17 ఏళ్ల విద్యార్థిని ప్యాంట్‌ కిందకు లాగి అండర్‌వేర్‌లో చేయి పెట్టిన వృద్ధుడు.. 10 సెకన్లలో జరిగినదాన్ని నేరంగా భావించలేమంటూ కోర్టు తీర్పు

ఇన్‌స్టాగ్రామ్ వీడియో

ఫొటో సోర్స్, INSTAGRAM

ఫొటో క్యాప్షన్, నిశ్శబ్ధంగా కెమెరా వైపు చూస్తూ తమ ప్రైవేట్ భాగాలను 10 సెకన్ల పాటు తాకుతూ తీసిన వీడియోలను ఇటలీ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు
    • రచయిత, సోఫియా బెట్టిజా
    • హోదా, బీబీసీ న్యూస్, రోమ్

మహిళలతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు అది 10 సెకండ్ల కంటే తక్కువ సమయం అయితే వేధింపులుగా పరిగణించరా?

ఇటలీలోని చాలామంది యువత దీనిపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

టీనేజ్ విద్యార్థినిని చేతులతో అసభ్యంగా తాకిన ఒక స్కూల్ కేర్‌టేకర్‌ను జడ్జి వదిలేయడంతో యువత ఆగ్రహిస్తారు.

ఆ కేర్ టేకర్ ఆమెను కొన్ని క్షణాలు మాత్రమే తాకారని, ఆయన చర్యలో లైంగిక వాంఛ లేదని చెప్తూ కోర్టు ఆయన్ను నిర్దోషిగా తీర్పునిచ్చింది.

ఈ కేసు రోమ్ హై స్కూల్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థినికి సంబంధించినది.

పాఠశాలలో ఒక ఫ్రెండ్‌తో కలిసి తరగతి గదికి వెళ్లడానికి మెట్లు ఎక్కుతున్నప్పుడు అకస్మాత్తుగా తన ప్యాంట్ కిందికి జారినట్లు గుర్తించానని ఆమె చెప్పారు.

వెంటనే, ఎవరిదో చేయి తన పిరుదులను తాకడంతో పాటు అండర్‌వేర్‌ను పట్టుకోవడం గుర్తించినట్లు ఆమె తెలిపారు.

తాను వెనక్కి తిరగ్గానే ఒక వ్యక్తి తనతో ‘లవ్.. నేను తమాషా చేశాను’ అని అన్నారని చెప్పారు.

పావొలొ కామిలి

ఫొటో సోర్స్, PAOLO CAMILLI/INSTAGRAM

ఫొటో క్యాప్షన్, 10 సెకన్ల అసభ్యప్రవర్తనను నేరంగా ఎందుకు పరిగణించరు? అంటూ నటుడు పావొలొ కామిలి వీడియో పోస్ట్ చేశారు

2022 ఏప్రిల్‌లో ఈ ఘటన జరిగింది. ఇది జరిగిన వెంటనే ఆ విద్యార్థిని.. స్కూల్ కేర్‌టేకర్ అయిన 66 ఏళ్ల ఆంటోనియో అవోలా మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ అమ్మాయి సమ్మతి లేకుండానే తాను ఆమెను తాకినట్లు ఆంటోనియా కోర్టులో అంగీకరించారు. అయితే, అది ఒక జోక్ అని ఆయన చెప్పారు.

ఆంటోనియోకు మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించాలని రోమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానాన్ని కోరారు.

కానీ, ఈ వారం ఆంటోనియా తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి విముక్తి పొందారు.

‘‘జరిగిన దాన్ని నేరంగా పరిగణించలేం. ఎందుకంటే అది జరిగిన సమయం 10 సెకన్ల కంటే తక్కువగా ఉంది’’ అని వ్యాఖ్యానిస్తూ కోర్టు ఆయన్ను విడుదల చేసింది.

ఈ తీర్పు వచ్చినప్పటి నుంచి ‘‘స్వల్ప స్పర్శ’’ అనేది ఇటలీలో ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ మాధ్యమాల్లో ట్రెండ్‌గా మారింది. దీనికి #10secondi అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు.

నిశ్శబ్ధంగా కెమెరా వైపు చూస్తూ తమ ప్రైవేట్ భాగాలను 10 సెకన్ల పాటు తాకుతూ తీసిన వీడియోలను ఇటలీ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

ఆ వీడియోలు చూడటానికి చాలా అసౌకర్యంగా ఉంటాయి. కానీ, ఆ 10 సెకన్ల సమయం ఎంత వికృతంగా ఉంటుందో, ఎంత వేదనను కలిగిస్తుందో తెలియజేయాలనే లక్ష్యంతో వారు ఈ వీడియోలను పంచుకుంటున్నారు.

వైట్ లోటస్ నటుడు పావొలొ కామిలి మొదటగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ తర్వాత వేలాది మంది పావొలో బాటను అనుసరించారు.

ఇటలీలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఇన్‌ఫ్లూయన్సర్ చియారా ఫెరాగ్ని కూడా మరో వీడియోను పోస్ట్ చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో చియారాకు 29.4 మిలియన్ల పాలోవర్లు ఉన్నారు.

మరో ఇన్‌ఫ్లూయన్సర్ ఫ్రాన్సెస్కో సిసోనెటీ దీని గురించి ట్విటర్ వేదికగా స్పందించారు.

‘’10 సెకన్లు అనేవి సుదీర్ఘ సమయం కాదని ఎవరు నిర్ణయిస్తారు? వేధింపులకు గురయ్యేటప్పుడు సమయాన్ని ఎవరు కొలుస్తారు?

మహిళల శరీరాలను అనుమతి లేకుండా తాకే హక్కు పురుషులకు లేదు. అది సెకన్ కావొచ్చు, లేదా 5-10 సెకన్లు కావొచ్చు’’ అని ఆయన ట్వీట్ చేశారు.

నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీసుకున్న నిర్ణయం, ఇటలీలో లైంగిక వేధింపులను ఎంత లెక్కలేనివిగా పరిగణిస్తున్నారో తెలుపుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘ఆ తీర్పు చాలా విడ్డూరంగా ఉంది. వేధింపుల వ్యవధి దాని తీవ్రతను తగ్గించకూడదు’’ అని ఫ్రీదా అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

ఇటలీలో లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లైంగిక వేధింపులపై ఇటలీలో మహిళలు నిరసన ప్రదర్శన చేశారు

కానీ, జడ్జ్‌లు పేర్కొన్నదాని ప్రకారం, టీనేజర్‌ను కేర్‌టేకర్ స్వల్ప సమయం పాటు ఇబ్బందిపెట్టారు. కామవాంఛ లేకుండా కేవలం అసభ్యంగా ప్రవర్తించారు.

‘‘అతను జోక్ చేశాడని జడ్జ్‌లు తీర్పు ఇచ్చారు. కానీ, నాకు అది జోక్‌ కాదు’’ అని బాధితురాలు స్థానిక వార్తా పత్రిక కొరీరా డెల్లా సెరాతో అన్నారు.

‘‘కేర్‌టేకర్ ఏమీ మాట్లాడకుండా వెనక నుంచి వచ్చారు. నా ప్యాంటు లోపల తన చేతుల్ని పెట్టారు. అండర్‌వేర్ లోపల కూడా. తర్వాత అలాగే నన్ను తనపైకి లాక్కున్నాడు. నా ప్రైవేట్ భాగాలను గట్టిగా పట్టుకున్నాడు. నావరకైతే ఇది జోక్ కాదు. ఒక టీనేజర్‌తో వృద్ధుడు ఇలా జోక్ చేయకూడదు.

అతని చేతులు నా శరీరం మీద ఉన్నాయని నాకు అనిపించడానికి ఆ కొద్ది సెకన్లు చాలు’’ అని ఆమె వివరించారు.

పాఠశాల పరిస్థితులతో పాటు న్యాయవ్యవస్థ ద్వారా తాను రెండుసార్లు మోసపోయాయని ఆమె అన్నారు.

‘‘సంస్థలను నమ్మడమే నేను చేసిన తప్పు అని నాకు అనిపిస్తోంది. ఇది న్యాయం కాదు’’ అని ఆమె చెప్పారు.

ఇలాంటి దాడులకు గురైనప్పుడు మహిళలు, బాలికలు ముందుకు రాకుండా ఈ తీర్పు బాధితులను అడ్డుకుంటుందనే భయాన్ని ఆమె వ్యక్తం చేశారు.

2016-2021 మధ్య వేధింపులకు గురైన ఇటలీ మహిళల్లో 70 శాతం మంది వాటి గురించి నివేదించలేదని ఈయూ ప్రాథమిక హక్కుల ఏజెన్సీ (ఎఫ్‌ఆర్‌ఏ) గణాంకాలు చూపిస్తున్నాయి.

‘‘వేధింపులను బహిర్గతం చేసినా ప్రయోజనం ఉండదని వారు నిశ్శబ్ధాన్ని పాటిస్తారు. కానీ, వాటిని బయటపెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే, వారి నిశ్శబ్ధం నిందితులను రక్షిస్తుంది’’ అని ఎఫ్‌ఆర్‌ఏ పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)