బ్యూటీ పార్లర్లపై నిషేధం: అవి మా అందాన్నేకాదు, ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి, కానీ ఇప్పుడు....

బ్యూటీ పార్లర్

"నా ఇంటి నుంచి ఒక్కదాన్నే బయటికి వెళ్లడానికి కూడా నాకు అనుమతి లేదు. అయితే, ఏడాదికి రెండు, మూడుసార్లు బ్యూటీ సెలూన్‌‌కు వెళ్లడానికి నా భర్త అనుమతించారు" అన్నారు జర్మీనా.

అణచివేత, పాతుకుపోయిన పితృస్వామ్య సమాజంలో ఉన్న తాను, ఉత్సాహం నింపుకోవడానికి, స్వేచ్ఛా భావాన్ని పొందడానికి అక్కడి బ్యూటీషియన్‌తో ముచ్చటిస్తారు 23 ఏళ్ల జర్మినా.

ఆమెకు 16వ ఏటనే పెళ్లయింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు. హైస్కూల్ చదువు పూర్తి చేసినప్పటికీ, ఉన్నత చదువులకు అత్తగారింటిలోఆమెకు అనుమతి దక్కలేదు.

ఆమె సెలూన్‌కి వెళ్లడం కోసమే ఎదురుచూసేవారు. కానీ తాలిబాన్ ప్రభుత్వం జూలై 24న వాటన్నింటినీ మూసివేయమని ఆదేశించింది.

జర్మీనా దక్షిణ అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌లో నివసిస్తున్నారు. ఇది తాలిబాన్‌లకు కేంద్రం లాంటిది. ఇక్కడ తాలిబాన్‌ల సుప్రీం లీడర్ ఇక్కడే నివసిస్తున్నారు.

అఫ్గాన్ మహిళలు

తాలిబాన్ల నిర్ణయం కన్నీళ్లు పెట్టించింది

జర్మీనా నెలకిందట బ్యూటీ సెలూన్ సందర్శించారు. నిషేధం గురించి వార్త వస్తున్నపుడు అక్కడ ఆమె తన జుట్టుకు గోధుమ రంగు డై వేయించుకుంటున్నారు.

" బ్యూటీ సెలూన్ యజమానురాలు షాక్‌కు గురయ్యారు, ఏడవడం ప్రారంభించారు. వాళ్ల కుటుంబానికి ఆమే ఆధారం" అని జర్మీనా చెప్పారు.

అఫ్గానిస్తాన్‌లో దాదాపు 60,000 మంది మహిళలు ఈ రంగంలో పనిచేస్తున్నారు.

"నా కనుబొమ్మలకు మేకప్ వేస్తున్నపుడు అద్దం వైపు కూడా చూడలేదు. అందరూ ఏడుస్తూ ఉన్నారు. అంతటా నిశ్శబ్దం ఆవరించింది" అని జర్మీనా గుర్తుచేసుకున్నారు.

జర్మీనా పొరుగున ఉన్న బ్యూటీషియన్ ఉద్యోగినితో కలిసి సెలూన్‌కి వెళ్లేవారు. ఆమెతో జర్మీనాకు మంచి స్నేహం ఉండేది.

గతంలో మహిళలు తమ భర్తల గురించి మాట్లాడేవారు. కొందరు తమ అభద్రతాభావాల గురించి బహిరంగంగా చెప్పేవారు.

అయితే ఆగస్టు 2021లో తాలిబాన్ అధికారం చేపట్టిన తర్వాత ఆర్థిక సంక్షోభం పెరిగింది. ఇప్పుడు మహిళలు నిరుద్యోగం, వివక్ష, పేదరికం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు.

మగవాళ్లు తమ కూతుళ్లు మేకప్ వేసుకోకుండా, బ్యూటీషియన్ దగ్గరకు వెళ్లకుండా నిషేధించడం ఇక్కడ మామూలే అని చెప్పారు జర్మీనా.

"చాలామంది మహిళలు ఇక్కడ బురఖా, హిజాబ్ ధరించి తిరుగుతారు. అది మా సంస్కృతిలో భాగమని అంగీకరించాం" అని అన్నారామె.

ఆమె భర్త రెండేళ్ల క్రితం మంచి జీతం వచ్చే ఉద్యోగం పోగొట్టుకుని వేరే ఊరికి వెళ్లారు. జర్మీనా చిన్న పిల్లలకు చదువు చెబుతూ కొంత డబ్బు సంపాదిస్తారు.

చివరిసారిగా సెలూన్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నపుడు, జర్మీనా సెలూన్ వైపు తిరిగి చూస్తూనే ఉన్నారు. ఆమె ఏం కోల్పోతుందో తనకు పూర్తిగా అర్థమైంది. జర్మీనా స్వాతంత్య్రానికి అది చిన్న కత్తిపోటు.

"నేను సెలూన్‌ ఖర్చులు నా సంపాదనతోనే చెల్లించాను. అది నాకు ఆత్మవిశ్వాసాన్ని , శక్తిని, ధైర్యాన్ని ఇచ్చింది" అని అన్నారు జర్మీనా.

బ్యూటీ పార్లర్

''నా భర్తే నన్ను తీసుకెళ్లేవారు''

22 ఏళ్ల మదీనా కాబూల్‌లో నివసిస్తున్నారు. ఆన్‌లైన్‌లో లేటెస్ట్ బ్యూటీ ట్రెండ్స్‌ను అనుసరిస్తూ ఉంటారు.

"నాకు తెలిసిన ప్రతి స్త్రీ, తన స్టైల్‌ని మెరుగుపరుచుకోవడానికి ఇష్టపడతారు. లేటెస్ట్ ఫ్యాషన్, మేకప్ వేసుకోవడం నాకు చాలా ఇష్టం" అని బ్యూటీ సెలూన్‌కు వెళ్లే ముందు మదీనా వ్యాఖ్యానించారు..

‘‘నా జుట్టును రకరకాల రంగుల్లో చూడటం, రకరకాల స్టైల్స్‌లో కత్తిరించడం నా భర్తకు చాలా ఇష్టం. ఆయనే నన్ను బ్యూటీ సెలూన్‌కి తీసుకెళతారు. తలుపు వద్ద ఓపికగా వేచి ఉంటారు" అని ఆమె గర్వంగా చెప్పారు.

"నేను బయటకు వెళ్లేటపుడు ఆయన నా అందాన్ని పొగుడుతారు. అది నాకు మంచి అనుభూతిని కలిగిస్తుంది." అని అన్నారు మదీనా.

న్యాయవాది కావాలనేది ఆమె ఆశయం, కానీ తాలిబాన్లు మహిళలను యూనివర్సిటీకి వెళ్లనివ్వలేదు. మహిళలపై చాలా విషయాల్లో నిషేధం విధించడంతో మదీనాకు ఏం చేయాలో తెలియలేదు.

ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తలపై వస్త్రం కప్పుకుంటారు. అమె రంగుల జుట్టును ఆమె భర్త, కుటుంబ సభ్యులు కాకుండా మరెవరూ చూడలేరు.

తాలిబాన్‌ ప్రభుత్వం రావడానికి ముందు మహిళలకు ఎక్కువ స్వేచ్ఛ ఉండేదని ఆమె గుర్తు చేసుకున్నారు.

పోస్టర్లపై నల్ల మరకలు

వధువు రెడీ అవుతుంటే వరుడు చూసేవారు..

మదీనా చిన్నతనంలో తన తల్లితో పాటు సెలూన్‌కి వెళ్లేవారు. మహిళలు తమ జీవిత విశేషాలను ఎలా అందరితో పంచుకుంటారో గుర్తుచేసుకున్నారు మదీనా.

"సెలూన్‌లోని మహిళా ఉద్యోగులు ఇకపై స్కర్టులు లేదా జీన్స్ ధరించరు, వారంతా హిజాబ్‌లలో ఉంటారు. ప్రతిచోటా ఒక భయం ఉండేది. తాలిబాన్‌లకు ఎవరు మద్దతిస్తున్నారో తెలియదు, రాజకీయాల గురించి మాట్లాడటానికి ఎవరూ ఇష్టపడరు" అని ఆమె అంటున్నారు.

గతంలో వధువు రెడీ అవడాన్ని చూసేందుకు వరుడిని అనుమతించేవారు. సెలూన్‌లో కొంతమంది పురుషులు ఫొటోలు తీయడం కూడా మదీనా గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు వాటిని నిషేధించారు.

కానీ మదీనాకు అపురూపమైన రోజుకు సంబంధించి కొన్ని మధుర జ్ఞాపకాలైతే ఇంకా ఉన్నాయి.

"గతేడాది పెళ్లికి ముందు నేను బ్యూటీ సెలూన్‌కి వెళ్లాను. పెళ్లికూతురు మేకప్ చేయించుకున్నా. అద్దంలో చూసుకున్నప్పుడు, నేను చాలా అందంగా కనిపించాను. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను" అని మదీనా గుర్తుచేసుకున్నారు.

సెలూన్

బ్యూటీ సెలూన్ నా ఆత్మ విశ్వాసాన్ని తిరిగిచ్చింది..

మజార్-ఇ-షరీఫ్‌ నగరానికి చెందిన 27 ఏళ్ల సోమయాకు బ్యూటీ సెలూన్ అవసరం.

మూడేళ్ల క్రితం తన గదిలోని హీటర్ పేలడంతో ఆమె ముఖం కాలింది. దీంతో సోమయా కనుబొమ్మలు, కనురెప్పలను కోల్పోయారు

"నా ముఖాన్ని చూసి తట్టుకోలేకపోయాను. నేను వికృతంగా కనిపించాను" అని ఆమె భావోద్వేగ స్వరంతో తెలిపారు.

"నా కనుబొమ్మలు పోయాయి. అందరూ నన్ను చూసి నవ్వుతారని, రెండు నెలలు బయటకు కూడా వెళ్లలేదు. ఆ సమయంలో నేను చాలా ఏడ్చాను'' అని గుర్తుచేసుకున్నారు సోమయా.

ఆమె గాయాలు వైద్య చికిత్స ద్వారా నయమైనా, బ్యూటీ సెలూన్ మాత్రమే ఆమె ఆత్మ విశ్వాసాన్ని తిరిగి అందించడంలో సహాయపడింది.

"నేను బ్యూటీ సెలూన్‌కి వెళ్లాను. మైక్రోబ్లేడింగ్ (కాస్మెటిక్ టాటూయింగ్ సెమీ-పర్మనెంట్ రూపం) చేసుకున్నా. ఇది నన్ను మరింత మెరుగ్గా కనిపించేలా చేసింది" అని సోమయా చెప్పారు.

"నా కనుబొమ్మలు చూడగానే, ఏడ్చేశాను. అవి ఆనందపు కన్నీళ్లు, బ్యూటీ సెలూన్ నాకు వాటిని తిరిగిచ్చింది" అని అన్నారు.

బ్యూటీ పార్లర్

''సెలూన్లు మా బాధను దాచేశాయి''

తాలిబాన్ అధికారం చేపట్టిన తర్వాత సోమయా ఉండే పట్టణంలో చాలా సెలూన్లు మూసివేశారు.

స్త్రీలు ముఖాన్ని బహిరంగంగా చూపించడాన్ని తాలిబాన్ నిషేధించింది. బుర్ఖా వేసుకోవాల్సిందే. బ్యూటీ సెలూన్ ప్రచారం చేసే రంగురంగుల పోస్టర్లు కూడా అదృశ్యమయ్యాయి. ఇక్కడ మహిళల కళ్లు మాత్రమే కనిపిస్తాయి.

సోమయా సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఇపుడు మెంటల్ హెల్త్ కౌన్సిలర్‌గా పని చేస్తున్నారు. తాలిబాన్లు భారీ ఆంక్షలు విధించినప్పటి నుంచి ఆమెను కౌన్సిలింగ్ కోసం చాలామంది ఆశ్రయించారు.

బ్యూటీ పార్లర్‌ను 'థెరపీ' కోసం ఉపయోగిస్తుండటంతో ఆమె ఒంటరేం కాలేదు. యుద్ధంతో దెబ్బతిన్న దేశంలో చాలామంది మహిళల ముఖాలు మచ్చలు, గాయాలతో ఉన్నాయి. వాటి చికిత్స ఖర్చునూ వారు భరించలేరు.

"సెలూన్లు అనేవి మాకు మేకప్ వేసుకోవడానికి వాడే స్థలాల కంటే ఎక్కువ. ఇవి మా బాధలను దాచడానికి మాకు సహాయపడ్డాయి. ఇవి మాకు శక్తి, ఆశలను అందించాయి" అని సోమయా అంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)