.

కానీ, హోటల్ మూతపడటంతో లక్షల్లో నష్టం రావడంతో పాటు సిబ్బంది కూడా ఇబ్బంది పడ్డారు.

ఇది స్వచ్ఛమైన శాకాహార హోటల్. ఇక్కడ గుడ్లు కూడా ఉడికించం. ఎందుకంటే హరిద్వార్ వెళ్లాలంటే ఇదే దారి. వారి విశ్వాసాలను మేం పూర్తిగా గౌరవిస్తాం.

చండీగఢ్ స్ఫూర్తితో హోటల్‌కి చండీగఢ్ అని పేరు పెట్టాం. మేం మాకు సంబంధించిన ఏ గుర్తింపును దాచడం లేదు.

ఔట్‌పోస్టు ఇన్‌చార్జి వచ్చి హోటల్ మూసివేయాలని ఆదేశించారు. అధికారులు జారీ చేసిన ఎలాంటి నోటీసులను పోలీసులు మాకు చూపించలేదు. దాబాను మూసివేయాలని మౌఖిక ఆదేశాలు మాత్రమే ఇచ్చారు’’ అని ఆయన తెలిపారు.

కావడ్ యాత్ర

ఫొటో సోర్స్, AMIT SAINI

ఫొటో క్యాప్షన్, చండీగఢ్ ద దాబాా మేనేజర్ అఫ్సర్ అలీ

‘‘ముస్లిం యజమానులతో మాకే సమస్య లేదు’’

ముస్లింల హోటళ్లలో అపరిశుభ్రత, ఆహారంలో మాంసం తదితరాలు కలుపుతున్నట్లు అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి.

ఇలాంటి ఆరోపణలపై అఫ్సర్ స్పందిస్తూ, ‘‘అలాంటి పనులు చేస్తున్నట్లు ఆధారాలు ఉంటే, ఆ పని ఎవరు చేసినా వారిపై చర్యలు తీసుకోవాలి. అయితే, అందరూ అలాగే చేస్తారని చెప్పడం పూర్తిగా తప్పు’’ అని అన్నారు.

ముస్లిం యజమానుల హోటళ్లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న హిందూ సంస్థలు కూడా ఈ రకమైన వాదనలే చేస్తున్నాయి.

ఈ హోటల్‌లో మాంసం, గుడ్డు లాంటివి వండరని కేవలం శాకహార భోజనం మాత్రమే చేస్తారని ‘చండీగఢ్ ద దాబా’ హోటల్‌లో నాలుగేళ్లుగా వంట పని చేసే భోజ్‌రామ్ అన్నారు.

లలిత్ దీక్షిత్ అనే వ్యక్తి తరచుగా ఇదే దాబాలో భోజనం చేస్తారు.

“మేం గత రెండు మూడేళ్లుగా ఇక్కడకు ఆహారం కోసం వస్తున్నాం. మధ్యాహ్న భోజనం దాదాపుగా ఇక్కడే తింటాం. మేం పండితులం. ఇది పూర్తిగా శాకహారమని మాకు తెలుసు. ఈ హోటల్‌కు ముస్లిం యజమానిగా ఉండటంలో మాకే ఇబ్బంది లేదు. ఇతరులకు కూడా ఈ అంశంపై ఇబ్బంది ఉండకూడదు’’ అని లలిత్ దీక్షిత్ చెప్పారు.

భోజ్‌రామ్

ఫొటో సోర్స్, AMIT SAINI

ఫొటో క్యాప్షన్, చండీగఢ్ ద దాబాలో వంట పని చేసే భోజ్‌రామ్

‘‘చౌకబారు ఆరోపణలు’’

వినాయకుడి ఫొటోతో ఉన్న ‘న్యూ గణపతి టూరిస్ట్ దాబా నంబర్-1’ హోటల్‌కు కూడా మేం వెళ్లాం. అక్కడ మేనేజర్‌గా పనిచేస్తున్న వసీమ్‌తో మాట్లాడాం.

దాదాపు పదేళ్లుగా అదే పేరుతో హోటల్ నడుస్తున్నట్లు వసీం చెప్పారు.

‘‘ఈ భూమి నసీం అహ్మద్‌కు చెందినది. గతంలో వీర్‌పాల్‌ ఈ హోటల్‌ను నడిపేవారు. ఆయన నుంచి దీన్ని మేం తీసుకున్నాం. రెండేళ్ల క్రితం అప్పుల బాధతో ఈ హోటల్‌ని నాకు పరిచయస్థుడైన పుష్పరాజ్‌సింగ్‌ అలియాస్‌ సోనూకి అమ్మేశాను.

గణపతి దాబా

ఫొటో సోర్స్, AMIT SAINI

పుష్పరాజ్ కోరిక మేరకు ఈ హోటల్‌ను నేను చూసుకుంటున్నా. కానీ, అతనే దీని యజమాని.

కానీ, ముస్లింలైన మీరు ఈ హోటల్‌ను హిందూ దేవుడి పేరుతో నిర్వహించకూడదని జిల్లా యంత్రాంగంలోని కొందరు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇది ఒక హిందూ వ్యక్తి హోటల్ కాబట్టి ఇప్పుడు ఆయన దీని పేరు మార్చుతారని నేను అనుకోవట్లేదు. వారి దేవుళ్ల ఫొటోలను ఆయన పెట్టుకోవడంలో తప్పేముంది?

పైగా ఇక్కడ పనిచేసే వారంతా హిందువులే. వారు ఆహారంలో ఎలా మాంసాహారాన్ని కలుపుతారు? ఈ ఆరోపణలన్నీ అసంబద్ధమైనవి, నిరాధారమైనవి, జుగుప్సాకరమైనవి’’ అని ఆయన అన్నారు.

యశ్వీర్

ఫొటో సోర్స్, AMIT SAINI

ఫొటో క్యాప్షన్, స్వామి యశ్వీర్ మహరాజ్

ముస్లింల శాకాహార దాబాలకు వ్యతిరేకంగా ప్రచారం

ముజఫర్‌నగర్‌లో ముస్లింల శాకాహార దాబాలకు వ్యతిరేక ప్రచారాన్ని స్వామి యశ్వీర్ ప్రారంభించారు. సాధువుగా చెప్పుకునే స్వామి యశ్వీర్ ఆశ్రమం బాఘ్రాలో ఉంది.

యాత్ర సందర్భంగా హిందూ పేర్లు, దేవుళ్ల పేర్లు చూసి హోటళ్లలో భోజనం చేస్తారని, అందుకే హిందువుల పేర్లతో ముస్లింలు హోటళ్లు నడుపుతున్నారని స్వామి యశ్వీర్ ఆరోపించారు.

‘‘ఈ వ్యక్తులు భోజనం చేసేటప్పుడు ఉమ్మివేస్తుంటారు. మూత్ర విసర్జన చేస్తుంటారు. కాబట్టి అలాంటి జిహాదీలను నమ్మలేం. అందుకే వారికి వ్యతిరేకంగా మేం గొంతెత్తాం. ముస్లింలు అయిన ఈ వ్యక్తులు హిందువుల పేరు, దేవుళ్ల పేరు మీద కాకుండా వారి మతం పేరుతో హోటళ్లు నడిపితే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. యాత్ర తర్వాత ఇప్పుడు తెరుచుకుంటున్న హోటళ్ల పేర్లు కూడా మార్చాలి. లేకపోతే ఆ హోటళ్ల బయట శాంతియుతంగా నిరసనలు మొదలుపెడతాం’’ అని అన్నారు.

కావడ్ యాత్ర ముగిసిన తర్వాత తెరుచుకుంటున్న దాబాలకు వ్యతిరేకంగా స్వామి యశ్వీర్ మహరాజ్, తన మద్దతుదారులతో కలిసి ముజఫర్‌నగర్ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం వెలుపల నిరాహార దీక్షకు కూర్చున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)